Skip to content

పిల్లలను గురించి కాళిదాసు

6 నవంబర్, 2008

పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు? అది ఎంత మహా కవులకైనా, మహర్షులకైనా సరే. ఎంత కటువుగా మాట్లాడే వారైనా పిల్లల ప్రసక్తి వచ్చేసరికి మృదుత్వం సంతరించుకొంటారు. మరి మృదుత్వం తప్ప మరొకటి ఎరుగని కాళిదాసు అయితే…

ఈ క్రింది పద్యం శాకుంతలం లోనిది. భరతుని చూసి గుర్తుపట్టక, దుష్యంతుడు తన సంతాన లేమిని తలచుకొన్న సందర్భంలో:


అలక్ష్య దంత ముకుళా ననిమిత్త హాసై

రవ్యక్త వర్ణ రమణీయ వచ: ప్రవృత్తీన్

అంకాశ్రయ ప్రణయిన: తనయాన్వహంతో

ధన్యా: తదంగ రజసా మలినీ భవంతి

ఏ కారణమూ లేకుండానే పలు మొగ్గలు కనిపించేలా చిరునవ్వులు చిందిస్తూ, వచ్చీ రాని ముద్దు పలుకులను వర్ణించలేనంత అందంగా పలుకుతూ, ఎప్పుడూ ఒడిని వదిలి పెట్టడానికి ఇష్టపడని బిడ్డలను ఎత్తుకొన్న వారు, ఆ బిడ్డ వంటిమీది దుమ్ము తగిలి ధన్యులౌతారు!


పిల్లలను గురించి పై పద్యానికి సాటి రాగల అందమైన వర్ణన ప్రాచీన సాహిత్యంలో మరొకటి కనిపించదు నాకు; ఒక్క తిరుక్కురళ్ లో తప్ప.


శాకుంతలంలోనే మరో హృద్యమైన పద్యం:


అనేన కస్యాపి కులాంకురేణ

స్పృష్టస్య గాత్రేషు సుఖం మ మైనం

కాం నిర్వృతిం చేతసి తస్య కుర్యాత్

య స్యాయ మంగాత్కృతిన: ప్రరూఢ: ?

ఎవరి వంశాంకురమో వీడు! ఈ పిల్లవాడిని ఆలింగనం చేసుకొంటే, ఇతడి స్పర్శ తగిలిన నా ప్రతి అంగమూ సుఖానుభూతిని పొందుతోంది. నాకే ఇలా ఉంటే ఇతడిని కన్న వారికి ఇతని ఆలింగనం మరెంత హాయిని కలిగిస్తుందో కదా! (అప్పటికి భరతుడు తన కుమారుడే నని దుష్యంతునికి తెలియదు)


రఘు వంశంలో దిలీపుడు కూడా వశిష్ఠునితో ఇలా అంటాడు…


కిం తు వధ్వాం త వైతస్యా

మదృష్ట సదృశ ప్రజం

న మా మవతి సద్వీపా

రత్న సూరపి మేదినీ

మీ కోడలైన ఈ సుదక్షిణ ద్వారా నాకొక పుత్ర రత్నం కలగనప్పుడు, సప్తద్వీపాలతో కూడిన ఈ భూమి యిచ్చే సమస్త రత్న రాశులూ నాకేమీ సంతోషాన్ని కలిగించడం లేదు (భూమి రాజుకు మరో భార్య కదా!).

కాళిదాసుకు సాటి రాగల వర్ణన, పిల్లలను గురించి,  తమిళ వేదమని చెప్పబడే తిరుక్కురళ్ లో కనిపించింది నాకు:


మక్కళ్ మెయ్ తీణ్డల్ ఉడఱ్కిన్బమ్ మట్ఱు

అవర్చొఱ్ కేట్టల్ ఇన్బమ్ శెవిక్కు

పిల్లల మృదు ఆలింగనం మన శరీరానికి అవ్యక్తమైన హాయిని గూర్చుతుంది. ఇంకా వారి ముద్దు పలుకులు మన చెవులకు తీయని సంగీతంలా వినిపిస్తాయి.

అమిழ் కినుమ్ ఆట్ఱ ఇనిదేదమ్ మక్కళ్

శిఱుకై అళావియ కూழ்

బిడ్డలు తమ చిన్నారి చేతులతో పిసికిన చద్దన్నం, తలిదండ్రులకు అమృతం కన్న మిన్నగా రుచిస్తుంది.

కుழల్ ఇనిదు యాழ் ఇనిదు ఎన్బదమ్ మక్కళ్

మழలైచ్చొల్ కేళాదవర్

తమ పిల్లల ముద్దు పలుకులు వినడానికి నోచుకోని వారు మాత్రమే వేణునాదం, యాழ் (ఒక ప్రాచీన తమిళ వాయిద్యం) ధ్వని సాటిలేని మాధుర్యం కలిగినదని అంటారు.

సంస్కృత భాష లోని మహాకవీ, ద్రవిడ భాషలోని మహాకవీ పిల్లల గురించి సంవదించిన హృదయ స్పందనలివి!

ప్రకటనలు
11 వ్యాఖ్యలు
 1. 7 నవంబర్, 2008 12:42 ఉద.

  very nice

 2. 7 నవంబర్, 2008 7:32 ఉద.

  బహు బాగు.తెలుగులో ఆధునిక కవులు కొన్ని చక్కని పద్యాలు రాశారు బాల్యాన్ని గురించి, పసి పిల్లల్ని గురించీ.

 3. 7 నవంబర్, 2008 1:51 సా.

  ఈ ప్రపంచంలో.. శరీరం ద్వారా సాధించగలిగిన సుఖాలలో అన్నిటికన్నా గొప్పదేమిటంటే ‘పుత్రగాత్ర పరిష్వంగ సుఖం’ అట. ఎంతో గొప్పగా చెప్పారు కదా! పుత్రుడంటే కేవలం కొడుకు అని కాదు, కడుపున పుట్టిన పిల్లలని అర్థం తీసుకోవాలి. ఈ మాట మహాభారతంలో ధృతరాష్ట్రుడు, శ్రీకృష్ణుడితో చెబుతాడని చదివాను. లేదా శ్రీకృష్ణుడే ఆయనతో చెబుతాడో! యుద్ధమే జరిగితే ఆ సుఖాన్ని కోల్పోతావని పెద్దాయన్ని కృష్ణమూర్తి హెచ్చరించే సందర్భమనుకుంటా. మీ టపా ఆ మాటను గుర్తుకు తెచ్చింది. ధన్యవాదాలు.

 4. 7 నవంబర్, 2008 5:34 సా.

  చాలా మంచి శ్లోకాలు గుర్తు చేశారండీ. భవభూతి శ్లోకం ఒకటి ఇదివరకు ఎప్పుడో చదివాను కానీ, పూర్తిగా గుర్తు లేదు. ‘ఆనంద గ్రంథి రేకో2యం అపత్యమితి బధ్యతే’ అని మాత్రం గుర్తు ఉంది. అది కూడా పూర్తిగా తప్పో, ఒప్పో తెలియదు. దంపతుల్ని కలిపి ఉంచే ఒకానొక ఆనంద గ్రంథి అని సంతానాన్ని గురించి భవభూతి అంటాడు. ఈ శ్లోకం పూర్తిగా తెలిస్తే చెప్పగలరా? (ఇది ఎందులోదో కూడా నాకు గుర్తు లేదు.)

  ఈ మధ్య మా అమ్మాయిని ముద్దు చేస్తున్నప్పుడు-
  ‘వైక్లబ్యం మమ తావదీదృశమహో స్నేహాదరణ్యౌకస:
  పీడ్యన్తే గృహిణ: కథం న తనయా విశ్లేష దు:ఖైర్నవై:’
  అన్న శ్లోకం గుర్తు వచ్చింది. శాకుంతలంలోని ఈ శ్లోక చతుష్టయం గురించి నా బ్లాగులో రాద్దామనుకున్నాను, కానీ ఆ శ్లోకాల్లోని లోతైన విశేషాలు ఎక్కువ నాకు తెలియవు. మీరు రాయకూడదూ వాటి గురించి సరదాగా?!!

 5. 9 నవంబర్, 2008 10:18 సా.

  బాబా గారు, కొత్తపాళి గారు, అరుణ గారు – ధన్యవాదాలు.

  నాగ మురళి గారు,
  నెనర్లు. మీరు చెప్పిన భవభూతి శ్లోకం నాకు తెలియదండి. నేనూ వెదుకుతాను. శ్లోక చతుష్టయం గురించి మీ ఐడియా బాగుంది. వ్రాయడానికి ప్రయత్నిస్తాను. ఐతే ఇప్పట్నుంచే మీ అమ్మాయి వెళ్ళిపోవడం గురించి బెంగెట్టేసుకొంటున్నారా! 🙂

 6. 10 నవంబర్, 2008 9:03 సా.

  చంద్రమోహన్,
  భవిష్యత్తులో అత్తవారి ఇంటికి వెళ్ళిపోతుందని బెంగ నిజమే అనుకోండి; అయినా ఆ క్షణంలో అనిపించింది ఏమిటంటే – ఎంత అడవిలో ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే కణ్వ మహర్షి లాంటి వాడికైనా కూడా ఇటువంటి బంధాలు ఎంత తీపిగా ఉంటాయో కదా అని. 😀

 7. 27 నవంబర్, 2008 3:10 ఉద.

  “రఘు వంశంలో దుష్యంతుడు కూడా వశిష్ఠునితో ఇలా అంటాడు…”
  మీ ఉద్దేశం దిలీపుడు అయి ఉంటుంది.
  దుష్యంతుడు చంద్రవంశపు వాడు కదా!

 8. 30 నవంబర్, 2008 10:33 సా.

  @కొత్తపాళీ గారు,
  నిజమేనండి! ముద్రారాక్షసం!! సరిచేశాను. కృతజ్ఞతలు.

 9. 25 జనవరి, 2009 8:09 సా.

  మూర్ఖులు చదవలేకుంటే చదవలేకున్నారు గానీ నేను మాత్రం ழ బదులు ళ మాత్రం వ్రాయను అని మీరు నిర్ణయించుకున్నారన్నమట. నామటుకు నేను ழ కోసం కన్నడం లిపిలోనున్న ೞ వాడుతుంటాను. ఇది వెనక తెలుఁగులో వుండేదని విన్నాను. కానీ దీనికి తెలుఁగు పొల్లు పెట్టడం కుదరదనుకోండి. కన్నడ పొల్లు పెట్టుకోవాలి. అయినా మీ చాదస్తం గాని, ழ అని మీరు వ్రాసినా దానిని మన వారు మహాఅయితే ళ గానే లేదా తప్పుగా z(జ) గానో చదువుకుంటారేమో. అంతెందుకు తమిళ మాప్పిళ్ళై అయిన మన వేంకట గారే దానిని జ అనుకున్నారు. నాకు కేరళలో ழ శిక్షణ బాగానే జరిగింది కోೞಿకోడు లో 🙂

  పిల్లల మీద అంటే నాకు ఎప్పుడూ శ్రీశ్రీ శైశవగీతం గుర్తుకువస్తుంది. మహాప్రస్థానం యెక్క కమ్యూనిష్టు కంపులో ఈ ఒక్క గీతమే పంకజంలా అనిపిస్తుంది!

  మీ
  రాకేశ్వరం.

 10. చంద్ర మోహన్ permalink
  8 ఫిబ్రవరి, 2009 10:19 సా.

  రాకేశ్వరా,
  ’ழ’ కు కొంతయినా దగ్గరగా ధ్వనించే అక్షరం తెలుగులో లేదు మరి! చాలా మంది ’ళ’ వాడుతారు గానీ నాకు నచ్చదు. నిజానికి నేటి మదురై, తిరుచ్చి ప్రాంతాలలో తమిళులు ’ళ’ అనే ఉచ్చరిస్తారు. “కుழల్” అనే పదాన్ని “కుళల్” అని పలికి చూడండి. ఎంత పేలవంగా ధ్వనిస్తుందో!

  ’శైశవ గీతం’ లో అంత అందం కనుపించదు నాకు. “మెటికలు విరుస్తూ ఇట గూర్చుండిన నను జూస్తుంటే నవ్వొస్తోందా?” అనే మాటలో ఎక్కడలేని ముసలితనాన్నీ పలికించాడు శ్రీశ్రీ.

 11. 24 ఫిబ్రవరి, 2009 4:54 సా.

  చంద్రమోహనా, ఇక్కడ ఓ లుక్కెయ్యండి.

  “ழ” దీన్నుండే తెలుగు ఱ వచ్చిందన్నట్టు ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం లో చదివినట్టు గుర్తు.

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: