Skip to content

మత్కుణ ప్రశస్తి

5 ఆగస్ట్, 2008

ఒకప్పుడు నిందా స్తుతి, స్తుతి నింద కలిగిన పద్యాలు వ్రాయడం ఓ సరదా ప్రక్రియగా ఉండేది. కాసుల పురుషోత్తమ కవి వ్రాసిన ‘ఆంధ్ర నాయక శతకం’ నిందాస్తుతికి గొప్ప ఉదాహరణ. అలాగే అందరూ నీచదృష్టితో చూసే వస్తువును కీర్తిస్తూ వ్రాసే స్తుతినింద, లేక ‘సెటైర్’ లాంటివి కొన్ని ప్రసిద్ధి చెందాయి. కాకిని కోకిలతో పోల్చి అపహాస్యంచేయడాన్ని నిరసిస్తూ కాకి చెప్పినట్లుగా నార్ల వేంకటేశ్వర రావుగారు ఓ కావ్యాన్ని వ్రాశారు. అలాంటివి చదివిన ప్రేరణతో నల్లిని కీర్తిస్తూ నేను చాలాయేళ్ళ క్రితం ‘మత్కుణ ప్రశస్తి’ (మత్కుణమంటే నల్లి) అనే పద్య కావ్యాన్ని వ్రాశాను. ఇప్పుడలాంటి పద్యకావ్యాలు ఎవరికైనా నచ్చుతాయో లేవో తెలియదు కానీ, పోగొట్టడం ఇష్టంలేక ఇక్కడ వ్రాస్తున్నాను:

మత్కుణ ప్రశస్తి

శ్రీకరమౌ మత్కుణమును
రాకాసులవోలె చంపు ప్రజలకు నెపుడున్
నాకము దక్కదు యున్నత
మౌకర్మంబులొనర్చి మనీషులైనన్

పరుపులందున నివసించు ప్రభువు రీతి
తలుపుసందుల వసియించు తప్పనపుడు
ఎప్పుడెట్టుల నివసింప నేమి కలదు!
మొగిటి ధీరత్వ శూరత్వములను మేటి

పొట్టనిండువరకె పురుషరక్తము ద్రావు
నెక్కు వొక్క చుక్క మెక్కబోదు
ఊరకెప్పుడునది నరుని జోలికి బోదు
ఎన్న నల్లికన్న యెవరు మిన్న?

కాలియందు చిన్న ములుగ్రుచ్చుకొన్నచో
అమ్మ! అబ్బ! చస్తి! యండ్రు నరులు
ఎన్ని హింసలెన్ని యిడుముల బెట్టిన
బాధకోర్చి నల్లి బ్రతుక నేర్చె

కరుణలేక నరులు కఠిన హృదయముల
నల్లి సద్గుణాల వల్లి జంప
వరుస బెట్టి యింటి వస్తు సంచయముల
మత్కుణ రహితముగ మార్చనెంచి

ఇంట నున్నవాని నెండపాలంజేసి
గట్టిగాను బాది కఱ్ఱతోడ
డీడిటీ, ఫినైలు, టిక్ ట్వంటి మొదలుగ
మందులెన్నొ బోసి సందులందు

కౄరాత్ములు కనిపెట్టిన
ఘోరాతిఘోరము, కాలకూట సదృశ సం
హారక మందుల గృహమున
కారుణ్యము లేకజల్లి కఠినాత్మలతోన్

ఇన్ని హింసలిడిన నెవరైన నోర్తురె
పార్థుడైన పంచ వక్త్రుడైన
విధినెదిర్చి పోరు వీర విక్రమ శాలి
మాననీయ చరిత నల్లి దక్క

ఒక్క చుక్క రక్త ముత్కణమును మన
శత్రువునుగ జేసె స్వార్థ బుద్ధి
మనిషి తనకు వలయు మాంసము కొరకెన్ని
జంతువులను రోజు చంపుచుండె!

కనుక నల్లి జంపు మానవాధములకు
నల్లి పడెడి బాధ నరకమందు
యముని భటులచేత తమకు గలుగుచుండ
గుర్తు రాదె వారి కౄర చర్య!

కనికరమును జూపి మానవులికనైన
నల్లి జంపు బుద్ధి మానకున్న
శాంతమూర్తి నల్లి శాపాగ్నిలో భూమి
కాలిపోవు కఱవు కాటకముల

(సమాప్తం)

ప్రకటనలు
9 వ్యాఖ్యలు
 1. వికటకవి permalink
  5 ఆగస్ట్, 2008 3:32 ఉద.

  బాగున్నాయ్ సరదాగా. అయినా ఎంత జీవ దయ అయితే మాత్రం నల్లితో కుట్టించుకోమంటారా ఏమిటి? దానంతటది ఎందుకు రాదండీ బాబూ, రాత్రిళ్ళు వచ్చి వచ్చి కనీసం ఓ చెంచాడు రక్తం నాది టీనేజీలో తాగి పారేస్తేనూ. అయినా నా రక్తం తాగి నన్ను శాపాగ్నిలో మాడమంటం అన్యాయం….నేనొప్పుకోను.

 2. 5 ఆగస్ట్, 2008 6:51 ఉద.

  చంద్రమోహన్,
  మీ బ్లాగు మొదలెట్టిన కొద్దిరోజుల్లోనే మీకు వీరాభిమానినైపోయాను. మా తెలుగు మాస్టారిని అనుక్షణం గుర్తు చేస్తున్నారు మీరు! మీ దగ్గర ఇలాంటివి ఏమైనా ఉంటే నా మొహాన పడెయ్యండి. అచ్చు తీసి దాచుకుంటాను.

  ఈ టపా మాత్రం తప్పక ప్రింట్ తీయాల్సిందే! మా వూర్లో సినిమా థియేటర్లలో కూడా నల్లులుంటాయి.అమ్మమ్మ ఎప్పుడూ నవారు మంచైం తిరగేసి ఎండలో పడేసి ఉంచేది. నల్లులు ఎండ తాళలేక మంచం కింద చేరేవి. మంచం ఎత్తగానే పుట్టలు పుట్టలుగా ఉండేవి. వాటిని చంపడంలో ఎంత సమ్రోత్సాహం ఉండేదో!

  “మనిషి తనకు వలయు మాంసము కొరకెన్ని..” సూపర్.

  ఈ లెక్కన నాకూ నరకం తప్పదన్నమాట.

 3. 5 ఆగస్ట్, 2008 1:55 సా.

  మీ దగ్గర నుంచి సంస్కృతం నేర్చుకోవాలని నాకూ చాలా కోరికగా ఉందండీ. ఒక క్రాష్ కోర్సు పెట్టొచ్చుగా నేనూ జాయిన్ అయిపోతాను.

 4. భావకుడన్ permalink
  5 ఆగస్ట్, 2008 2:26 సా.

  చంద్రమోహన్ గారు,
  చాలా బావుందండి మీ ఈ “నల్లాయణము” 🙂

  “నాకము దక్కదు యున్నత
  మౌకర్మంబులొనర్చి మనీషులైనన్” ఇందులో “నాకము” అంటే ఏమిటో అర్థం కాలేదండి. భావం అర్థము అయింది కాని అసలు అర్థము (literal meaning) తెలీదు అందుకని.

  ఇకపోతే మీ ఈ రచన నా బ్లాగులో(www.nemechchinaraatalu.blogspot.com) పెట్టుకోవచ్చా? మీవే కాపీరైటు హక్కులన్నీ 🙂

  చివరిగా ప్రతాప్ గారి సహాధ్యాయి అవటానికి నేను సుముఖుడనే మీరు చెపుతానంటే.

 5. నరేంద్ర భాస్కర్ S.P permalink
  5 ఆగస్ట్, 2008 7:25 సా.

  నరేంద్ర భాస్కర్ S.P.
  నమస్తే!
  నల్లి గురించే వెనకటికో చాటువుంది, (ప్రతి చాటువు లాగానే దీన్నీ శ్రీనాధుడు రాశాడనే అంటారు)
  ఇనుడస్తాద్రిని శయనించుట, విష్ణువు పాము మీద పడుకోడం, శివుడు మంచు కొండల్లో ఉండడం ఇవన్నీ నల్లుల భాధ పడలేకే సుమా అంటాడు కవి అది గుర్తొచ్చింది,
  నెనర్లు

 6. 5 ఆగస్ట్, 2008 10:44 సా.

  శివుడద్రిని శయనించుట,
  రవిచంద్రులు మింటనుంట, రాజీవాక్షుం
  డవిరళముగ శేషునిపై
  పవళించుట, నల్లి బాధ పడలేక సుమీ!

 7. 5 ఆగస్ట్, 2008 11:06 సా.

  @వికట కవిగారు,
  వికటకవి అన్నాక, తప్పదు మరి! నల్లి ఆత్మ ఘోషకు నేను ‘మౌత్ పీస్’ ని మాత్రమే. మీరు తప్పొప్పులు తేల్చుకోవలసింది నల్లి తోనే 🙂 . నెనర్లు.

  @సుజాతగారూ,
  నేను బ్లాగు వ్రాస్తే ఎవరైనా చదువుతారా అని అనుమానముండేది. అలాంటిది మీరు ‘వీరాభిమాని’ అంటూ వ్రాస్తే, చెప్పొద్దూ, కొంతసేపు కాళ్ళు నేలమీద నిలవడం కష్టమయిపోయిందనుకోండి:-)
  పద్యం మీకు మెయిల్ లో పంపించాను. ఇక నరకం అంటారా, దానిగురించీ మీకేం భయం లేదు. ఈ కవితను చదివిన వారికీ, విన్నవారికీ, నల్లిదోష నివారణ అయిపోవడమే గాక, స్వర్గంలో బెర్తు రిజర్వు అయిపోతుందని ఫలశృతి, వ్రాయడం మరిచిపోయాను 🙂

  మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.

  @ ప్రతాప్ గారు,
  నాకంత సీన్ లేదండి. ఏదో చదివిన నాలుగు ముక్కలు ఇలా చెప్పగలను కానీ, ఇంకొరికి నేర్పేంత సంస్కృతం నాకు రాదు. నాగమురళి గారిని ప్రయత్నించి చూడండి.

  @ భావకుడన్ గారు,
  నాకము అంటే స్వర్గమని అర్థం. రచనను నిరభ్యంతరంగా మీ బ్లాగులో పెట్టుకోవచ్చు. మీకంతగా నచ్చడం కన్నా ఇంకేం కావాలి!

  @ నరేంద్ర భాస్కర్ గారు,
  ఆ పద్యం ఇదీ:
  “శివుడద్రిని శయనించుట
  రవిచంద్రులు మింటనుంట, రాజీవాక్షుం
  డవిరళముగ శేషునిపై
  పవళించుట నల్లిబాధ పడలేక సుమీ”

  ఈ పద్యం శ్రీనాధుడు వ్రాసినట్లు వినలేదు నేను.

  నెనర్లు.

  – చంద్ర మోహన్

 8. 6 ఆగస్ట్, 2008 3:50 సా.

  చంద్రమోహన్ గారూ, చాలా బాగుంది మీ మత్కుణోపాఖ్యానం. పద్యాలు చాలా బాగా రాశారు. మీ బ్లాగుకి వీరాభిమానుల్లో నేనూ ఉన్నాను. మీ తరువాతి టపాలకోసం ఎదురు చూస్తాను.

  ప్రతాప్ గారూ, తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యంగారు తన బ్లాగులో సంస్కృతం పాఠాలు చెప్పారు. ఒకసారి ఆయన సాహిత్యం బ్లాగు చూడండి.

 9. చంద్ర మోహన్ permalink
  7 ఆగస్ట్, 2008 3:50 సా.

  @ నాగమురళి గారూ,
  మీ అజ్ఞాతవాసం ముగిసి పోయిందన్న మాట. ఇప్పుడిక మీవంతే!.

  – చంద్ర మోహన్

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: