Skip to content

ఈ రామాయణమంతా ఎందుకు !

10 అక్టోబర్, 2008

ఎక్కువగా మాట్లాడితే “ఇప్పుడా రామాయణమంతా ఎందుకు, సంగతేంటో చెప్పరాదా” అంటారు పెద్దలు. తమిళ పెద్దలైతే మరీను. ” విషయం వదిలిపెట్టి కంబ రామాయణం మాట్లాడుతున్నాడు చూడు” అనేస్తారు. రామాయణం మాట్లాడ్డమే ఒక తప్పైతే కంబ రామాయణం మాట్లాడడం ఇంకా పెద్ద తప్పు. ఎందుకంటే వాల్మీకి రామాయణానికి మూడు రెట్లున్న ఉద్గ్రంధ మది! వాల్మీకి ఇంక మన వల్ల కాదనుకొని వదిలేసిన ఘట్టాలను కూడా ఈడ్చి ఈడ్చి వర్ణించాడు కంబ మహాకవి తన 72,000 పద్యాల “రామావతారం” లో. “కంబ రామాయణ‌ం” అన్నది సుదీర్ఘమైన వర్ణనలకు, ఉపన్యాసాలకు పర్యాయపదమైపోయింది తమిళులకు.

మొత్తానికి జనబాహుళ్యంలో రామాయణం పట్ల ఒక అభిప్రాయం ఉంది- ‘కట్టె, కొట్టె, తెచ్చె అని మూడు ముక్కల్లో చెప్పగలిగిన కథను మరీ ఎక్కువగా పొడిగించారు అని ‘. అది నిజమేనేమో. మన పాత గ్రంధాల్లో అంత సూటిగా, సరళంగా ఏక సూత్రంగా ఉన్న కథ మరొకటి కనిపించదంటే అతిశయోక్తి కాదు. భారతం చూడండి, కొన్ని వందల పాత్రలు, వేల సన్నివేశాలు, ఎవరి ప్రాముఖ్యం వారిదే, ఏ సన్నివేశాని కదే సాటి. ఫలానా పాత్ర మొత్తం భారతానికి నాయకుడు అని చెప్పలేము. అన్ని పాత్రలకు న్యాయంచేస్తూ, అన్ని కథలనూ ముఖ్య కథకు అనుసంధానం చేస్తూ మహాభారత గ్రంధాన్ని రచించడం అసిధారా వ్రతమే. అందుకే మన ఆంధ్ర మహాభారతం వ్రాయడానికి ముగ్గురు మహాకవులు చేయిచేసుకోవలసి వచ్చిందేమో! “అన్నప్రాసన నాడే ఆవకాయ” అన్నట్లు తెలుగులో మొదటి గ్రంధమే మహాభారతం వ్రాయడానికి పూనుకోకుండా చక్కగా ఏ రామాయణమో వ్రాసుకొని ఉంటే నన్నయకు మతిభ్రమణం కలిగేది కాదేమో బహుశ! కవిత్రయం తరువాత మళ్ళీ అంత సాహసానికి పూనుకోలేదెవరూ. పిల్లల మర్రి పినవీరభద్రుడు జైమినీ భారతం రచించినా ప్రజలు కూడా దాన్ని ఎక్కువగా ఆదరించినట్లు లేరు. కవిత్రయ భారతం తరువాత చెప్పుకోదగ్గ మరో భారత కావ్యం ఏదీ తెలుగులో లేదనే చెప్పుకోవచ్చు.

అదే రామాయణాన్ని చూడండి! చక్కగా ఒక్కడే హీరో, ఒక్కతే హీరోయిన్, ఒక విలన్ … ఏ తెలుగు సినిమా ఫార్ములాలోనైనా చక్కగా ఇమిడి పోగలిగిన కథ. మొత్తం కథంతా హీరో చుట్టూనే తిరుగుతుంది. కథ లోని మరే పాత్రలయినా సరే, హీరోకు అవసరమైతేనే ప్రవేశిస్తాయి, పనయిపోగానే నిష్క్రమిస్తాయి. అసలు కథ చిన్నదే. మిగిలినదంతా హీరో యొక్క హీరోయిజం చూపించడానికి కావలసిన సంఘటనలు, లేదా హీరో గుణగణాలగురించిన పొగడ్తలు.

అందుకే మహా భారతాన్ని రెండవ సారి ముట్టని తెలుగు భాషలో రామాయణాలు మాత్రం తామర తంపరగా వెలిశాయి. లిస్టెందుకు గానీ ముఖ్యంగా చెప్పుకోదగ్గవి, భాస్కర రామాయణం, రంగనాధ రామాయణం, మొల్ల రామాయణం, విశ్వనాధ వారి రామాయణ కల్పవృక్షం. వాల్మీకి రామాయణానికి వచ్చిన అనువాదాలు వీటికి అదనం. ఉత్తర రామాయణం, రామాయణం ఆధారంగా రచించిన ఇతర కావ్యాలను పేర్కొనడంలేదు, మళ్ళీ అదో పెద్ద రామాయణం ఔతుందని. ఈ రామాయణాలు ఇన్ని ఎందుకు వ్రాస్తున్నారో అని జనాలు విసుక్కున్న సంగతి వ్రాసిన కవులకు కూడా తెలియక పోలేదు. దాదాపు అందరూ తాము రామాయణం ఎందుకు వ్రాస్తున్నామో ‘జస్టిఫికేషన్‘ ఇచ్చుకున్నారు – “మరల నిదేల రామాయణంబన్న … “ అన్న రీతిలో. ఐతే భారతం ఎందుకు వ్రాయలేదో, భాగవతం ఎందుకు వ్రాయలేదో ఎవరూ చెప్పలేదు. చెప్పకపోయినా మనకు తెలుసుగా, సంక్లిష్టత. పోతన మాత్రం సంతోషించాడు. భాగవతం తనకు వదిలేసినందుకు. ఐనా పాపం పోతన కూడా ఒక్కడే పూర్తి చేయలేక పోయాడు మొత్తం భాగవతాన్ని. సింగన, నారయలు కూడా తలో చేయీ వేస్తేనే గాని ‘స్వస్తి‘ అనిపించుకోలేక పోయింది.

ఇలా రామాయణాల మీద రామాయణాలు వచ్చేస్తుంటే ఇతర కవులూరుకొంటారా! శ్రీశ్రీ అననే అన్నాడు :

“రామాయణాలనే మ
ళ్ళీ మళ్ళీ దెచ్చి మ్రుచ్చిలించేకన్నా
ఆ మోస్తరు రచనల్లో
క్షేమం గద రామకోటి సిరిసిరి మువ్వా
”    అని.

ఈ వెటకారాలు తెలుగుకు మాత్రమే పరిమితం కాలేదు. కన్నడం లో మహా భారతాన్ని రచించిన కుమార వ్యాసుడు (బహుశ క్రీ.శ. 16 వ శతాబ్దం లో అనుకొంటాను). తను రామాయణాన్ని కాక భారతాన్ని ఎందుకు వ్రాస్తున్నాడో చెబుతూ అవతారికలో ఇలా అన్నాడు:

“తిణికిదను ఫణి రాయ రామా
యణ కవిగళ భార దలి … “

రామాయణ కవుల భారాన్ని భరించలేక ఆదిశేషుడు పురిటి నెప్పులు పడ్డాడట! ఆది శేషుని పై మరింత భారం మోపడం తనకు ఇష్టం లేక పోయిందట.

ఈ మధ్య బ్లాగ్లోకంలో రామాయణంపై, రాముని పై వేడిగా వాడిగా చర్చలు జరిగాయి ( లింకులు ఇవ్వొచ్చుగానీ “మళ్ళీ ఆ రామాయణమంతా ఎందుకు?” అని పాఠకులు చిరాకు పడతారేమోనని ఊరుకొంటున్నాను ). చర్చించి చర్చించి అలసి సొలసి ఎవరికి వారు స్వచ్ఛంద యుధ్ధ విరామం ప్రకటించుకొనేంత వరకు కొన సా…గాయి చర్చలు (అందులో ‘నేనుసైత‌ం’ అని కొన్ని చోట్ల వేలు పెట్టాననుకోండి! ఐతే కాలకముందే వెనక్కు తీసుకోగలిగాను). “రాయండి మీ రామాయణం” అంటూ బ్లాగరులను ప్రోత్సహించారు కొత్తపాళీ గారు తమ బ్లాగులో. ఒక పోటీ వివరాలు అందించారు కూడా. మళ్ళీ నిజంగానే ఎవరైనా ఇంకో రామాయణం వ్రాసేస్తారేమో అన్న భయంతో… వ్రాసినవి చదివి అర్థం చేసుకోగలితే చాలు అని చెప్పడానికి… ఇంత రామాయణం వ్రాశాను.

ప్రకటనలు
8 వ్యాఖ్యలు
 1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి permalink
  10 అక్టోబర్, 2008 8:20 ఉద.

  🙂

 2. 10 అక్టోబర్, 2008 9:56 ఉద.

  రామయణం కథలో సరళతే ఎక్కువగా రాయించిందనుకుంటా. కానీ, నాకు మాత్రం రామయణం కన్నా భారత భాగవతాలలోనే ఎక్కువ వూహకి ఆస్కారం వుందనిపిస్తుంది. క్లిష్టమైన కథ/పాత్రలు అందుకు కారణమనుకుంటా. భాగవతంలో వున్న ఇలాంటి క్లిష్టత గురించి ఈ రోజే రాసాను, వీలైతే చదవండి.

  http://palakabalapam.blogspot.com/2008/10/blog-post.html

  మంచి టపా రాశారు. నెనర్లు.

 3. 10 అక్టోబర్, 2008 10:58 ఉద.

  ఈ మీ రామాయణం బాగుంది.

 4. 10 అక్టోబర్, 2008 3:14 సా.

  మన బ్లాగర్లం కూడా ఆదిశేషుడికి ఖచ్చితంగా ఇంకొంచం extra తలనెప్పి తెచ్చిపెట్టి ఉంటాం. అయినా – తలనొప్పి తెప్పించే మా చర్చని చూసి కూడా రామాయణం సూటిగా, సరళంగా ఉంటుందని తీర్మానించడం న్యాయమేనంటారా??

 5. 10 అక్టోబర్, 2008 3:20 సా.

  బాగుందండీ 🙂

 6. chavakiran permalink
  12 అక్టోబర్, 2008 1:57 సా.

  🙂

 7. 12 అక్టోబర్, 2008 7:49 సా.

  @ నాగమురళి గారు: 😉
  అందరికీ నెనర్లు.

 8. 25 జనవరి, 2009 10:00 సా.

  బ్లాగులో పడ్డ ఆరు నెలలకి వ్యాఖ్యానించాడంట వెనకెవడో.
  మీరు హాస్యరసం కూడా చాలా బాగా పండిస్తున్నారు గురువుగారు. 🙂

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: