Skip to content

శివుడు చెప్పిన తమిళ పద్యం

21 సెప్టెంబర్, 2008

వేల యేళ్ళనాటి కథ. అప్పటికింకా తెలుగు, కన్నడాది ఇతర ద్రవిడభాషలు పుట్టలేదు. మదురై నగరంలో మూడవ తమిళ్ సంగం (తమిళ అకాడెమీ లాంటిది) మహాకవి నక్కీరుడి అధ్యక్షతన విలసిల్లుతోంది. తమిళ భాషకు ఏది మంచిదో ఏది కాదో తమిళ సంగం నిర్ణయించేది. తమిళ భాష, సంస్కృతులకు సంబంధించినంత వరకు సంగం ఆదేశాలకు తిరుగు లేదు. మహారాజు సైతం సంగం నిర్ణయాలకు తలవంచాల్సిందే. తమిళ సంగం సమావేశాల్లో రాజు స్థానం సంగం పెద్దల తరువాతనే. కవులకు ఎనలేని గౌరవం ఉన్న బంగారు కాలమది.

ఒకనాడు పాండ్య రాజ్యాధీశుడైన చూడామణి పాండ్యుడు మహారాణితో కలిసి వైగై నదీ తీరంలోని ఉద్యానవనంలో విహరిస్తున్నాడు. నదిపైనుండీ వీస్తున్న పిల్లతెమ్మెరలు మోసుకొస్తున్న పరిమళాలు రాజు హృదయంలో ఏదో భావావేశాన్ని కలిగిస్తున్నాయి. ఆ తన్మయత్వంలో ఉండగా రాణి ప్రశ్నించింది –   ‘ప్రభూ ఏమాలోచిస్తున్నారు?’.

‘నీ కురులలోనుండి వస్తున్న సహజ పరిమళాలు నన్ను మత్తెక్కిస్తున్నాయి. ఇంకేం ఆలోచించగలను!’ – బదులిచ్చాడు పాండ్య రాజు. రాణి కిల కిల నవ్వింది.

‘ప్రభువుల ప్రేమాతిశయంలో ఏది స్వభావోక్తియో ఏది అతిశయోక్తియో మరచిపోతున్నారు. నక్కీరుల వారు వింటే ఊరుకోరు..’.

‘ఇందులో ఒక్క ముక్క కూడా అతిశయోక్తి లేదు రాణీ! నాకు తోచిందే చెప్పాను. కావాలంటే నక్కీరుల వారితోనే నేను చేసిన వర్ణన సరియని ఒప్పిస్తాను’.

‘ అసంభవం ప్రభూ! వర్ణనలో మితిమీరిన అతిశయోక్తిని సంగం ఎన్నటికీ అంగీకరించదు . కురులకు సహజ పరిమళం ఉండదు. అది ప్రకృతివిరుద్ధమైన విషయం.’

‘ చూస్తాను. రేపు తమిళ సంగం ముందే ఈ ప్రస్తావన చేస్తాను.’

అలా మొదలైన వారి వివాదం తమిళ సంగాన్ని చేరింది. ఆడువారి కురుల పరిమళం గురించి స్వారస్యమైన పద్యం చెప్పగలిగిన వారికి వెయ్యి బంగారు నాణాల బహుమానం ప్రకటించాడు మహారాజు.

ఈ వార్త మదురై నగరం లోని ధర్మి (దరుమి) అనే శివ భక్తుడైన ఓ పేద యువకవి చెవిన పడింది. అతను సాయంత్రం గుడిలో దేవుని వద్ద తన గోడు వెళ్ళబోసుకొన్నాడు. “ పరమేశ్వరా! నాకో మంచి పద్యం తోచేటట్లు వరమీయరాదా, అది చెప్పి వెయ్యి బంగారు నాణాలు సంపాదించుకొంటే నా జీవితాన్ని ప్రశాంతంగా నీ సేవలో గడిపెయ్యనా!” అని మొర పెట్టుకొన్నాడు. తమిళ సాంప్రదాయంలో భాషకు అధిదేవత సరస్వతి కాదు. శివుడే. శివుడికి ఆ పేద భక్తుని పై జాలి కలిగింది. మానవ రూపం ధరించి ప్రత్యక్షమైనాడు. ‘ఇదిగో పద్యం, వ్రాసుకో. వెళ్ళి మహారాజుకు చెప్పి ఆ బంగారు నాణాలు తెచ్చుకో’ అని ఈ క్రింది పద్యం చెప్పాడు:

కొంగుదేర్ వా zh కై యంజిఱై తుంబి
కామమ్ శెప్పాదు కణ్డదు మొ zhi మో!
పయిలియదు కెzhee ఇయ నట్పిన్ మయిలియఱ్
చెఱియెయిట్రరివై కూందలిన్
నఱియవుమ్ ఉళవో నీ అఱియుమ్ పూవే?

పై పద్య భావం ఇదీ –

”శ్రేష్టమైన మకరందం కోసం సృష్టిలోని ప్రతి పూవునూ అన్వేషిస్తూ తిరిగే ఓ తుమ్మెదా! నేనడిగే ప్రశ్నకు నిజాయితీగా జవాబు చెప్పు. నువ్వు అనుకొన్నదాన్ని బట్టి కాక నీ అనుభవంలోకి వచ్చినదాన్ని బట్టి చెప్పు. చక్కని పలువరుస కలిగినట్టి, యుగయుగాలుగా నాకు ప్రియురాలైనట్టి , మయూరివంటి నా ప్రేయసి కురులనుండి వెలువడే సహజ సుగంధాన్ని మించిన పరిమళం ఈ లోకంలోని ఏ పూవులోనైనా ఉండడం నువ్వు చూశావా?”

పద్యాన్ని అందుకొన్న ధర్మి వడివడి గా రాజ సభను చేరాడు. రాజు గారికి పద్యంవినిపించాడు. తాననుకొన్న భావం పద్యంలో విన్న ప్రభువు పరమానంద భరితుడైనాడు. తక్షణం వెయ్యి బంగారు నాణాలను ధర్మికి బహూకరించవలసిందని ఆదేశించాడు.

అంతలో నక్కీరుడు లేచాడు. ‘ప్రభూ! ఆగండి. ఈ పద్యం దోషపూరితమైనది. సత్కారానికి తగినది కాదు. ’అన్నాడు. రాజు నిస్సహాయుడైనాడు. నక్కీరుడు ధర్మితో ‘ నీ పద్య భావానికి అధారమేమిటో చూపించి ఈ బహుమతి అందుకోవచ్చు’ అని చెప్పాడు. తనకు తెలిస్తే కదా! అవమాన భారంతో తలవంచుకొని సభనుండి నిష్క్రమించాడు. సాయంత్రం గుడిలో కలిసిన పద్యప్రదాతతో తనకు జరిగిన అవమానాన్ని గురించి చెప్పుకొన్నాడు. ‘తన పద్యంలో దోషమా! ‘ శివునికాశ్చర్యం కలిగింది. ‘నేనూ వస్తాను, అదేంటో చూద్దాం పద’ మన్నాడు.

మరునాడు శివుడు మనుష్య రూపంలో తమిళసంగానికి వెళ్ళాడు. ‘ఎవరు నా పద్యంలో దోషమున్నదని చెప్పింది?’ అని హుంకరించాడు. నక్కీరుడు చిరునవ్వు నవ్వాడు. ‘ పెద్ద పెద్ద గొంతులు కాదు తమిళ సంగానికి కావలసింది. శాస్త్ర సమ్మతమైన కవిత్వం. దోషం లేదని నిరూపించి మీ బహుమతిని నిరభ్యంతరంగా తీసుకొండి’ అన్నాడు.

’ఏమిటా దోషం? ఎక్కడుంది? శబ్దంలోనా, వ్యాకరణంలోనా, అర్థంలోనా? ఎందులోఉంది?’ శివుని కోపం పెరుగుతోంది.

‘ శబ్ద వ్యాకరణాల్లో ఏ దోషమూ లేదు. ఉన్నా ఫరవాలేదు. సరిదిద్ద వచ్చు. భావ దోషం సరిదిద్ద లేనిది’ జవాబిచ్చాడు నక్కీరుడు.

‘ భావ దోషమా! ఏమిటది? ‘

‘ మీ పద్యం స్త్రీల శిరోజాలకు సహజ పరిమళం ఉందన్న అర్థాన్ని ఇస్తోంది’.

‘అయితే?’

‘అది అతిశయోక్తి. అస్వాభావికమైన వర్ణనలు తమిళసాహిత్యంలో ఉండడాన్ని సంగం అంగీకరించదు.’

‘నా పద్యం లోని వర్ణన అస్వాభావికమైనదని సంగం ఎందుకనుకొంటున్నదో తెలుసుకొనవచ్చునా?’

‘స్త్రీల కురులకు పరిమళం వారు చేసే ఉపచారాలవలన, పూసే తైలాల వలన, తలదాల్చే పుష్పాల వలనా వస్తుంది. ఇది లోకానికంతా తెలిసిన సత్యం. సహజంగానే కురులు సుగంధ పూరితాలని చెప్పడం వాస్తవ విరుధ్ధం’.

‘అలాగా! ఏమిటి మీకు తెలిసిన సత్యం? ఎందరు స్త్రీలను చూశారు మీరు. ఎన్ని జాతుల వారు? ఎన్ని లోకాల వారు? ఎన్ని యుగాల వారు? మీకు తెలిసిందే సత్యమనడం మూర్ఖత్వం.’

‘తమరే వితండవాదం చేస్తున్నారు కవివర్యా! నేను చూసిందే సత్యమని నమ్ముతాను నేను. కాదంటే ప్రమాణాన్ని చూపించి ఒప్పించండి’.

‘మానవుల విషయంలో మీరు చెప్పినట్లు దృష్ట ప్రమాణం సాధ్యం. దేవతలు మీకు కనపడరు. వారి కురుల విషయంలోనూ అంతేనా?’

‘నిస్సందేహంగా. దేవతల కురులకైనా సహజ పరిమళం ఉండదనే మా నిర్ణయం’.

శివునికి నక్కీరుని అహంకారం, పిడివాదం అంతులేని ఆగ్రహాన్ని కలిగించింది.

‘ నక్కీరా! ‘ గర్జించాడు శివుడు. ‘ నువ్వు పూజించే శివుడు, ఆ కళాధినాధుని ప్రియసతి ఙ్ఞాన పూంగోదై (పార్వతి యొక్క ఒక రూపం) శిరోజాలకైనా అంతేనా?’

‘నిశ్చయంగా అంతే! ‘

శివుని క్రోధం అవధులు దాటింది. నుదుట మూడవ కన్ను ప్రత్యక్షమైంది. ఐనా చర్చలోఉన్న నక్కీరునికి అది శివుడేనన్న విషయం స్ఫురణకు రాలేదు. ‘మీకు మూడు కన్నులున్నా, వెయ్యి కళ్ళున్నా తప్పు తప్పే’ అన్నాడు.

శివుని సహనం పూర్తిగా అంతరించి పోయింది. నిజరూపంలో సంగం సభికుల ముందు దర్శనమిచ్చాడు. పట్టరాని ఆగ్రహంతో నక్కీరుని వైపు చూశాడు. ‘ మూర్ఖుడా! పాండితీ గర్వంతో నీ కళ్ళు పొరలు కమ్మాయి. నీకు తెలియని విషయాన్ని తెలిసినట్లు వాదించి తమిళ సంగపు గొప్పదనానికి చేటు కలిగించడానికి ప్రయత్నించావు. నీ అహంకారానికి ఫలితాన్ని అనుభవిస్తావు’. ఈ మాటలంటూ ఉండగానే మూసివున్న శివుని ఫాలనేత్రం నుండి వెలువడే వేడిలో నక్కీరుని శరీరం కాలిపోసాగింది. పరుగెత్తుతూ వెళ్ళి మీనాక్షీ ఆలయ మధ్యభాగంలోని పుష్కరిణిలో దూకాడు. ఆ నీటి మహిమతో అతని ప్రాణాలు నిలిచాయి. అతని అహంకారం కూడా నశించింది. పుష్కరిణిలోనుండే శివుని స్తుతించాడు. శివుడు చల్లబడ్డాడు. కుమారస్వామి వద్ద తమిళ భాషను అభ్యసించిన అగస్త్యుని వద్ద తమిళ భాషాభ్యాసం చేయమని నక్కీరునికి వరమిచ్చి అంతర్థానమయ్యాడు.

నక్కీరుడిప్పుడు లేడు. ఈ కథ నిజమో కాదో చెప్పడానికి శివుడు రాడు. కానీ శివుడు స్వయంగా చెప్పినట్లుగా భావిస్తున్న పై పద్యం మాత్రం ‘తిరువిళైయాడల్ పురాణం’ లో గ్రంధస్తమై చిరస్థాయిగా నిలిచిపోయింది. తమిళ భాషలోని ఆణిముత్యాల్లాంటి పద్యాల్లో ఒకటిగా భాసిల్లుతోంది.

ప్రకటనలు
7 వ్యాఖ్యలు
 1. 22 సెప్టెంబర్, 2008 4:56 సా.

  ధూర్జటి కవి రచించిన శ్రీకాళహస్తి మాహాత్మ్యంలో నత్కీరోపాఖ్యానం, ఆంగ్ల వివరణతో

  మొదటి భాగం
  రెండవ భాగం
  మూడవ భాగం

 2. 22 సెప్టెంబర్, 2008 5:14 సా.

  ఇదంతా చదువుతుంటే గుర్తొచ్చింది. మా తెలుగు మాస్టారు ఈ కథ కూడా చెప్పారు మాకు.

  అది సరే, శివుడికి అంత కోపం దేనికో? స్త్రీల శిరోజాలకు సహజ పరిమళం ఉండదన్న మాట నిజమేగా! నక్కీరుడు చూసిందే సత్యమని నమ్ముతానని ఇంతకు ముందే చెప్పాడాయెను, దేవతలను చూళ్ళేదు!

  అతడు చెప్పింది నిజం కాకపోతే ‘దేవతా స్త్రీలు వేరు ‘ అని నెమ్మదిగా చెప్పాలి గానీ, సత్యం మాట్లాడిన నక్కీరుడిని భస్మం చేసెయ్యడమేనా?

 3. 22 సెప్టెంబర్, 2008 5:15 సా.

  చంద్ర మోహన్ గారు,
  టైము చుసుకుని ‘కణ్ణగి ‘ కథ కూడా చెప్పకూడదూ?

 4. 22 సెప్టెంబర్, 2008 6:05 సా.

  చంద్రమోహన్ గారు,
  మంచి పద్యాన్నీ కథనీ పరిచయం చేసారు.
  కాళహస్తిమాహాత్మ్యంలో ఈ కథ (కొద్ది తేడాలతో) చాలచక్కగా ధూర్జటి చిత్రీకరించాడు. దీనిగురించి నేనింతకు ముందు నా బ్లాగులో (ఇంచుమించు ఇదే శీర్షికతో!) ఓ టపా రాసాను. అందులో నాకు దొరికిన తమిళ పద్యాన్ని ఇచ్చాను. మీది మరింత సాధికారికంగా ఉందని, అక్కడ మీ టపాకి లంకె ఇచ్చాను.

 5. 22 సెప్టెంబర్, 2008 9:45 సా.

  చంద్రమోహన్ గారూ, నేను కూడా ధూర్జటి రాసిన కథనే చదివాను. ఇందులో కొంచం తేడాలున్నాయి. మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. మూర్ఖంగా వాదిస్తే మా ఇంట్లో నత్కీరుడిలాగా వాదించకు అని తిట్టేవారు మా నాన్నగారు.

  పాండిత్యం ఉన్నంతమాత్రాన యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తించడం తప్పని ఈ కథ తెలియజేస్తుంది అని నేను అనుకుంటూ ఉంటాను. సుజాత గారూ, నత్కీరుడి లాంటి వాళ్ళతో సంభాషిస్తే తెలుస్తుంది, శివుడికి ఎందుకు కోపం వచ్చిందో. అతడిలాంటి వాళ్ళు ప్రస్తుతం ఎక్కడా లేరని నేను అనుకోను.

 6. చంద్రమోహన్ permalink
  22 సెప్టెంబర్, 2008 10:41 సా.

  కొత్తపాళీ గారు, కామేశ్వర రావు గారు

  నేనేదో కొత్త విషయం చెప్పేస్తున్నానని సంబరపడిపోయాను. తుస్సుమనిపించేశారు. ఇక ముందు ఏదైనా వ్రాయాలంటే ముందు మీ టపాలను వడపోయాలిసిందే 🙂

  కామేశ్వర రావు గారూ,

  తమిళ పద్యానికి మీ అనువాదం చాలా బాగుంది. నాకు కుదరలేదు. ముఖ్యంగా “జననాంతర సౌహృదమూ, నెమలి సౌకుమార్యమూ…” అన్న మాటలు మూలంలోని భావాన్ని చక్కగా దొరకబుచ్చుకున్నాయి. ఐతే కాళహస్తి మహాత్మ్యంలో నక్కీరుని (నత్కీరుని!) వ్యక్తిత్వాన్ని సరిగా చిత్రించలేదనిపిస్తోంది. తమిళ సాహిత్యంలో ఎక్కడా నక్కీరుణ్ణి అహంభావిగా, చిన్న కవులను రాజాశ్రయానికి నోచుకోనీయని అసూయాపరునిగా చూపలేదు. తను నమ్మిన సత్యంకోసం తను పూజించే దేవుణ్ణైనా ఎదిరించిన వాడిగానే వర్ణించారు. క్రీ.శ. 7వ శతాబ్దం నాటి తిరువిళైయాడల్ పురాణంలో మొదటగా నక్కీరుని ప్రసక్తి వస్తుంది. కనుక అందులోని కథే సరియైనదని (Authentic) నా నమ్మకం.

  సుజాత గారూ,

  అలాంటి తెలుగు మాస్టారివద్ద శిష్యరికం చేసిన మీరు ధన్యులు!

  నక్కీరునిలో ఏమూలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలడం కోసమే శివుడు అలా చేశాడని కొందరు వ్రాశారు. నాకైతే అలా నాకు తెలిసిందే నిజం అని ఎవరు మూర్ఖంగా వాదించినా చిరాకేస్తుంది, శివునిలా భస్మం చేయలేను గాని 😉 . ఆ తరువాత శివుడు పాపం నక్కీరుణ్ణి పొదిగై పర్వతం మీది అగస్త్యాశ్రమానికి పంపి తమిళ భాషాభ్యాసం చేయిస్తాడు. పరిపూర్ణ జ్ఞానిగా తిరిగివచ్చి నక్కీరుడు సుబ్రహ్మణ్య స్వామిని కీర్తిస్తూ “తిరు మురుగాట్రుప్పడై” అనే కావ్యాన్ని రచించాడు.

  తమిళ పంచ మహాకావ్యాలలో ఒకటైన ‘కణ్ణగి ‘ కథను చెప్పాలంటే కొంచెం ఎక్కువ టైమే కావాలి! అందులో నాకు నచ్చిన పద్యం కంట పడినప్పుడు తప్పకుండా చెబుతాను.

  అందరికీ నెనర్లు!

  – చంద్ర మోహన్

 7. 22 సెప్టెంబర్, 2008 11:11 సా.

  నాగమురళి గారూ,

  నెనర్లు! సందేహం అక్కరలేదు. నక్కీరుని లాంటి వారు నేడు ‘ఎందెందు వెదకి చూసిన అందందే గలరు ‘. తేడా ఏమిటంటే నక్కీరునిలా కాక వీరు ‘పండితమ్మన్యులైన వైతండికులు ‘.

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: