Skip to content

జేశ్వరాధములూ, జల్లెడు మోము వాడూ!

3 ఆగస్ట్, 2008

నా చిన్నతనంలో పద్యాలలో విరుపుల గురించి అంతగా తెలిసేది కాదు. ఒక్కో పద్య పాదాన్నీ చివరి వరకు చదవడం, తిరిగి తరువాతి పాదం మొదలు పెట్టి చివరి వరకు , మొత్తం పద్యాలన్నీ అలాగే. మన గణ యతి ప్రాస నియమాల పుణ్యమాని పాదాలు పదాల మధ్యలో విరిగిపోతాయి లేక అతుక్కు పోతాయన్నది ఒక్కో సారి స్ఫురణకు వచ్చేది కాదు.

భాగవతంలో ఓ పద్యం ఉంది:

”ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులన్ … “ అని.

ఇమ్మని అడిగే వారి కిచ్చి వారిచ్చే కానుకలు గ్రహించడం పోతన గారికి ఇష్టం లేదని తెలిసి పోయింది. ఐతే అలా ఇమ్మని పోతన ను అడిగిన వారెవ్వరు? పద్యం లో ‘జేశ్వరాధము’ లన్న పదం కన్పిస్తూనే ఉంది. ఈ జేశ్వరాధములెవరో అర్థం కాలేదు. ఈ పదం శబ్దార్థ చంద్రిక లో గానీ శబ్ద రత్నాకరంలో గానీ దొరకలేదు. చాలారోజులు సొంత తెలివితో ఆలోచించి ఇక లాభం లేదని పెద్దలనడిగాక తెలిసింది … “ఈ – మనుజేశ్వరాధములు “అని విడదీసి అర్థం చెప్పుకోవాలని. ‘మరి పోతన అలా విడదీసి స్పష్టంగానే వ్రాయవచ్చును గదా, చాదస్తం కాకపోతే ‘అన్పించేది. ఇంతచేసినా ఏ వ్యాకరణకర్తా పోతన భాగవతాన్ని ప్రామాణికంగా పరిగణించనూ లేదు, తమ వ్యాకరణాల్లో భాగవతాన్ని ఉదహరించనూ లేదు.

భాగవతంలోనే ఇంకో పద్యం ఉంది :


నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపారసంబుపై
జల్లెడు మోము వాడు … “ అని.

ఇక్కడా మనది అదే సమస్య. రెండో పాదంలోనికి వచ్చేసరికి ఈ జల్లెడు మోము వాడెవరో నని సందేహం వచ్చేసేది . చాలా సొంత పరిశోధన తరువాత గానీ “ పైజల్లెడు మోము వాడు” అని చదవడం అలవాటు కాలేదు. మునిమాణిక్యం వారు కూడా ఓ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించడం నేను తరువాత చదివాను. ఇలాంటి విరుపులు చాలానే ఉన్నాయి. గజేంద్రమోక్షం లో ని ఓ ప్రసిద్ధమైన పద్యం …


అలవైకుంఠ పురమ్ములో నగరిలో నామూల సౌధమ్ము దా
పుల మందార వనాంతరామృత … “ అని.

రెండో పాదంలోని ‘పుల మందార’ అంటే మందార పుష్పాల్లో అదో విశేషమైన ప్రజాతి కాబోలనుకొన్న రోజులున్నాయి.

అన్నీ పోతన పద్యాలనే చూపాను కనుక ఇది పోతన మార్కు విరుపులనుకోకండి. పోతన పద్యాలు అందరికీ పరిచితం కనుక వాటినే వ్రాశాను. ‘సహజకవి’ కావ్యంలోనే ఇన్ని చిక్కులైతే ఇతరేతర కవుల సంగతి చెప్పనక్కరలేదు.

హైస్కూల్లో కృష్ణమనాయుడు గారనే తెలుగు మాస్టారు పద్యాలను ఎలా చదవాలో, ఎలా చదవకూడదో నేర్పాక ఈ రకమైన సందిగ్ధతలు దూరమయినాయి. పదాలను సరియైన చోట విడయాలని చూపడానికి వారు ఈ క్రింది పద్యాన్ని ఉదాహరణగా చూపే వారు:


కొండనుండు నెమలి కోరిన పాలిచ్చు
పశువు శిశువు తోడ పలుక నేర్చు
వనిత వేదములను వల్లించుచుండును
బ్రాహ్మణుండు కాకి పలలము దిను”

కొండనున్న నెమలి కోరిన పాలీయడమేమిటని మేమంతా అశ్చర్య పోయాక పద్యంలో కామాలను పెట్టి ‘ఇప్పుడు చదవండి!’ అనే వారు, ఇలా :


కొండనుండు నెమలి, కోరిన పాలిచ్చు
పశువు, శిశువు తోడ పలుక నేర్చు
వనిత, వేదములను వల్లించుచుండును
బ్రాహ్మణుండు, కాకి పలలము దిను”

తెలుగులోనే ఇలా ఐతే, ప్రతిపద నానార్థాలున్న సంస్కృతంలో ఇలాంటి చిక్కులు కోకొల్లలు. వాటి గురించి ఇంకో సారి.

పద్యాలలో గణాల అమరికను, పదాల కూర్పును అధ్యయనం చేయడం పద్యాలను సరిగ్గా చదవడానికి అవసరం. పద్యాలు వ్రాయడానికి మరీ అవసరం. వారి ప్రోత్సాహంతోనే నాకు పద్యాలు వ్రాయడం అలవడింది. నేను మొదటి సారి ఓ కావ్యఖండిక ను వ్రాసినప్పుడు కృతజ్ణతతో వారికి అంకితమిచ్చాను. అంకిత పద్యం ఇలా వ్రాశాను:


పద్దియముల యందు శ్రద్ధను గల్గించి
ఇట్టి త్రోవ నన్ను నెట్టినట్టి
ఆఖ్య కృష్ణ నాయుడాంధ్ర భాషాచార్యు
కిచ్చుచుంటి కృతిని మెచ్చగాను “

కావ్యఖండిక వారికి చూపించితే ఆసాంతం చదివి వారిలా అన్నారు – “ పద్యాల గురించి చెప్పి నిన్ను నెట్టినందుకు బాగానే కిచ్చావురా !”

ప్రకటనలు
9 వ్యాఖ్యలు
 1. 3 ఆగస్ట్, 2008 11:45 సా.

  ha ha ha.
  very good

 2. chilamakuru vijayamohan permalink
  4 ఆగస్ట్, 2008 4:07 ఉద.

  చాలా చాలా బాగుంది.

 3. 4 ఆగస్ట్, 2008 9:34 సా.

  చంద్ర మోహన్ గారు, ఈ టపా చదువుతుంటే నా చిన్నపుడు విజయవాడ రేడియో స్టేషన్ వారు నిర్వహించే “సరసవినోదిని” అనే సమస్యా పూరణ కార్యక్రమమ వింటున్నట్టుగా ఉంది. ప్రతి మాగళవారం ఉదయం 7-15 గంటలకు వచ్చే ఆ కార్యక్రమానికి మా వూరి నుంచి ఇద్దరు తెలుగు లెక్చరర్లు తప్పక ప్రతివారం పూరణలు పంపుతుండేవారు. అందులో ఇలాంటి విరుపులతోనే సమస్యలు ఇచ్చేవారు.మీ టపా చాలా బాగుంది.
  జేశ్వరాధములూ, జల్లెడుమోమువాడు! బాగుంది!

 4. 6 ఆగస్ట్, 2008 12:16 ఉద.

  @కొత్తపాళీ గారు,
  @ విజయ మోహన్ గారు,
  @ సుజాత గారు,

  నెనర్లు.
  -చంద్ర మోహన్

 5. 6 ఆగస్ట్, 2008 3:57 సా.

  చాలా బాగుందండీ.
  నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా సంస్కృతం టీచరు గారికి ప్రియశిష్యుణ్ణి. అప్పుడు మాకు సిలబస్ లో లేకపోయినా కాళిదాసు మేఘ సందేశం సంపాదించి చదివాను. కానీ ఆ పుస్తకంలో శ్లోకమూ, తెలుగు అర్థమూ ఉన్నాయి కానీ ప్రతిపదార్థ వ్యాఖ్యానాలు లేవు. నేనే పదాలు విడదీసుకుని అర్థం చేసుకోడానికి ప్రయత్నించేవాడిని. ఉత్తర మేఘంలో ఒక శ్లోకం చివరి పాదం ఇలా కనిపించింది –
  నీచైర్గచ్ఛత్యుపరి చ శాద చక్రనేమి క్రమేణ.

  అందులో ‘శాద’ అంటే ఎంత ప్రయత్నించినా అర్థం కాలేదు. మా టీచరు గారిని అడిగాను. ఆవిడా చెప్పలేకపోయారు. శ్లోకం ఏమిటో కనుక్కుని, ఆవిడ ఇంటికి వెళ్ళి వ్యాఖ్యానం చూస్తే, అది అప్పు తచ్చు అని తేలింది. ‘శాద’ కాదు. ‘దశా’ అన్నమాట. తరవాత మల్లినాథ సూరి వ్యాఖ్యానం ఉన్న పుస్తకం నాకిచ్చి చదువుకోమన్నారు. ఎంత సంతోషించానో చెప్పలేను.

 6. చంద్ర మోహన్ permalink
  7 ఆగస్ట్, 2008 3:46 సా.

  నాగ మురళి గారూ,
  తెలుగులోనే ఇన్ని పాట్లయితే, సంస్కృతం గురించి చెప్పేదేముంది. అచ్చు తప్పులు కూడా తోడైతే ఇక అంతే. మునిమాణిక్యం వారోసారి వ్రాశారు: ఒక కుర్రాడు ‘సార్! లంగూడి అంటే ఏమిటండీ’ అని అడిగాడట. ఆయన నానా కష్టాలూ పడ్డ తరువాత ఇంతకీ ఆ పదం ఎక్కడ దొరికిందా అని పుస్తకం తెప్పింఛి చూస్తే, అందులో ” అ, ఆ, ఇ, ఈ లంగూడి…” అని ఉందట.

  – చంద్ర మోహన్

 7. 30 ఆగస్ట్, 2008 12:33 సా.

  బ్రహ్మాండం ! లంగూడి ప్రహసనం మరీ నవ్వు తెప్పించింది.
  ఇది చదువుతూంటే.. నేను ఆరో తరగతిలో ఉండగా “శ్రీమదాంధ్ర మహాభారతం” అని మాచేత చెప్పించడానికి మా ప్రిన్సిపాలు గారు పడ్డ యాతన గుర్తొచ్చింది. గతంలో బ్లాగాను.

 8. 30 ఆగస్ట్, 2008 2:57 సా.

  టపా బావుంది, మీ లంగూడి వ్యాఖ్య మరీను, చదివి తెగ నవ్వుకున్నాను

 9. 30 ఆగస్ట్, 2008 6:12 సా.

  నవ్వుకి టపా రూప మిచ్చాను చూడండి

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: