Skip to content

జ్ఞాన పీఠము తెచ్చినారము జ్ఞానులెవ్వరొ తెలుపుడీ!

2 అక్టోబర్, 2008

కొంత కాలంక్రితం ఒక పెళ్ళికని మా వూరు (చిత్తూరు) వెళ్ళాను. పెళ్ళి భోజనాల తరువాత బంధు జనులందరూ కూర్చొని పిచ్చా పాటీ మాట్లాడుకొంటున్నాము. మాటల సందర్భంలో ఒకరు; తమిళ, తెలుగు, ఆంగ్ల భాషల్లో విశేష కృషి చేసిన వారు, ఒక ప్రశ్న అడిగారు. “జ్ఞాన పీఠ అవార్డు ఇవ్వడానికి తెలుగు భాషను పరిశీలించే సమయం వచ్చింది. ఐతే మిమ్మల్ని ఒక పేరు ప్రతిపాదించమని అడిగితే మీరెవరి పేరు చెబుతారు?” హఠాత్తుగా ఒక ఇబ్బందికరమైన నిశ్శబ్దం. ఎవరికీ మాటలు దొరకలేదు. “ఈసారీ అర్హులు ఎవరూ లేరని తెలుగును దాటవేస్తారేమో” అన్నారు ఒకరు మెల్లగా. మరణావస్థలోనున్న తెలుగు సాహిత్య ఆత్మ శాంతికా అన్నట్లు కొన్ని క్షణాల మౌనం తరువాత మెల్లగా సంభాషణ తమిళ సాహిత్యం వైపు మళ్ళింది. అక్కడున్నవారిలో పలువురు ఉభయ భాషాభిమానులు కావడంతో అవార్డు తెలుగు కవికి వచ్చినా, తమిళ కవికి వచ్చినా వారికి సంతోషమే.

ఇన్ని రోజులు గడిచినా ఆ ప్రశ్న నా మనసులోనుండి తొలగి పోలేదు. “జ్ఞాన పీఠ అవార్డు కు ఒకరి పేరు చెప్పమంటే నేనెవరి పేరు చెప్పాలి?” . ఆఖరు సారిగా సినారె కు వచ్చింది. అప్పుడు నాకు నచ్చలేదు. పుట్టపర్తి వారికి వస్తుందని నాకు నమ్మకంగా ఉండేది. అవార్డు ప్రకటించిన కొన్ని రోజులకు నేను పుట్టపర్తి నారాయణాచార్యుల వారిని వారి యింటిలో కలవడం జరిగింది. వారికి కూడా కొంత నిరాశ కలిగిన మాట వాస్తవం. “ అవార్డు గురించే కాదు గానీ, వారిచ్చే లక్ష రూపాయలతో నా ఆధ్యాత్మ రామాయణం అచ్చయిపోయేది. మరో సారి తెలుగు వంతు వచ్చేదాకా నేను బ్రతికిఉండే అవకాశం లేదు” అన్నారు. మరో రెండేళ్ళకే వారు దివంగతులయ్యారు.

విశ్వనాధ వారికి అవార్డు వచ్చినప్పుడు ఎవరికీ ఆక్షేపణలు లేకపోయినా, అంతటి గొప్ప సమకాలికులు ఆయనకు చాలామందే ఉండేవారు – శ్రీశ్రీ, జాషువా, వారి గురువు చెళ్ళపిళ్ళ వారు, కృష్ణశాస్త్రి, తిలక్, … ఇంకా బోలెడంతమంది. అదేమి వింతయో గానీ భూమిపైనుండి డైనోసార్లు హఠాత్తుగా అంతరించిపోయినట్లు తెలుగు సాహితీ లోకంనుండి కవికులం చడీ చప్పుడు లేకుండా అదృశ్యమైపోయింది. పద్య కవితలు పోతే పోయె, మంచి వచనమో, కనీసం చక్కని సాహితీ విలువలతో కూడిన నవలా సాహిత్యమో సృజించేవారు కరువైపోయారు.

ఈ మధ్య కాలంలో జ్ఞాన పీఠ అవార్డుకు ఖచ్చితంగా అర్హులైన వారని నేను భావించే కరుణశ్రీ,  గుంటూరు శేషేంద్ర శర్మ గారు,  మధురాంతకం రాజారాం గారు … అందరూ కీర్తిశేషులైపోయారు. జ్ఞాన పీఠ అవార్డును మరణానంతరం ఇచ్చే సాంప్రదాయం లేదాయె. ఇక మిగిలిందెవరు?

తెలుగు సాహితీ లోకంలో ప్రస్తుతం భయంకరమైన శూన్యం తాండవిస్తోంది. ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ‘ తెలుగులో అవార్డు ఇచ్చి చాలా రోజులైపోయింది. ఇదిగో జ్ఞాన పీఠం, తీసుకోండి’ అంటే తీసుకోగలవారు కనిపించడంలేదు.

“ ముద్దుగ గండపెండియరమున్ గొనుడంచు బహూకరింపగా
నొద్దిక నాకొసంగుమని యొక్కరు కోరగలేరు, లేరొకో! ”

అని ఒకనాడు శ్రీకృష్ణ దేవరాయల వారు బాధపడి పోయారు. ఆ క్షణాన వారికి ఓదార్పునిస్తూ

“ పెద్దన బోలు సత్కవులు పృధ్విని లేరని నీవెరుంగవే!
పెద్దనకీదలంచినను పేర్మిని నాకిడు కృష్ణరాణృపా ”

అని చెప్పడానికి ఓ పెద్దనామాత్యుడు ఉన్నాడు. నేడెవరున్నారు?

ప్రకటనలు
46 వ్యాఖ్యలు
 1. sujata permalink
  3 అక్టోబర్, 2008 12:28 ఉద.

  జ్ఞాన పీఠం వంతుల వారీ గా ఇస్తారా ? ఈ విషయం లో నా పరిజ్ఞానం సున్నా.. కానీ నాకు అనిపించింది ఇది – మన మేధావులంతా, భక్తి రచనలకో, భక్తి ప్రవచనాలకో, టీ.వీ కో, అవధానాలకో మాత్రం సరిపోతున్నట్టున్నారు.

 2. Ranjeeth permalink
  3 అక్టోబర్, 2008 1:35 ఉద.

  As is norm with all other awards in India, Jnanapeeth is junk too. When C Narayana Reddy got that award, he did so by lobbying when the one that deserves the award was Seshendra.

  But Sesehendra wouldn’t care. In his own words…

  సముద్రం ఒకది ఇంతి ముందు కుర్చుని మొరగదు
  తుఫాను గొంతుకు చిత్తం అనదం తెలియదు
  నేనింతా పిదికెడు మట్టే కావచ్చు, కానీ కలం ఎత్తితే నాకు
  ఒక దెశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంది

 3. 3 అక్టోబర్, 2008 2:03 ఉద.

  Good question.

 4. gangabhavani permalink
  3 అక్టోబర్, 2008 6:07 ఉద.

  చాలా తెలియని సంగతులు చెప్పారు

 5. 3 అక్టోబర్, 2008 7:19 ఉద.

  మంచిప్రశ్న. దీనికి సమాధానంగా నేనొక టపా రాయడానికి పూనుకుంటున్నాను.

 6. 3 అక్టోబర్, 2008 10:19 ఉద.

  బహుదొడ్డ ప్రశ్న మీది.
  చిలిపి ఆలోచన అనుకోకపోతే యండమూరి దానికెందుకు అర్హుడు కాదు?
  “విశ్వనాధవారిది జాక్‌పాట్ ఐతే, నారిగాడిది లాటరీ” అని ఒక తరం సాహితీప్రముఖులు అనేవారు. ఇప్పుడు అది లేక పోయినా మన సాహిత్యానికి పోయిందేమీలేదు.

 7. 3 అక్టోబర్, 2008 10:55 ఉద.

  మ.కో. తేనెలూర తెలుంగుబాస విదేశతయ్యె స్వదేశమున్
  గూనుగిల్లిరి యెల్లరున్ మరుగుజ్జు లొజ్జల పున్నె మా
  జానుబాహుల కానమీ కుఱచావనిన్ కనుబొడ్చినా
  జ్ఞాన పీఠము తెచ్చినా తగు జ్ఞానులెక్కడ మోహనా?

 8. రాజేంద్ర కుమార్ దేవరపల్లి permalink
  3 అక్టోబర్, 2008 11:07 ఉద.

  బూదరాజు గారు గ్నానపీట అనేవారు సదరు పీఠాన్ని,తెచ్చుకోవటమే తప్ప ఇవ్వటం జరగదని(చాలా సార్లు) ఇంతకు ముందు ఇదేవిషయమై మాలతి గారి
  http://tethulika.wordpress.com/2008/08/13/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BF%E0%B0%95%E0%B1%87%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A4%E0%B0%AA%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%81-%E0%B0%88%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8/ లో కాస్త చర్చ జరిగింది.

  చంద్రిమ గారు(మీ పేరు ఇదే అనేసుకుంటున్నా)ఈ సారి ఆ పీట ప్రస్తావన వస్తే తెలుగు బ్లాగరుల తరపున లేదా యావత్తెలుగు సాహితీవేత్తల తరపునా బాబ్బాబు నాపేరు కాస్త సిఫారసు చేద్దురూ,ఢిల్లీలో బోలెడు పనులున్నాయ్ 🙂

 9. 3 అక్టోబర్, 2008 1:11 సా.

  చాలా విషయాలు తెలిసేయి.

 10. 3 అక్టోబర్, 2008 1:29 సా.

  ఈ టపా చదివిన తరువాత ఎవరున్నారా అని ఆలోచిస్తే కాస్తంత శూన్యంగానే ఉంది పరిస్థితి.

  గతంలో వచ్చిన వారు అద్వితీయమైన ప్రతిభా సంపన్నులు. ఎన్ని ఎకసక్కాలు/జోకులు వెనుక పేలినా వారికి రావటం సముచితంగానే అందరూ/జనబాహుళ్యం భావించారు.
  అర్హులైన కొంతమంది అందుకొనకుండానే రాలిపోవటం ఆ అవార్డు దురదృష్టం తప్ప మరొకటి కాదు. అలాంటి వారిలో ఆరుద్ర మొదటి వరుసవాడు.

  ప్రస్తుతం ఉన్నకవులలో శివారెడ్డి, వేగుంట, శిఖామణి, (క్షమించండి- మీరు చెప్పండి నేను చెప్పలేకపోతున్నాను)

  కొంతమంది ప్రతిభాశాలురు వారి రంగాల కారణంగా ఈ అవార్డుకు అందుకోలేరని అనుమానం (ఉదా: సిరివెన్నెల, యండమూరి)

  మీరంటున్నట్ట్లు తెలుగులో కవుల జాబితా కుచించుకు పోవటానికి ప్రధాన కారణం పత్రికలు, పుస్తకాల పై అనురక్తి తగ్గిపోవటం.

  బొల్లోజు బాబా

 11. KRISHNA RAO JALLIPALLI permalink
  3 అక్టోబర్, 2008 7:52 సా.

  యండమూరికేం ఖర్మ. చందు సోంబాబు కి కూడా ఇవ్వచ్చు.

 12. 3 అక్టోబర్, 2008 10:02 సా.

  @ సుజాత గారు,
  మన అవధాన కవులు సాహితీ సర్కస్ చేయగలరే కాని, ఒక మంచి కావ్యాన్ని ఆవిష్కరించలేరు.
  @ రంజీత్ గారు,
  శేషేంద్ర గారి విషయంలో మీ అభిప్రాయమే నాదీ. ఐతే జ్ఞానపీఠ అవార్డును జంక్ అనడం మనకందని ద్రాక్షపళ్ళను పుల్లన అనడమే. It is just too much of generalization, Every system has its loopholes, but harping on them will not solve the problem. Try to look beyond the rhetoric of corrupt system to find how other languages are getting the award, Do you mean to say we are less capable to corrupt than the other states litterateurs?
  @ కొత్త పాళి గారు,
  ప్రశ్నకు జవాబే తెలియడంలేదు.
  @ మహేష్ గారు,
  మీ టపా (కాయ) కోసం ఎదురు చూస్తుంటాం అందరం.
  @ నెటిజన్ గారు,
  యండమూరికి ఇవ్వచ్చేమో! ‘అంతర్ముఖం’ ఒక గొప్ప రచనే అనిపిస్తుంది నాకు.
  @ గిరి గారూ,
  ఇంకా పద్యాల వర్షమే 🙂
  @ రాజేంద్ర కుమార్ గారు,
  కన్నడిగులకు హిందీ రాష్ట్రాల వారికంటె, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల వారికంటె పెద్ద లాబీ కేంద్రంలో చిరకాలంగా ఉందంటారా? మరి కన్నడ భాషకు అన్ని జ్ఞాన పీఠాలు ఎలా వచ్చాయంటారు? మనకు రాలేదు కాబట్టి అవార్డ్ ప్రక్రియ అంతా మోసమే అనుకొంటే మనసుకు కొంత ఊరటగా ఉండవచ్చు. అలా ఆత్మవంచన చేసుకుంటూ ఉండిపోదామంటే సరే. ఈ సిఫారసు చేసేవాళ్ళెవరో, ఎంత ఖర్చవుతుందో కర్ణాటక వాళ్ళనే అడిగి కనుక్కుందాం రండి 🙂

  పి.ఎస్: నా పేరు చంద్ర మోహన్. చంద్రిమ బ్లాగు పేరు మాత్రమే!

  @బొల్లోజు బాబా గారు,
  పఠనానురక్తి తగ్గడం వలన కవులు తగ్గిపోయారా, మంచి కవులు లేక అనురక్తి తగ్గిపోయిందా అన్నది ఇప్పుడు అక్షర లక్షల ప్రశ్న !

  స్పందించిన అందరికీ నెనెర్లు!

 13. palavelli permalink
  3 అక్టోబర్, 2008 10:57 సా.

  బ్లాగులకావలనున్న ఓ కవిగారితో ముచ్చటిస్తే, వారు ఆవంత్స సోమ సుందర్ పేరూ పరిశీలనలో ఉన్నట్టు తెలియజేసేరు.

 14. రాజేంద్ర కుమార్ దేవరపల్లి permalink
  4 అక్టోబర్, 2008 12:18 ఉద.

  జ్ఞానపీఠ పురస్కారమొక్కటే కాదు,నోబెల్,ఆస్కార్,ఇలా ప్రతి సంవత్సరమూ అన్ని ఆవార్డులూ తెలుగువారికి రావాలని నా స్వార్ధ,సంకుచిత ఆలోచన లేండి 🙂 కన్నడిగులకు కొన్ని సార్లు అలా కలసివస్తుంటాయి.భారతక్రికెట్ నిండా వాళ్ళే ఉంటారు.చంద్రబాబు నాయుడి పుణ్యాన దేవెగౌడ లాంటి ప్రధానమంత్రులూ మనకు దొరుకుతుంటారు.కన్నడసాహిత్యం మీద నాకు పొరబాటున కూడా చిన్నచూపులేదు,అలాగే ఏ భాషలో ఉండే మహారచనలు ఆ భాషలో ఉన్నాయి.నేను మాస్తివేంకటేశ అయ్యంగారి చిక్కవీరరాజేంద్ర(తెలుగు అనువాదం)చాలా తీవ్రంగా,దాదాపు క్షుణ్ణంగా చదివాను,బ్రహ్మాండమైన రచన అనిపిస్తుంది గానీ ఈ ఒక్కనవలకా ఆయనకు జ్ఞానపీఠమొచ్చింది అని పించింది నావరకు.
  సరే తరువాత ఒకవ్యక్తికి తనసాహితీసృజన మొత్తానికీ కలిపి అని నిబంధనలు వచ్చాయనుకోండి.ఈ సంగతి ఇక్కడ చర్చల వల్ల తేలేది కాదు.ఈ మధ్య కాలంలో నోబెల్ పురస్కారం వ్యక్తులకూ,సంస్థలకూ ఇస్తున్నారు కాబట్టి నాతరపున ఒక సంస్థను సిఫారసు చేస్తున్నా వారికి చందమామ పత్రికకు గాను ఆ పీఠమెక్కించమనండి,డాల్టన్ పబ్లికేషన్స్ ఆ సంస్థ పేరు.
  మీ పేరు చంద్రమోహన్ అని తెలియజేసినందుకు ధన్యవాదాలు.:)

 15. 5 అక్టోబర్, 2008 11:18 సా.

  “మన అవధాన కవులు సాహితీ సర్కస్ చేయగలరే కాని, ఒక మంచి కావ్యాన్ని ఆవిష్కరించలేరు.”
  గరికపాటి వారు కావ్యం వ్రాశారు కదండీ ..
  ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు గత కొన్ని దశాబ్దాలుగా తెలుగుసాహిత్యానికి చేసిన/చేస్తున్న సేవ తక్కువేమీ కాదు..

  గతమెంతో ఘనకీర్తి అని…
  ఇప్పుడే ఇలా వెతుకు కుంటుంటే , ఇంకో పుష్కరం గడిస్తే పరిస్థితి ఏమిటో

 16. 6 అక్టోబర్, 2008 7:55 ఉద.

  నిజమే ఆవంత్స సోమసుందర్ గారు ప్రతిభాశాలి. సుమారు 70 సంవత్సరాలుగా అలుపెరుగని సాహితీ సేవ చేస్తున్న పుంభావసరస్వతి.
  అటు పాత తరం ఇటు కొత్త తరం పద్దతులను, ఆకళింపు చేసుకొన్న వారధి. వారిరచనలు ఉత్కృష్టమైనవని చెప్పలేం కానీ, వారికి ఇవ్వటం సముచితంగానే అంపిస్తుంది.

  బొల్లోజు బాబా

 17. 6 అక్టోబర్, 2008 10:04 సా.

  @ ఊ.దం. గారూ
  నిజమే. కొందరు అవధానులు గొప్పకావ్యాలు వ్రాశారు. తిరుపతి వేంకట కవులు, వేంకట రామకృష్ణ కవులు, కొప్పరపు కవులు లాంటివారు గొప్ప ఉదాహరణ. నేను చెప్పింది ఇప్పుడున్న అవధానులగురించి. మేడసాని మోహన్, మాడుగుల నాగఫణిశర్మ, రాళ్ళబండి కవితా ప్రసాద్ వంటివారు అవధాన ప్రక్రియలకే పరిమితమైపోయారు, కావ్య రచనపై దృష్టి పెట్టలేదు అని. సుజాత గారు ఉద్దేశించింది వీరిలాంటివారి గురించేనని నేననుకొన్నాను.

  @ పాలవెల్లి గారూ, @ బాబా గారూ,
  సోమసుందరం గారి రచనలేవీ నేను చదవలేదు. మీరు చెబుతున్న దాన్ని బట్టి వారు గొప్ప కవులే అయివుంటారనుకొంటాను. వారి రచనలేవీ నాకంట పడలేదు ఇంతవరకూ. ఇప్పుడు చదువుతాను.

 18. 10 అక్టోబర్, 2008 10:55 ఉద.

  >> “జ్ఞాన పీఠ అవార్డు ఇవ్వడానికి తెలుగు భాషను పరిశీలించే సమయం వచ్చింది.

  అలాంటిదేమీ లేదండీ, ఒకసారి ఒక భాషవారికి ఇచ్చాక మూడు సంవత్సరాల పాటు ఆ భాషను పరిశీలించరు. అంటే గత మూడేళ్లలో అవకాశం రాని భాషలన్నిటికీ “సమయం” వచ్చినట్లే.

  విశ్వనాథకు ఆ పీఠం వచ్చినప్పుడు జ్ఞానపీఠ అవార్డుల కమిటీ అధ్యక్షుడుగా ఉన్నది బెజవాడ గోపాలరెడ్డి. ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు – విశ్వనాథకు రావడానికి తాను గట్టి కృషే చేశానని (ఆయన విశ్వనాథకు వీరాభిమాని లెండి).సినారెకు వచ్చినప్పుడు ఆ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నది పి.వి. నరసింహారావు అనుకుంటా.

  మీరడిగింది ఒక్కపేరే కాబట్టి గొడవ లేకుండా ఒక్కపేరే చెప్తాను: కారా మాస్టారు. (విశ్వనాథకు వచ్చింది ఒక నవలారచయితగా. సినారె కవి. తెలుగు కథేనా ఆ గుర్తింపుకు నోచుకోనిది?)

  మీకు పుట్టపర్తి వారితో నేరుగా పరిచయం ఉందా? నాకొకసారి మెయిలు చెయ్యగలరా? ప్రొద్దుటూరులో వారి విగ్రహాన్ని తొలగించినప్పుడు నా పరిధిలో నేను కొంత గొడవచేశాను. 🙂
  వివరాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ.

 19. 11 అక్టోబర్, 2008 3:25 ఉద.

  ఈ టపాకు మీరు పెట్టిన పేరు భయంకరంగా వుంది. 🙂 అప్పుడు కాకాపోతే ఇప్పుడు. పుట్టపర్తి నారాయణాచార్యులకే ఇవ్వొచ్చు. జ్ఞానపీఠం దక్కాలంటే బొందితో భూలోకంలోనే వుండాలన్న ఆంక్షేమైనా వుందా?

 20. 11 అక్టోబర్, 2008 9:18 ఉద.

  యండమూరి రాసిన ‘అంతర్ముఖం’ కామూస్ ‘ది ఔట్ సైడర్’, కాఫ్కా ‘మెటామార్ఫాసిస్’ లని కలిపి రాసిన స్వేచ్చానువాదం తరహా రచన. అది తెలుగు పాఠకులకు అవసరమైన వేందాంతాన్ని అందించినా జ్ఞానపీఠకు అర్హమయ్యేదైతే కాదు.

  కాకపోతే, తను రాసిన విజయానికి ఐదు మెట్లు, విజయానికి ఆరోమెట్టు వంటి పుస్తకాల్ని చాలా మంది యువత ప్రేరణలుగా చూస్తారు. వాటి గురించి ఆలోచించొచ్చు…లేక అతను రాసిన మొత్తం వ్యక్తిత్వవికాస పుస్తకాలని ఒక కట్టగాట్టి అవార్డు ఇచ్చెయ్యొచ్చు.

  ఇప్పటికీ ముళ్ళపూడి వెంకట రమణే నా జ్ఞానపీఠ క్యాండిడేట్!!!

 21. 11 అక్టోబర్, 2008 10:23 ఉద.

  ముళ్ళవాడి వ్యంగ్యటరమణ అర్హుడని నా ఉద్దేశ్యం. గతించిన ఘనకీర్తులను కూడా పరిశీలించదలిస్తే రావిశాస్త్రి రంగంలో ఉంటాడు.

 22. 11 అక్టోబర్, 2008 1:49 సా.

  కావ్య స్థాయి రచనలు కాని వాటి గురించి ఇక్కడ అనవసర చర్చ జరుగుతుందనిపిస్తుంది.
  బొల్లోజు బాబా

 23. 11 అక్టోబర్, 2008 11:06 సా.

  @రానారె గారు,
  జ్ఞాన పీఠం మరణించినవారికి ఇచ్చే సాంప్రదాయం లేదు. అది మంచిదే అనిపిస్తుంది. లేకపోతే ఎవరైనా రేపు మా భట్టుమూర్తి గారి వసుచరిత్రకు ఇవ్వాలని డిమాండ్ చేయవచ్చు 😉
  @మహేష్ గారు,
  నిజమా! ఆ నవల ఆంగ్ల రచనల స్ఫూర్తితో వ్రాసి ఉంటే ఆ విషయాన్ని నిజాయితీగా తెలిపి ఉండవలసింది యండమూరి గారు.
  @చదువరి గారు,
  ముళ్ళపూడి వారి గురించి జ్ఞానపీఠ్ కమిటీకి తెలుపడానికి మనం ఏమైనా చేయగలమా? పరిశీలించండి.
  @బాబా గారు,
  కావ్య స్థాయి రచనలు అంటే, మరీ పద్య, గద్య కావ్యాలే అవసరం లేదండీ. మంచి సాహితీ విలువలున్న నవలలైనా అర్హమే. తమిళంలో జయకాంతన్ కు అవార్డు వచ్చింది ‘సిల నేరంగళిల్ సిల మనిదర్ గళ్ ‘ అనే నవలకు. దీన్ని మధురాంతకం రాజారాంగారు ‘ కొన్ని సమయాలలో కొందరు మనుష్యులు ‘ అనే పేరుతో తెలుగులోకి అనువదించారు.

 24. 12 అక్టోబర్, 2008 12:06 ఉద.

  అవునా?
  మంచి విషయాలు చెప్పారు. మీరు చెప్పిన నవల చదవటానికి ప్రయత్నిస్తాను.

  బొల్లోజు బాబా

 25. 12 అక్టోబర్, 2008 9:17 ఉద.

  యండమూరి అంతర్ముఖానికి ప్రేరణ కామూస్ ‘ది ఔట్‌సైడర్’ అని నవలలోనే చెప్పాడు. అలాగే తన వ్యక్తిత్వ పుస్తకాలలో ఏదైనా సంఘటన ఎక్కడినుంచో తీసుకుంటే అది కూడా పేర్కొన్నాడు. అవి జ్ఞానపీఠానికి అర్హమా కాదా అన్నది వేరే ప్రశ్న. అందుకు ఆయన నిజాయితీని శంకించడం భావ్యం కాదు.
  ఇక్కడ ఎవరూ పేర్కొనలేదు కాబట్టి, నేను చెప్పక తప్పదు. కాళీపట్నం రామారావు గారి పేరు ఎవరూ ప్రతిపాదించకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. అందులోనూ ఇప్పుడు జ్ఞానపీఠాన్ని ఒక రచనకు కాకుండా సర్వతోముఖ కృషికి ఇస్తున్నారు కదా! కథానిలయాన్ని స్థాపించి అటు ఔత్సాహిక రచయితలకు శిక్షణ ఇవ్వడంతో పాటు, తెలుగు కథ పుట్టిననాటి నుంచి అన్ని కథలనూ ఒకచోట సంగ్రహించడానికి వారు చేస్తున్న ప్రయత్నం శ్లాఘనీయం.

 26. KRISHNA RAO JALLIPALLI permalink
  12 అక్టోబర్, 2008 5:19 సా.

  యండమూరి పాపులర్ రచయతే .. కావచ్చు. thats all.
  మధు – విజయవాడ, మధు బాబు – హనుమాన్ జంక్షన్, విజయ బాపినీడు – మద్రాసు, కొప్పిశెట్టి, గిరిజ శ్రీ బగవాన్ – విజయవాడ, భయంకర్, కృష్ణ మోహన్, కొమ్మూరి సాంబశివరావు ఇంకా ఎంతో మంది — ఈయన కంటే పాపులర్. ఆయన కంటే గొప్ప రచనలు చేసిన వారే. అంత మాత్రాన..

 27. 12 అక్టోబర్, 2008 7:01 సా.

  @కృష్ణారావు జల్లేపల్లి: పాపులర్ రచయితలూ రచనల మీద ఎందుకండీ అంత చిన్నచూపు? వారు జ్ఞానపీఠకు అర్హులుకారా? వారు రాసేవి రచనలు కావా?

  నిజానికి, ఉదగ్రంధాలూ,కావ్యాలూ గొప్ప రచనలూ అని నెత్తికెత్తుకునే ఎన్ని పుస్తకాల్ని జనబాగుళ్యం చదివి అర్థం చేసుకుంది, ఆస్వాదించింది, జీవితాలకు అన్వ్వయించుకుంది? వాటిల్లో ఉన్న జీవిన మూల్యాలెన్ని? ప్రయోజకత్వం ఎంత?

  యండమూరిని మిగతా రచయితలగాటన అస్సలుకట్టలేము. He is and always will be class apart. మొత్తం ఒక తరంచేత తెలుగు పుస్తకాలు చదివింపజేసిన రచయితల్లో ఈయన ఒకరు. నిజానికి నా తరం ఇంకా తెలుగు చదువుతూందంటే దానికి కారణం మధుబాబు డిటెక్టివ్ నవలలూ, యండమూరి ఆలోచనాత్మక నవలలూ, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు.

  ఇంతకంటే మరే అర్హతకావాలి జ్ఞానపీఠకు? ఒక తరంచేత తెలుగు చదివించిన ఘనత చాలదా? తన తచనలతో కొన్ని వేల జీవితాల్ని influence చేసిన ప్రయోజకత్వం చాలదా? పూజించదగిన పుస్తకాలు రాసిన మహామహులకన్నా, ఉపయోగించుకోదగిన పుస్తకాలు రాసిన ఈయన తీసిపోయాడా?

 28. 12 అక్టోబర్, 2008 7:47 సా.

  @కృష్ణమోహన్ గారు,
  నిజమే. ఇప్పుడు మళ్ళీ ఆ నవల తీసిచూస్తే తెలిసింది. అనేకసార్లు చదివిన పుస్తకంలోని ఈ విషయాన్ని గమనించకపోవడం నాదే పొరబాటు.
  @ మహేష్ గారు,
  మధుబాబు నవలలు గుర్తున్నంతగా మరో పుస్తకం గుర్తుండని మాట నిజమే. షాడో గురించి తెలిసినంతగా సహోదరుల గురించికూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. కానీ జ్ఞానపీఠ్ అవార్డు లక్ష్యం వేరు. పాప్యులర్ రచనలను ప్రోత్సహించడం వారి విధానం కాదు. వాటికి అమ్మకాలు ఇచ్చే ప్రోత్సాహకాలను మించిన ప్రోత్సాహం అక్కరలేదు. మీరు చెప్పినట్లు జనబాహుళ్యం చదవని, ప్రింటు చేయడానికయిన అప్పులు కూడా తీర్చలేని రచనలు, కేవలం తమ సాహితీ తృష్ణను తీర్చుకోవడం కోసం, ఒక గొప్ప రచనను సృజించడంకోసం తమ జీవితాలను ధారపోసే మహానుభావులను గుర్తించడానికి ఉద్దేశించింది ఈ అవార్డు.

 29. KRISHNA RAO JALLIPALLI permalink
  12 అక్టోబర్, 2008 8:22 సా.

  నేను అనేది అదే. అందరూ జ్ఞానపీఠ్ అవార్డ్ కి అర్హులే. యండమూరి ఒక్కరే కాదు. యద్దనపూడి, మాదిరెడ్డి సులోచన, MALLADI VENKATA KRISHNA MURTHY, CHANDU SOMBABU,CHALLA SUBRAMANYAM, G.V. AMARESWARA RAO, KUPPILI PADMA, BEENA DEVI, TEMPO RAVU, A.V. MOHANA RAO, VISWA PRASAD, VISWA MOHAN, KAAGADA SHARMA, DWIVEDULA VISHAALAKSHI, VASUNDARA, KANCHARLA RAMANA, GOTETI, INTOORI, AADI VISHNU, MALLIK, KOMMANAPALLI, SURYADEVARA, PURAANAM, ఇంకా చాలా మంది .. అన్ని తరాల వారితో , అందరితో వారి వారి రచనలను చదివింప చేసారు. ఎందరో జీవితాలను ప్రబావితం చేసింది – మొన్న చలం, నిన్న ‘రేపు’ నరసింహ రావు గారు. నేడు ఎవరూ లేరు. యండమూరి మాత్రం ఖత్చితంగా కాదు.
  ఇక యండమూరి నిజాయితీ గురించి చెప్పాల్సి వస్తే … అవును ఆయన నిజాయితీ చాలా, చాల మందం. అది ఎంత మందమో .. తెలుగు పాఠక లోకానికంతా తెలుసు. వారి నిజాయితీ గురించి MAGICIAN పట్టాభిరాం గారు చాలా బాగా చెప్పగలరు.

 30. 12 అక్టోబర్, 2008 9:31 సా.

  @కృష్ణారావు – మీరు వ్యక్తిగత జీవితాలలోకి వెళ్ళిపోతున్నారు. మనం సాహితీ జీవితం వరకూ మాట్లాడుకుంటున్నాము. నేనైతే అంతర్ముఖం నవల ప్రేరణ గురించి మాత్రమే మాట్లాడాను. “యండమూరి ఖచ్చితంగా కాదు” – ఇలాంటి పెద్ద పెద్ద స్వీపింగు స్టేటుమెంట్లు చెయ్యకండి – మీకెంత విజ్ఞానమున్నా. యండమూరి సాహిత్యంతో ప్రభావితమైన చాలామంది నాకు స్వయంగా తెలుసు. అంతకంటా సరిపోయినవారెవరు అని మీరు చెప్పండి – అంతేగానీ వాడికొద్దు – వీడికొద్దు అనడం అంత శోభస్కరంగానూ, సంస్కారవంతంగానూ లేదు. ఎవరికివ్వచ్చు అని ఆలోచించడానికి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము – ఎవరికి ఇవ్వకూడదు అని వాదించడానికి కాదు..

 31. 12 అక్టోబర్, 2008 10:23 సా.

  @చంద్ర మోహన్: జ్ఞానపీఠ అవార్డు ఎవరికైనా ఇవ్వచ్చు. the annual ‘Jnanpith Award’ (of Rs. 5 lakhs), given for the best creative literary writing by any Indian citizen in any of the languages included in the VIII Schedule of the Indian Constitution.” (http://www.jnanpith.net/awards/index.html)

  దీనిప్రకారం వీరికొలమానం సృజనాత్మకతేతప్ప మీరు చెప్పిన “జనబాహుళ్యం చదవని, ప్రింటు చేయడానికయిన అప్పులు కూడా తీర్చలేని రచనలు, కేవలం తమ సాహితీ తృష్ణను తీర్చుకోవడం కోసం, ఒక గొప్ప రచనను సృజించడంకోసం తమ జీవితాలను ధారపోసే మహానుభావులను గుర్తించడానికి ఉద్దేశించింది” కాదు.

 32. 12 అక్టోబర్, 2008 10:23 సా.

  @చంద్ర మోహన్: జ్ఞానపీఠ అవార్డు ఎవరికైనా ఇవ్వచ్చు. the annual ‘Jnanpith Award’ (of Rs. 5 lakhs), given for the best creative literary writing by any Indian citizen in any of the languages included in the VIII Schedule of the Indian Constitution.” (http://www.jnanpith.net/awards/index.html)

  దీనిప్రకారం వీరికొలమానం సృజనాత్మకతేతప్ప మీరు చెప్పిన “జనబాహుళ్యం చదవని, ప్రింటు చేయడానికయిన అప్పులు కూడా తీర్చలేని రచనలు, కేవలం తమ సాహితీ తృష్ణను తీర్చుకోవడం కోసం, ఒక గొప్ప రచనను సృజించడంకోసం తమ జీవితాలను ధారపోసే మహానుభావులను గుర్తించడానికి ఉద్దేశించింది” మాత్రమే కాదు.

 33. 12 అక్టోబర్, 2008 11:21 సా.

  @ మహేష్ గారు,
  అందులో క్రియేటివ్ పక్కనే లిటరరీ రైటింగ్ అన్నది కూడా గమనించండి, సృజనాత్మకత ఏ రకం వ్రాతకైనా అవసరమే. ఐతే అది necessary-but-not-sufficient condition లాంటిది. సృజనాత్మకంగానూ, సాహితీ విలువలు కలిగింది గానూ ఉన్న రచనలు, మీరు చెప్పినట్లు జనబాహుళ్యాన్ని చేరకుండా, లైబ్రరీల్లో రెఫరెన్సు సెక్షన్ లో మిగిలిపోయే అవకాశాలే ఎక్కువని నా భావం. అదే వెబ్ సైట్లో ఇచ్చిన అవార్డు గ్రహీతల లిస్టు చూస్తే తెలిసిపోతుంది, వారి ‘క్రైటీరియా’ ఏమిటో, “best creative literary writing” అన్న మాటలను వారు ఏ context లో ఉపయోగించారో.

 34. 13 అక్టోబర్, 2008 12:14 ఉద.

  @చంద్ర మోహన్: సమస్య అక్కడే వస్తుంది. షేక్స్పియర్ నుంచీ గిరీష్ కర్నాడ్ వరకూ గొప్ప సాహితీసృజనకర్తలు కేవలం “సాహితీవిలువల” కోసం రచనలు చెయ్యలేదు. తమ ఆలోచనలు పంచుకోవడం కోసం, ప్రజలకోసం రాసారు. వాటికి విలువలు ఆపాదించింది మనలాంటి కొందరో లేక సమయాన్నిబట్టి అవి ఆపాదించబడటమో జరిగింది. కాబట్టి, “పాప్యులర్ రచనల్లో ఆ విలులు లేవు” అనుకోవడం అంత ఆమోదయోగ్యం కాదు.

 35. 13 అక్టోబర్, 2008 1:56 సా.

  జ్ఞానపీఠ్ అవార్డులు ఇవ్వడం మొదలవకముందే వెళ్ళిపోయిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిని మినహాయించినా ఆ అవార్డు రాదగిన తెలుగు కథారచయితలు కొ.కు., చా.సో., రావిశాస్త్రి, ఇప్పుడున్నవారిలో కా.రా. అని కేతు విశ్వనాథరెడ్డి ఒకసారి అన్నారు. చంద్రమోహన్ గారూ, రానారె గారి వ్యాఖ్యకు సమాధానంగా మీరు వెలిబుచ్చిన అభ్యంతరానికి సమాధానం ఇందులో ఉన్నట్లుగా నాకు అనిపిస్తోంది. 🙂

 36. 13 అక్టోబర్, 2008 2:00 సా.

  మర్చిపోయా…

  టపాలో మీరు అడిగిన ప్రశ్నకు కూడా నా సమాధానం: కా.రా. అనే!

 37. KRISHNA RAO JALLIPALLI permalink
  13 అక్టోబర్, 2008 8:22 సా.

  చివుకుల గారూ..
  మీరు వ్యక్తిగత జీవితాలలోకి వెళ్ళిపోతున్నారు. మనం సాహితీ జీవితం వరకూ మాట్లాడుకుంటున్నాము – నాకు తెలిసినంత వరకూ రెంటిని విడగోట్టలేము.
  “యండమూరి ఖచ్చితంగా కాదు” – ఇలాంటి పెద్ద పెద్ద స్వీపింగు స్టేటుమెంట్లు చెయ్యకండి – మీకెంత విజ్ఞానమున్నా – ఎందుకు చెయ్య కూడదు?? ఎవరి ఇష్టం వారిది, ఎవరి అభిరుచి వారిది, ఎవరి దురద వారిది. నాకు విజ్ఞానమున్నదని ఎక్కడా వ్యక్తికరిచలేదే.. అదే కనుక ఉంటే.. నేను కూడా ఒక బ్లాగ్ ని మొదలెట్టే వాడిని కదా??

  యండమూరి సాహిత్యంతో ప్రభావితమైన చాలామంది నాకు స్వయంగా తెలుసు – పట్టాభిరాం గారి రచనలతో ప్రబావితం అయిన వారెంతో మంది నాకు తెలుసు, బాపినీడు రచలనతో, మధు రచనలతో, మధు బాబు రచనలతో, చందు సోంబాబు రచలనతో .. తమ తమ జీవితాలనే మార్చు కొన్న వారెంతో మంది నాకు కూడా తెలుసు.

  అంతకంటా సరిపోయినవారెవరు అని మీరు చెప్పండి – పెద్ద లిస్టే ఇచ్చాను కదా.. వారందరికి ఇవ్వ వొచ్చు.
  శోభస్కరంగానూ, సంస్కారవంతంగానూ లేదు – నాకు రెండూ లేవు. ఒప్పుకుంటున్నాను.

 38. 13 అక్టోబర్, 2008 8:34 సా.

  అద్దేపల్లి రామమోహన రావు గురించి ఇక్కడ ఎవరికైనా తెలుసా?
  బొల్లోజు బాబా

 39. rajendra kumar devarapalli permalink
  13 అక్టోబర్, 2008 10:46 సా.

  బొల్లోజు బాబా గారు చాలా తెలుసండి :)ఇవ్వాళ ఒక దినపత్రిక సాహితీవిభాగములో కూడా ఉంది

 40. 14 అక్టోబర్, 2008 9:11 ఉద.

  @కృష్ణారావు – మీరిచ్చిన లిస్టుతో నాకే ఇబ్బందీ లేదు. ఇంకో నాలుగు పేర్లు కలుపుకున్నా నాకేమీ పరవాలేదు. నేనన్నది వీరికి ఇవ్వకూడదు అనడం బాగు లేదని.
  మీ విజ్ఞానం, సంస్కారం,శోభస్కరం – మీకంటా మిమ్మల్ని బాగా జడ్జ్ చేసుకునేది ఎవరు? మీతో ఏకీభవించడానికి నాకేమీ ఇబ్బంది లేదు.
  వ్యక్తిగత జీవితం, సాహితీ జీవితం వేరు కాబట్టే శ్రీశ్రీనీ, చలాన్నీ మనం ఇంకా గౌరవిస్తున్నాము. మీరేమో రెండూ ఒకటే అంటున్నారు – మీకు నాకంటా ఎక్కువైనా తెలిసుండాలి – లేదా అస్సలు తెలియకపోయి ఉండాలి. మీరన్నట్టు – మీ దురద మీది. గోక్కోండి.. అభినందనలతో…

 41. 14 అక్టోబర్, 2008 12:14 సా.

  తిరుమల రామచంద్ర గారి పేరు ఇంతా చర్చలో రాకపోవడం బాధగా ఉంది.(ఆయన ఇప్పుడు లేరనుకోండి).

 42. KRISHNA RAO JALLIPALLI permalink
  15 అక్టోబర్, 2008 10:47 సా.

  @చివుకుల –
  ఇంకో నాలుగు పేర్లు కలుపుకున్నా నాకేమీ పరవాలేదు – మీ ఫరవా తో నాకు సంబంధం లేదు.
  మీతో ఏకీభవించడానికి నాకేమీ ఇబ్బంది లేదు – మీరు ఎకిభవించినా, ఎకిభవించక పోయినా నాకు పోయేది ఏమి లేదు.. ఊడేది అంత కన్నా లేదు.

  లేదా అస్సలు తెలియకపోయి ఉండాలి – అందుకనే బ్లాగు మొదలెట్ట లేదు.
  మీ దురద మీది. గోక్కోండి – యండమూరిది మాత్రం గోకను.

 43. 16 అక్టోబర్, 2008 10:32 ఉద.

  రవి గారు, చర్చ ను చదువుతూనే ఉన్నాను! రామచంద్ర గారి పేరు నాకు తట్టింది! ఆయన ‘హంపి నుంచి హరప్ప దాకా” జ్ఞానపీఠ్ ఖచ్చితంగా ఇవ్వదగ్గ గ్రంధం! కానీ దివంగతులైన వారికి అవార్డ్ ఇవ్వరని తెలిసి ఇక్కడ కామెంట్ రాయలేదు.

  అన్నట్టు రచయిత్రుల్లో ఎవరూ ఈ అవార్డుకి అర్హులైన వారు లేరంటారా? చివరికి యండమూరి, మధు బాబు కూడా దృశ్యంలో కొచ్చారు కాబట్టి ధైర్యం చేసి లత(తెన్నేటి హేమలత) గారి పేరుని ప్రతిపాదిస్తున్నాను. ఆవిడ రాసిన “రామాయణం ” “పౌలస్త్యుని ప్రేమ కథ” మొదలైన గ్రంధాలు గ్రంధాలు అవార్డుకు అర్హమనిపిస్తుంది. అయితే ఆవిడా ఇప్పుడు లేరు.

  నవలలకు కూడా ఇవ్వొచ్చు అంటే మాలతీ చందూర్ గారు రాసిన కొన్ని(కొన్ని మాత్రమే ఆవిడవి బాగుంటాయి) నవలలని పరిశీలించ వచ్చు!ఉదాహరణకి ఒక స్త్రీ వందేళ్ళ జీవితాన్ని సమగ్రంగా చిత్రీకరించిన ‘శతాబ్ది సూరీడు ‘ నవల.

 44. KRISHNA RAO JALLIPALLI permalink
  16 అక్టోబర్, 2008 7:50 సా.

  సుజాత గారూ.. కరెక్ట్ .. మాలతీ చందూర్ గారు ఈ అవార్డ్ కి అన్ని విధాల అర్హురాలు. కొన్ని దశాబ్దాలు ఆంధ్ర ప్రభ లో ప్రమదావనం శీర్షిక నిర్వహించారు. ఇప్పుడు స్వాతి లో. చాలా చాలా కథలు నవలలు రాసారు. లతా గారి వంశీ కృష్ణ కూడా చదవండి వీలు అయితే. చాల గొప్ప రచన.

 45. kala permalink
  14 జనవరి, 2009 5:39 సా.

  i want the address of challa subramanyam can u please post it to me
  kalareddy_hai@yahoo.co.in

Trackbacks

 1. పొద్దు » Blog Archive » అక్టోబరు బ్లాగుల విశేషాలు

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: