Skip to content

నాకు నచ్చిన ఓ తమిళ పద్యం

1 ఆగస్ట్, 2008

“అలై కడల్ కడైయ కండేన్, ఐయన్ ఐందు శిరముమ్ కండేన్

మలై ఇరుచ్చిరగు కండేన్, శివన్ శుద్ధ కళుత్తు కండేన్

మన్మధన్ ముళు వడివుకండేన్, పులవరి ఇరు కణ్ కండేన్

వారిధి నన్నీర్ కండేన్ , కొడుత్తదై వాంగక్కాణేన్”

ఈ పద్యం రామాయణ పరంగా తమిళనాడులో ప్రాచుర్యంలో ఉన్న ఓ పిట్టకథకు సంబంధించినది. మూల రచన గానీ, రచయిత పేరు గానీ జ్ఞాపకం లేదు. పదాలు కూడా ఖచ్చితంగా అవే అని చెప్పలేను. ఎప్పుడో చిన్నతనంలో ఎవరిదగ్గరో విన్న పద్యం నా మనసుకు హత్తుకు పోయింది.

పద్యానికి పూర్వకథ ఏమిటంటే…

రావణ సంహారానంతరం సీతారాములు, అయోధ్యకు ప్రయాణం అవుతుండగా సీతమ్మ వారి దృష్టి లంక లో ఉన్న ఓ సన్నికల్లు పై పడిందట. ఇలాంటిది అయోధ్యలో లేదుకదా, తీసుకువెళ్ళి అందరికీ చూపించుదాం అని ముచ్చట పడింది. ఆ సన్నికల్లును పుష్పకవిమానం లో పెట్టించమని వానరులకు పురమాయించిందటా తల్లి. వానరులు సందేహంలో పడి, ఆ విషయాన్ని హనుమంతుని దగ్గర విన్నవించుకొని ఏంచేయాలని సలహా అడిగారట. హనుమంతుడు చిక్కులో పడిపోయాడు. సన్నికల్లు గొప్ప వస్తువేమీ కాదు. సీతమ్మ వారు కోరుకొన్నారని తెలిస్తే విభీషణుడు అలాంటివి కొన్నివేలు సమర్పించుకోగలడు. కానీ ఇవ్వడమే గానీ తీసుకొనడం ఎఱుగని రాముని పత్ని శరణాగతుడైన విభీషణుడి సొత్తు గ్రహించడమా! అదీ గాక లంకలోనికి అడుగుపెట్టకుండానే సమస్త లంకారాజ్యాన్నీ విభీషణుడికి ధారాదత్తం చేసేశాడు రాముడు. ఆ రాజ్యంలో భాగమైన సన్నికల్లుని, అదెంత అల్పమైందయినా సరే, తీసుకొంటే దానంగా ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకొన్నట్లు కాదా! ఇలా ఆలోచించి, అది సరైన పని కాదనే నిర్ణయానికి వచ్చాడు హనుమంతుడు.

సరే, మరి ఆ విషయాన్ని సీతమ్మవారితో ఎలా చెప్పడం? చెప్పేంత ధైర్యం ఎవరికుంది? నా వల్లకాదన్నాడు హనుమంతుడు. అందరూ కలిసి అందరికంటే పెద్దవాడయిన జాంబవంతుని దగ్గరకు వెళ్ళి, విషయం చెప్పుకొన్నారు. జాంబవంతుడు చిరునవ్వునవ్వాడు, నేను చూసుకొంటానని అభయం ఇచ్చాడు. మెల్లగా సీత దగ్గరకు వెళ్ళి “అమ్మా సీతమ్మ తల్లీ! అందరికన్నా ఎక్కువ వయసైన వాడిని నేను. మీరు వినడమేగానీ చూడని విషయాలనెన్నో నేను స్వయంగా నా కళ్ళతో చూశాను” అంటూ పై పద్యం చెప్పాడు. దాని అనువాదం (ముక్కకు ముక్కగా కాదు) ఇదీ:

” మహాసముద్రాన్ని కవ్వంతో చిలకడం అనే వింతను నేను చూశాను. బ్రహ్మదేవుని ఐదు శిరస్సులను చూశాను.

పర్వతాలకు రెండేసి రెక్కలుండడం చూశాను, శివుని తెల్లని, చక్కని కంఠాన్ని చూశాను,

మన్మధుని సశరీరుడిగా చూశాను, ఇంద్రుని రెండు కన్నులవాడిగా చూశాను. సముద్రాలలో మంచినీరుండడం కూడా చూశాను.. కానీ తల్లీ !  దానంగా ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకోవడమన్నది ఎన్నడూ చూడలేదు.”

ఈ మాటలతో సీతకు తన కోరికలోని అనౌచిత్యం తెలిసి సిగ్గుపడి, సన్నికల్లుని అక్కడే పెట్టేయమని ఆజ్ఞాపించింది. వానరులందరూ ఊపిరి పీల్చుకొన్నారు.

ఈ కథలో ఉన్న మంచి విషయాలివీ:

* ఒక పని మంచిది కాదని తోచినప్పుడు ఎంత వారు చెప్పినా సరే చేయరాదు.

* అలా అని ఎవరు పడితే వారు వెళ్ళిపోయి నువ్వు చెబుతున్నది తప్పు అనేయకూడదు. చెప్పేవాడికి కూడా కొన్ని అర్హతలుండాలి.

* చెప్పాల్సిన పద్ధతిలో చెబితే ఎవరైనా అర్థం చేసుకొంటారు.

ఇవి ఏనాటికైనా వర్తించే నీతులు. కథ విషయం పక్కన పెడితే పై పద్యం ఎన్నో పౌరాణిక విశేషాలను తెలుపుతుంది.

అందుకే ఇది నాకు నచ్చిన తమిళ పద్యాలలో ఒకటి.

ప్రకటనలు
12 వ్యాఖ్యలు
 1. phanibala permalink
  1 ఆగస్ట్, 2008 10:59 సా.

  చాలా బాగుందండి.ఇది చదువుతున్నప్పుడు అన్ని నా కళ్ళకి కట్టినట్టుగా కనిపించాయి.చాలా హయిగావుంది ధన్యవాదములు:)

 2. వికటకవి permalink
  1 ఆగస్ట్, 2008 11:08 సా.

  చాలా బాగుంది. మంచి పద్యం అందించారు.

 3. chilamakuru vijayamohan permalink
  2 ఆగస్ట్, 2008 3:42 ఉద.

  చాలా బాగుందండి.

 4. రాజు permalink
  2 ఆగస్ట్, 2008 5:10 ఉద.

  బాగుంది. ముఖ్యంగా మీరు పద్యాన్ని వివరించే పద్దతి నచ్చింది. మరిన్ని మంచి పద్యాలను మాకు పరిచయం చేయగలరు.

 5. 2 ఆగస్ట్, 2008 7:56 ఉద.

  చాలా బాగుంది. భారతీయ సాహిత్యం లో భాష ఏదైనా రమణీయ భావాలకు కొదవ లేదు. అద్భుతంగా ఉంది.
  చంద్రమోహన్ గారు,
  మీరు ఇలాంటి పద్యాల్ని మాకెన్నో పరిచయం చేయాల్సిందే, తప్పదు!

 6. సుధాకర బాబు permalink
  3 ఆగస్ట్, 2008 10:39 ఉద.

  భావం, వ్యాఖ్య కూడా చాలా బాగున్నాయి. ఆణిముత్యం లాంటి సాహిత్య ఖండాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు

 7. చంద్రమోహన్ permalink
  3 ఆగస్ట్, 2008 11:40 ఉద.

  @ఫణిబాల గారికి, వికటకవి గారికి, విజయమోహన్ గారికి, రాజు గారికి, సుజాత గారికి, సుధాకర బాబు గారికి:
  నాకు నచ్చిన పద్యం మీకూ నచ్చినందుకు, మీ అభినందనలకు కృతజ్ఞతలు.

  – చంద్ర మోహన్

 8. raghu permalink
  5 ఆగస్ట్, 2008 11:44 సా.

  చాలా బావుంది.

  “బ్రహ్మదేవుని ఐదు శిరస్సులను చూశాను.”
  “సముద్రాలలో మంచినీరుండడం కూడా చూశాను”

  – దయచేసి కాస్త వివరించగలరా?

  -రఘు

 9. 6 ఆగస్ట్, 2008 4:02 సా.

  చాలా బాగుంది సార్.

 10. చంద్ర మోహన్ permalink
  7 ఆగస్ట్, 2008 4:27 సా.

  @ రఘు గారు,
  బ్రహ్మ దేవునికి మొదట ఐదు శిరస్సులు ఉండేవట. శివపార్వతుల కల్యాణ సమయంలో వచ్చిన ఓ గొడవలో శివుడు ఒక తలను తన త్రిశూలంతో ఛేదించాడనీ, తరువాత బ్రహ్మ తనకపాలం లోనే బిచ్చమెత్తుకొని భుజించమని శివుని శపించాడనీ ఓ కథ. ఇక సముద్రాల విషయానికొస్తే, మొదట అవి మంచినీళ్ళే నని, ఓ సారి అగస్త్యునికి కోపం వచ్చి సముద్ర జలాలనన్నీ ఔపోశన పట్టి, తరువాత మూత్ర రూపంలో విడిచిపెట్టాడనీ కధ ఉంది. ఇవి తమిళనాట ప్రాచుర్యంలో ఉన్న పురాణ కథలు. వీటికేదైనా శాస్త్ర ప్రమాణం ఉందేమో నాకు తెలియదు.
  -చంద్ర మోహన్

 11. 28 ఆగస్ట్, 2008 12:45 ఉద.

  Absolutely beautiful.

 12. 29 ఏప్రిల్, 2009 3:50 సా.

  Hi.. if u r interested in contributing pustakam.net, please do let me know, @my id.

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: