Skip to content

మమ్మల్నలా వదిలేయండి!

24 మే, 2009

ఈ పోస్టు నిజానికి ‘బ్లాగాడిస్తా ‘ బ్లాగులో రవి గారు వ్రాసిన టపాకు వ్యాఖ్య వ్రాయాలని మొదలైంది. రవి గారి  టపా తాడేపల్లి వారు వ్రాసిన టపాకు విమర్శ. కాని విషయ విస్తారం  వలన కామెంటు అసలు పోస్టుకంటే పెద్దదైపోయినట్లనిపించి  దాన్ని విడిగా ఇక్కడ  ప్రచురించాను. ఆ పై టపాలు రెండూ చదివితే గాని ఈ టపా అర్థం కాదు. “>> <<” ఈ గుర్తుల మధ్య వాక్యాలు రవిగారి టపాలోనివి.

చల్లారిపోయిందనుకొన్న వివాదం మళ్ళీ పైకొచ్చింది! మీరు ఈ పోస్టు వ్రాసిన నేపథ్యాన్ని బట్టి మీ ఆవేశం నాకు అర్థమయ్యింది. కానీ ఆ ఆవేశంలో మీరు తమిళ దురభిమానం గురించి కొన్ని మూస (Stereotyped) అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కామెంటకూడదనుకొన్నా వ్యాఖ్యల్లో కూడా ఈ దురభిమానం గురించి దురభిప్రాయాలు వ్యక్తమవడం చూశాక కొన్ని వివరణలు అవసరమనిపించి వ్రాస్తున్నాను. మీ టపాలోని మూల విషయానికి సంబంధించి నాకేమీ అభిప్రాయ భేదం లేదని గమనించగలరు.

.
>>కొన్ని నెలల క్రితం ఈనాడు ఆదివారం అనుబంధంలో…ఉన్నది అభిమానం. ఆ అభిమానం మనసుకు సంబంధించినది!<<

మీరు మరోసారి ఆ వ్యాసం చదవండి. నిజంగా వాళ్ళు భాషాభిమానంతో తెలుగు మాట్లాడుతున్నారా? వారు శ్రీలంకలో అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. ఎలుకల్ని తింటూ, పాములు ఆడించుకొంటూ ఉండడానికి ఇల్లు లేక ఊరూరూ తిరుగుతూ జీవనం కొనసాగిస్తున్నారు. వారు మాట్లాడే భాషని తెలుగంటారని కూడా వారికి తెలియదు.శ్రీలంక జనాభా లెక్కల్లో కూడా వీరిని తెలుగు వారని గుర్తించలేదు. ఏదో గిరిజన భాష మాట్లాడే  Nomadic tribe కింద లెక్కగట్టారు. ఏ భాష మాట్లాడుతున్నామో ఆ వ్యాసకర్త చెప్పేదాకా తెలియని ఆ భాషాభిమానం తమిళుల భాషాభిమానానికి భిన్నమైనదని నా ఉద్దేశ్యం.

చెన్నైలోనూ, తంజావూరు జిల్లా లోనూ, కోయంబత్తూరు లోనూ తెలుగు మాట్లాడే వాళ్ళుండడం చాలా సాధారణమైన విషయం. వారా భాష మాట్లాడకుండా కట్టడి చేసినవారెవరూ లేరు. కనుక వారికే ఉద్యమమూ అవసరం కాలేదు. మదురై నగరంలో వేలాది సౌరాష్ట్రీయుల కుటుంబాలున్నాయి. ఏ కాలంలోనో గుజరాత్ లోని కఛ్ ప్రాంతంనుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వారు సౌరాష్ట్ర భాష మాట్లాడుతారు. తమిళ సాంస్కృతిక రాజధాని ఐన మదురైలో వారు శతాబ్దాలుగా వారి భాష మాట్లాడుతూ నిశ్చింతగా బ్రతుకుతున్నారు. వారిని సౌరాష్ట్ర భాష మాట్లాడవద్దని ఎవరూ అనలేదు. తన  తల్లిని గౌరవించేవాడే ఎదుటి వాడి తల్లిని గౌరవించ గలడు. తమ భాషను ప్రాణంగా భావించే తమిళులు ఇతర భాషలను కూడా అలాగే గౌరవించారు.

>>ఈ ఆధునికులు, పైగాపొద్దస్తమానం పాశ్చాత్య సంస్కృతిలో, పాశ్చాత్య భాషలో వ్యవహారం సాగించే వాళ్ళు… ఇది ఏ ఉద్యమం తాలూకు ఫలితం?<<

ఇంటర్నెట్లో ఉత్తర భారతీయుల జులుం, అవహేళనలు సహించలేక తెలుగు యూజర్నెట్ గ్రూపు స్థాపనకు ఎంత  పోరాటం  జరిగిందో, ఎంత పెద్ద ఉద్యమం నడిచిందో ‘ఈమాట’ ఎడిటర్ సురేష్ కొలిచాల గారి స్మృతులు ఈ లంకెలో చదవండి. భారతీయ భాషల్లో యూజర్ నెట్ మొదటగా తెలుగు, తమిళ భాషల్లోనే ప్రారంభమయ్యాయని ఆయన వ్రాశారు.

ఏ ఉద్యమం నడవకుండా భాష బ్రతకదన్న విషయం గ్రహించాలి. గిడుగు వారి వ్యవహారిక భాషోద్యమం లేకుంటే బహుశ ఇప్పుడు తెలుగు సాహిత్యం రిఫరెన్సు లైబ్రరీల్లో మాత్రమే ఉండేది కాదా!

>>శ్రీలంక విషయం వచ్చినప్పుడల్లా, “శ్రీలంక భారతీయులు” అన్న పదం వినిపించదు. బహుశా శ్రీలంక తమిళులు తాము “భారతీయులు” అని చెప్పుకోవటం సిగ్గుచేటని భావిస్తారో ఏమో?<<

నిస్సందేహంగా! శ్రీలంక పౌరులు తమను భారతీయులమని చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా? శ్రీలంక తమిళులను ఇతర ప్రవాస భారతీయులతో పోల్చి మీరే పొరబడ్డారు. మీరనుకుంటున్నట్లు  వారు భారతపౌరులు కాదు. భారత పౌరసత్వమూ వారు కోరుకోవడం లేదు. వారు కోరేది తమ దేశం (శ్రీలంక)లో తమకు సమాన హక్కులు కావాలని మాత్రమే. వారు భారతపౌరసత్వమే కోరుకొనివుంటే ఇంత పోరాటం ఎందుకు. అందరూ తమిళనాడుకు వచ్చేయక పోయారా! బాంగ్లాదేశీయులనే రానిస్తున్న మనం వారిని అడ్డుకొంటామా?

శ్రీలంక పొమ్మంటే పోవడానికి వారు నిన్నమొన్న   కోబాల్ నేర్చుకొని  H1B వీసాలపై  వెళ్ళిన ఎన్నరైలు కాదు. వెయ్యి సంవత్సరాల పూర్వం రాజ రాజ చోళుడు  లంకను జయించి చోళ సామ్రాజ్యంలో కలిపేసుకున్నప్పటినుండి తమిళులు అక్కడ నివసిస్తున్నారు.(చూ. -“వికీ పీడియా” ). బ్రిటిష్ వారు తరలించుకొని వెళ్ళిన  తమిళులు దీనికి అదనం. తమ దేశంలోనే సహస్రాబ్దపు చరిత్ర ఉన్న భాషను నాశనం చేయాలనుకోవడం సింహళుల మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వానికి ఫలితమే ఇంత వినాశనం.

>>శ్రీకృష్ణదేవరాయలు. మనకు తెలిసిందే…’మేము ఓ కన్నడిగుని మీద అభిమానం చూపించాం, ఆదరించాం’ అన్నప్రచారం, పటాటోపం, ఆవగింజంత కూడా లేవు<<

ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో గమనించండి. ఆదరించేది ఎవరు? ఆదరణ పొందేది ఎవరు? గజపతులు, బహమనీ, బీజాపూర్ సుల్తానుల రాజ్యాలను వదిలేస్తే మొత్తం దక్షిణ భారతాన్నంతా(ఒరిస్సాతో కలిపి) సర్వం సహాధిపత్యంగా ఏలిన మహాచక్రవర్తి ని ఓ ప్రాంత ప్రజలు ఆదరించారని చెబుతారా లేక అంతటి మహా ప్రభువు  తెలుగువారిని ఆదరించాడని చెబుతారా! చూడబోతే తెలుగువారి దయమీదే రాయలవారు బ్రతికారన్నట్లుంది! ఆయన తెలుగు భాషను అభిమానించి ఆదరించాడు. అదే సమయంలో కన్నడ, తమిళ కవులు కూడా ఆయన ఆస్థానంలో ఉండేవారు. పెద్దనతో సమంగా వారికీ గౌరవాదరాలుండేవి. కన్నడ భాషీయులెవరినైనాఅడిగి చూడండి- రాయలు మావాడంటారో మీవాడంటారో. ఆయన ‘ఆంధ్ర భోజుడు’ మాత్రమే కాదు. ‘మూరు రాయర గండ’ కూడా.ఆయనను తెలుగువాళ్ళు ఆదరించడం కాదు, ఆయనే తెలుగువారిని ఆదరించాడు.

>>>ఓ పద్ధతి ప్రకారం తమిళులు కన్నడ రాజధానిలో వేళ్ళూనుకున్నారనిపిస్తుంది. ఇక్కడ ఏ (ప్రభుత్వ రంగ లేదా ప్రైవేటు) సంస్థలో అయినా, మేనేజర్లు అధికశాతం తమిళులు. వీళ్ళందరూ, నిజాయితీగా, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళేనా? … … … <<<

మీనుండి ఇంత  Biased వాదనను ఊహించలేదు నేను. బహుశ మీ స్వీయానుభవాలేవో ఇలాంటి దురభిప్రాయాన్ని కలిగించాయనుకొంటాను. కొంచెం కూల్ గా అలోచిస్తే మీ వాదనన వితండ వాదమని మీకే అనిపిస్తుంది. పనిచేయని తమిళులను టోకున ఉద్యోగాల్లో చేర్చుకొని ప్రమోషన్లిస్తూ  ఉండేంత లగ్జరీ ఈనాడు ఏ సంస్థకైనా (ప్రభుత్వ/ప్రైవేటు)ఉందనుకోను. నేనూ ఓ ప్రభుత్వ సంస్థలోనే పనిచేస్తున్నాను. నా భాషకారణంగా ఇంతవరకు ఒక్క ప్రయోజనమైనా కలుగలేదు నాకు- ఎందరో తమిళ బాసులక్రింద పనిచేసినా. కనీసం తమిళనాడుకు బదిలీ ఐనా ఇవ్వలేదు గత 14 ఏళ్ళుగా ఎంత అడిగినా (మీ టపా చూపించాలి వారికి – “చూడండ్రా మన ఐకమత్యం గురించి వాళ్ళెంత చెబుతున్నారో! కనీసం వారి మాట నిజం చేయడం కోసమైనా నాకు చెన్నైకి బదిలీ ఇవ్వండ్రా..” అని చెప్పాలి. ఏమైనా వర్కవుట్ అవుతుందేమో చూద్దాం 😉 ).

మీరు బెంగళూరులోనే ఉన్నారు కదా, ఒక సారి చుట్టుపట్ల విచారించి చూడండి. ఏ జాతీయులు ఎలా ఉన్నారో. తమిళులు మీరన్నట్లు ఉద్యోగాల్లో, చిన్న చిన్న వ్యాపారాల్లో ఉన్నారు. సగం బెంగళూరు నగరాన్ని రియల్ ఎస్టేట్ భూముల కింద కొనేసిందెవరో, బెంగళూరులో పెద్ద పెద్ద హోటళ్ళు ఎవరివో, రాజకీయాలు చేసేది ఎవరో, బెంగళూరు నగరంలో పెద్ద పెద్ద సివిల్ కాంట్రాక్టులు చేసేది ఎవరో ఒకసారి పరిశీలించండి. జగన్ బాబు మొదలుకొని మాచిత్తూరు జిల్లా రాజులు, నాయుళ్ళ వరకు అందరూ తెలుగు వాళ్ళే సార్! చాలా మంది తెలుగు మాట్లాడక పోవచ్చు. ఎందుకంటే మనకు బతుకు ముఖ్యం, భాషకాదు. తెలుగంటూ కూర్చుంటే కాసులు రాలవు. కర్ణాటక అసెంబ్లీలో తెలుగు మంత్రులెందరో , తమిళులెవరైనా ఉన్నారో ఒకసారి కనుక్కోండి. బెంగళూరులో ఒక పథకం ప్రకారం రాజకీయాలు చేస్తూ  పాతుకుపోయిందెవరో మీకే తెలుస్తుంది. బెంగళూరులో తమిళులు ఒక్కచోట ఉండడానికీ, వారి ఆవాసాల్లో ఇతరులను చేర్చకపోవడానికీ గల చారిత్రిక కారణాలు బహుశ మీకు తెలియవు. కావేరీ గొడవలప్పుడు ఇళ్ళు, వాకిళ్ళి వదిలేసి ప్రాణాలరచేత పట్టుకొని పారిపోయి వచ్చిన మా బంధువులు నాకు తెలుసు. కన్నడిగుల చేత మానభంగం కావింపబడి ఆత్మహత్యలు చేసుకొన్న తమిళ స్త్రీల కథలు నాకు తెలుసు. అంతెందుకు, నేను మైసూరు వచ్చిన కొత్తలో కావేరి అల్లర్లు జరిగాయి( సుప్రీం కోర్టు తీర్పు తరువాత). అప్పుడు మా ఇంటి ఓనరు (వాళ్ళు సింధీలు) మాకు సలహా ఇచ్చాడు.” మీరు తమిళులమని చెప్పుకోకండి. ఈ మండ్యా జనాలు మంచివాళ్ళు కాదు” అని. ‘వీళ్ళకు భయపడి రోజూ చస్తామా, ఠాట్ ‘ అని నేను పట్టించుకోలేదనుకోండి. అందరితో తమిళుణ్ణనే చెబుతాను. కానీ పిల్లలను వెంటేసుకుతిరిగే మా ఆవిడ పాపం అంత ధైర్యం చేయలేక పోయింది. తను అందరితో తెలుగువాళ్ళమని చెప్పుకుంటుంది. ఇంత అల్లర్లలోనూ తమిళనాడులో ఒక్క కన్నడ స్త్రీకైనా అవమానంజరిగిందని ఎవరినైనా చెప్పమనండి! భయపడుతూ బ్రతికేవారిని భయపెట్టే వారెందరో. సుబ్రహ్మణ్య భారతి  ఇలా నినదించాడు :

“అచ్చమిల్లై  అచ్చమిల్లై  అచ్చమెన్బదిల్లయే
ఇజ్జగత్తుళోరెల్లాం ఎదిర్తు నిన్డ్ర పోదిలుం
అచ్చమిల్లై అచ్చమిల్లై అచ్చమెన్బదిల్లయే”

(భయంలేదు .. భయంలేదు.. భయమన్నదె లేదులే
ఈ జగాన జనులెల్లరు ఎదురించి  నిలిచినప్పుడూ
భయం లేదు.. భయంలేదు.. భయమన్నదె లేదులే)

తన భాషకోసం, తన సంస్కృతికోసం ఎదురొడ్డి నిలిచిన ప్రతి తమిళుడి గుండెలోనూ స్ఫూర్తిని నిలిపేది పై మాటలే. తమను ద్వేషంతో చూసే జనులమధ్య బ్రతుకు తెరువుకై వచ్చి నివసిస్తున్నా తన భాషను, తన సంస్కృతిని మరచిపోకుండా, భయంతోనో, ధనార్జనకోసమో, ఇతర లాభాలకోసమో తన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టకుండా తలెత్తుకొని తిరిగే ప్రతి తమిళుడి గుండెలోనూ పై గీతం ప్రతిధ్వనిస్తుంది. అది బెంగుళూరైనా, బట్టికలోవా అయినా సరే.

>>ఇంత పెద్ద దేశంలో ఒక్క తమిళ నాడులో తప్ప, మరెక్కడా, తమ మాతృ దేశంలో అత్యధికులు మాట్లాడే హిందీ భాషపై తీవ్ర అసహనమూ, ఏవగింపూ కనబడదు.<<

నిజమా! మరైతే దక్షిణ భారత హిందీ ప్రచార సభ  కార్యాలయం చెన్నైలో ఎందుకుంది? సురక్షితమైన హైదరాబాద్ కు ఎప్పుడో తరలి పోవలసింది కదా? హిందీ వ్యతిరేక ఉద్యమాల్లో ఎప్పుడైనా ఆ కార్యాలయం మీద దాడి జరినట్లు గాని, దాన్ని తరలించాలని డిమాండు చేసినట్లు గానీ విన్నారా? తమిళుల వ్యతిరేకత భాషపై కాదు. భాషను దౌర్జన్యంగా రుద్దడం పైన. నేను ముందే చెప్పినట్లు తల్లిని గౌరవించేవాడు పరమాతను అగౌరవ పరచలేడు. తమిళులు ఎప్పుడూ ఇతర భాషలను చులకన చేయరు. భారతియార్ అంతటి మహాకవి కూడా పాట పాడితే సుందరమైన తెలుగు భాషలోనే పాడాలని ప్రశంసించాడు.

త్రిభాషా సూత్రాన్ని తుంగలో తొక్కి, కేంద్రం ఇక్కడ హిందీని రుద్దుతూ, ఉత్తర భారతంలో రెండు భాషలనే నేర్పుతూ, దక్షిణాది భాషలను ఒక పథకం ప్రకారం అణగదొక్కే కుటిల నీతికి వ్యతిరేకంగా మాత్రమే తమిళులు పోరాడుతున్నారు. చేతనైతే చేయి కలపండి. మన భాషా సంస్కృతులను నిలబెట్టుకొందాం రండి. లేదంటారా తమిళులను వారి మానాన వారిని వదిలేయండి. ఒకరు వారి తో పోల్చడం ఎందుకు? ఇతరులు దాన్ని తెగడుతూ పన్లో పనిగా తమిళులపై అభాండాలు వేయడం ఎందుకు? మన గీతను పెద్దది చేయడం కోసం పక్క గీత ను చిన్నది చేయడం తెలివైన పనే, కానీ సరియైన పని కాదు. తెలుగు వారి రాజీ ధోరణే ఉన్నతమైందని అందరూ అంగీకరిస్తే అందులో అభ్యంతరపెట్టవలసిందేదీ లేదు. కానీ అందుకోసం మమ్మల్నీ , మా భాషాభిమానాన్ని (మీ భాషలో దురభిమానం) కించ పరచకండి. మా భాష మాకు ఎంత ముఖ్యమో మీరు అర్థం చేసుకోలేరు. భారతిదాసన్ తన కవితలో అంటాడు:

“తమిழுక్కు అముదెండ్రు పేర్
అంద తమిழ் ఇన్బ త్తమిழ் ఎంగళ్ ఉయిరుక్కు నేర్
తమిழுక్కు నిలవెండ్రుమ్ పేర్
ఇన్బత్తమిழ் ఎంగళ్  సమూగత్తిన్ విళైవుక్కు నీర్…”

( తమిళానికి అమృతమని పేరు,
ఆ తమిళం, ఆ తీయని తమిళం, మాకు ప్రాణంతో సమానం.
తమిళానికి వెన్నెలనీ పేరు.
ఆ తీయని తమిళమే  మా తమిళజాతి అనే పంటకు నీరు)

మా భాష మాకు ప్రాణం, మా సంస్కృతికి జీవం. దానికి ఎవరు హాని తలపెట్టినా ఓర్చుకోలేనితనం మా జీన్సు లో ప్రోగ్రాం అయిపోయింది. మమ్మల్నలా వదిలేయండి.

ప్రకటనలు
13 వ్యాఖ్యలు
 1. krishna permalink
  25 మే, 2009 12:43 ఉద.

  అధ్భుతం గా వ్రాసారు.

 2. వికటకవి permalink
  25 మే, 2009 3:11 ఉద.

  వాదోపవాదాలెలా ఉన్నా చాలా తెలియని విషయాలు తెలియచెప్పారు. సంతోషం.

 3. 25 మే, 2009 10:32 ఉద.

  భాషోద్యమ చరిత్రలు, అదీ ముఖ్యంగా ద్రవిడ భాషోద్యమ చరిత్ర తెలియకుండా రవిగారు తమ అనుభవంలోంచీ కొన్ని గుళికల్ని జెనరలైజ్ చేసి వదలటం వలన కొంత “అతి” గా అనిపించుండొచ్చు. మీ టపా విషయపరంగా చాలా బలంగా ఉంది. అభినందనలు.

 4. vinay chakravarthi permalink
  25 మే, 2009 10:33 ఉద.

  nenu chennai lo 2 years vunnanu nenu asalu prob face cheyaledu.but telugu vaallalku vallante enduko chinna chhopu…..naku telisi inka south indialo traditions fallow avutunna state tamilnadu matrame………

 5. 25 మే, 2009 11:15 ఉద.

  వినయ్ చక్రవరిగారూ! కేరళను మర్చిపోకండి. దక్షిణ భారతదేశంలో తమ సంస్కృతికి అతి దూరంగా ఉండేది మన తెలుగోళ్ళే. కాబట్టి అందరికన్నా చిన్నచూపు మనమీద మనకే.

 6. 25 మే, 2009 12:01 సా.

  చంద్రమోహన్ గారు,

  మీకు సమాధానం చెబుతాను. (కాస్త నిదానంగా). అంతకంటే ముందు (వీలయితే ఈ రాత్రికి. ఇప్పుడు ఆఫీసులో మెయిల్ అవకాశం లేదు.) మీకు ఓ వేగు పంపుతున్నాను. దయచేసి చదవండి.

 7. 25 మే, 2009 1:59 సా.

  భాషపై జరుగుతున్న చర్చకు మంచి వ్యాసాన్ని చేర్చారు, చంద్రమోహన్ గారూ.

  తెలుగుకు పటంగట్టి, ఇంగ్లీషుకు పట్టం గట్టే తెలుగువాడి తెలివిలేమి గురించి ఇదివరలో ఎక్కడో చదివాను.. తెలుగువాళ్ళం కళ్ళజోడు పెట్టుకోని పోజులు కొడుతూ, అసలు కళ్ళు లేకపోయినా పర్లేదనుకుంటున్నామట.

  “మా భాష మాకు ప్రాణం, మా సంస్కృతికి జీవం. దానికి ఎవరు హాని తలపెట్టినా ఓర్చుకోలేనితనం మా జీన్సు లో ప్రోగ్రాం అయిపోయింది. ” -ఈ వాక్యం నుంచి తెలుగువాడు చాలా నేర్చుకోవాలి.

  శ్రీకృష్ణ దేవరాయలను తెలుగువారు ఆదరించడం కాదు, ఆయనే తెలుగువారిని ఆదరించాడు, అని అన్నారు, కానీ అది నిజం కాదేమో. రాయలు తన ప్రజల్ని తెలుగువాళ్ళా కన్నడిగులా అని చూడకుండా ఆదరించాడు, నిజమే. ఆయన చూపిన ఆదరణ ఆయనతోటే పోయింది. కానీ తెలుగువాడు రాయలను ఈనాటికీ ఆదరిస్తున్నాడు. ఇంకోటి.. రాయలు తెలుగు భాషకు చేసిన సేవే ఆయన్ని ఈనాటికీ తెలుగువాడి గుండెల్లో నిలిపింది. తెలుగువాడు రాయలకు ఋణపడిపోయాడు. అందుకే తెలుగువాడు రాయలను సొంతం చేసేసుకున్నాడు.

 8. 25 మే, 2009 7:09 సా.

  “నిజంగా వాళ్ళు భాషాభిమానంతో తెలుగు మాట్లాడుతున్నారా? వారు శ్రీలంకలో అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు.”
  పలానా విధంగానే భాషాభిమానం ఉండాలని మీరెలా అనుకుంటారు?
  వాళ్ళు మాట్లాడేదాన్ని ఇన్నాళ్ళుగా కాపాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళకు వాళ్ళు మాట్లాడేది తెలుగు అని తెలియకపోయినంత మాత్రానా వాళ్ళ భాషాభిమానం తక్కువా?

  “నిజమా! మరైతే దక్షిణ భారత హిందీ ప్రచార సభ కార్యాలయం చెన్నైలో ఎందుకుంది”
  పై స్టేట్మెంట్ ఎలా ఉందంటే భారతదేశంలో ఒక దళితుడు ప్రెసిడెంట్ కూడా కాగలిగాడు. కాబట్టి అక్కడ వివక్షత వేళ్ళతో సహా పెకిలించబడింది అన్నట్లుగా ఉంది.
  వాళ్ళు హిందీని అధికార భాషగా ఎందుకు ఒప్పుకోలేకపోయారు? ఇది అసహనం వ్యక్తం చేయటం కాదా? కేంద్రం ఉత్తరాది వాళ్ళకు ఒక దక్షిణాది భాష నేర్చుకునేలా చెయ్యాలని అంటున్నారా. అప్పుడు ఈ దేశంలో ఇంకెంత అసహనం చెలరేగేదో ఊహించగలరా?
  ” నిస్సందేహంగా! శ్రీలంక పౌరులు తమను భారతీయులమని చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా”
  నాకు తెలిసి రవిగారి ఉద్దేశ్యం ఏంటంటే ఇంకో దేశానికి వెళ్ళేటప్పుడు ముందుగా మనం భారతీయులం అని చెప్పుకుంటాం. ఆ తరువాతే మనం ఏ రాష్ట్ర ప్రజలమో చెప్పుకుంటాం. ఇక్కడ శ్రీలంకకు వెళ్ళినవాళ్ళని భారతీయులు అనకుండా తమిళులు అంటున్నారని అన్నారు.
  మహేశ్‌గారు చెప్పినట్లు రవిగారి వ్యాసం biased గా ఉంది. అందులో ఉన్న చాలా అపోహలను తొలగించటానికి ప్రయత్నించారు. కానీ మీది వేరే extremeకి వెళ్ళిపోయిందని నాకనిపించింది….కొన్నైతే మరీనూ..తమిళ స్త్రీలు మానభంగం చేయబడటం లాంటివి.

 9. 25 మే, 2009 11:12 సా.

  కృష్ణ గారు, వినయ్ గారు , వికటకవి గారు

  నెనర్లు.

  వికటకవి గారు
  మీ ప్రొఫైల్ ఫోటో ‘Little Prince’ ది కదా?

  మహేష్ గారూ,
  మీ వ్యాఖ్య నాకు ఆనందం కలిగించింది. నెనర్లు.

  చదువరి గారూ,
  నెనర్లు. నిజానికి ఈ ఆదరించడం అన్న మాట ఇక్కడ నప్పలేదు. ఆదరం అన్నది పెద్దలకు చిన్నవారి పట్ల, లేక సమవర్తుల మధ్య ఉండేది. ప్రజలు ప్రభువు పట్ల చూపేది ఆదరం కాదు, అభిమానం, గౌరవం. ఆ ఉద్దేశ్యంతోనే నేనలా చెప్పాను. నిజానికి త్యాగరాజును కూడా తమిళులేదో ప్రత్యేకంగా ఆదరించారని నేననుకోను. వారభిమానించేది కర్ణాటక సంగీతాన్ని. దాన్ని అందించిన వారందరినీ గౌరవించారు- అది త్యాగరాజైనా, పురందర దాసైనా, స్వాతి తిరునాళ్ ఐనా, మైసూర్ వాసుదేవన్ ఐనా. మొన్నటికి మొన్న ఆంధ్ర దేశంపై అలిగి చెన్నైలో స్థిర పడిన మంగళం పల్లి బాల మురళీ కృష్ణ ఐనా సరే. త్యాగరాజుపై ఏదో ప్రత్యేక ఆదరం చూపినట్లు నాకైతే అనిపించదు.

  మళ్ళీ విషయానికొస్తే, తెలుగుభాష అభివృధ్ధికి ఎనలేని సేవ చేసిన వారిలో రాయలు మొదటి వారైతే నా అభిప్రాయంలో సి.పి. బ్రౌన్ రెండవ స్థానంలో ఉంటాడు. మరి అతని పట్ల చూపిన ఆదరం ఎటువంటిది? కడపలో బ్రౌన్ స్మారక చిహ్నాలు శిధిలమైపోతుంటే చూడలేక శ్రీ జానుమద్ది హనుమచ్ఛాస్త్రి గారు కల్పించుకొని స్వంతంగా నిధులు సేకరించి కొన్నింటిని పునరుధ్ధరించారు. చరిత్ర ప్రసిధ్ధులను అందరూ మావాడంటే మావాడనుకోవడం మామూలే. ఈ మధ్య ఓ కులంవారు రాయలు అసలు మాకులంవాడేనంటూ ఒక వాదన లేవదీశారు కూడాను!

  భవాని గారూ,

  మీరడిన ప్రశ్నలన్నింటికీ జవాబులు నా టపాలోనే ఉన్నాయి. చర్విత చర్వణంగా మళ్ళీ ఆ విషయాలను చర్చించాలనుకోవడం లేదు నేను. ఇక Extreme అంటారా, నిజమేనేమో! చదివిన వారే జడ్జి చేయాలి. ‘తమిళ స్త్రీల మానభంగాలు ‘ — అందులో అతిశయోక్తులేమీ లేవు. మీకు కావాలంటే Specific Instances ఆధారాలతో సహా ఇవ్వగలను.

 10. rayraj permalink
  26 మే, 2009 6:03 సా.

  “మా భాష మాకు ప్రాణం, మా సంస్కృతికి జీవం. దానికి ఎవరు హాని తలపెట్టినా ఓర్చుకోలేనితనం మా జీన్సు లో ప్రోగ్రాం అయిపోయింది. ” -ఈ వాక్యం నుంచి తెలుగువాడు చాలా నేర్చుకోవాలి.

  నా కైతే కళ్ళల్లో నీళ్లొచ్చాయి; గుండె పిండేశారు.

  తమిళుడివైనా ఇంత చక్కటి తెలుగు!ఇంకా బాగా నచ్చింది.

  As long as this feeling is there : Accamillai

 11. rayraj permalink
  27 మే, 2009 8:13 సా.

  తెలుగు గురించి జనాల అభిప్రాయాలని సర్వే చేసే ఉద్దేశ్యంలో ఓ ప్రైమరీ ట్రైల్ వేస్తున్నాం.

  విజయ్ మాధవ్ అనే ఔత్సాహిక యువకుడు ఇందుకు సహాయంగా, ఇమ్మిడియట్ గా తన బ్లాగ్ లో ఈ సర్వే పెట్టారు. చంద్రిమ పాఠకులందరికి, త్వరగా ఇక్కడ ఓ చిన్న ఆఫ్షన్ సెలెక్ట్ చేసి, పుణ్యం కట్టుకోమని మనవి.

  http://vijayamadhava.blogspot.com/2009/05/rayray.html

 12. 29 జనవరి, 2010 4:32 సా.

  sir,ur blog is good and loving.thanks for ur love on languages.

 13. mvnag permalink
  14 మే, 2010 11:48 సా.

  oh superb ga undi mee vyaasam

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: