Skip to content

అద్వైతం

28 అక్టోబర్, 2008

ఎవరన్నారు మనం దూరమయ్యామని?


ఉషోదయమౌతున్నప్పుడు

అరుణ కిరణాల దీప్తులలో

గులాబీ రేకులపై నిలిచి

ముత్యాల్లా మెరుస్తున్న మంచు బిందువులు

నీ రాగ రంజిత వదనాన్నే ప్రతిఫలిస్తున్నాయి


అపరాహ్ణ వేళ

చండ భాను ప్రజ్వలిత తాప ప్రతాపాన్ని పరిహసిస్తూ

మొగలి పొదల పైనుండి వీచే

సుగంధ పూరిత శీతల సమీరం

నీ స్పర్శ యని భ్రమింపజేస్తుంది


సాయం సమయాన

నీలాకాశం సంధ్యా రాగాన్ని పలికిస్తున్నప్పుడు

పక్షుల కలస్వనాల నడుమ

విలసిల్లే నిశ్శబ్ద ప్రకృతి

నీ మౌన ముద్రనే అనుకరిస్తున్నది


ఎవరన్నారు మనం దూరమయ్యామని!


అర్ధ రాత్రి వేళ, నిశ్శబ్ద నిశీధిలో

వెన్నెలలో తడిసి, మత్తుగా

జోగుతున్న చెట్ల ఆకులను సవరిస్తూ

మెల్ల మెల్లగా వీచే చిరుగాలి సవ్వడి

నీ పాటనే గుర్తు చేస్తున్నది


గట్లను ఒరుసుకొంటూ

బండ రాళ్ళను ఢీకొని ఎగసి పడుతూ

అల్లరిగా ప్రవహించే

సెలయేటి అలల గలగల ధ్వానం

నీ నవ్వునే తలపింప జేస్తున్నది


ఉవ్వెత్తున లేచి

చెలియలి కట్టను తాకి

ఇసుక తిన్నెలను రాచుకొంటూ

వెనుదిరిగే కడలి తరంగం

నీ చరణ మంజీర నాదాన్ని వినిపిస్తున్నది


ఎవరన్నారు మనం దూరమయ్యామని?


ఘనీభవించిన ఏకాంతంలో

స్మృతి పథంలో పయనిస్తూ

గడిచిపోయిన మధుర క్షణాలను ఏరుకొంటూ

హృదయాంతరాళాలను సమీపించి

లోనికి తొంగి చూసినపుడు

గుండె గదిలో సుప్రతిష్ఠితమై

స్నేహ సామ్రాజ్యాభిషిక్తవై

చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చేనీ రూపం

నేనే నీవన్న భావనను కలిగిస్తున్నది


మరి,


ఎవరన్నారు మనం దూరమయ్యామని!

ప్రకటనలు
9 వ్యాఖ్యలు
 1. 28 అక్టోబర్, 2008 9:20 సా.

  బాగుంది.

 2. 29 అక్టోబర్, 2008 5:19 సా.

  చాలా బాగుందండీ. ఇది చదివాకా మీరు వచనకవిత్వం రాయలేనని ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియడం లేదు. ( నాకు వచన కవిత్వం గురించి – అసలే కవిత్వం గురించైనా సరే – తెలిసినది బాగా తక్కువ అనుకోండి. అయినా చాలా బాగుంది.

  మీ హైకూల టపా కూడా చదివాను. హైకూలంటే నాకో విషయం గుర్తు వస్తుంది. అది హాస్య కవితో, సీరియస్ కవితో తెలియదు గానీ – ‘పచ్చని పొలాలు, పోయాలనిపించింది’ అంటూ ఎవరో ఒక గొప్ప కవి ఒక హైకూ రాశారట. దాన్ని ఒక పెద్దాయన విమర్శించడం విన్నాను. ఆ హైకూ ఎవరికైనా పూర్తిగా తెలుసా? ఎవర్రాశారో కూడా తెలిస్తే కొంచం చెప్పండి.

 3. 29 అక్టోబర్, 2008 11:37 సా.

  @పూర్ణిమ గారు
  నెనర్లు.

  @నాగమురళి గారు
  నెనరులు మీకు కూడా. పద్యకవిత కంటే వచన కవిత (బాగా) వ్రాయడం కష్టం అని నాకనిపిస్తుంది. పద్యం ఒక నియమ బద్ధమైన రహదారిలో ప్రయాణంలాంటిది. నియమాలు ఆకళింపు చేసుకొంటే దూసుకుపోవచ్చు. వచన కవిత గజిబిజి ట్రాఫిక్ లో వెళ్ళడంలాంటిది. ఎటైనా వెళ్ళవచ్చు గాని, ఎటుపోతే గమ్యం చేరతామో బోధ పడదు. అందుకే నాకు తెలిసి వచన కవిత బాగా వ్రాయగలిగిన వారందరూ పద్య రచనలోనూ నిష్ణాతులే… శ్రీశ్రీ , శేషేంద్ర, కృష్ణశాస్త్రి లాంటివారు. మినహాయింపు తిలక్.

 4. 30 అక్టోబర్, 2008 4:49 ఉద.

  చంద్రమోహన్ గారూ,

  తిలక్ కూడా మొదట్లో చాలా సుకుమారమైన పద్యకవిత్వం వ్రాశారండీ.ఆయన సీతాదేవి మీద వ్రాసిన ఖండికలు కరుణాత్మకమే కాదు రసప్లావితాలు కూడా.ఆయన పద్యసంకలనం “గోరువంకలు” అజోవిభో వారి వెబ్సైట్ లో దొరకవచ్చు.అయితే ఆయన విస్తృతంగా వ్రాసింది మాత్రం వచన కవిత్వమే.వచనకవిత్వానికి అందాన్నిచ్చిన కవులలో ఆయన ప్రముఖులని నా అభిప్రాయం.

  మీ కవిత బావుంది.మీ వచన కవిత్వపు శైలిపై తిలక్ ప్రభావం ఉన్నట్లు కూడా అనిపిస్తుంది.అభినందనలు.

 5. 30 అక్టోబర్, 2008 1:27 సా.

  హాయిగా ఉంది చదువుతుంటే!

 6. 30 అక్టోబర్, 2008 11:00 సా.

  నాగమురళి గారి అభిప్రాయమే నాదీను.
  చాలా గొప్పగా ఉంది.
  ఎటైనా వెళ్ళవచ్చు గాని, ఎటుపోతే గమ్యం చేరతామో బోధ పడదు. అన్న వాఖ్య నా కర్ధం కాలేదు. నా సందేహమేమంటే వస్తువునెంచుకొన్నతరువాత, కొంత మధనం జరిగిన తరువాత అటూ ఇటూ పోవటం ఎలా జరుగుతుంది?
  పద్యం సౌందర్యం పద్యానిదే, వచనం సౌలభ్యం వచనానిదే అని నా అభిప్రాయం.
  కవితైతే చాలా బాగుంది. అంత మంచి కవిత్వాన్ని వ్రాయగలిగేమీరు అస్త్రసన్యాసం చేయటం ఏం బాలా. 😐

 7. 31 అక్టోబర్, 2008 8:17 ఉద.

  @ vennela
  తిలక్ పద్యాలు వ్రాశారని ఇంతవరకు నాకు తెలియదు. మంచి విషయం తెలియజేశారు, అదీ నా థియరీని బలపరిచే విధంగా. ధన్య వాదాలు. మీ అభినందనలకు కూడా నెనర్లు.

  @ సుజాత గారు
  నెనర్లు

  @ బాబా గారు
  ‘ఎటైనా వెళ్ళవచ్చు గాని, ఎటుపోతే గమ్యం చేరతామో బోధ పడదు’… అన్నది కేవలం నాకు మాత్రమే వర్తిస్తుందని గమనించ ప్రార్ధన. మీలాగా, నిషిగంధ, రాధిక ల లాగా చక్కని వచన కవితలు వ్రాసేవారికి కాదు. నావరకు వచన కవిత వ్రాయడం పద్యం కంటే కష్టం అనిపిస్తుంది. పద్యంలో పదాలు ఎక్కువ తక్కువలు కాకుండా, రిథమ్ చెడకుండా, గణాల, యతి, ప్రాసల నియమాలు దిశా నిర్దేశం చేస్తాయి కొంత వరకు. వచనంలో కవికి పూర్తి స్వేచ్ఛ ఉంది పదాల ఎంపికలో. ఈ స్వేచ్ఛను జాగ్రత్తగా వాడక పోతే వచన కవిత, తవికగా మారిపోయే అవకాశాలెక్కువ.
  నెనర్లు.

 8. 25 జనవరి, 2009 7:55 సా.

  మీరూ కవితలు వ్రాస్తారని తెలిసి చాలా సంతోషంగా వుంది.
  నా అభిప్రాయం కూడా వచన కవిత్వమే కష్టమని. (నేను వ్రాసిన అనేక వచన కవితలు ప్లాఫు అయ్యాక నాకు ఆ విషయం ఇంకా రూఢీగా తెలియవచ్చింది).

  అన్నట్టు ఈ కవితాంశమై, మీరు లేని వ్యక్తిని ప్రక్కనే వున్నట్టు ఊహించుకోవడం, అంత మంచి అలవాటు కాదు. యోగులు చెప్పినట్టు, నిజం (రియాలిటీ) ఎంత చేదుగా వున్నా అందులోనే బ్రతకడం సరుచితం 🙂 మఱైతే “నీవు నిన్న వ్రాసిన కవిత మాటేఁవిటి రాకేశ్వరా” అని నన్ను తిఱిగి ప్రశ్నించబాకండి! 🙂 ఓశో చెప్పినట్టు, నిజం మఱీచేదుగా అనిపించిన వారే కవులౌతారనుకుంట !

 9. చంద్ర మోహన్ permalink
  7 ఫిబ్రవరి, 2009 11:34 సా.

  రాకేశ్వర గారూ,
  ధన్యవాదాలు. ఎందుకో మరి నేను వ్రాసిన కొన్ని కవితలూ (ఇదొక్కటే తెలుగు, మిగిలినవి ఆంగ్ల, తమిళ భాషల్లో) లేని వ్యక్తిని గురించే. యోగులు ఏంచెప్పారో గానీ కవితకు విరహయోగమే రుచిరం!

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: