Skip to content

శివుని మూడుకన్నులూ మంటలెత్తిన వేళ!

23 ఫిబ్రవరి, 2009

చి‍రుతొండ నంబి గొప్ప శివభక్తుడు. ప్రతి రోజూ ఒక శివభక్తునికి ఆతిథ్యమిచ్చి గానీ తాను భోంచేయడు.

ఒకనాడు అతని ఇంటికొక జంగము వచ్చాడు. ప్రతిరోజూ తూమెడు చెరకు రసంతో శివుని అభిషేకించడం అతని ఆచారం. దానికి కావలసిన చెరకు రసం సమకూర్చితే ఆతిథ్యం స్వీకరిస్తానన్నాడు. చిరుతొండనంబి అభిషేకానికి కావలసిన చెరకుమోపులు మోసుకురావడానికి వెళ్ళాడు. ఆ బరువు మోయలేక పాపం తడబడుతున్నాడు. భక్తుని కష్టం చూసిన శివుడు తక్షణం వెళ్ళి సాయం పట్టాడు. ఆ మోపుల బరువుకు ఆయనకూ పాపం మేను చెమరించింది.

ఈ సన్నివేశం జరిగినప్పుడు శివుడు కైలాసంలో ఉన్నాడు. పార్వతితో కలిసి అప్సరసల నృత్యం తిలకిస్తున్నాడు. అక్కడ కూడా శివుని మేను చెమర్చింది. అది పార్వతి గమనించింది. అప్సరసల హొయలు చూసి శివుడు వారిపై మోజుపడ్డాడని, అందుకే మేను చెమర్చినదని అనుమానం కలిగింది. జగజ్జననికి కూడా అసూయ తప్పలేదు. అయితే అపర కాళిక ఊరుకొంటుందా!

“అమరవరేణ్య! ప్రేంకణము లాడెడు వేలుపులేమ జూచి యే
చెమరిచి తంచుగేళి సరసీరుహమెత్తి ప్రతాపమొప్పగా
హిమగిరి రాజనందన మహేశ్వరు మొత్తె, మధూళికా పరా
గములు శశాంకశేఖరుని కన్నుల మూటను జిందునట్లుగన్”

చేతిలోని తామర పూవుతో ’ప్రతాపమొప్పగా’ శివుని ఘాట్టిగా ఒక్కటిచ్చుకొంది. దెబ్బకు పాపం తామరపూవులోని పుప్పొడి అంతా శివుని మూడుకన్నుల్లోనూ చిందిందట. కొంచెం మెల్లగా కొట్టియుండవలసింది పాపం.

శివపార్వతుల మీద ఇంత కామెడీ వ్రాయగల ధైర్యం ఎవరికుంటుంది, ఒక్క శ్రీనాధునికి తప్ప! ” పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ ” అని ఆక్షేపించిన నోటినుండి వెలువడిందా పద్యం – హర విలాసం లో.

ఆ పరమశివుడు అందరికీ శుభములు కూర్చు గాక!

ప్రకటనలు
6 వ్యాఖ్యలు
 1. 23 ఫిబ్రవరి, 2009 8:08 ఉద.

  మీకు,మీ కుటుంబానికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.

 2. చిలమకూరు విజయమోహన్ permalink
  23 ఫిబ్రవరి, 2009 10:33 ఉద.

  మీక్కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.

 3. 24 ఫిబ్రవరి, 2009 2:30 సా.

  ఇప్పుడే తెలుగుపద్యం లో శ్రీనాథుని చమత్కారం చూసి వస్తున్నాను. ఇక్కడ మీరు అందించిన ఇంకో రసగుళిక.

  అభినందనలు చంద్రమోహనా…

 4. 25 ఫిబ్రవరి, 2009 12:25 సా.

  చంద్రమోహన్‌గారూ నిజమే, శ్రీనాథుడా మరొకరా!!! వీలు చూసుకుని హరవిలాసం చదవాలండీ నేను. మంచి పద్యం చెప్పారు. ఆలస్యంగానైనా మీకు శివరాత్రి శుభాభినందనలు.

 5. 27 ఫిబ్రవరి, 2009 9:12 సా.

  శివరాత్రి శుభాకాంక్షలు.
  శ్రీనాధుడిదే మరో చక్కని పద్యం కాశీఖండం లోని “చంద్రబింబాననా”.గత శివరాత్రికి ఈ పద్యాన్ని నా బ్లాగు లో గుర్తుచేసుకున్నాను.ఈ శివరాత్రి కి శ్రీనాధుడి పద్యం మరొకటి తెలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది.
  ధన్యవాదాలు.

Trackbacks

 1. నేర్పవయ్య నాకు సర్పభూష! – ౨ « ఊక దంపుడు

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: