Skip to content

తిరువళ్ళువర్ … గదరా సుమతీ !

3 ఆగస్ట్, 2008

“Wise men think alike” అని ఓ ఆంగ్ల సామెత (“Vice men” కూడా అనుకోండి) . ఈ మాటల్లో ఎంతో నిజం ఉంది. కొన్ని మంచి మాటలు విశ్వ జనీనంగా, దేశ కాలాలకు అతీతంగా వేర్వేరు మహా పురుషుల నోటినుండి ఉద్భవిస్తుంటాయి. ఆ మాటలలోని సారూప్యత ఒక్కోసారి మనకు అశ్చర్యాన్ని కలిగిస్తాయి.

ద్రవిడ వేదంగా పరిగణించబడే “తిరుక్కురళ్” దాదాపు రెండు వేల ఏళ్ళనాటిది. ద్విపద లాంటి రెండు పాదాల ఛందంలో ఆణిముత్యాల్లాంటి సూక్తులను అందించిన గ్రంధమది. అందులోని ఓ పద్యం ఇది:

“ఎప్పొరుళ్ యార్ యార్ వాయ్ కేట్పినుం
అప్పొరుళ్ మెయ్ పొరుళ్ కాణ్బదరివు ”

(ఏ విషయమైనా ఎవరుచెప్పినా సరే గుడ్డిగా నమ్మక, ఆ చెప్పిన విషయంలోని నిజానిజాలను గ్రహించడాన్నే వివేకం అంటారు).

ఈ పద్య భావం చదవగానే తెలుగువారికి ఓ చిరపరిచితమైన పద్యం గుర్తుకు వచ్చివుండాలి :

“వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింప దగున్
కనికల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ”

తిరువళ్ళువర్ ఋషి పుట్టిన ఎన్నో శతాబ్దాల తరువాత జన్మించిన బద్దె భూపాలుడు దాదాపుగా అవే మాటలను ఎలా చెప్ప గలిగాడు? తమిళగ్రంధమైన తిరుక్కురళ్ ను ఆయన చదివి వుండడం సాధ్యమా ?

అందుకే అనిపిస్తుంది , “Wise men think alike” , ఈ మాటల్లో ఎంతో నిజం ఉంది!

ప్రకటనలు
7 వ్యాఖ్యలు
 1. రాజేంద్ర permalink
  3 ఆగస్ట్, 2008 6:26 సా.

  మూలం నేను ఉదహరించలేనుగానీ,బుద్ధుడు ఇలాంటి మాటలే చెప్పారు,వేల సంవత్సరాలక్రితం,బుద్ధుడు చెప్పాడనో,గురువులు,తల్లితండ్రులు,బ్రాహ్మణులు,పండితులు చెప్పారనో కాక నువ్వు,విన్నదీ,చదివినదానినుంచి మంచియేదో చెడ్డయేదో నీవే గ్రహించుకుని స్వీకరించాలీ అని.అలాగే అతిప్రాచీన కాలం నాటి సూక్తి ఒకటి ఉంది,చూసింది సగమే నమ్ము,విన్నది అసలు నమ్మకు అని.మీకృషికి నా అభినందనలు.మీ బ్లాగును ఇప్పుడే చూసాను,బాగుంది.

 2. రాజేంద్ర permalink
  3 ఆగస్ట్, 2008 6:27 సా.

  అలాగే అతిప్రాచీన కాలం నాటి చైనా దేశపు సూక్తి ఒకటి ఉంది,చూసింది సగమే నమ్ము,విన్నది అసలు నమ్మకు అని.

 3. 3 ఆగస్ట్, 2008 6:50 సా.

  @ రాజేంద్ర గారూ,
  నేను చెప్పదలచిన విషయాన్ని మీ వ్యాఖ్యలు మరింత విశదీకరించాయి. కృతజ్ఞతలు. దాదాపు రెండున్నర వేల యేళ్ళనాటి బుద్ధుడు, రెండు వేల యేళ్ళ క్రితం తిరువళ్ళువర్, వెయ్యి సంవత్సరాల నాటి బద్దెన వేరు వేరు ప్రదేశాలలో, వేరు వేరు భాషా సంస్కృతుల నేపథ్యంలో, ఒకే లాంటి దార్శనికతను ప్రదర్శించడం అద్భుతమైన విషయం.

  నెనర్లు.
  – చంద్ర మోహన్

 4. 3 ఆగస్ట్, 2008 10:33 సా.

  బుద్ధుడు చెప్పిన సూత్రం యొక్క అనువాదాన్ని ఇక్కడ చదువుకోవచ్చు.

 5. చంద్ర మోహన్ permalink
  4 ఆగస్ట్, 2008 11:24 సా.

  నాగరాజు గారూ,
  మంచి లంకె. కృతజ్ఞతలు. http://www.tipitaka.org/eot అనే వెబ్ సైటులోకూడా ఈ సూత్రాల అనువాదం దొరుకుతుంది.

  -చంద్ర మోహన్

 6. భావకుడన్ permalink
  5 ఆగస్ట్, 2008 3:16 సా.

  దీన్నే kohlberg అనే ఆయన తన stages of morality లో ఆఖరుది, ఆరవది అయిన స్టేజి అఫ్ మొరాలిటీని “based on universal ethical principles” అంటాడు. అంటే “మన పూర్వీకులు లేదా సమాజం చెప్పినదాన్ని గుడ్డిగా ప్రామాణికంగా తీసుకోకుండా ప్రతీ సందర్భాన్ని దాని యొక్క పరిస్థితులను బట్టి తప్పు ఒప్పులు నిర్ణయించటం” అని వివరిస్తాడు. నిజంగా ఇవన్నీ “universal ethical principles” ఏ నండి.

  (http://en.wikipedia.org/wiki/Kohlberg's_stages_of_moral_development)

 7. 6 ఆగస్ట్, 2008 4:00 సా.

  మీ ‘జల్లెడు మోము వాడు’ టపాకి మరొక ఉదాహరణ ఇందులో మీరు చెప్పిన పద్యం. చిన్నప్పుడు ‘కనికల్ల నిజము తెలిసిన’ లో కనికల్ల అంటే అర్థం అయ్యేది కాదు. కని తరవాత కామా పెట్టాలని తరవాత ఎప్పుడో తెలిసింది.

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: