Skip to content

పూలతోట

27 జూలై, 2008

నిత్యజీవన పయన మార్గపు
ముళ్ళబాటను నడచి యలసిన
తెరువరులు మా పూలతోటను
చూడవచ్చెదరా!

స్వీయ జీవిత కష్టసుఖముల
నొక్కమారటు మరచి పోవుడు
మధుర స్వప్నిక జగతి తలుపులు
తెరచికొనెనదిగో!

చెట్లు కొమ్మలు చిగురుటాకులు
చెట్ల చివరను చిన్ని మొగ్గలు
నేల రాలిన వృద్ధ సుమములు
అన్ని మనకొరకే

మేము పెంచగ కొన్ని పెరిగెను
తామె పెరిగెను కొన్ని మొక్కలు
తీగకన్నెల సోయగమ్ములు
చూడగా రారే

సగము విచ్చిన తీగ మల్లెలు
బంతి పూవులు సన్నజాజులు
మాలతీలత మొదలుగా గల
పూలు గలవిచటన్

ఎరుపు తెలుపు గులాబి బాలలు
స్నేహసౌరభములను జల్లుచు
రమ్ము రమ్మని తలలు యూచుచు
పిలుచుచున్నవటన్

ధవళ కాంతుల తళుకులీనెడు
పారిజాత సుమాల గంధము
హాయిగొలుపుచు మనకు స్వర్గము
చూపుచున్నవిటన్

కౄరమగు మిన్నాగుకైనను
రసపిపాసను గలుగజెసెడు
మొగలి పూవుల సొగసులన్నియు
ఇవిగొ మీకొరకే

మత్తమధుపము కేమి తెలియును
మధువుదక్క మరొక్క విషయము
సృష్టియందలి శ్రేష్ట గంధమీ
చంపకమ్ములవే

ముద్దులన్నియు మూటగట్టెడు
ముగ్ధయౌ జవరాలి మోమును
గుర్తు చేసెడి శ్వేతపద్మము
లిచట చూదదగున్

పొంగిపొరలెడు తీపి మధువుల
తోడనిండిన పద్మముల, భృం
గమ్ములన్నియు చుట్టు ముట్టుట
చూడవలసినదే!

ఇచటి పుప్పొడులన్ని గైకొని
మనకు సౌరభములను పంచుచు
మెల్లమెల్లన వీచు వాయువు
దెంత ధన్యతయో!

చూచితిరి గద మా వనమ్మును
గాంచితిరి గద తృప్తి మీరగ
సృష్టి యందు నుత్కృష్టమైన యీ
పుష్పసంపదలన్

పోయిరండు సన్మిత్రులార యీ
పూలతోటను మరచి పోకుడు
ఇచ్ఛ గలిగిన యెప్పుడైన వి
చ్చేయుడిచ్చటికిన్.

—000—

ప్రకటనలు
2 వ్యాఖ్యలు
 1. 30 జూలై, 2008 8:11 సా.

  అద్భుతమైన కవిత్వం. మీరిటువంటివి మరెన్నో రాయాలని కోరుతున్నాను. సాహిత్య పిపాసులకి ఖచ్చితంగా మీ బ్లాగు సేదతీర్చే అందమైన పూలతోటే..

 2. చంద్ర మోహన్ permalink
  31 జూలై, 2008 12:17 ఉద.

  నాగమురళి గారూ,
  నేను బ్లాగు ప్రారంభించడానికి స్ఫూర్తి మీరే. నెనర్లు!

  – చంద్ర మోహన్

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: