విషయానికి వెళ్ళండి

తెలుగు పద్యాల్లో ఆంగ్ల పాఠాలు – 2

21 ఫిబ్రవరి, 2011

కొంత, చాలా కాలం క్రితం, కొన్ని పద్యాల్ని తెలుగు పద్యాల్లో ఆంగ్లోచ్ఛారణా పాఠాలన్న పేర పెట్టాను. శ్రీ సుదర్శనం గారి పద్యాల పాఠాలు మెల్లమెల్లగా వందను తాకుతున్నాయి. ఉచ్ఛారణను దాటి పద వ్యుత్పత్తి, భాషాభాగాలను స్పృశిస్తూ కొంత ప్రౌఢంగా మారింది. ఈ పద్యాలను యూనికోడులో టైపు చేయడం తప్ప నా హస్తవాసి మరేమీ లేదు. మచ్చుకి మరికొన్ని పద్యాలు ఇక్కడ:

1.
మర్క్యురి పాదరసంబౌ
సర్క్యూయిటసనగ నొప్పు సర్కిట్ పరమై
హర్క్యూలీజ్ అతి బలుడౌ
పర్క్యూటేనియసనంగ త్వగ్ మూలమగున్

(Mercury, Circuitous, Circuit, Hercules, Percutaneous )

2.
క్వెశ్చన్ అన ప్రశ్న యగు, స
జశ్చన్ సూచన యగును, డిజశ్చన్ మరి డై
జశ్చన్ జీర్ణక్రియ, కం
జశ్చన్ సమ్మర్దమగును సంధ్యా నాటీ!

(Question, Suggestion, Digestion, Congestion )

3.
భాషా విభాగంబు మారగా వెన్వెంట
మారును గాదె యుచ్చారణంబు
హీలు హెల్తయ్యెను హేలు తత్పరమెయౌ
ఫూడ్, ఫీడ్ విభేదంబు పొదలునిటులె
బ్రీడు బ్రూడగు గాదె బ్లీడు బ్లడ్ ఇట్టులే
గ్రేస్ నుండి క్రియకల్గు గ్రేజనంగ
నీ నీలగును నెస్టు నెజిలగు గమనింప
ఈక్వల్ ఇక్వాలిటీ ఇటులె చెల్లు
కాఫ్ నుండి కావ్ గల్గు హాఫ్ నుండియే హావ్, బి
లీఫ్ బిలీవ్ అగును రిలీఫు నిట్లె
సాలిడ్ సలిడిఫైయె స్టడి స్ట్యూడియస్ అగు
టిట్యులర్ టైటిలు డీపు డెప్తు
లోరయ్యె లర్న్ లెండు లోనుగ మారెను
సీ సైటు, సిట్ సీటు, స్టీలు స్టెల్తు
నిట్ నాట్‍గ మారె ఎనిమి ఇనిమికల్, అ
బైడ్‍ అబోడగు, బైండు బాండు
డీడయ్యె డూ, డ్రాపు డ్రిప్పిట్టులేయగు
నౌనయ్యె నామినల్ నాగభూష ;
స్కూల్ స్కలేస్టిక్ అగు సోషల్ ససైయటి
వైసును విషియేటు గ్లాసు గ్లేజు
ఇంక్లైన్ అలెజ్‍ నుండి ఇంక్లినేషను మరి
ఏలిగేషన్ గల్గు నిందుమౌళి
స్పేసు స్పేషియలగు పేలస్ పలేషియల్
డివినిటియు డివైను కవయునిట్లె

పాప్యులర్ పీపులును మరి పాప్యులసును
ఏకపరమగు అబిలిటి ఏబులిటులె
క్లియరు క్లేరిటిగా మారె క్లీను క్లెన్సు
కాలని కలోనియల్లాయె కాలకంఠ!

( భాషా విభాగంబు = Parts of Speech
Heal – Health, hale; Food – Feed; Breed – Brood; Bleed – Blood; Grass – Graze; Knee – Kneel;
Nest – Nesting; Equal – Equality; Calf – Calve; Half – Halve; Belief – Believe; Relief – Relieve;
Solid – Solidify; Study – Studious; Title – Titular; Deep – Depth; Learn – Lore; Lend – Lone; See – Sight; Sit – Seat; Steal – Stealth ; Knit – Knot; Enemy – Inimical; Abide – Abode; Bind – Bond; Do – Deed; Drop – Drip; Noun – Nominal; School – Scholastic; Social – Society; Vice – Vitiate; Glass – Glaze; Incline – Inclination; Allege – Allegation; Space – Spatial; Palace – Palatial; Divinity – Divine; People – Popular, Populace; Able – Ability; Clear – Clarity; Clean – Cleanse; Colony – Colonial )

4.
వర్ణక్రమము వేరు, భావమ్ము వేరయి
ఉచ్చారణము మాత్రమొకటె యైన
యట్టి పదంబులు హామఫోన్సనబడు
ఈ క్రింది పదములిట్టివియె యగును
హేర్‍ రోడ్‍ మరి గరిల హియరు డియరును గ్రీస్
సేల్‍ ఫేలనంగను మేలననిటె
కాంప్లిమెంట్‍ ప్రిన్సిపల్‍ కాన్ఫిడంట్‍ కౌన్సిలు
మీటని రెడ్‍ అన పీసునిటులె

బేరనగ సోల్‍ రెయిననగ ఫేరనంగ
పేరనంగ సైట్ సోరన పేక్టనంగ
బ్రేకనగ కర్నలనగ హీల్‍ బీటనంగ
రీడ్‍ మరియు చెక్‍ రీక్‍ ను హోల్‍ వృషభ వాహ!

వర్ణక్రమము = Spelling
Homophone
Hare – Hair; Hear – Here; Dear – Deer; Greece – Grease; Sale – Sail; Pale – Pail; Male – Mail; Compliment – Complement; Principle – Principal; Confident – Confidant; Meat – Meet; Red – Read (Past Tense);
Bear – Bare; Sole – Soul – Seoul (capital of South Korea); Rain – Rein – Reign; Soar – Sore;
Pear – Pare – Pair; Site – Sight; Shear – Sheer; Pact – Packed; Brake – Break; Colonel – Kernel;
Heel – Heal; Beer – Bier; Read – Reed; Check – Cheque; Wreak – Reek;

5.
హామగ్రాఫునకుండు నానార్థములు, ప
లిసెమి యన పలు అర్థములే యెసంగు
స్లఫ్ ‍అనంగను ఫాస్టన సౌండనంగ
మినిటు మైన్యూటు మరి టియర్ జననిటులనె
హామఫోనును మరియును హామగ్రాఫు
ఒదిగియుండును హామనిం పదమునందె

(Homograph; Polysemy; Slough; Sound; Minute; Tear – Tier; Homonym )

6.
స్టేటివ్ క్రియలు దెల్పు స్థిమిత పరిస్థితి
కాన ’ఇంగ్’ (ing) వీనికి కలుపరాదు
అమరు సామాన్య ధర్మముగ ’ఇంగ్’ చేర్పమి
బీయింగ్ క్రియలివియె బేసికంటి!
ఇంద్రియ గ్రాహ్యము లీహలూ హలు రుచుల్
నడవడి వైఖరి నమ్మకముల
చాటునీక్రియలు; డిసర్వు నండస్టేండు
సీం, లవ్ అనంగ పర్సీవ్ బిలాంగు

వరలు వ్యతిరేకి డైనమిక్‍ వర్బనంగ
ఇవియె డూయింగ్ క్రియలన నెసగు, చలన
శీలత ఈ క్రియ ధర్మము సెండ్, రిపేరు
వర్కనగ, వీనికి ’ఇంగ్’ చేర్చవచ్చు నీశ!

(Stative; Being; Deserve; Understand; Seem; Love; Perceive; Belong; Dynamic; Doing; Send; Repair; Work )

7.
ఈ క్రింది పదముల ఎయ్చ్ (H), మూగయై యుండు
ఆనస్టు, అవర్, ఏర్, ఆనరనగ
ఆర్చును, హర్టు గ్రేఅం టెమ్స్ ను, సేంటిపి
సేంతిపి పాస్ట్యుమస్‍ చేటమనగ
ఏంటని, ఏంతని హెమరిజ్ టిరీసయు
టామస్ షెపడ్ డాల్య డాలియ యన
మరి హిగిన్ బాటమ్స్ మాం మోం అనగవచ్చు
మెక్‍ కీమాను వీఇకిల్ వీహికిలన

ఫారిడనగ ఫోర్‍హెడ్‍ అన ద్వయము సరియె
వీయిమెంట్‍ వీహిమెంట్‍ మరి నీయిలిజము
నీహిలిజమన ప్రయిబిషన్ ప్రోహిబిషను
హీ (He) కి ఊనిక లేనిచో ఈ, ఇ యగును
ఇట్లె డిసేబీల్ డిసబీల్‍ మహేశ! సాంబ!

(Honest; Hour; Heir: Honour; Herb; Graham; Thames; Xanthippe; Posthumous; Chatham; Anthony; Haemorrhage; Theresa; Thomas; Shepherd; Dahlia; Higginbothams; Maugham; Mac Mohan ; Vehicle; Forehead; Vehement; Nihilism; Prohibition; Disable )

8.
పదములు కొన్ని వ్యాప్తములు పెనల్టిమేట్
అంతాక్షరము మూగదేను, కాని
తత్పదోత్పన్న పదావళి యందున
మూగవోయిన శబ్దము రవళించు
పేరడైం పేరడిగ్మేటిక్‍ రిసైన్ రెసి
గ్నేషను, సైను సిగ్నేచరగును
హిం హిమ్నలగును ఇట్లె రేన్ రెగ్నమౌ
సాలం సలమ్నిటి శమన వైరి!
కాలమగును కాలంనిస్టు కాలమిస్టు
ఫ్లెం ను ఫ్లేగ్మేటికగును బాలేందు మౌళి!
క్రం అగును క్రంబులాటం ను కండెమిటులె
పాంజనితము పాల్మేటును పాల్మరునగు

(ఉత్పన్న పదావళి = Derived Words; Paradigm – Paradigmatic; Resign – Resignation; Sign – Signature; Hymn – Hymnal; Reign – Regnam; Solemn – Solemnity; Column – Columnist; Phlegm –Phlegmatic; Crum – Crumble; Autumn – Autumnal; Condemn – Condemnation; Palm – Palmate, Palmer )

9.
లవ్‍లోన గివ్‍ లొ పల్కగరాదు గద ’ఈ’ (e)
ఐనచో నిదియేల అతికియుండు
యనగ నుత్తరంబె ’ఈ’ ఆది పదాచ్చును
దీర్ఘీకరించును త్రిపుర వైరి!
మ్యాట్ మేట్ అగునిటులె ప్యేన్ పేనగును డిమర్
డిమ్యుఅర్ అగును బిట్ ఇట్లె బైటు
స్టాప్ స్టోప్ గ మారును స్టార్‍ స్టేరు కారు కేర్‍
మెట్, టబ్లు మారును మీటు, ట్యూబు

డూ అగున్ డోగ టాప్, పిన్‍ లు టాపు, పైను
స్పిట్ పరిణతియె స్పైట్ శివ! మహేశ!
పైని ’ఈ’ మేజిక్ ఈ యని పలుక బడును
ఈ ను తొలగింతు రమెరికనులీ పదముల
ఏక్స్ చివరను ఏడ్జ్ చివర గిరీశ! సాంబ!

(Love; Give; Mat – Mate; Pan – Pane; Demur – Demure; Bit – Bite; Stop – Stope; Star – Stare; Car – Care; Met – Mete; Tub – Tube; Do – Doe; Top – Tope; Pin – Pine; Spit – Spite; Grip – Gripe; American Spelling for Axe is Ax and Adze is Adz)

10.
గ్రీస్‍ నుండి డీమాస్‍ యురీక ను పై (π) దెచ్చి
ఇటలి పీట్సను గ్రహియించి మెచ్చి
ఏంజైన పెక్టరిస్‍ ఏ ప్లూరిబస్‍ యూన
మునుదెచ్చి లేటిను మూలకముగ
భరత ఖండమునుండి బహువ్రీహి గొంపోయి
జర్మనీ నుండి కైసరును దెచ్చి
స్పేనిష్‍ నుండి సవేన, ప్వెబ్లో గొని
పర్షియా నుండి దర్బారు దెచ్చి

ఫ్రాన్సు దేశపు రాండివూ పరిగణించి
పోర్చుగల్ నుండి పాద్రి, టైఫూను దెచ్చి
సూక్తులిటుపన్ని సర్వాంగ సుందరముగ
అలరు దేదీప్యమానమై ఆంగ్ల వాణి

(Demos; Eureka; Pizza; Bahuvreehi Samasa/Compound; Angina Pectoris; E Pluribus Unum; Kaiser; Savannah; Pueblo; Durbar; Rendezvous; Padre; Typhoon)

పేద కవి ఉత్తరం!

18 ఫిబ్రవరి, 2010

తెరపినివ్వని దగ్గు తెరల మధ్య ఖళ్ళు ఖళ్ళు మంటూ
పేద కవీశ్వరుడు ప్రభుత్వంవారికిలా ఉత్తరం వ్రాశాడు
“అద్దె కట్టలేక వచ్చిన గొడవలతో మారుతూ మారుతూ
ఇప్పుడు నేనుంటున్నది ఇరవైయేడో యిల్లు
దగ్గి దగ్గి, రేపెప్పుడో నే చస్తే, నా స్మారక మందిరం కోసం
ఎన్ని ఇళ్ళని మీరు కొని చస్తారు?”

(తమిళ కవి వైరముత్తు కవితల సంకలనంలోని ఒక కవితకు నా అనువాదం)

తగని కోపమ్మదేలనో తమిళమన్న!

11 జనవరి, 2010

“తమలపాకులు నములు
దవడతో మాట్లాడు
తానె వచ్చును తమిళు
ఓ కూనలమ్మా”

– ఒక తెలుగు కవి వెటకారం!

“డాయకుమీ అరవ ఫిలిం…”

– మరో మహాకవి ప్రబోధం

“అరవం అరవం అంటారు, మళ్ళీ అరుస్తూనే ఉంటారెందుకో!” ఒక తెలుగు మీరినాయన ‘పన్ నాగం’!

“అరవ్వాడి దోశై
మీద తోచింది వ్రాసెయ్…” – మహా కవి భరోసా, మళ్ళీ!

“తెలుగు తేటె, కన్నడ కస్తూరి, అరవ అధ్వాన్న” –  ఒక కన్నడ భాషీయుని ఉటంకింపు.

నా చిన్నతనంలో ఇలాంటివి చదివినప్పుడు ఒళ్ళు మండిపోయేది ( ఇప్పుడు నవ్వేస్తాననుకోండి). మా భాషపై ఎందుకు వీళ్ళకింత అకారణ ద్వేషమని ఆశ్చర్యం కలిగేది. ఇలాంటివి తమిళంలోనూ ఏవైనా ఉంటే మనమూ చెబుదామని వెదికే వాడిని. అబ్బే, ఇతర భాషలను కించపరిచే రచన ఒక్కటికూడా తమిళ సాహిత్యంలో కనిపించలేదు నాకు. చిన్నప్పుడు అన్నింటికన్న నన్ను ఎక్కువగా నొప్పించిన పద్యం శ్రీనాధుని పేర చెలామణీ అవుతున్న చాటువొకటి:

మేతకుఁ గరిపిల్ల, పోరున మేకపిల్ల
పారుబోతు తనమ్మున పందిపిల్ల
ఎల్ల పనులను జెరుపంగ పిల్లి పిల్ల
అందమునఁ గోతి పిల్ల, ఈ యరవ పిల్ల

ఈ పద్యం శ్రీనాధుడు వ్రాసినదేనా అని నాకు ఇప్పటికీ సందేహమే (శైలిని బట్టి). తరువాత ఎప్పుడో  శ్రీనాధుడు వ్రాసిన ఈ క్రింది పద్యం, కాశీఖండం లోనిది, చదివాను:

ముడువంగ నేర్తురు మూలదాపటికి రా
చికురబంధములీగ జీరువార
పొన్నపూవుల బోలు పొక్కిళ్ళు బయలుగా
గట్టనేర్తురు చీర కటిభరమున
తొడువంగ నేర్తురు నిడువ్రేలు చెవులయం
దవతంసకంబుగా నల్లిపూవు
పచరింప నేర్తురు పదియారు వన్నియ
పసిడి పాదంబుల పట్టుచీర

పయ్యెద ముసుంగు పాలిండ్ల బ్రాకనీక
తఱచు పూయుదురోల గందంపుఁ బసుపు
బందికత్తెలు, సురత ప్రసంగ వేళ
కంచి యరవతలసమాస్త్ర ఖడ్గ లతలు

ఒకప్పుడు కోతిపిల్ల లాగానూ, మరొకప్పుడు అసమాస్త్రుని ఖడ్గ లతల్లాగానూ అరవతలు ఎలా కనిపించారా అనిపించేది. ఐతే శ్రీనాధుని బాగా చదివాక, అతని నోటికి అడ్డూ ఆపూ ఏదీ లేదని తెలుసుకున్నాక శ్రీనాధునిపై నా కోపం పోయింది. తమిళులనేమిటి? ఎవరినైనా అలాగే అనగలడు కదా శ్రీనాధుడు! ” కర్ణాట కామినీ కర్ణహాటక రత్న తాటంక యుగ ధాళ ధాళ్యములకు…” జోహారులర్పించిన నోటితోనే ” వసివాళ్వారుచు వచ్చుచున్నయది కర్ణాటాంగనన్ గంటిరే!” అని మనల్ని పిలిచి మరీ చూపించగలడు.

విషయానికి వస్తే, పొరుగు భాషల వారికి తమిళంపై ద్వేషమో, చిన్నచూపో ఎందుకుండాలన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది నాకు. “సుందర తెలుంగినిల్ పాట్టిసైత్తు …” అంటూ సింధు నదిలో వెన్నెల రాత్రి సుందరమైన తెలుగులో పాట పాడుతూ చేర దేశపు పడతులతో నౌకా విహారం చేయాలని కలలు కన్న భారతియార్ ఇతర భాషలకన్న నాభాష గొప్పదని ఎన్నడూ చెప్పలేదు. ఆ భాషపై తెలుగువారికింత చిన్న చూపు ఎప్పుడొచ్చింది! తమిళ కుటుంబానికి చెందిన మాస్తి వెంకటేశం అయ్యంగార్ కన్నడంలో గొప్ప రచనలు చేసి జ్ఞానపీఠ అవార్డును తెచ్చిపెట్టాడు. ఆ భాషీయులంటే కన్నడిగులకెందుకు ద్వేషం ఉండాలి!

మనకున్నదేదో వాడికి లేదనే అహంకారం ఒకటి, వాడికున్నదేదో మనకు లేదన్న అసూయ ఒకటి – ఎదుటివాడిపై చిన్నచూపు కలగడానికివి రెండే కారణాలు. తెలుగు, కన్నడ భాషలు రెండూ కూడా పరభాషల ప్రభావానికి సులభంగా లొంగి పోయాయి. పరాయి భాషలు భాష మూలస్వరూపాన్నే మార్చేస్తున్నా నిస్సహాయంగా ఉండిపోయాయి. అదే సమయంలో, తమిళ భాష తన వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూ ఎదిగింది. తంజావూరులో తెలుగు నాయకరాజుల పాలన కొనసాగి, తెలుగు సాహిత్య పునరుజ్జీవనం అక్కడ జరిగినప్పుడు కూడా తమిళం తన ఉనికిని కోల్పోలేదు. ఈ ప్రత్యేకత, భాషకున్న ఈ వ్యక్తిత్వం బహుశ ఇతరులలో అసహనాన్ని కలిగించింది. నలుగురు నడిచేదారిని కాదని సొంత మార్గాన్ని ఎంచుకోవడం వలన తమిళ భాషీయులు వారి సోదర భాషలనుండి శాశ్వతంగా విడిపోయారు. వారిని కలిపిఉంచిన బంధమేదో తెగిపోయింది. తెలుగు, కన్నడ భాషలు కాలప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. తమిళం ఎదురీదుతోంది. దూరం పెరిగి పోతోంది.

తమిళ దేశంలోనే సంస్కృత భాషను ‘ప్రమోట్’ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. స్వామినాథ దేశికర్ అన్న సంస్కృత పండితుడు ‘ఇలక్కణక్కొత్తు’ అన్న గ్రంథంలో ఇలా వ్రాశాడు:

ఐన్దు ఎழுత్తాల్ ఒరు పాడైయుం ఆమ్‌ ఎన్ఱు
అఱైయవుం నాణువర్ అఱివురైయోరే

‘సంస్కృతంలో లేనివి, తమిళంలో ఉన్నవి ఐదే అక్షరాలు (ఎ, ఒ అనే అచ్చులు, ఱ,ந (న), ழ అనే మూడు హల్లులు). ఓ ఐదక్షరాలు ఎక్కువున్నంత మాత్రాన తమిళమూ ఒక గొప్ప భాషైపోతుందా, పండితులు దాన్ని ఒప్పుకొంటారా’ అని తమిళాన్ని పరిహసిస్తూ ఒక సూత్రమే వ్రాశాడు. ఐతే జనుల హృదయాల్లో తమిళమే నిలిచింది, పరిహసించిన గ్రంధాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి.

పెరిగి పెద్దవాడై, నాలుగూళ్ళు తిరిగాక, భాషా భేదాలు, ఎక్కువ తక్కువలు మనసుకు పట్టడం తగ్గిపోయింది. ఒక భాష మరో భాషకన్న గొప్పదనో, తక్కువనో అనుకోవడం ఎంత మూర్ఖత్వమో తెలిసింది. నేను మైసూరుకు బదిలీ అయి వచ్చినప్పుడు కన్నడ భాషంటే కొంత వ్యతిరేకత ఉండేది, వారి తమిళ వ్యతిరేకతకు రియక్షన్ అన్నమాట. నాకు కొంత భాష తెలిసినా తెలియనట్లే స్థానిక అధికారులతో, ప్రజా ప్రతినిధులతో హిందీలోనో ఆంగ్లంలోనో మాట్లాడేవాడిని. ఐతే మెల్లగా ఇక్కడ కన్నడ సాహిత్య చర్చలు వినడం, వారి భాషను కాపాడుకోవడానికి వారు పడుతున్న తపనను దగ్గరినుండి చూడడం నాలో చాలా మార్పును తెచ్చింది. వారి భాషను నిలుపడానికి నా వంతు ప్రయత్నం చేయాలనిపించింది. గత రెండేళ్ళుగా కార్యాలయంలో నేను కన్నడ భాషీయులతో వారి భాషలోనే మాట్లాడుతున్నాను. ప్లాంటులోని సూచనాఫలకాలను కన్నడభాషలోకి అనువదింపజేసి ప్రదర్శింపజేశాను.Instruction Manuals ను కన్నడ భాషలో ముద్రింపజేశాను.

ప్రాచీన తమిళ గ్రంధమైన ‘పుఱ నానూఱు’ లో పూంగుండ్రనార్ అనే కవి ఇలా అంటాడు:

యాదుం ఊరే, యావరుం కేళిర్…
… … … … …
పెరియోరై వియత్తలుం ఇలమే
శిరియోరై ఇగழ் దల్ అదనినుం ఇలమే

(ప్రతి ఊరూ నా స్వగ్రామమే, అందరూ నా వారే…
… … పెద్దవారని ఎవరినీ భట్రాజులా కీర్తించనూ లేదు, చిన్నవారని ఎవరినీ తక్కువగా చూడనూ లేదు)

రెండున్నరవేల యేళ్ళనాటి పై పద్యపాదాలు ప్రతిబింబించే తమిళ సంస్కృతికి అనుగుణంగా ఉండాలన్నదే నా క్రొత్త సంవత్సర నిర్ణయం, “అరవ అధ్వాన్న” అనుకున్నా సరే 🙂

తెలుగు పద్యాల్లో ఆంగ్లోచ్చారణ పాఠాలు

20 డిసెంబర్, 2009

చిత్తూరు వెళ్ళినప్పుడు మా బంధువులైన శీకాయపట్టెడ కె. సుదర్శనం గారిని కలిసిన విషయం గత టపాలో వ్రాశాను. వారిప్పుడు తెలుగు విద్యార్థులు ఆంగ్లం మాట్లాడేటప్పుడు సాధారణంగా వచ్చే ఉచ్చారణా దోషాలను సరిచేస్తూ తెలుగు పద్యాల శతకం వ్రాసే పనిలో ఉన్నారు. మచ్చుకు కొన్ని వినిపించి ఎలా వున్నాయని అడిగారు. నాకనిపించిందేమిటంటే నేటి విద్యార్థులకు ఆంగ్ల పదాల ఉచ్చారణ కంటే ఆ పద్యాలలోని తెలుగు పదాల ఉచ్చారణే కష్టమేమోనని. బహుశ పద్యాల్లోని తెలుగు పదాల అర్థాలు తెలుసుకొనేందుకు వాటిలోని ఆంగ్ల పదాలు సహాయపడతాయి. ‘రివర్సు డిక్షనరీ’  లాగా అన్నమాట. అలా పద్యాలతో పుస్తకం వ్రాస్తే ఏ మాత్రం మార్కెట్ ఉంటుందో కూడా అనుమానమే. పద్యాలకు బదులు “అర గంటలో ఆంగ్ల ఉచ్చారణ” అని టైటిల్ పెట్టి ఇంగ్లీషు-తెలుగు పదాల లిస్టు వ్రాసేసి ప్రచురిస్తే కొంత మార్కెట్ కావచ్చు. ఐతే పుస్తకం ప్రచురించి మార్కెట్ చేసుకోవాలన్నది వారి ఉద్దేశ్యం కాదు గనుక, కనీసం తెలుగు పద్యాల వైవిధ్య భరితమైన ఉపయోగాలను ముందు తరాల వారికి పరిచయం చేయడం కోసమైనా శతకాన్ని పూర్తిచేయమని చెప్పాను. వారి పద్యాలలో కొన్ని ఇక్కడ వ్రాస్తున్నాను:

1.

సో’ యనగా విత్తుట యగు
సో’ యనగా కుట్టుటయును సోమోత్తంసా
సౌ’ యన వారాహి యగున్
సూయిజ్జ’న చెత్త, రొచ్చు; ’సూయరు’ తూమౌ

(1.Sow 2. Sew 3. Sow 4. Sewage 5. Sewer)

2.

‘విన్యడ’న ద్రాక్షతోటగు
‘అన్యన్’ నీరుల్లి యగు, త్రియంబక! శంభో!
సాన్యా‘, ‘సోన్యా‘ సమమౌ
సిన్యోర్‘ అన మిస్టరిటలి,’సిన్యోరా‘ స్త్రీ

(Vineyard; Onion; Sonia; Signor; Signora)

3.

రో‘ యన వరుసకు జెల్లును
రో‘ యనగా తెడ్ల పడవ ద్రోసి నడపుటౌ
రౌ‘ యనగా యలజడి యగు
రౌ‘ యన గద్దించుటయును రౌప్య గిరీశా!

(Row)

4.

వుమన‘న స్త్రీకినిఁ బేరగు
విమిన‘న బహువచనమగును విమలేందు ధరా!
జెమినై‘ యన ‘జెమిని‘ యనన్
యమకంబును, మిథున రాశి హైమవతీశా!

(Woman; Women; Gemini)

5.

బో‘ యన వింటికి నామము
బో‘ యనగా నింద్రధనుసు, ముడికినిఁ బేరౌ
బౌ‘ యనగ నమస్కారము
బౌ‘ యనగా వినతుడగుట పశ్యత్‍ఫాలా!

(Bow)

6.

నైకీ‘ యన జయదేవత
సైకీ‘ యన మనసు, నాత్మ; సద్యోజాతా!
వైకౌంట‘న నొక తెగ దొర
సైకైయేట్రిస్టు‘ మానస వ్యాధి భిషక్

(Nike; Psyche; Viscount; Psychiatrist)

7.

ఫిలిమనకుము ‘ఫిల్మ‘నవలె
లలబై‘ యన లాలి, ‘ఏల్కలై‘ క్షారమగున్
ఇలినోయ్‘ అమెరిక రాష్ట్రము
పలీసు‘ సరి, పోలిసనకు బాలేందు ధరా!

(Film; Lullaby; Alkali; Illinois; Police)

8.

సాలస్‌‘ అన నోదార్చుట
పేలిట్‌‘ అన అంగుడౌను విశ్వాధారా!
పాలన్‌‘ అన పుప్పొడి యగు
వేలంటైన్‌‘ లేఖ, కాన్క ప్రియులకు ముద్దౌ

(Solace; Palate; Pollen; valentine)

9.

మహిళనొక్కతె ‘మేడమ‘ని పిల్వగా వలె
బహుత ‘లేడీస‘న పలుక వలయు
బాలే‘ యనగ గీతభర నృత్య నాటిక
అవన‘ని పల్కంగ నగును ప్రొయ్యి
మెషరు‘, ‘మిరాష‘న మితి, మృగతృష్ణయౌ
బీటు‘కు పాస్టెన్సు ‘బీటు‘ మాత్ర
మాంగ్ల పదంబున నాస్తి ద్విత్వపు వాక్కు
కుక్కరనగ రాదు ‘కుకర‘న వలె

ప్రీమడాన‘ ముఖ్య నృత్యగాయని యౌను
గ్లాసు‘, ‘గ్లేస‘నంగ గాజు పేరు
ప్లాంటు‘, ‘ప్లేంట‘నంగ పరగు మొక్కకు పేర్లు
ఆశుతోష! ఈశ! అట్టహాస!

(Madam; Ladies; Ballet; Oven; [ష-zha] Measure;
Mirage; Beat; Beat (past tense); Cooker;
Prima Donna; Glass; Plant)

ఎలా ఉన్నాయంటారు!

స్వగ్రామ దర్శనం – గ్రామ చూర్ణం కథ

6 డిసెంబర్, 2009

వృత్తిగత వ్యవహారాల్లో లోతుగా కూరుకుపోయి నాకో బ్లాగుందని మర్చిపోయేంత పనయ్యింది. కొన్ని నెలల విరామం తరువాత ఇవ్వాళ బ్లాగు చూస్తే బావురుమంటూ కనిపించింది:-( “గవర్నమెంటు కంపెనీలో ఉజ్జోగం అయింది కదా, ఇంకేం, అంతా తీరికే నీకు!” అని వేళాకోళమాడిన స్నేహితుల్నందరినీ మైసూరుకు ఛార్జీలిచ్చి పిలిచి మరీ తన్నాలని ఉందిగానీ వారిలో చాలామంది ఇప్పుడు అమెరికాలో బోలెడంత తీరుబాటున్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఛార్జీలిచ్చి పిలవడం కుదిరేపని కాదు.

ఇంత పనిఒత్తిడిలోనూ, దీపావళికి మావూరు, చిత్తూరికి వెళ్ళడం కుదిరింది. ఇంకెన్నాళ్ళు చిత్తూరు ’మా వూరు’ గా ఉంటుందో తెలియదు గానీ, ప్రస్తుతానికి మాత్రం ఆ గాలి నా వయసును పాతికేళ్ళు తగ్గించేస్తూ ఉంటుంది. చిత్తూరును ’చిత్తమున్న ఊరు’ అని చమత్కరించారు సినారె గారొక సారి. నిజానికి ’చిరు + ఊర్’ -> ’చిట్రూర్’ అనే తమిళ పదం వాడుకలో చిత్తూరుగా మారింది. ’చిన్న ఊరు’ అని అర్థం. చిత్తూరు చిన్న ఊరైతే మరి పెద్ద ఊరేది? ప్రక్కనే ఉన్న ’వేలూర్’ నగరం (ఆంధ్రుల వాడుకలో రాయవెల్లూరు). ఆంధ్ర రాష్ట్రం అవతరించిన చాలా యేళ్ళవరకు కూడా చిత్తూరు తమిళనాడులో ఉండేది. ఇప్పుడైనా సాంస్కృతిక పరంగా చిత్తూరు తమిళ పట్టణమే. అందుకే మా ఊరి ప్రజలందరూ రెండు భాషలూ (కలగలిపేసి) మాట్లాడుతారు. “కూలికి పిండి ఆడబడును”, “తలముడి నరకబడును” వంటి బోర్డులు ఇంకా అక్కడక్కడా దర్శనమిస్తూ ఉంటాయి. ఎన్టీయార్ కూడలి ఉన్నట్లే ఎంజీయార్ రోడ్డు కూడా కనిపిస్తుంది. ఏ తమిళ సినిమా ఐనా మొదటిరోజున ఇక్కడ రిలీజ్ కావలసిందే. అయితే మా జిల్లా వాసులెప్పుడూ తెలంగానంలాగా విడిపోయే పాట ఆలపించినట్లు లేదు, అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నా. బహుశ చిత్తూరు ప్రజలెప్పుడూ ఆంధ్ర ప్రభుతమీద ఏ ఆశలూ పెట్టుకోలేదు. ఏ హైకోర్టు కేసు ఉంటేనో, సెక్రటేరియట్లో పని ఉంటేనో లేక ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంటేనో తప్ప చిత్తూరు వాసులెవ్వరూ హైదరాబాద్‌ గురించి తలవనైనా తలవరు. నేను హైదరాబాద్ చూడడం ఎంసెట్ కౌన్సిలింగ్‌ అప్పుడే. మాకు సిటీ అంటే చెన్నై లేక బెంగుళూరు. అంత దూరం వద్దనుకుంటే వేలూరు. కనుక రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశంలో ఉన్నా తమిళనాడులో ఉన్నా పెద్ద తేడా యేమీ లేదని అందరూ అనుకున్నట్లుంది. ఇప్పుడిప్పుడే పట్టణం పెరుగుతుండడం వలన రాజకీయాలు కూడా పెరుగుతున్నాయి.

తమిళ మాసమైన ’ఆడి’ నెలలో కృత్తికా నక్షత్రం వచ్చేరోజు చాలా పవిత్రమైనది. ఆరోజు సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలన్ని క్రిక్కిరిసి పోతాయి. చిత్తూరు ప్రజ కావిళ్ళెత్తుకోని దగ్గరలోనే ఉన్న తిరుత్తణి క్షేత్రానికి బయలుదేరుతారు. చిత్తూరు బస్టాండు ప్రాంతం పసుపురంగు బట్టలేసుకున్న వాళ్ళతో ’మహానాడు’ ను మరిపిస్తుంది. సమస్యేమిటంటే మురుగన్ పాటలన్నీ చాలావరకు తమిళభాషలోనే ఉంటాయి.’కావడి చిందు’ అనే ఒక ప్రత్యేక తాళగతిలో సాగే ఈ పాటలు అందెలు చేతబట్టి చిందులేయడానికి అనువుగా ఉంటాయి. తెలుగు మాత్రమే తెలిసిన పాటక జనం ఈ పాటలను అతికష్టంమీద నేర్చుకొని పాడుతుంటే వినడానికి తమాషాగా ఉండేది మా చిన్నప్పుడు. “పంది రెండు కొయ్యా … తోళ్ల మురుగయ్యా” అని భక్తి పారవశ్యంతో చిందులు వేస్తున్న వారిని చూసి ’తోళ్ళ మురుగయ్యేమిటి? పందిని కొయ్యడమేమిటి? దేవుడిని అలా అనడం తప్పుకాదా!’ అని ఆశ్చర్యపడి పోయే వాళ్ళం. తరువాత పెద్దలు చెప్పేవారు: అది “పణ్ణిరెండు కయ్యా… తోழ் మురుగయ్యా” అనే తమిళ పాట యొక్క అపభ్రంశ రూపమని.’పన్రెండు చేతులవాడా, కాపాడు మురుగా, తండ్రీ’ అని భావం. ఇలాంటి భాషాభాసాలు, భాషాహాసాలు బోలెడన్ని మా వూళ్ళో.

ఈ దీపావళినాడు చిత్తూరులో ఉన్న మా బంధువులు శీకాయపట్టెడ కె. సుదర్శనం గారి ఇంటికి వెళ్ళాం. ఆయన తమిళం, తెలుగు, ఆంగ్లం, సంస్కృత భాషల్లో విశేషంగా అధ్యయనం చేసినవారు. ప్రస్తుతం ఆంగ్ల పదాలకు సరియైన ఉచ్చారణను తెలుగు పద్యాల్లో విద్యార్థులకు తెలియజెప్పడానికి ఒక శతకం వ్రాసే ప్రయత్నం చేస్తున్నారు (ఆ వివరాలు మరో టపాలో). మాటల సందర్భంలో ఆయన ఒక కథ చెప్పారు.

ఒక పండితుడు దేశాటనం చేస్తూ పండితులను వాదంలో ఓడిస్తూ ఒక రాజ్యానికి వచ్చాడట. ఆ రాజ్యంలోని ఆస్థాన విద్వాంసునితో రాజుగారు పోటీ ఏర్పాటు చేశారట. పండితుని ప్రతిభను గురించి వినివున్న ఆస్థాన విద్వాంసుడు పోటీకి భయపడి అతడిని భయపెట్టడానికి ఒక ఎత్తు వేశాడట. రేపు పోటీ అనగా ఆ సాయంత్రం విద్వాంసుని భార్య తమ పనిమనిషితో కలిసి పండితుడు బసచేసిన సత్రం వద్దనున్న బావి వద్దకు నీళ్ళకోసం వెళ్ళింది. పండితుడు అరుగుమీద కూర్చున్న సమయం చూసి పనిమనిషి ’అమ్మగారూ, సాయంత్రం కూర ఏం చేయమంటారు?’ అని అడిగింది. దానికి ఆస్థాన విద్వాంసుని భార్య ఈ క్రింది శ్లోకం చెప్పింది:

” మత్కుణం నదీ సంయుక్తం
గోపత్నీ సింధు సంయుతం
విచార ఫల సంయుక్తం
గ్రామ చూర్ణం కరిష్యతాం “

అది విన్న పని మనిషి ’అలాగేనండీ అమ్మగారూ’ అంటూ అక్కడినుండి నిష్ర్కమించింది. ఈ శ్లోకం వింటున్న పండితునికి ఆ వంటేమిటో ఏమీ అర్థం కాలేదు. వచ్చి నీళ్ళబిందె చంకనెత్తుకొంటున్న విద్వాంసుని భార్యను అడిగాడు ఆ శ్లోకం అర్థం ఏమిటని. ’మా వూరి అమ్మలక్కలు మాట్లాడుకొనే మాటలకే అర్థం తెలియని వారు రేపు మా ఆస్థాన విద్వాంసునితో ఏం పోటీ పడతారు!’ అని పరిహాసం చేసి వెళ్ళి పోయిందావిడ. ఇంకేముంది, పండితుడు పలాయనం చిత్తగించడం, ఆస్థాన విద్వాంసుడు ఊపిరి పీల్చుకోవడం జరిగిపోయాయి.

ఇంటికి వెళ్ళిన ఆ ఇల్లాలు భర్తను అడిగింది- ఆ వంటేమిటని. ఆస్థాన విద్వాంసుడు నవ్వి ఇలా చెప్పాడు:

మత్కుణం = నల్లి; నదీ = ఏరు ; నల్లి + ఏరు = నల్లేరు
గో = ఆవు; పత్నీ = ఆలు ; ఆవు + ఆలు = ఆవాలు
సింధు = ఉప్పు
విచార = చింత ; ఫలం = పండు ; విచార ఫలం = చింతపండు
గ్రామ = ఊరు ; చూర్ణం = పిండి; గ్రామ చూర్ణం = ఊరుబిండి

’అంటే చింతపండు, ఆవాలు, ఉప్పు వేసి నల్లేరు ఊరుబిండి చేయి అని దాని అర్థం. తెలుగు పదాలను ముక్కకు ముక్కగా సంస్కృతంలో అనువదించి చెప్పాను’ అన్నాడట ఆయన. భర్త చమత్కారానికి ఆశ్చర్యపోయిందా ఇల్లాలు.

చిత్తూరులో మాట్లాడే తెలుగు, తమిళం కూడా ఇలాగే ఉంటాయని మీరనుకుంటే ఆ తప్పు మీది కాదు 🙂