Skip to content

‘దీపశిఖ’ కాళిదాసు

12 ఆగస్ట్, 2008

అది ఇందుమతీ దేవి స్వయంవర సభ. భువిలోని రాజులందరూ విచ్చేసినారు. అందరి మనసుల్లోనూ ఒకే కోరిక. ఇందుమతి నన్నే వరించాలి! అని. అనుంగు నెచ్చెలి సునంద వెంటరాగా వరమాలను చేత ధరించి ఇందుమతీ దేవి ఒక్కొక్క రాజునే చూస్తూ ముందుకు నడుస్తున్నది. సునంద ఆ రాజును గురించి అమెకు పరిచయం చేస్తుంటే ఒక్క క్షణం ఆతని ముఖాన్ని పరకాయించి చూస్తున్నది. ఆ క్షణాన ఆ రాజు ముఖం వెలిగిపోతున్నది ఇందుమతి నన్నే చూస్తోంది! ఇక మాల మెడలో పడడమే తరువాయి అన్న ఊహ అతని ముఖాన్ని దీప్తిమంతం చేస్తున్నది. అంతలో ఇందుమతి తల త్రిప్పేసి ముందుకు వెళ్ళి పోతుంది. ఆమె తనను దాటి వెళ్ళిపోతుంటే పాపం ఆ రాజు ముఖం కళావిహీనమైపోయి నల్లబడిపోతోంది. వరుసలోని రాజులందరిదీ ఇదే పరిస్థితి. ఈ సన్నివేశాన్ని కాళిదాసు బహురమ్యంగా వర్ణించాడు, ఇలా:

సంచారిణీ దీప శిఖేవ రాత్రౌ

యం యం వ్యతీయాయ పతింవరా సా

నరేంద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే

వివర్ణ భావం సస భూమిపాల:

ఆ స్వయంవర సభలో ఇందుమతి నడుస్తున్న దీపశిఖ లా ఉందట. చీకట్లో రాజవీధిలో ఓ దీపశిఖ నడిచిపోతూ వుంటే ఒక్కో రాజభవనపు గుమ్మం, జ్వాల దగ్గరవుతున్నకొద్దీ ప్రకాశమానమవుతూ, జ్వాల దాటి పోగానే చీకట్లో మునిగిపోతున్నట్లుగా ఒక్కో రాజు ముఖం ఇందుమతి సమీపిస్తూ ఉంటే ప్రకాశిస్తూ, తనను దాటిపోతుంటే నల్లబడిపోతోంది.

రఘువంశం లోని అద్భుతమైన, మనోజ్ఞమైన ఈ వర్ణన కాళిదాసుకు దీపశిఖ కాళిదాసు అన్న పేరు తెచ్చిపెట్టింది.

కాళిదాసు రచనల్లో మేఘదూతం అత్యుత్తమమైనదని చాలామంది అభిప్రాయపడతారు గానీ, నా ఓటు మాత్రం రఘువంశానికే.

ప్రకటనలు
17 వ్యాఖ్యలు
 1. 13 ఆగస్ట్, 2008 3:52 సా.

  ‘నరేంద్ర మార్గాట్ట ఇవ’ అని ఉండాలి అనుకుంటా.
  దీపశిఖా కాళిదాసు అంటే నాకు ఈ శ్లోకంతో పాటూ ఇంకో శ్లోకం కూడా గుర్తు వస్తుంది.

  రూపం తదోజస్వి తదేవ వీర్యం తదేవ నైసర్గికమున్నతత్వం
  న కారణాత్ స్వాత్ బిభిదే కుమార: ప్రవర్తితో దీప ఇవ ప్రదీపాత్ ||
  రఘుమహారాజు కొడుకైన అజుడు రూపంలోనూ, శౌర్యంలోనూ, ఔన్నత్యంలోనూ అచ్చంగా తండ్రినే పోలి ఉన్నాడట – ఒక దీపం నుంచి వెలిగించిన మరొక దీపంలాగా.

  నేను రఘువంశాన్నీ మేఘదూతాన్నీ పోల్చి చూడను గానీ, మేఘదూతం మహా రొమాంటిక్ పొయెట్రీ . అందులోనూ టీనేజిలో చదివానేమో, నా మనసులో చెరగని ముద్ర వేసింది.

 2. 13 ఆగస్ట్, 2008 5:29 సా.

  నా ఓటు మేఘదూతానికే!హరిహరన్, కవితా కృష్ణ మూర్తి ఆలాపించిన మేఘదూతం వినేదాకా నేనసలు మేఘదూతాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ గాన మాధుర్యానికి బానిసనై, మేఘదూతం చదవాలనుకున్నాను. మనకు సంస్కృతం రాదు కాబట్టి మేఘదూతానికి విద్వాన్ కోసూరు వెంకట నరసిమ్హ రాజు గారు వ్యాఖ్యానం రాసిన పుస్తకం సంపాదించాను. (సంస్కృత భాషా ప్రచార సమితి వారిది ఈ బుక్)

  ప్రతి శ్లోకానికీ రమణీయ వ్యాఖ్యానం!నేను కాళిదాసు ఇతర కావ్యాలు చదవలేదు. అందువల్ల నా వోటు మేఘదూతానికే!

 3. 13 ఆగస్ట్, 2008 6:11 సా.

  సుజాత గారూ, హరిహరన్, కవితా కృష్ణ మూర్తి ఆలపించిన మేఘదూతం నేను 1998లో విన్నాను. తరవాత హైదరాబాదులో ఆ సీడీ కోసం ప్రయత్నించాను కానీ దొరకలేదు. ఇంటర్నెట్ లో అది ఎక్కడైనా దొరుకుతుందేమో చెప్పగలరా?

 4. 13 ఆగస్ట్, 2008 7:50 సా.

  10 వ తరగతి సంస్కృత పాఠం లో ఈ పద్యం మొదటి సారి చదువుకున్నప్పుడు, అంతగా తట్టలేదు, నా మృణ్మయ మస్తిష్కానికి. ఆ తరువాత, “దీప శిఖ” ..దీపపు చిమ్మె ను వదిలేసి, కేవలం ఆ “జ్వాల” ను అమ్మాయి తో పోల్చి చూసుకున్నప్పుడు తెలిసింది, అందులో ఉన్న అపూర్వమైన భావం.

  మొగలి పువ్వునీ, జాజి మల్లె నీ పోల్చి చూస్తే యేది గొప్పది అన్నట్టుంది మీ ప్రశ్న.

 5. వికటకవి permalink
  13 ఆగస్ట్, 2008 9:37 సా.

  ఇంటర్మీడియట్లో చదివిన శ్లోకం ఇది. బహు చక్కని ఉపమానం. అయినా ఉపమా కాళిదాసస్య అని ఊరికే అన్నారా? “ఇవ ప్రపేదే” కరక్టు.

 6. పరుచూరి శ్రీనివాస్ permalink
  13 ఆగస్ట్, 2008 10:17 సా.

  హరిహరన్, కవితా కృష్ణమూర్తి పాడిన విషయం కూడా నాకు తెలియదు. నాకు తెలిసిన, నచ్చిన మేఘదూతం (సంస్కృతంలో) బాలాంత్రపు రజనీకాంతరావుగారి ఆధ్వర్యంలో బాలమురళీకృష్ణ తదితరులు గానం చేసింది. బెంగుళూరు రేడియో స్టేషన్ ద్వారా 1978 ప్రాంతాల్లో ప్రసారమయ్యింది. నిడివి సుమారు 65 నిమిషాలు. వీలునిబట్టి ఈమాట సైట్ కి upload చేస్తాను. పైన పేర్కున్న యిద్దరు గొప్ప వ్యక్తులే 1955-60 మధ్యల్లో ఇదే కావ్యాన్ని తెలుగీకరించి విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారం చేసారు. ఆ రికార్డింగు దొరికితే బావుణ్ణు :-). ఆ కాలంలో చాలా సంస్కృత కావ్యాలు/నాటకాలు విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారమయ్యాయి.

  — శ్రీనివాస్

 7. 14 ఆగస్ట్, 2008 6:14 ఉద.

  విశ్వమోహన్ భట్ కూర్చిన మ్యూజిక్ టుడే రికార్డ్ అది!నాకు నచ్చింది. కొన్ని శ్లోకాలను ఎంపిక చేసి మంచి మంచి రాగాల్తో స్వరపరిచారు.

 8. 14 ఆగస్ట్, 2008 6:16 ఉద.

  నాగమురళి గారు, అది ఇంటర్నెట్ లో ఎక్కడా లేదు. నా దగ్గర కూడా కేవలం కాసెట్ మాత్రమే ఉంది. అప్పట్లో సిడి ప్లేయర్లు పెద్దగా లేకపోవడం వల్ల కాబోలు అది సిడి రూపంలో కూడా దొరకలేదు. నేనే ఎప్పుడో దాన్ని సిడి లోకి మార్చాలనుకుంటున్నాను.

 9. 14 ఆగస్ట్, 2008 6:16 సా.

  శ్రీనివాస్ గారూ, తప్పకుండా ఈమాటలో అప్ లోడ్ చెయ్యండి. ఎదురు చూస్తుంటాను. (మీకు బోల్డంత పుణ్యం వస్తుంది 🙂 )

  సుజాత గారూ, వీలైతే ఆ కేసెట్ ని సీడీ గా చేసి ఎక్కడైనా అప్ లోడ్ చెయ్యగలరా? (మీకూ డిటో).

 10. 15 ఆగస్ట్, 2008 12:11 ఉద.

  నాగమురళి గారూ, వికట కవి గారూ,
  ‘ఇవ’ నే కరక్టు. సరి చేసినందుకు నెనర్లు. మీరు వ్రాసిన పద్యం కూడా కాళిదాసు రచనా శైలికి గొప్ప ఉదాహరణ.
  రవి గారు,
  నెనర్లు. కాళిదాసు రచనలను పోల్చడం కష్టమే. పోల్చి చూడడం నా ఉద్దేశ్యం కూడా కాదు. కానీ కాళిదాసు గొప్పతనమే ‘పోల్చడం’ లో ఉంది కదా 🙂 ఎంతకాదనుకున్నా మన ‘ఫేవరేట్’ అంటూ కొన్ని ఉంటాయిగా. నన్నడిగితే జాజుల కంటే మొగలిపూవులే ఇష్టం అంటాను.

  సుజాత గారు,
  ఆ కేసెట్ పేరు చెప్పగలరా. ‘Music Today’ వారి సైట్ లో కూడా ప్రయత్నించి చూశాను కానీ కనిపించలేదు.

  శ్రీనివాస్ గారూ,
  మీ అప్ లోడ్ కొరకు ఎదురుచూస్తుంటాను.

 11. 25 ఆగస్ట్, 2008 6:41 సా.

  @ సుజాత గారు
  మేఘదూతానికి విద్వాన్ కోసూరు వెంకట నరసిమ్హ రాజు గారు వ్యాఖ్యానం రాసిన పుస్తకం సంపాదించాను. (సంస్కృత భాషా ప్రచార సమితి వారిది ఈ బుక్)
  ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది 🙂 నాకు ఒక ప్రతి కావాలి.
  రాకేశ్వర

 12. 25 ఆగస్ట్, 2008 9:02 సా.

  రాకేశ్వర గారు,
  ఈ పుస్తకం నేను 1998లో కొన్నాను, విశాలాంధ్రలో! దానిలో ఉన్న అడ్రస్ ఇలా ఉంది.

  ప్రాప్తి స్థానము
  కార్యదర్శి,
  సంస్కృత భాషా ప్రచార సమితి
  5-4-743,రెండవ అంతస్థు,
  హరేకృష్ణ దేవాలయం పక్కన,
  నాంపల్లి స్టేషన్ రోడ్, హైదరాబాదు
  ఫోన్ (బహు పాత నంబరు)040-515481

  ఈ చిరునామా ఎందుకు ఇచ్చానంటే ఈ పుస్తకం విశాలాంధ్రలో ఇప్పుడు లభ్యం కావడం లేదు. ఒకవేళ నాకు మరొక కాపీ లభిస్తే మీకు పంపడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు.

 13. వికటకవి permalink
  25 ఆగస్ట్, 2008 9:20 సా.

  ఇంటర్నెట్లో ఎక్కడో బహుశా ఆర్కైవ్స్.ఆర్గ్ అనుకుంటా లేదా మరోచోటో ఖచ్చితంగా సాఫ్ట్ కాపీ ఉంది. ప్రయత్నించండి, రాకేశ్వర్.

 14. 25 ఆగస్ట్, 2008 10:20 సా.

  ఆ పుస్తకం ఇక్కడ చదువుకోవచ్చు:
  http://www.new.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0000/823first=1last=224barcode=2020120000824
  ఓపిక ఉండాలే కానీ Digital Library పుస్తక రత్నాకరమే!

Trackbacks

 1. మేఘదూతం పాటలు « Naga Murali’s Blog
 2. ఆతపత్ర భారవి - ఘంటా మాఘుడు « Naga Murali’s Blog

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: