Skip to content

శివ తపోభంగము

22 అక్టోబర్, 2008

ఈ మధ్య జరిగిన అంతర్జాల భువన విజయదశమి లో ఒక వర్ణనాంశం మన్మధుని శరాలతో తపోభంగమై కళ్ళుతెరిచి గిరిజను చూసిన క్షణంలో శివుని మనస్సులో ఎలాంటి భావాలు కలిగాయి అన్నది. అందుకోసం వ్రాసుకొన్న పద్యాలు ఇవి. సమయాభావం వలన భువన విజయంలో చోటుదొరకలేదు. రానారె గారిచ్చిన క్లూ అందిపుచ్చుకొని ఆ పద్యాలను ఇక్కడ పెట్టేస్తున్నాను (నా బ్లాగులో స్థలాభావం లేదు మరి!)

కం. కన్నులు తెరచిన క్షణమున

పన్నగ భూషణుడు గాంచె పర్వత పుత్రిన్

వన్నెల పూవుల పూజకు

సన్నద్ధము జేసితెచ్చి సన్నిధి నిలువన్

ఉ. ఆనిమిషమ్మునందు మరుడాతని గుండెను నాటినట్టి బా

ణానికి దీటువచ్చు హరిణాంకముఖీ సుమసౌమ్య దృక్కులా

స్థాణు హృదంతరాళమును దాకె, తపస్సిటు భంగమాయెనో!

పూనిన సంయతిన్ ఫలము పొందెనొ! దోచని సంశయమ్మునన్

సీ. పలుమార్లు జూచిన పార్వతి యందాలు

కొంగ్రొత్తగా నేడు గోచరించు

వణికించు శీతాద్రి పై వీచు పవనాల

ఉష్ణాన తన తనువు చెమరించు

స్వామీ! యని గిరిజ వచియించు పలుకులు

ప్రణయ భావమ్ముల ప్రతిఫలించు

శైల ధన్వుని మీద స్మరుని సుమాస్త్రాలు

ముప్పిరి గొని నేడు మోహరించు

తే.గీ. అవతరించిన తొలిప్రేమ భావమొకట

భగ్నమాయెను తపమన్నబాధ యొకట

క్రొవ్విదముసేయు మరునిపై క్రోధమొకట

కలిసిపోయెను ముక్కంటి కన్నులందు

ప్రకటనలు
7 వ్యాఖ్యలు
 1. కొత్తపాళీ permalink
  22 అక్టోబర్, 2008 4:34 సా.

  బాగు బాగు.
  చివరి తేగీలో .. మూడు కనుల్లో మూడు భావాలు పలికినాయని మంచి చమత్కారం.

 2. durgeswara permalink
  22 అక్టోబర్, 2008 7:47 సా.

  harahara mahaadeva.

 3. వినోద్ permalink
  22 అక్టోబర్, 2008 7:50 సా.

  నా సిస్టమ్ లో ఈ బ్లాగ్ సరిగా కనిపించడం లేదు..
  మీరు ఏ ఫాంట్ వాడుతున్నారు
  ???

 4. 22 అక్టోబర్, 2008 8:56 సా.

  @కొత్తపాళీ గారు,
  నెనర్లు. రాయల వారి నిరూపణం పడింది. ఇంకేమి కావాలి!
  @దుర్గేశ్వర గారు,
  శివార్పణం! కృతజ్ఞతలు.
  @వినోద్ గారు,
  నేను MSWORD లో డిఫాల్టుగా వచ్చే గౌతమి ఫాంట్లో టైపు చేశాను. ఇది యూనికోడ్ ఫాంటేనే!

 5. 23 అక్టోబర్, 2008 9:10 ఉద.

  బాగు బాగు! (ఆంగ్లంలో అయితే wow!!!)

 6. 29 అక్టోబర్, 2008 5:20 సా.

  చాలా బాగున్నాయి పద్యాలు.

 7. 31 అక్టోబర్, 2008 8:19 ఉద.

  @ రవి గారు, నాగమురళి గారు
  నెనర్లు.

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: