Skip to content

కాళిదాసు

27 జూలై, 2008

కాళిదాసు అంటే తెలుగువారికి ప్రత్యేకమైన అభిమానం. కాళిదాసు కావ్యాలకు అద్భుతమైన వ్యాఖ్యానాలను రచించిన మల్లినాధసూరి తెలుగువాడు కావడం కేవలం కాకతాళీయం కాదేమో! కాళిదాసు అభిమానులు మరోకవి గొప్పదనాన్ని అస్సలు ఒప్పుకోరు. ఇది ప్రాచీన కాలంనుండీ ఉన్న స్పర్థ :

పురాకవీనాం గణనా ప్రసంగే
కనిష్ఠికాధిష్టిత కాళిదాసా:
అద్ద్యాపి తత్తుల్య కవేరభావేత్
అనామికా సార్థవతీ భభూవ

ప్రాచీన కవులలో గొప్పవారెవరా అని లెక్కించడానికి వేళ్ళు లెక్కబెడుతూ, మొదటగా చిటికెన వేలిని లేపి “కాళిదాసు” అన్నారట. తరువాత ఉంగరపు వేలిని లేపి పేరుచెప్పబోగా కాళిదాసుతో సమానుడైన మరోకవి ఎవరూ తోచక ఆపేశారట. అలా ఉంగరపు వేలికి ‘అనామిక ‘ అన్న పేరు సార్థకమయింది (సంస్కృతంలో ‘అనామిక’ అంటే ఉంగరపు వేలు అనీ, పేరులేనిది అనీ అర్థాలున్నాయి).

భవభూతి అభిమానులు మాత్రం కాళిదాసు కవి ఐతే భవభూతి మహాకవి అంటారు. మరి కాళిదాసాభిమానులు ఊరుకొంటారా!

కవయా కాళిదాసాద్యా:
భవభూతిర్మహాకవి:
“కవులంటే కాళిదాసు, మొదలైన వారు. భవభూతి మహాకవి”.

దీనికి కాళిదాసాభిమానుల జవాబు :-

తరవ: పారిజాతాద్యా:
స్నుహీ వృక్షం మహాతరు:
“చెట్లంటే పారిజాతం మొదలైనవి. స్నుహీవృక్షం మహావృక్షం”.

(ఈ స్నుహీవృక్షం అన్నది ఆయుర్వేద శాస్త్ర రీత్యా ఎందుకూ పనికిరాని చెట్టు. అందువలన శాస్త్రకారులు దానిని వ్యంగంగా ‘మహావృక్షం’ అని పిలిచారు).

కాళిదాసు స్పర్థ గురించి మరో కథ ప్రచారంలో ఉంది. కాళిదాసు, దండి కవుల్లో ఎవరు గొప్ప అని పోటీ వచ్చిందట. కాళిదాసు ఆరాధించే కాళికామాతనే తీర్పుచెప్పమని భోజరాజు ప్రార్థించాడు. “కవిర్దండీ కవిర్దండీ కవిర్దండీ నసంశయ:” అన్న పలుకులు విగ్రహంనుండి వెలువడ్డాయట. దండి యే కవి, అనుమానంలేదు అని దాని అర్థం. ఆ సమధానం విని ఉగ్రుడైన కాళిదాసు “కోహం రండే” (మరి నేనెవరినే ముండా అని) ప్రశ్నించాడట. అందుకు కాళీమాత “త్వమేవాహం… త్వమేవాహం” అని జవాబిచ్చిందని చెబుతారు. అంటే ” నువ్వే నేను నువ్వే నేను” అని అర్థం. కథ నిజానిజాల సంగతలావుంచితే కాళిదాసు పై జనులకున్న అంతులేని అభిమానానికి ఈ కథలు నిదర్శనాలు.

ప్రకటనలు
One Comment
  1. narayana permalink
    20 మే, 2009 2:29 సా.

    meru kalidasu gurinchi bhagarasu. memu kalidasugari kavita visistyam telusukovalanukuttunnamu . meru mayandu dayavuncci maku kavitavesistyam telupagalarani pradhna.

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: