Skip to content

తెలుగు లో ఫిజిక్స్ ?! (లేక ఫిజిక్స్ లో తెలుగు?!) అను సంవాదము

7 జూన్, 2009

కొంత కాలం క్రితం ఒక మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు ఒక చర్చ వచ్చింది. విజ్ఞాన శాస్త్ర విషయాలను తెలుగులో అర్థమయ్యేలా చెప్ప వచ్చా అని. ముఖ్యంగా భౌతిక శాస్త్ర సూత్రాలను తెలుగులో ఎలా అనువాదం చేయగలమని. మాటల్లో అతనన్నాడు, హాస్యంగా: ‘ సూత్రాలను పద్యాల్లో చెప్పితే ఇంకా తమాషాగా ఉంటుందేమో’ అని. నిజంగానే పద్యాల్లో ఛందస్సు వలన ఒక తూగు, ఒక సౌష్ఠవ రూపం ఉంటుందని, అందు వలననే కవుల వచన సాహిత్యం కంటే పద్య సాహిత్యం జనుల నాలుక పై ఎక్కువగా ఆడుతుంటుందనీ, సూత్రాలను పద్యాల్లో చెబితే గుర్తుంచుకోవడం సులభం కావచ్చనీ నేనన్నాను. “ఐతే కెప్లర్ నియమాల్ని పద్యాల్లో చెప్పు చూద్దాం” అని సవాలు విసిరాడా మిత్రుడు. నేనూ అందుకొని సూత్రాలను అనువాదం చేయడం ప్రారంభించాను. కెప్లరు గ్రహగతి నియమాలు ఇవీ (ఆంగ్లంలో) :

Kepler Laws of Planetary Motion:


1. Every Planet revolves around the sun in an elliptical orbit, with the sun at one of its foci.

2. The areal velocity of the radius vector is constant. In other words, the line joining the planet with the sun will sweep equal areas in equal intervals of time.

3. the square of the time period (time taken by planet to complete one revolution around the sun) is inversely proportional to the cube of the semi-major axis of its orbit.


చూస్తే చాలా కష్టమే అనిపించింది. ఐనా ధైర్యం తెచ్చుకొని పై నియమాలకు నా అనువాదం ఇలా ప్రారంభించాను:

౧.
ప్రతి గ్రహము యినుని చుట్టును
గతి దప్పక దీర్ఘవృత్త కక్ష్యను దిరుగున్
సతతము యుండును భానుడు
అతివృత్తపు రెండు నాభులందొక దానిన్

౨.
సర్వ స్థితులందు వ్యాసార్థ సదిశ రేఖ
యొక్క విస్తీర్ణ వేగమ్ము యొకటె గాని
మారదచు వచించె కెప్లరు, గ్రహముల
గమనమంతయు నియమ బధ్ధమని చాటె

౩.
గ్రహ భ్రమణ కాల వర్గము
గ్రహ కక్ష్యకు చెందు అర్థ గుర్వక్షమ్మున్ …

మూడో నియమం వద్దకు వచ్చేసరికి కలం ఆగిపోయింది. రెండో పాదంలో యతి తన్నేసిందని గుర్తు పట్టగానే ఇక ఆలోచనలు ముందుకు కదల్లేదు.

కనుక చదువుతున్న బ్లాక్కవి వరులకు నా విన్నపం ఏమిటంటే, మూడో నియమం కాస్తా అనువాదం చేసి పుణ్యం కట్టుకోండి. అలాగే ఫిజిక్సుకు, ఛందస్సుకు ఏమైనా ఫ్యూజన్ జరిగే అవకాశముందేమో ఆలోచించండి .

ప్రకటనలు
15 వ్యాఖ్యలు
 1. 7 జూన్, 2009 4:15 ఉద.

  మంచి ప్రయత్నమండి. ఇంతకీ రెండు పద్యాలు వ్రాసిన మీకు మూడో పద్యం పెద్దలెక్క కాదనుకుంటాను. సరే ఏమైనా..
  సెమి-మేజర్ యాక్సిస్ కు, క్యూబ్ కు తెలుగు పదాలు చెప్తారా.. ఏవరైనా ప్రయత్నిస్తారేమో..

 2. 7 జూన్, 2009 8:03 ఉద.

  చక్కని ప్రయత్నం. keep it up.

  >>”విజ్ఞాన శాస్త్ర విషయాలను తెలుగులో అర్థమయ్యేలా చెప్ప వచ్చా?”

  ప్రయత్నం చెయ్యాలే గాని, తెలుగులో చాలా సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పవచ్చు. ఒకసారి ఈ బ్లాగు చూడండి. http://scienceintelugu.blogspot.com/.

  మీకు కూడా సైన్సును తెలుగులోకి అనువదించాలనే ఆసక్తి ఉంటే, నాకు mail చెయ్యండి. My mail ID: nagaprasad27@gmail.com

 3. 7 జూన్, 2009 9:00 ఉద.

  భలే ఐడియా వచ్చింది మీకు. ఇలాంటివి మన బళ్ళల్లో నేర్పిస్తే ఎంత బావుంటుంది? మూడవ పద్యం కష్ట సాధ్యమే. నా వంతు సహాయంగా అనువాదం యొక్క గద్యం:

  గ్రహం సూర్యుడి చుట్టూ తిరిగే సమయం యొక్క వర్గము, గ్రహ ముఖ్య కక్ష్య ఘనమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది

 4. 7 జూన్, 2009 9:56 ఉద.

  భాస్కర రామిరెడ్డి గారూ,
  Semi-major axis ను అర్థ-గురు అక్షమని నేను అనువాదం చేసుకొన్నాను – నా మూడో పద్యంలో . ఇక Cube కు ఘనం అనే మాట విస్తృతంగానే వాడుకలో ఉంది. వాటిని ఛందంలో ఇరికించడమే ఎలాగో తోచలేదు.

  రవి గారూ,

  ఒక సారి పద్యంలో కూడా ప్రయత్నించకూడదూ! అన్నట్లు ఘనమూలానికి కాదు, ఘనానికే విలోమానుపాతంలో ఉంటుంది.

 5. 7 జూన్, 2009 11:16 ఉద.

  గ్రహము రవిని జుట్టు కాలమ్ము వర్గింప
  అది విలోమ గతిని అనుసరించు
  కక్షకున్న ముఖ్య అక్షార్థ ఘనమును
  విశ్వదాభిరామ వినురవేమ 🙂

  కక్ష అన్నా orbit అనే అర్థం ఉంది.

  సరదాగా రాయడానికి బావుంటాయి కాని ఈ కాలంలో శాస్త్ర విషయాలు పద్యాల్లో రాయడం ఎంత వరకూ ప్రయోజనకరమో నాకు అనుమానమే.

 6. manohar permalink
  7 జూన్, 2009 12:41 సా.

  great work

 7. దువ్వూరి వేణుగోపాల్ permalink
  7 జూన్, 2009 2:00 సా.

  బాగుందండి. చరకసంహిత మొదలయిన వైద్యశాస్త్ర గ్రంధాలు, చాలా జ్యోతిషానికి సంబంధించి సంస్కృత గ్రంథాలు ఛందోబద్ధమయిన పద్యరూపంలోనే ఉంటాయి. అవి గద్యరూపంలో లేవు.

 8. సూర్యుడు permalink
  7 జూన్, 2009 2:14 సా.

  @ కామేశ్వర రావు గారు,

  అది కక్ష్య అనుకుంటానండి, కక్ష కాదు. కక్ష అంటే grudge అనుకుంటా 🙂

  ~సూర్యుడు 🙂

 9. sriku permalink
  7 జూన్, 2009 5:27 సా.

  దొర్లుతున్న రాయి కసలు ద్రవ్యరాశి యుండునా
  పొర్లియున్ననీటి విలువ వస్తు భారమే కదా
  ప్రతీ చర్య కొక ప్రతిచర్య సమానముగ కలుగులే
  భౌతిక సిద్ధాంతముల కూడ వేదాంతము కలదులే

 10. 7 జూన్, 2009 7:27 సా.

  @sriku
  Rolling stone gathers no MOSS, not mass 🙂

  చంద్రమోహన్, ఇది భలే మంచి కసరత్తు. మనవాళ్ళు ముందు సంస్కృతంలోనూ, తరవాత తెలుగులోనూ అనేక శాస్త్ర విషయాల్ని, నిఘంటువులతో సహా, ఛందోబద్ధ పద్యరూపాల్లోనే రాశారు.
  ఉదాహరణకి ఆచార్య వేమూరిగారి ఈ వ్యాసం చూడొచ్చు.

 11. 7 జూన్, 2009 9:02 సా.

  సూర్యుడుగారు,

  సంస్కృతంలో కక్ష పదానికికూడా orbit అనే అర్థం(కూడా) ఉంది. అందికే ప్రత్యేకించి చెప్పాను.

 12. సూర్యుడు permalink
  7 జూన్, 2009 10:35 సా.

  @ కామేశ్వర రావు గారు,

  క్షమించండి, నాకు సంస్కృతార్ధం గురించి తెలీదు, పొరపడ్డారేమో అనుకున్నా 🙂

  ~సూర్యుడు 🙂

 13. 7 జూన్, 2009 11:14 సా.

  స్పందించిన అందరికీ ధన్యవాదాలు!

  @కామేశ్వర రావు గారు,
  అనువాదం చేస్తే మీరే చెయ్యాలనుకొన్నాను. చక్కగా వచ్చింది. “విశ్వదాభిరామ…!?” 🙂
  సరదాగానే ఐనా ఇలాంటి ప్రయత్నాలు విరివిగా చేస్తే బాగుంటుంది. నాలుగు రకాల పద్యానువాదాలుంటే, మనసులో గట్టిగా నిలిచేది ఒకటైనా ఉండవచ్చు. దాన్ని గుర్తుంచుకోవడం ఆంగ్ల నిర్వచనాన్ని (గద్యం రూపంలో ఉండే Definition ను నిర్+వచనం అనడం ఒక ఐరనీ!) గుర్తుంచుకోవడం కంటే సులభం అనిపించొచ్చు. మొత్తం శాస్త్ర చర్చ అంతా పద్యాల్లో ఉండాలని నా ఉద్దేశ్యం కాదు. ఇలాంటి సూత్రాలు మాత్రమే.

  ఆట వెలది, తేట గీతి పద్యాల లక్షణాలు పద్యాల్లో చెప్పినవి-

  ‘సూర్యుడొక్కరుండు, సురరాజులిద్దరు
  దినకరద్వయంబు తేటగీతి’
  ‘ఇనగణ త్రయంబు నింద్రద్వయంబును
  హంస పంచకంబు నాటవెలది’

  ఇవి గద్యం రూపంలో చదువుకొని ఉంటే నాకు ఇన్నేళ్ళు జ్ఞాపకం ఉండేది కాదేమో!

  తదుపరి కవిసమ్మేళనంలో అనువాద సమస్యలిచ్చినప్పుడు రాయల వారు ఈవిషయాన్ని దృష్టిలో ఉంచుకొనగలరని ప్రార్థన!

 14. Rao Vemuri permalink
  14 జూన్, 2009 7:28 సా.

  చాల మంచి ప్రయత్నం. ఇంకా ఈ దిశలో ప్రయత్నాలు చెయ్యండి.
  నేను ఇంజనీరింగు విద్యార్ధిగా ఉన్న రోజుల్లో మాకు ఇంజనీరింగ్ ఇకనామిక్స్ అనే పాఠ్యాంశం ఉండేది. నాకు గణితం, భౌతికం, రసాయనం, మొదలైనవి సులభంగా అర్ధం అయేవి కాని, ఈ ఇకనామిక్ ఒకంతట అవగాహనకి రాలేదు. ఈ విషయం మా తునిలో టైపు నేర్పించే ఓరుగంటి రామారావు గారితో చెప్పేను. అప్పుడు ఆయన తను తెలుగులో రాసిన వ్రాత ప్రతి ఒకటి ఇచ్చి దాన్ని చదవ మన్నారు. ఆ పుస్తకంలో ఇకనామిక్స్ ని తెలుగులో ద్విపద కావ్యంలా రాసేరు. అది చదివి నోట్సు రాసుకుని పట్టికెళ్ళేను. పెద్ద పరీక్షలలో నాకు గణితం, భౌతికమం, రసాయనం, మొదలైన అంశాలలో కంటె ఇకనామిక్స్ లో ఎక్కువ మార్కులు వచ్చేయి. ఇది నిజంగా నా జీవితంలో జరిగిన సంఘటన. ఆ పుస్తకం రామారావు గారి వారసుల దగ్గర ఉంటే అది ఇప్పటికీ ప్రచురణార్హం.
  ఇటువంటి అనుభవాలు దృష్టిలో పెట్టుకునే ఏ విషయాన్నయినా మాతృభాషలో బోధించటంలో లాభాలు లేకపోలేదనే తీర్మానానికి వచ్చేను.

 15. 14 జూన్, 2009 11:16 సా.

  రావు గారు,
  మీ ప్రోత్సాహానికి నెనర్లు. ద్విపదలో ఎకనామిక్స్! చాల గొప్ప విషయమే. వ్రాత ప్రతి దొరికితే బాగుండును!.

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: