Skip to content

భాషలతో ఒక రోజు

1 జూన్, 2009

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసే ప్రతిచోటా టోలిక్ (TOLIC – Town Official Language Implementation Committee) అనే సమితి ఉంటుంది. ఆ పట్టణంలో ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, జాతీయ బ్యాంకులు అందులో సభ్యులు.ఊళ్ళోని ఏదో ఒక పెద్ద సంస్థ టోలిక్ కు అధ్యక్షత వహిస్తుంది.ఈ TOLIC ను హిందీలో నరాకాస్ అంటారు – ‘నగర రాజ్ భాషా కార్యాన్వయన్ సమితి’ అన్న మాట. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ రాజభాష ఐన హిందీ ని ఎంతవరకు అమలు చేస్తున్నాయో రివ్యూ చేసి పార్లమెంటుకు రిపోర్టు చేయడం, హిందీ అమలుకు సూచనలివ్వడం ఈ సమితి పనులు. మైసూరులో భారతీయ భాషా సంస్థాన్ (Central Institute of Indian Languages – CIIL) ఈ సమితి కి అధ్యక్షత వహిస్తుంది. మా కార్యాలయంలో ఈ రాజభాషా అమలు సమన్వయకుడి పదవి నాది (Official Language Coordinator). ఆ బాధ్యతల రీత్యా నేను నెలకోసారి భారతీయ భాషా సంస్థాన్ కు వెళ్ళవలసి వస్తుంది.

గత సోమవారం మధ్యాహ్నం సమావేశానికి CIIL నుండి పిలుపు వచ్చింది . ఆ ముందురోజే బ్లాగుల్లో భాషా చర్చలతో బుర్ర వేడెక్కి ఉండడాన ఆఫీసులో కూడా అవే అలోచనలతో ఉన్న నాకు అదేరోజు భాషల నిలయానికి వెళ్ళవలసి రావడం యాదృచ్ఛికమే ఐనా ఆలోచనలనుండి కొంత విముక్తి కలుగుతుందనే ఉద్దేశ్యంతో ఎగ్గొట్టకుండా వెళ్ళాను. హిందీ అమలు గురించి చర్చలు జరుగుతున్నాయి. అన్యమనస్కంగా ఉన్ననాకు పెద్దగా తలకెక్కడం లేదు. సభాధ్యక్షత వహించిన ప్రొఫెసర్ రాజేష్ సచ్ దేవ , CIIL ఉప సంచాలకులు, ఈ విషయం గమనించినట్లు నాకప్పుడు తెలియలేదు. సమావేశం ముగిసిన తరువాత దగ్గరకు పిలిచి అడిగారు – ” ఇక్కడ లేవు నువ్వు ఏమిటి సంగతి?” అని. ఎలాగూ అడిగారు కదా అని భాష గురించి నాక్కొన్ని ప్రశ్నలున్నాయని చెప్పాను. ఆయన కూడా కొంత తీరిగ్గా ఉండడంతో కాసేపు వివరంగా మాట్లాడారు మా సంభాషణలో ఆయన చెప్పిన సంగతులు, యథాతథంగా కాకుండా, నా మాటల్లో క్రింద వ్రాస్తున్నా:

అసలు అధికార భాషంటే ఏమిటి అన్న దానికి సచ్ దేవ గారి వివరణ:

అధికార భాష అన్నది మూడు రకాలు:

1. Legislative Official Language : పరిపాలనా సౌలభ్యం కోసం శాసన పూర్వకంగా ప్రభుత్వం అదేశించిన అధికార భాష. మన దేశంలో హిందీ లాగా.

2. Symbolic Official Language : ప్రభుత్వం లాంఛనంగా ప్రకటించిన అధికార భాష, ఆంధ్ర ప్రదేశ్ లో ఉర్దూ లాగా, పాండిచ్చేరిలో ఫ్రెంచి లాగా – ఒక వర్గాన్ని సంతోష పరచడంకోసం ఒక భాషను అధికారభాషగా లాంఛనంగా ప్రకటిస్తారు గానీ నిజానికి ఆ భాషలో అధికారిక కార్య కలాపాలేవీ జరగవు.

౩. Working Official Language : ఇది ఎవరైతే అధికారిక కార్య కలాపాలు నిర్వహిస్తారో వారికి అనువుగా ఉండే భాష అన్నమాట. మన దేశంలో ఆంగ్ల భాష లాగా. ఎవరు అవునన్నా కాదన్నా చివరికి ఆ భాషలోనే అన్ని అధికారిక పత్రాలూ వెలువడుతాయి.

ఈ మూడు రకాల అధికార భాషలూ ఏ దేశంలో నైతే ఒకే భాషగా ఉంటుందో అది భాషా పరంగా ఎంతో సౌలభ్యం ఉన్న దేశం అన్నమాట. చాలా వరకు ఐరోపా దేశాలు,అమెరికా(ఉత్తర,దక్షిణ), చైనా, తూర్పు ఆసియా దేశాలు, అరబ్బు దేశాలు ఈ కోవలోకి వస్తాయి.

ఆఫ్రికాలో లాంఛనంగా ప్రతి దేశానికీ ఓ అధికార భాష ఉంటుంది కానీ, నిజానికి దైనందిన కార్యకలాపాలన్నీ ఆంగ్లంలోనో, ఫ్రెంచిభాషలోనో జరుగుతాయి. అక్కడ సామాన్య ప్రజలకు , పాలనాధికారులకు మధ్య భాష పెద్ద అంతరాన్నే సృష్టిస్తుంది.

ఇక మూడవ దానికి ఉదాహరణ మనదేశమే. అనేక భాషా సంస్కృతులకు నిలయమైన మన దేశంలో ఆంగ్లం అప్రకటిత అధికార భాషగా స్థిరపడిపోయింది. రాజ్యాంగంలో కేవలం కొంతకాలం పాటు , హిందీ అధికార భాషగా నిలద్రొక్కుకొనేంత వరకు ఒక ‘లింక్ లాంగ్వేజ్’ గా వాడమని చెప్పిన భాష ఈనాడు తొలగించ వీలుకాని దశకు చేరుకొంది.

హిందీ భాష రాజ భాషగా ఎందుకు ఇంకా నిలద్రొక్కుకోలేదు అన్నదానికి ఆయన విశ్లేషణ ఇది:

హిందీని అధికార భాషగా పెట్టినప్పుడు పెద్దలకు తెలుసు. ఇతర భారతీయ భాషలు హిందీకంటే ఉన్నత స్థాయిలో ఉన్నాయని, ఆయా భాషల ప్రజలు అంత తొందరగా హిందీని అంగీకరించరనీ. ఇతర భారతీయ భాషలన్నింటినుండీ పదాలను స్వీకరించి కలుపుకుంటూ హిందీ ఒక కొత్త భారతీయ భాష, భారతీయులందరి భాషగా అవతరించాలని ఆశ్వాసించారు. కానీ వాస్తవంలో జరిగింది వేరు. ఇతర భారతీయ భాషలనుండి చెప్పుకోదగ్గ సంఖ్యలో పదాలేవీ హిందీలో చేరలేదు. దానితో బాటే ఆ భాష కొన్ని భాషల ప్రజలను చేరలేదు. ప్రభుత్వం గత యాభై యేళ్ళుగా హిందీని ఒక సర్వశక్తిమంతమైన భాషగా అభివృధ్ధి పరచడంలో విఫలమైంది. నేటికి కూడా ఒక ఇంజనీరింగ్ గానీ వైద్య శాస్త్రంగానీ హిందీలో చదవగలిగే అవకాశంలేదు. ఎందుకూ పనికిరాని జాతీయ భాషను ఎవరైనా ఎందుకు పనిగట్టుకొని నేర్చుకొంటారు? చైనా, ఇజ్రాయెల్, కొరియా, చివరికి మన చుట్టుప్రక్కలున్న సింహళం, థాయ్ లాంటి భాషలు కూడా హిందీకంటే అభివృధ్ధి చెందాయి.

హిందీ అమలుకు నియుక్తమైన కమిటీలన్నీ, “అన్ని భారతీయ భాషా పదాలనూ” అన్న రాజ్యాంగ కర్తల మాటలను ప్రక్కన పెట్టేశారు. ‘జనని సంస్కృతమ్ము సకలభాషలకును’ అన్న సూక్తిని గుర్తుకు తెచ్చుకొని సంస్కృత పదాలను కలిపేస్తే, అన్ని భాషల పదాలను కలిపేసినట్టే కదా అని అతితెలివిగా అలోచించి బోలెడన్ని సంస్కృత పదాలను హిందీలోకి తరలించేశారు (అంటే రాజభాష ఐన హిందీ అన్నమాట). అయ్యవారిని చేయబోతే కోతి అయిందన్న సామెతగా అలా కృత్రిమంగా తయారైన రాజభాష, అటు హిందీ మాతృభాషగా కలవారికీ మింగుడు పడక, అటు హిందీయేతర జనుల మన్ననలూ పొందక రెండికీ చెడింది. ఉదాహరణకు కొన్ని హిందీ పదాలు, హిందీ మాతృభాషగా కలవారు ఉపయోగించేవి-రాజభాషా నిఘంటువులు చెప్పేవి:

ప్రజా వ్యవహారంలోని హిందీ———-రాజభాష (శుధ్ధ్‌ హిందీ)———–తెలుగు మాట

ఇంత్ జామ్ కర్నా ——————-ప్రబంధ్ కర్నా———————-సిధ్ధం చేయడం (prepare)
ఇంత్ జార్ కర్నా———————ప్రతీక్షా కర్నా———————–వేచి ఉండడం (wait)
ఔర్——————————— ఏవం —————————–మరియు (and)
మగర్——————————–పరంతు————————– కానీ (but)
కార్ఖానా——————————సంయంత్ర్————————కర్మాగారం (plant/ factory)

ఇలా ఎన్నో. ఈ రెండవ నిలువు వరుస లోని హిందీ భాషను హిందీరాష్ట్రాల్లో వారెవ్వరూ వారి దైనందిక వ్యవహారంలో గానీ, సాహిత్య సృష్టిలో గానీ వాడరు. అది కేవలం ప్రభుత్వ పత్రాలకే పరిమితం ఐపోయిన ఒక కృతక భాష. ఇతర భాషీయులకు కొంత సులభమైనా వారు ఈ భాష నేర్చుకొన్నందువలన అదనపు ప్రయోజనం ఏమీ లేదు. పైగా ఉత్తరాదిలో ఆ రెండో వరుసలోని భాషను వాడితే వాడు హిందీయేతర జాతీయుడని రూఢిగా తెలిసిపోతుంది. వాళ్ళు నవ్వుకోవడానికితప్ప అనుకున్న విషయాన్ని వ్యక్తీకరించడానికి ఆ భాష పనికిరాదు. అలా మన రాజ భాష, రాజ భాషగానే మిగిలిపోయింది గానీ ప్రజలకు , వింధ్యకు రెండువైపులనున్నవారికీ, చేరువకాలేక పోయింది.

ఐనా హిందీ భాష పెరుగుతోంది. భాషాభివృధ్ధికి చేపట్టిన ప్రభుత్వ ప్రాజెక్టులన్నీ వాటి లక్ష్యాలను అందుకోలేక పోయినా సరే, హిందీ భాష విస్తరిస్తోంది. 2001 జనగణన వివరాల ప్రకారం దేశంలో 40% ప్రజలకు హిందీ మాతృభాష ఐతే మరో 25% మంది హిందీని ద్వితీయ భాషగా వాడుతున్నారు. కనీసం మరో పది శాతం ప్రజలకు హిందీలో కనీస పరిజ్ఞానం ఉంది. మరి ఈ విస్తరణ ఎలా జరిగింది? బాలీవుడ్ వలన, హిందీ టీవీ ఛానెళ్ళ వలన! ఎందుకంటే అవి ప్రజల భాష మాట్లాడాయి. బలవంతపు శాసనాల ద్వారా కాక, సాంస్కృతిక సంబంధాలద్వారా ప్రజలకు దగ్గరయ్యింది. ఈనాడు టివీ ఛానెళ్ళలో సీరియళ్ళు చూస్తూనే దక్షిణ భారత మహిళలు హిందీ నేర్చుకొంటున్నారు. అందుకు ఉదాహరణగా ఆయన ఒక సన్నివేశాన్ని వివరించారు – సచ్ దేవా గారు కన్నడ భాషావాది ఐన ప్రముఖ కన్నడ రచయిత లింగదేవరు హళెమనె గారి యింటికి వెళ్ళినప్పుడు ఆయనతో ఆయన కూతురు దెబ్బలాడుతోందట. ‘ టివీలో నేను హిందీ కార్యక్రమాలే చూస్తాను, కన్నడ కార్యక్రమాలొద్దు’ అని. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో తన యీడు పిల్లలందరూ హిందీ సీరియళ్ళ గురించే చర్చించుకొంటారట. అవి చూడకపోతే స్నేహితులతో మాట్లాడుకోవడానికి కామన్ విషయం దొరకదట. ఇలాంటి సామాజిక అవసరాలే భాషాభివృధ్ధికి దోహదం చేస్తాయి గానీ, శాసనాల ఒత్తిడులు కావని చెప్పారు.

ఆయన ఇంకో ఉదాహరణ కూడా చెప్పారు – ఆ మధ్య ఆయన తమిళనాడులో UGC వారి సమావేశంలో పాల్గొన్నప్పుడు అక్కడున్న ప్రొఫెసర్లలో ఎంతమందికి హిందీ వచ్చని అడిగారట. 22 మందిలో ముగ్గురు మాత్రమే తమకు హిందీ వచ్చని చెప్పారట. వారిలో ఎందరు తమ పిల్లలకు హిందీ నేర్పాలనుకుంటున్నారని అడిగారట. అందరూ చెయ్యెత్తడమే కాదు, తమ పిల్లలకు ఇప్పటికే హిందీలో ప్రవేశం ఉందని అందరూ చెప్పారట. తమిళనాడులో కూడా హిందీ పట్ల తగ్గుతున్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని అన్నారు.

మరి చిన్నభాషలు ప్రమాదంలో పడవా? అని అడిగాను నేను. CIIL, భాషల ఆస్పత్రి వంటిదనీ, అక్కడ ప్రతియేటా ఎన్నో భాషల చావులు చూస్తామనీ చెప్పారు. మానవ పరిణామ క్రమంలో భాషల పుట్టడం, అంతరించడం సహజ పరిణామమనీ, అందులో మనం పెద్దగా చేయగలిందేమీ లేదనీ ఆయన అభిప్రాయం. కోయ, చెంచు వంటి గిరిజన భాషలు మాట్లాడే వారు, బ్రతుకు తెరువుకోసం, వారుంటున్న రాష్ట్రపు భాషను నేర్చుకోవడం, రాష్ట్రపు భాషను మాట్లాడే వారు, మరింత మొబిలిటీ కోసం హిందీ నేర్చుకోవడం, హిందీ మాట్లాడే వారు మంచి ఉద్యోగావకాశాలకోసం ఆంగ్లం నేర్చుకోవడం, కొన్ని తరాల తరువాత తమ వారసత్వపు భాషలకు దూరమైపోవడం మామూలే. అలా కాకుండా ఉండాలంటే వారికి తమ భాషను మర్చిపోకుండా ఉండేందుకు, అదనపు శ్రమ వెచ్చించి నేర్చుకొనేందుకు ఏదో ఒక incentive కావాలి. అవి ఆర్థిక కారణాలు కావచ్చు, సాంస్కృతిక కారణాలు కావచ్చు, బలమైన కారణం ఉండడం ముఖ్యం. అలాంటి కారణాన్ని సాహిత్యమో, కళలో ఇవ్వగలవు. అందుకోసమే తమ తమ సాహిత్యాన్ని రక్షించుకోవడం సమాజాలకు ముఖ్యం.

అనునిత్యం భాషలకోసం పరిశ్రమించే ఒక విద్యావేత్తతో కొంతసేపు మాట్లాడడం మనసును తేలిక పరచింది. కానీ ఆయన మాటల్లో భాషల భవితవ్యం గురించి ఒక ఆశావహ దృక్పథం కనిపించక పోవడం కొంత నిరాశను కలిగించింది.

తరువాత, అక్కడే క్లాసికల్ తెలుగు విభాగాన్ని చూస్తున్న శ్రీ కందాళం శ్రీనివాసాచార్య గారిని కలిసి మాట్లాడాను. తమిళ విభాగాధిపతి శ్రీ తొల్కాప్పియన్ గారిని కూడా కలుసుకొన్నాను. ఆ సంభాషణలు కూడా భాషల భవితవ్యం పట్ల ఆశను కలిగించేలా లేవు.

అలా నా రోజంతా భాషలమధ్య గడిచింది.

ప్రకటనలు
14 వ్యాఖ్యలు
 1. 1 జూన్, 2009 5:26 సా.

  ఆ మిగిలిన సంభాషనలు కూడా మాతో పంచుకోండి.

 2. 1 జూన్, 2009 10:24 సా.

  చంద్రమోహన్ గారు,

  చాలామంచి విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  అయితే ఒక విషయం ఆశ్చర్యం కలిగించింది:
  “ఇతర భారతీయ భాషలన్నింటినుండీ పదాలను స్వీకరించి కలుపుకుంటూ హిందీ ఒక కొత్త భారతీయ భాష, భారతీయులందరి భాషగా అవతరించాలని ఆశ్వాసించారు.”

  ఇది సాధ్యమని భాషా శాస్త్రవేత్తలు అనుకున్నారా అని ఆశ్చర్యం. నిజాయితీగానే ఇది అనుకున్నారా లేదా హిందీని జాతీయభాషగా అంగీకరింప చెయ్యడానికి ఇదొక సాకుగానే చెప్పారా అన్న అనుమానం వచ్చింది.

  “అలా కాకుండా ఉండాలంటే వారికి తమ భాషను మర్చిపోకుండా ఉండేందుకు, అదనపు శ్రమ వెచ్చించి నేర్చుకొనేందుకు ఏదో ఒక ఇంచెంతివె కావాలి. అది ఆర్థిక కారణాలు కావచ్చు, సాంస్కృతిక కారణాలు కావచ్చు, బలమైన కారణం ఉండడం ముఖ్యం. అలాంటి కారణాన్ని సాహిత్యమో, కళలో ఇవ్వగలవు. అందుకోసమే తమ తమ సాహిత్యాన్ని రక్షించుకోవడం సమాజాలకు ముఖ్యం.”

  నా మనసులోని ఆలోచనలు యథాతథంగా ఇక్కడ చూసి ఆనందించాను.

 3. 2 జూన్, 2009 9:55 ఉద.

  చాలా బావుంది. ఇంకా మీ అనుభవాలను పంచుకోగలరు.

  మీరు చెప్పిన రాజభాష హిందీ- ఈ విషయంలో మీతో విభేదించను. అయితే, మీరు ఉటంకించిన రెండవ కాలంలో పదాలు దైనందిన జీవితంలో, సాహిత్య సృష్టిలో ఎవరూ వాడరు అని మీరన్నారు. అలాంటి పదాలు వాడే ఉత్తర ప్రదేశ్ బ్రాహ్మణులను నేను చూశాను. ఇది వరకు నేను పని చేసే ఓ ప్రభుత్వ సంస్థలో ఒకాయన (ద్వివేది అనుకుంటాను), ఏవం, పరంతు, ప్రతీక్షా కర్ నా ..ఇలాంటివి వాడేవాడు. ఇంకా వైమానికీయ, తక్నీకీ వంటి శబ్దాలూనూ. అదీ మమూలుగా ఆఫీసులో దొర్లే సంభాషణల్లో. వాజపాయ్ కూడా మన పార్లమెంట్ లో ఇలానే మాట్లాడేవాడనుకుంటాను.

 4. చంద్ర మోహన్ permalink
  2 జూన్, 2009 10:36 సా.

  కిరణ్ గారు,
  పంచుకోవాలనే అనుకొంటున్నాను.

  కామేశ్వర రావు గారు,
  “నా మనసులోని ఆలోచనలు యథాతథంగా ఇక్కడ ..”
  wise men think alike 🙂

  ఈ కృతక హిందీ అలోచన భాషా శాస్త్రజ్ఞులది కాదండీ, రాజ్యాంగాన్ని రచించిన రాజకీయ వేత్తలది. ఎవరి పని వారు చేసి ఉంటే అసలింత గొడవ ఉండేది కాదేమో!

  రవి గారు,

  “ప్రభుత్వ సంస్థలో ఒకాయన…” – కీలకమంతా అందులోనే ఉంది. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేవారికి ఈ ‘శుధ్ధ హిందీ’ వద్దన్నా వచ్చేస్తుంది. అదీ గాక ఈ హిందీలోని సంస్కృత పదాల ఉధ్ధతి వలన బ్రాహ్మణ వర్గాలు కొంత దీని వైపు మొగ్గు చూపించి ఉండ వచ్చేమో (నా ఊహ మాత్రమే). కానీ సాహిత్యంలో మాత్రం ఈ హిందీ ఉందన్నది అనుమానమే. నేనైతే చూడలేదు.

 5. rayraj permalink
  3 జూన్, 2009 12:54 సా.

  “అలాంటి కారణాన్ని సాహిత్యమో, కళలో ఇవ్వగలవు” – అన్నది కొంతవరకే నిజం. నాకిష్టమైన తెలుగు సినిమా నిలవడానికి కూడా, ముందు “తెలుగు” ఉండాలిగా అన్న అవసరం వచ్చింది. అందుకని, “తెలుగు” భాష గురించి నేను చర్చిస్తున్నది.మొన్నోసారి కామేశ్వరరావుగారిని పద్యం వల్ల తెలుగు నిలుస్తుందని అనుకుంటున్నారా అంటే “కాదు” అన్నారు. అప్పటి నా ఉద్దేశ్యం కూడా – ఉత్తి పద్యం అని కాదు. పద్యం స్టాండ్స్ ఫర్ సాహిత్యం అన్నమాట. సాహిత్యం , కళ అన్నాక – ఏదో ఒకటి పట్టుకుంటాం; కళలో నేను పట్టుకున్నది సినిమా. జన బాహుళ్యంలో ఉండేవి కాబట్టి “వీటివల్ల” అనుకుంటున్నారు గానీ, ఇంకా జెనిరిక్ రీజన్ కి వెళ్తే – “భాషలో ఎదగని ఆలోచనల వల్ల అవి ప్రమాదంలో ఉన్నాయ”ని అనుకుంటున్నాను.ఇవ్వాళే మీ పోస్టు చూస్తున్నాను. నిన్న “స్టాండర్డైజేషనే అసలు శతృవు!?” అని పోస్టు వేశాను.నా భావం సుమారుగా మీరు చెప్పిన రెండో కాలం లాంటి విఫల యత్నాలవల్లే పుట్టింది.ఐనా ఈ భాషలు చచ్చిపోతే వస్తే నష్టం ఏంటి!? అందరం ఇంగ్లీషు వాడితే నష్టం ఏంటి!?

 6. 3 జూన్, 2009 1:26 సా.

  హ్మ్మ్ ఆసక్తికరం.

 7. 3 జూన్, 2009 9:09 సా.

  రేరాజుగారు,

  “ఈ భాషలు చచ్చిపోతే వస్తే నష్టం ఏంటి!? అందరం ఇంగ్లీషు వాడితే నష్టం ఏంటి!?”

  సరిగ్గా ఇదే ప్రశ్న నేను మొదట్నుంచీ అడుగుతున్నాను. దీనికి మీరిచ్చిన సమాధానం (నాకర్థవైనంతలో) “నేను తెలుగువాణ్ణి కాబట్టి తెలుగు భాష బతకాలనుకుంటున్నాను” అని. “తెలుగువాడు” అనే ఐడెంటిటీ (అస్తిత్వం) మీకు ఎలా వస్తోంది అన్నది నా ప్రశ్న. మరో ప్రశ్న, ప్రతిమనిషికీ “తను” అనే మౌలిక అస్తిత్వం ఉంటుంది కదా. ఇంకా మరొక “తెలుగువాడు” అనే అస్తిత్వం ఎందుకు? మూడు, “తెలుగువాడు” అనే అస్తిత్వం “తన” అనే అస్తిత్వంలాగా ప్రతి మనిషికి వ్యక్తిగతంగా ఉండేదా లేక కొంతమందికి కలిపి సామూహికంగా ఉండే అస్తిత్వమా? వ్యక్తిగత అస్తిత్వమైతే దానికీ “తన” అనే అస్తిత్వానికి ఉన్న తేడా ఏవిటి? ఒకవేళ అది సామూహికమైతే అది ఎలా కలుగుతుంది? “నాది” అనే భావం నుంచి “మనది” అనే భావన ఎలా కలుగుతుంది?

  ఈ ప్రశ్నలన్నిటికీ మీ దగ్గర సమాధానాలుండాలని కాదు నేను అడిగింది. ఆ మాటకొస్తే నాకూ ఉన్నాయని కచ్చితంగా చెప్పలేను, కాకపోతే కొన్ని స్థిరమైన ఆలోచనలున్నాయి. వీటికి సమాధానాలు చెప్పకుండా తెలుగు భాషని/తెలుగుదనాన్ని కాపాడడం గురించి, దానికి కావలసిన మార్గాల గురించీ “సామూహికంగా” ఆలోచించడం కుదరదు. అలా చెయ్యలేనప్పుడు మీరు చేస్తున్న చర్చంతా వ్యర్థం అయిపోదా?

 8. 3 జూన్, 2009 10:01 సా.

  ఛాలా ఛాలా బావుంది చంద్రమోహన్ గారూ. ఓపిగ్గా మీ సంభాషణ సారాన్ని మాతో పంచుకున్నందుకు అనేక థాంకులు.
  ఉత్తర ప్రదేశ బ్రాహ్మణులు ఇటువంటి (సంస్కృత భూయిష్ట) హిందీ మాట్లాడుతారనేది అబద్ధం. ఒకవేళ అలవాటై ఉంటే అది ప్రభుత్వోద్యోగ సంపర్కంవల్లనో, లేక ఉర్దూ, హిందుస్తానీ వాసన తగలకుండా రూపొందించబడిన టీవీ పౌరాణికాలు చూడ్డం వల్లనో అయుండొచ్చని నా అనుమానం.
  దక్షిణ రాష్ట్రాల్లో కూడా కొన్ని బ్రాహ్మణ కుటుంబాల్లో, ముఖ్యంగా వైదిక, లేదా వైష్ణవ సాంప్రదాయం పాటించే కుటుంబాల్లో, వంట, మడి, భోజనాది కార్యక్రమాలకి సంబంధించి సంస్కృత పదాలే వాడేవారు .. జలం, సంప్రోక్ష్యం, ఇలాగ .. వాళ్ళకి ఇతరత్రా ఒక్క ముక్క సంస్కృతం రాకపోయినా.

 9. చంద్ర మోహన్ permalink
  3 జూన్, 2009 11:05 సా.

  రేరాజ్ గారూ,

  తెలుగు సినిమా బ్రతకడానికి తెలుగుండాలి కదా అని మీరంటున్నారు. తెలుగు బ్రతకడానికి తెలుగు సినిమా ఉండాలి అని నేనంటున్నాను. ఎంత గొప్ప కళాఖండమైనా మన భాషలో చూస్తే అదో ఆనందం. లేకపోతే డబ్బింగ్ సినిమాలుండేవి కాదేమో. ఆ ‘మనభాషలో’ చూడాలన్న కోరికే తెలుగును ప్రజల భాషగా నిలబెట్టవచ్చు. అందరం ఇంగ్లీషు వాడితే నష్టం యేమిటి? అనే ప్రశ్నకు జవాబు చెప్పడం నిజంగా కష్టం. ఇడ్లీ, దోశ, పెసరట్టు లేకపోతే ఏమిటి? అందరం బ్రెడ్-బటర్, కార్న్ ఫ్లేక్స్ తినొచ్చుకదా అంటే ఏం చెప్పగలం? అది కేవలం అలవాటేనా, లేక మనకే సొంతమైన భోజన సౌఖ్యమా, మన సంస్కృతికి ఒక రుచికరమైన ప్రతీకనా? చూద్దాం, మీ సర్వే మీకేం చెబుతుందో!

  కొత్తపాళి గారు,
  నెనర్లు. నాకు పి.వి. నరసింహా రావుగారి ‘సహస్ర ఫణ్’ గుర్తొచ్చింది. హిందీ ప్రాంతానికి చెందిన కవి ఐతే ఆ శీర్షిక పెట్టేవాడా అని సందేహం.

 10. 4 జూన్, 2009 2:08 ఉద.

  “ఎంత గొప్ప కళాఖండమైనా మన భాషలో చూస్తే అదో ఆనందం.”
  ఈ భావాన్నే తిరగేసి, ఆ చూసే చెత్తేదో మన భాషలో చూస్తే అదో ఆనందం అని తెలుగు చెత్తసినిమాలే చూస్తాన్నేను! 🙂

 11. 5 జూన్, 2009 12:53 సా.

  ౧.“తెలుగువాడు” అనే ఐడెంటిటీ (అస్తిత్వం) మీకు ఎలా వస్తోంది అన్నది నా ప్రశ్న.
  జ:నిజానికి ఇది నోషనల్ అండ్ డైనమిక్; కానీ, ఓ అంగీకారాత్మక దృక్పదం గా “భాష” అని మనం ఏర్పరుచుకోవచ్చు. కొత్తగా ఏర్పరుచుకోనవసరం కూడా లేదు. ఆల్రెడీ,నేను తెలుగు మాట్లాడేవాణ్ణి కాబాట్టే, నేను తెలుగువాడిని. అలా తెలుగువాడిగా ఉండటానికి, తెలుగు “భాషను జీవించేలా” చేసుకోవచ్చని నా ఉద్దేశ్యం.

  ౨.మరో ప్రశ్న, ప్రతిమనిషికీ “తను” అనే మౌలిక అస్తిత్వం ఉంటుంది కదా. ఇంకా మరొక “తెలుగువాడు” అనే అస్తిత్వం ఎందుకు?
  జ:”తను” అన్న అస్తిత్వం తర్వాత ఇంకా చాలా అస్తిత్వాలు ఒకే మనిషికి ఉంటాయి. మనకి మళ్టిపుల్ ఐడెంటీస్ ఉంటాయి. అందులో “తెలుగువాడు” అనేది ఒకటి. డాక్టరు రెండు. అందులోనే సర్జెన్. పేరుమోసిన సర్జన్. మగ సర్జన్ ; ఆడ సర్జన్ అలా….. ఆలా……ఇట్స్ ఎ కాంప్లెక్స్ థింగ్.

  ౩.మూడు, “తెలుగువాడు” అనే అస్తిత్వం “తన” అనే అస్తిత్వంలాగా ప్రతి మనిషికి వ్యక్తిగతంగా ఉండేదా లేక కొంతమందికి కలిపి సామూహికంగా ఉండే అస్తిత్వమా?
  జ:ఇది సామూహికంగా ఉన్న అస్తిత్వం. ఈ సమూహంలోకి జనాలు చేరాలని కోరుకోగలగాలి. లేకపోతే, క్రమేణా ఇలాంటి సామూహిక అస్తిత్వాలు క్షీణిస్తాయి.

  ౪.వ్యక్తిగత అస్తిత్వమైతే దానికీ “తన” అనే అస్తిత్వానికి ఉన్న తేడా ఏవిటి? ఒకవేళ అది సామూహికమైతే అది ఎలా కలుగుతుంది? “నాది” అనే భావం నుంచి “మనది” అనే భావన ఎలా కలుగుతుంది?
  జ:ఇది చాలా పెద్ద ప్రశ్న కదండి; ఈ “మనది” అనే భావం ఎలా కలిగించాలి అనేదాని గురించి అనేక మంది నాయకులు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్రపంచంలో దీని గురించి చాలా ఆలోచనలు జరిగాయి. జరుగుతునే ఉన్నాయి.అలా మనం కూడా ఆలోచనలు తెలుగులో చేసుకోవలన్నది నా అభిమతం. ఏకీభవించిన వాళ్ళెవరో ఇంకా తెలీలేదు.

  ౫.ఈ ప్రశ్నలన్నిటికీ మీ దగ్గర సమాధానాలుండాలని కాదు నేను అడిగింది. ఆ మాటకొస్తే నాకూ ఉన్నాయని కచ్చితంగా చెప్పలేను, కాకపోతే కొన్ని స్థిరమైన ఆలోచనలున్నాయి.
  జ:మీ ఆలోచనలు వినాలని నాకూ ఉంది. తెలుగు అనే పదంలేని ఏ బ్లాగులో చెప్పిన సులువుగా చదువుకుంటాను.

  ౬.వీటికి సమాధానాలు చెప్పకుండా తెలుగు భాషని/తెలుగుదనాన్ని కాపాడడం గురించి, దానికి కావలసిన మార్గాల గురించీ “సామూహికంగా” ఆలోచించడం కుదరదు. అలా చెయ్యలేనప్పుడు మీరు చేస్తున్న చర్చంతా వ్యర్థం అయిపోదా?
  జ: వ్యర్ధం అయిపోయినా – నాదీ ఓ ఆలోచన ; అది ముఖ్యం. తెలుగులో భాష గురించి ఆలోచించినవారిలో -“భాష అనేది ఆలోచన వల్ల జీవిస్తుంది” అని అనుకున్నవాడిగా నేను ఉంటానేమో!!

  భాష జీవించడానికి కావాల్సింది – “ఆలోచన”. శాస్త్రభాషలోని “ఆలోచన”, మన కావ్యభాషలోని “ఆలోచన”ని మారుస్తుంది. శాస్త్రాలు అందరూ నేర్చుకోరు. కానీ, ఆ శాస్త్రంలోని “ఆలోచనలు” మనకి కావ్యల్లోనూ వచ్చేస్తాయి. ఎప్పుడైతే, ఈ రెండు వేరు పడతాయో, అప్పుడు కావ్యభాషలో ఆలోచనల కొరత ఏర్పడుతుంది. కావ్యభాషలో పదాలు కొరవడతాయి. తద్వారా అది ఛస్తుంది. పాత “ఆలోచన”లని అందరూ అంగీకరించరు మరి! అసలు సాహిత్యం “వల్ల”, కళల “వల్ల” భాష జీవిస్తుందనేది తప్పండి. భాష సాహిత్యం”లోనూ”. కళల”లోనూ” నిలుస్తుంది. కానీ “ఆలోచన” వల్ల జీవిస్తుంది. దానికి ఉదా: “వర్షం” అన్న ఒక్క ఆలోచన గురించే బోళ్డు వివరించాను నా బ్లాగులో; భవానిగారికిచ్చిన సమాధానంలో పాయింట్ వైజ్ లిస్ట్ చేసాను.

  @చంద్రమోహన్ : సినిమా వల్ల తెలుగు నిలుస్తుంది అనేది తప్పేమో అని నా అభిప్రాయం. తెలుగుభాషలో ఆలోచనలు చెలరేగాలి.దాని వల్ల కొత్త కొత్త ఆవిష్కారాలు, పరిష్కారాలు, దొరకాలి; దాని కోసం అందరూ తహ తహ లాడుతూ, తెలుగును చూస్తారు.అలా ఏ భాష కా భాష ప్రయత్నించాలి.అందరూ విజయం సాధించరు.

  చరిత్రలో ఒక్కొక్క సమయంలొ ఒక్కొక్క ఆలోచనకి ప్రాముఖ్యత వస్తుంది. అందుకని, ఆలోచనలతో చెలరేగిపోతు ఉండాలి. దాన్ని ఎలా సాధించాలి అనేది మరో స్థాయి చర్చ.

 12. 5 జూన్, 2009 5:44 సా.

  ముంబయిలోను, హైదరాబాదులోను వాడే హిందీ అసలు హిందీ కానే కాదు.
  హిందీ సినిమాలలో కూడా శుద్ధ హిందీ ఉండదు.
  సరైన హిందీ వినాలంటే అలహాబాదు, వారణాసి వెళ్ళాలి.
  ప్రబంధ్, ప్రతీక్షా అందరూ వాడతారు.
  అంతెందుకు అమితాబ్ మాట్లాడే హిందీకి, షారూఖ్ మాట్లాడే హిందీకి ఎంత తేడాయో చూడండి.
  ఇకపోతే ప్రజావ్యవహారంలోని హిందీ అని వ్రాసినవి ఉర్దూ పదాలు.

 13. 5 జూన్, 2009 11:46 సా.

  >>”నిజానికి ఇది నోషనల్ అండ్ డైనమిక్; కానీ, ఓ అంగీకారాత్మక దృక్పదం గా “భాష” అని మనం ఏర్పరుచుకోవచ్చు”
  అంటే ఇక్కడ ఒక రకమైన స్టాండర్డైజేషన్ అవసరమవుతుందా? ఒకే కాలంలో వివిధ ప్రాంతాల్లోనూ, ఒకే ప్రాంతంలో కాలంతో బాటూ తెలుగు భాషలో తేడా ఉంటుంది కాబట్టి “తెలుగు భాష”, అది మాట్లాడేవాళ్ళు తెలుగువాళ్ళు అనే అస్తిత్వం రావడానికి కొంత స్టాండర్డైజేషన్ అవసరమేనా?

  >>”మనకి మళ్టిపుల్ ఐడెంటీస్ ఉంటాయి.”
  అవును. “తెలుగువాడు” అనే ఐడెంటిటీ తప్పనిసరి ఐడెంటిటీనా? అది కావాలి, వద్దనుకోడానికి వ్యక్తులకి స్వేచ్ఛ ఉంది కదా? దాని అవసరమేంటి అని నేను అడిగిన ప్రశ్న.

  >>”అలా మనం కూడా ఆలోచనలు తెలుగులో చేసుకోవలన్నది నా అభిమతం.”
  “నాది” అనే భావం నుంచి “మనది” అనే భావన కలిగినప్పుడు, అలా కలిగినవాళ్ళు, ఆలోచనలు తెలుగులో చేసే ప్రయత్నం చేస్తారు. “మనది” అనే భావం కలగడం, తెలుగువాళ్ళు తెలుగులో ఆలోచించడానికి pre-requisite, దాని outcome కాదు. ఒప్పుకుంటారా? తెలుగుదనం “మనది” అనే భావన కలగనప్పుడు ఎవరైనా తెలుగులో ఆలోచించడానికి ఎందుకు ప్రయత్నిస్తారు, మీరు చెప్పినంత మాత్రాన. అందికే అది pre-requisite. అందికే ముందు దానికి సమాధానం ఆలోచించాలని నేనంటున్నది.
  What you are trying to do is find a way on how telugu can continue to exist as a language. However for that way to succeed, telugu people have to follow that way. I am trying to thinking of how we can make telugu people follow a certain way. I hope you agree that it is more important(and a pre-requisite) that telugu people should recognize the importance of retaining their identity before trying out ways to realize it.

 14. rayraj permalink
  8 జూన్, 2009 1:17 సా.

  ౧.స్టాండర్డైజేషన్ అవసరమవుతుందా?
  ఐడెంటిటీ కోసం స్టాండర్డైజేశన్ అవసరపడదనే నా ఉద్దేశ్యం.

  ౨.తప్పనిసరి ఐడెంటిటీనా?వ్యక్తులకి స్వేచ్ఛ ఉంది కదా?
  తప్పనిసరి కాదు.స్వేచ్ఛ ఉంది.అది అలా స్వేచ్ఛగానే ఉండాలన్నది నా వాదం. ఐతే, ఎవరైతే నాయకులై నిలబడతారో, వారు ఈ ఐడెంటిటీని ప్రజలు కోరుకునేలా చేయాలి.

  దానికి ఒక మార్గం – మనకి ఘనచరిత్ర ఉంది అని చెప్పటం :
  సంస్కృతం కోసం ఇలాగే ప్రయత్నించబడింది.కానీ అది భాష నిలబడ్డానికంటే, ఓ ఆత్మగౌరవ సమస్యకి మాత్రమే పనికొచ్చేలా చెప్పబడింది.ఇప్పుడు అదే పని మనం చేయలేం. ఎందుకు?
  అ) తెలుగు ఏ ఒక్క వర్గానికో చెందింది కాకూడదు. అలా Teleng వర్గాలు మాత్రమే తెలుగు కాపాడితే, దాని గతి మళ్ళీ సంస్కృతం గతే ఔతుంది.
  ఆ) సంస్కృతంలో ఉన్న లాంటి స్వతంత్ర్య ఆలోచన, తెలుగులో ఏమీ లేదనే నా ఉద్దేశ్యం. ఒకవేళ “ఉంది” అనుకునే వాళ్ళుంటే, దాని గురించి చెప్పటం లాభదాయకమే కావచ్చు. కానీ, “అదే సత్యం” అన్న స్థితికి దాన్ని తీసుకు వెళ్ళకూడదు. ఆలోచనలు నిరంతరం సాగుతునే ఉండాలి.

  అందుకనే, ఇంకో మార్గం – “తెలుగులో ఆలోచించడం” :
  చరిత్రలోని ఘనతకంటే, ప్రస్తుతంలోని “ఆలోచన” పై స్ట్రెస్ ఎక్కువ పెట్టాలని, “తెలుగులో ఆలోచించండి” అనే పిలుపు. నిజానికి తెలుగును రక్షిద్దామనే ఆలోచనలో ఉన్న వాళ్ళు చాలా మంది, చాలా రంగాల్లో గొప్పవారే అవ్వచ్చు. కానీ వారి రంగంలోని ఆలోచనలు ఇంగ్లీషులో పంచుకుంటూ, తెలుగులో పూతరేకులపై మాత్రమే పద్యాలు రాయటం వృధా అని నా ఉద్దేశ్యం.

  అంటే, అందరం ఇంగ్లీషు నేర్చుకోవటంలో ఏ లాభాలు ఉన్నాయో, ఆ లాభాలకి విత్తనాలు, వేర్లు తెలుగులో కూడా వేసి పెంచటం. ప్రభుత్వం తెలుగును ఓ భాషగా మాత్రమే నేర్పిచ్చినా, అనేకానేక విషయాలలోని కొత్త ఆలోచనల కోసం తెలుగులోకంలో వెతుక్కునే అవకాశం, అవసరం మనం సాధించగలిగితే, తెలుగుకు ఓ కొత్త శ్వాస నింపినవాళ్ళం అవుతాము. అందుకని అనువాదాలకు మించి, ఆలోచనలు జరగాలి.

  మూడో మార్గం- వైవిధ్యమైన ఆలోచనల నుంచి లాభపడటం:
  ఈ విషయం నేనికింకా చర్చించ లేదు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు – ప్రస్తుత ఆలోచనల్లోని లోపల వల్ల వచ్చిన నష్టాలకి విరుగుడు, వైవిధ్యం ఉన్న వేరే సంస్కృతులలోనూ, భాషల్లోనూ దొరుకుతాయి. అలాంటి అవకాశం తెలుగు వారిది కూడా అవ్వచ్చు. ఒకవేళ వేరేచోట ఆ సమాధానాలు దొరికితే, అప్పుడు ఆయా భాషలని, ఆలోచనలని మనం ఆకళింపు చేసుకునే జాతిగా నిలవగలం. కానీ, దాని కంటే, మనదైన ఆలోచనలను ప్రపంచానికి అందిచే స్థితికి మనం ఎదగటం -“మన లక్ష్యం” అవ్వాలి.

  ౩. “మనది” అనే భావం కలగడం, తెలుగువాళ్ళు తెలుగులో ఆలోచించడానికి pre-requisite, దాని outcome కాదు. ఒప్పుకుంటారా?
  ఓ ఆలోచన ప్రకారం మీరు చెప్పిందే రైటే; కానీ, అది అలాంటి సీక్వెన్సులో నడవదు. ఒక్క విషయం : అసలు ఇవి సీక్వెన్షియల్ అని అనుకోకండి.తెలుగు మీద ప్రేమ జనాల్లో కలుగుతుండటం, తెలుగులో ఆలోచనలు పెరుగుతుండటం, దాని వల్ల తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం అనేవి సైమళ్టేనియస్ గా జరుగుతూ ఉంటాయి.

  ఒకవేళ అదే సీక్వెన్సులో నడుస్తున్నట్టుగా ఉన్నా కూడా, అలాంటి సైకిల్స్ ప్రతి ఒక్క విషయంలో విడివిడిగా జరుగుతాయి. స్పైరలింగ్ ఎఫెక్టులో పెరుగుతాయి. పైగా, ఎన్నో విషయాల మీద ఇవన్నీ ఇంటర్ లింక్ అయ్యుంటాయి. అందుకని, “మనది” అన్న భావాన్ని కలిగించటం ప్రీ రిక్విసిట్ అయినా కూడా, అది పూర్తిగా సాధించాకే, ఇలాంటి ఆలోచనలు జరగాలి అనుకోవటం తప్పనేది నా ఉద్దేశ్యం.

  నిజానికి, ఎవరికో “మన తెలుగు” అనే భావం ఉన్నది కాబట్టే, నేను ఇవ్వాళ్ళ ఇక్కడ మీతో నా ఆలోచన తెలుగులో పంచుకుంటున్నాను. ఈ “మన” అనే భావం ఆల్రెడీ ఉన్నదే; మరీ అంత కొత్త ఆలోచనేమీ కాదు. అందుకే, ఈ “మనది” అని ఎవరికి ఆలోచన ఉన్నదో, వాళ్ళు తెలుగుకి సంస్కృతంలాంటి గతి పట్టించకుండా, దాన్ని వాళ్ళు
  బతికించే మార్గం చెప్పాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రాసెస్లో, కొంతమంది కొత్తవారిలోనూ “మన తెలుగు” అనే భావం నిద్రలేవచ్చు. వాళ్ళు, నేను కోరుకున్నది సాధించే శక్తి సంపన్నులు కావచ్చు. అందుకే ఇవన్నీ సైమళ్టేనియస్ అనేది నా భావం.

  మీ స్టాండైజేషన్ లో, పొరబాటున గనక, “పంచె” తెలుగుదనం అని నిర్ధారిస్తే, అది ఖచితంగా రెట్రో. అప్పుడప్పుడు రెట్రో, ఓ ఫ్యాషన్ అవ్వచ్చు. కానీ, అది ఎప్పటికీ పురోగమనం అనిపించుకోదు. అందుకని, “పురోగమనం” లక్ష్యంగా ఉండాలి. ఆ పురోగమన లక్ష్యం కూడా “మన” అన్న భావనకి దోహదపడేది అవ్వచ్చు. అంటే, ఓ 30
  ఆర్ధిక శాస్త్ర వేత్తల చర్చలు తెలుగులో జరిగితే, తెలుగులో ఆర్ధిక శాస్త్రం అభివృద్ధి చెందుతున్నట్టు అనుకోండి. ఓ ౩౦ మంది జన్యుశాస్త్రం గురించి చర్చలు జరిపితే, తెలుగులో జన్యుశాస్త్రం అభివృద్ధి చెందుతోంది అనుకోండి. ఓ 30 మంది చరిత్ర గురించి చర్చిస్తే, తెలుగులో చరిత్ర అధ్యయనం బాగా జరుగుతోంది అనుకోండి. అలా రకరకాల విషయాల మీద, తెలుగు ప్రజలు “మనది” అన్న భావంలో చర్చించాలి. అంతేగానీ, కేవలం “భాషాభిమానుల” వల్ల,సాహిత్యాభిలాషులవల్ల తెలుగు నిలవదు.

  దీనికి రాజకీయ లక్ష్యాలను మాత్రం జోడించను. అలా జోడించిన వాదాలు విరిగిపోయాయి. పైగా, అలాంటి ఉద్యమాలు ఆల్రెడీ బోళ్డు ఉన్నాయి.ఉద్యమ స్పూర్తి మనం కలిగి ఉండొచ్చునెమో గానీ, మనది ఉద్యమం కాదు. మనది “జీవనం” – ఇది నిరంతరం స్వేచ్చకై జరుగు పోరాటం. అంటే, సుఖపడం అని కాదు. సుఖిస్తున్నా,
  భవిష్యత్తుకై చేసుకొనే ప్రణాలికలు, వాటి అమలు. ఇది నిరంతరం జరుతునే ఉంటుంది. ఇది ఆలోచనాత్మకం; ఆచరణాత్మకం. స్వేచ్చకై ఎవరిని పిలవక్కర్లేదండి. స్వేచ్చలో ఆనందం,లాభం ప్రజలు తెలుసుకొని, పరుగులతో వచ్చేస్తారు. తెలుగు నుంచి లాభపడండి అనేది మరో మోటో అవ్వచ్చు!!

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: