Skip to content

మళ్ళీ బడికి!

15 జూలై, 2009

నా కొత్త పాఠ్యపుస్తకం

నా కొత్త పాఠ్యపుస్తకం

వెంటనే హిందీ ప్రవీణ్ పరీక్షకు చదివి పాస్ కమ్మని పైవారి నుండి తాఖీదు వచ్చింది నాకు, మా బాసుకు. మాకు ఎంతో కొంత హిందీ వచ్చుకదా మళ్ళీ పరీక్షలెందుకని నసిగాం, కానీ వినలేదు. ఈ సంవత్సరం ఇంత మందిని హిందీ ప్రవీణులను చేస్తామని పార్లమెంటుకు హామీ ఇవ్వడం జరిగింది గనుక, వారి  రికార్డుల ప్రకారం  హిందీ ప్రావీణ్యం మాకున్నట్లు ఏ ధ్రువపత్రాలూ లేవు గనుక, మేము అర్జంటుగా క్లాసులకెళ్ళి హిందీ నేర్చుకొని ప్రవీణ్ పరీక్ష పాసు కావలసిందేనని నిష్కర్షగా చెప్పిన తరువాత, ఇక చేసేదేం లేక తరగతులకు సిద్ధమయ్యాము.

కేంద్ర ప్రభుత్వ సంస్థలలో పనిచేసేవారికి రాజభాషా ప్రవేశం కల్పించడం కోసం గృహ మంత్రిత్వ శాఖ మూడు స్థాయిలలో శిక్షణ నిర్వహిస్తుంది. ప్రబోధ్, ప్రవీణ్, ప్రాఙ్ఞ (హిందీలో  “ప్రాగ్య “) అని పరీక్షలుంటాయి. మొదటిది ప్రాథమిక స్థాయి, అచ్చులు, హల్లులనుండి మొదలు పెట్టి వాక్య నిర్మాణం వరకూ నేర్పుతారు. రెండవ దానిలో, వ్యాకరణం, వచన రచన, ఉత్తరాలు గట్రా వ్రాయడం ఉంటాయి. చివరి స్థాయిలో సాధారణం గా ప్రభుత్వ పరిపాలనా సంబంధిత విషయాలు, ఫైళ్ళ నోటింగులు ఎలా వ్రాయాలి, పరిపాలనలో వాడే పదాల అనువాదాలు మొదలైనవి ఉంటాయి. ప్రస్తుతం నేను రెండవ స్థాయి పరిక్షకు సిద్ధమవుతున్నాను. పరీక్ష నవంబరులో. భారతీయ భాషా సంస్థ (CIIL) లో వారానికి ఒక్క రోజు తరగతులు. పుస్తకాలు పుచ్చుకొని ’మళ్ళీ బడికి’ బయలుదేరాము.

మాకు పాఠాలు చెప్పే మాస్టారి పేరు టేక్ చంద్. హర్యానా నుండి వచ్చారు. మొదటిరోజు కనుక పాఠాలజోలికి పోకుండా, హిందీ గురించి ఎన్నో సరదా సంగతులు చెప్పారు. అన్నింటికన్న నన్ను అబ్బురపరచిన విషయం, హిందీలో “ఐ, ఔ” అన్న అచ్చులు లేవన్న మాట. దక్షిణ భారతీయులు సంస్కృత ప్రభావం వలన దేవనాగరి లిపిలోని అక్షరాలను సంస్కృత అచ్చులతో సమానంగా ఉచ్చరిస్తారు కానీ, శుద్ధహిందీలో ’ఎ, ఏ, ఒ, ఓ’ అనే అచ్చులు మాత్రమే ఉన్నాయని, ’ఐ, ఔ’ అన్న అచ్చులు లేవని చెప్పారు. ’ఐశ్వర్య’ అన్న మాటను హిందీలో ’ఏశ్వర్య’ అన్నట్లు పలకాలని, ’ఔరత్’ ను ’ఓరత్’ అని పలకాలని చెప్పి, అలా పలికి వినిపించారు. మాతో కూడా అలా పలికించారు. ఈ ఉచ్ఛారణ సంగతి ఇంతవరకు ఎక్కడా నేను నేర్చుకోలేదు. అలా ఈ తరగతులకు రావడం వలన నాకు హిందీ లో ’అ,ఆ’ లే ఇంకా సరిగ్గా రావన్న విషయం అర్థమైంది. మనకంతా వచ్చని విర్రవీగకుండా బుద్ధిగా పాఠాలు నేర్చుకోవడానికి ఈ తొలిక్లాసు ఉపకరించింది.

ప్రకటనలు
10 వ్యాఖ్యలు
 1. అబ్రకదబ్ర permalink
  16 జూలై, 2009 5:13 ఉద.

  ఐతే హిందీ కన్నా తెలుగు మీదనే సంస్కృతం ప్రభావం ఎక్కువన్నమాట. సంస్కృత వేద మంత్రాలు తెలుగు బ్రాహ్మలు ఉచ్ఛరించినంత స్పష్టంగా వేరే ఎవరూ పలకలేరని ఆ మధ్యెక్కడో చదివా. అదే విషయం ఓ హిందీ మితృడితో చెబితే అతనొప్పుకోలేదు. ఇంతకీ నే చదివింది నిజమేనా?

 2. 16 జూలై, 2009 8:29 ఉద.

  హిందీలో ఏ ఐ, ఓ ఔ లు ఉంటాయి, ఎ, ఒ లు ఉండవు అని చదూకున్నాను. అలాక్కాదా!!?

 3. 16 జూలై, 2009 9:31 ఉద.

  ఉద్యోగం వచ్చాక “అమ్మయ్య, వదిలింది చదువు”అని ఊపిరి పీల్చుకున్నా,పుస్తకాలు పుచ్చుకుని మళ్ళీ బయలుదేరక తప్పలేదన్నమాట మీకు!

  మీరు చెప్పేదాకా నాకూ ఐ, ఔ హిందీ లో లేవని తెలీదు. కానీ మరి ఉత్తర భారతీలు కూడా ఐశ్వర్య, ఔరత్ అనే ఉచ్ఛరిస్తారే ఈ పదాలను? లేక మనకలా అనిపిస్తుందా?

  పనిలో పనిగా మీ క్లాసులోని ఇలాంటి పనికొచ్చే విషయాలను మాకిక్కడ ట్యూషన్ చెప్పొచ్చుగా చంద్రమోహన్ గారూ!

  @ అబ్రకదబ్ర,
  నా పరిశీలన ప్రకారం మీరు విన్నది నిజమే!

 4. 16 జూలై, 2009 9:48 ఉద.

  “అబ్ తక్ ఛప్పన్” అని ఒక హిందీ సినిమా. అందులో నానా పటేకర్ అంటాడు, తన ఉత్తరాది కొలీగు తో, “అరె క్యా లోగ్ హై రె తు, వైశాలి కో వేశాలి బోల్ తే హై, వైశాలి, వైశాలి బోలో” అని.

  సంస్కృతంలోనో ఇలాంటి పరీక్షలు ఉన్నాయి. మొదట, బాలబోధ, ప్రాథమిక, ప్రావేశిక ఇలా. చివరిది “శిరోమణి” అనుకుంటాను. వాటిలో నేనూ ఓ ౩ వెలగబెట్టాను, చిన్నప్పుడు.

 5. 16 జూలై, 2009 9:49 ఉద.

  హిందీ లో ఎ ఉంది. ఏ లేదు. ఒ ఉంది. ఓ లేదు. ఐ=ऐ ,ఔ = औ లు ఉన్నాయి. కానీ వాటిని పలకడం “ఏ,ఓ” గా పలుకుతారు.

  హిందీ సంస్కృత ప్రభావం నుంచీ బయటపడుతున్న తరుణంలో ఒకవైపు ఉర్దూ మరోవైపు భ్రఝ్, మైధిలీ ప్రాదేశికాల ప్రభావాన్ని మమేకం చేసుకుంది. కాబట్టి, రాయడం దేవనాగరి లిపి ప్రకారం జరిగినా పలకడం “సహజంగా” పలుకుతారు. ఆ సహజత్వానికి ప్రతిఫలమే ఈ “తేడా”.

  నేను హార్యాణా లో చదువుతున్న రోజుల్లో వారి భాషని ‘శుద్ధ్ హిందీ’ (మనమిక్కడ నేర్చుకునేది)తో పోల్చుకుని హాస్యాలాడినా ఒకసారి వారి ప్రాదేశిక సాహిత్యం పరిచయమయ్యాక అబ్బురపడటం నావంతయ్యింది. హర్యాణవీ లోని కవితలూ,వ్యాసాలూ mainstream హిందీవాళ్ళు ఎంత గౌరవంగా తెలుసుకోవడానికి ఉత్సుకత చూపుతారో అర్థమయ్యింది. “తేడా”లను చూసి హాస్యాలూ,అపహాస్యాలూ చేసినా, ఆ తేడా హిందీ విస్తృతిలో ఒక గౌరవమైన జోడింపుగా సాహితీవేత్తలు ఎప్పుడో గుర్తించడం మొదలెట్టారు.

  తెలుగులో ఈ ధోరణి ప్రారంభమయినా, మన సంస్కృత ప్రభావం ఇంకా ఎక్కడో ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందనే అనుకోవాలి. భాష శుద్ధత పట్ల మనలోని కట్టుబాట్లకి,నమ్మకాలకీ మూలం ఎక్కడిది? నామిని, ఖదీర్ బాబు లాంటోళ్ళ పట్ల మన సాహితీవేత్తలు(?) చూపిన చులకన భావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

 6. అబ్రకదబ్ర permalink
  16 జూలై, 2009 10:38 ఉద.

  @మహేష్:

  పరభాషా ప్రభావం ఎప్పుడూ తప్పే అని ఎందుకనుకోవాలి? అలా మడి కట్టుకోబట్టే సంస్కృతం గంగలో కలిసింది, కట్టుకోలేదు కాబట్టే ఆంగ్లం వెలిగిపోతుంది. నాకైతే తెలుగులోకి ఐ, ఔ ఎక్కడినుండొచ్చాయన్నది ముఖ్యం కాదు. అవి తెలుగు మాధుర్యాన్ని ఎంతలా పెంచాయన్నది మాత్రమే ముఖ్యం. సంస్కృతానికే కాదు, తెలుగు మీద ఆంగ్ల ప్రభావానికీ ఇదే వర్తిస్తుంది. తెలుగు వ్యాకరణం, రూపం మౌలికంగా కనుమరగవనంతకాలం పర భాషల నుండి ప్రభావితమవటంలో తప్పు లేదనుకుంటాను.

 7. 16 జూలై, 2009 11:02 ఉద.

  @అబ్రకదబ్ర: పరభాషాప్రభావం ఎవ్వటికీ తప్పుకాదు. కానీ ఇక్కడ విషయం వేరు.

  భాషలతో ప్రభావితం అవ్వడం వేరు. అందులో విశాలత్వం అలవడుతుంది. మన భాషని మరో భాష మూసలో పొయ్యడం వేరు. అందులో బానిసత్వం కనిపిస్తుంది. తెలుగులో జరిగింది రెండో ప్రక్రియ. దాన్నొక్కదానే వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే అది “సహజం” కాదుగాబట్టి.

  ఇక ఆంగ్లం ప్రభావం అంటారా. దానితో నాకు ఏ సమస్యాలేదు. తెలుగులోకొచ్చిన కన్నడ,తమిళ,హిందీ,మరాఠీ,ఉర్ధూ,దక్కనీ హిందీ భాషాపదాలతో నాకు అస్సలు సమస్యలేదు. అవి విస్తృతిని పెంచాయేతప్ప “మూస కావాలని” దేబరించలేదు. తెలుగులో విభక్తి ప్రత్యయాలున్నంతవరకూ ఏ భాషాపదాన్నైనా “మనది” చేసుకోవచ్చు. రైలు,బస్సు దర్జాగా మనవి కావా? టైలరు,డ్రైవరూ మనవాళ్ళు కాదా!

  సమస్య పరభాషా ప్రభావం కాదు. పర భాషా వ్యామోహం కాదు. మూలభాషను పరాయిపరం చేసే ఉన్మాదం.

 8. 16 జూలై, 2009 10:03 సా.

  చంద్రమోహన్ గారు,

  హిందీలో “ఐ”,”ఔ”లు అందరూ ఒకేలా పలకరు. ఇక్కడ మీ మాస్టారు చెప్పిన “ऐ” ఉచ్చారణ makeలో “ఏ” కాదు, “mat”లోని “ఏ”. అలాగే “औ” ఉచ్చారణ “goat”లో “ఓ” కాదు, “god”లో “ఓ”. ఇది ఉర్దూ ప్రభావం వల్ల ఏర్పడినది.
  ए ओ లు సంస్కృతంనుండి వచ్చిన పదాలకి సంసృతంలోని ఉచ్చారణే (దీర్ఘాలు), “एक”లో లాగ. ఉర్దూ పదాలలో మాత్రం వాటికి హ్రస్వ ఉచ్చారణ, एहसान లాగ.
  హిందీ ప్రధానంగా ఉర్దూ భాష చేత చాలా ప్రభావితమయ్యింది. ఇది “రుద్దబడకుండా” జరిగిన “సహజ” పరిణామమా కాదా అన్నది నాకు తెలీదు.

 9. 16 జూలై, 2009 10:39 సా.

  అబ్రకదబ్ర గారు,
  తెలుగు బ్రాహ్మలు వేదం అందరికంటే బాగా చదువుతారన్నది అపోహే అని నా అభిప్రాయం. వేదపండితులు సాధారణంగా ఆరేడేళ్ళ వయస్సునుండే వేదాధ్యయనం ప్రారంభిస్తారు. వేదం చదువుకోవడం ముగించేటప్పటికి వారి సంస్కృత ఉచ్చారణపై మాతృభాషా ప్రభావం ఉండే అవకాశం చాలా తక్కువ. కనుక వేద పండితులెవరైనా సంస్కృతం చక్కగా పలుకుతారు.

  చదువరి గారు,
  నేనూ అలానే చదువుకున్నానండి. అందుకే నేనూ వెంటనే అంగీకరించలేక పోయాను.

  సుజాత గారు,
  క్లాసునుండి వచ్చాక నా సహోద్యోగి (ఉత్తర ప్రదేశీయుడు) ని అడిగాను. ‘మరి ఐశ్వర్య అన్న పదాన్ని మీరెలా పలుకుతారు’ అని. అతడు ఏశ్వర్య అనే పలికాడు. నేననుకోవడం హిందీ రాష్ట్రాల్లోనే వివిధ యాసల్లో పలుకుతారేమోనని.
  ట్యూషన్ చెప్పడం మాట దేవుడెరుగు! ముందు నేను పరీక్ష పాసవ్వాలని కోరుకోండి. లేకుంటే పిల్లలముందు తలెత్తుకోలేం మళ్ళీ:)

  రవిగారు,
  ఇవి అలాంటి పరీక్షలు కావండీ. కేవలం ఉద్యోగులకు ప్రాథమిక భాషా జ్ఞానం కలిగించడం కోసం ఉద్దేశించినవి. ఇవి పాసయితే హిందీ సాహిత్యం చదవగలిగే సామర్థ్యం వస్తుందని గ్యారంటీ ఏమీ లేదు.

 10. 16 జూలై, 2009 10:58 సా.

  మహేష్ గారు,
  హిందూస్థానీ భాష హిందీ, ఉర్దూలుగా విడిపోక పూర్వం బహుశ ఐ, ఔ లు ఉండేవి కాదు. హిందీ సంస్కృత ప్రభావంతోనే ఈ అచ్చులను అలా పలకడం ప్రారంభించి ఉండాలి. ఇప్పటికీ అసలైన ఐ, ఔ పదాలు వ్రాయాలంటే ఆఈ, ఆఊ అనే వ్రాస్తారు కదా (ఉదా: ఫైల్ ను హిందీలో फाईल అని వ్రాస్తారు).
  మీకు సంస్కృతంపై అంత కోపమెందుకో:) సంస్కృత ప్రభావంలేని తెలుగును ఊహించుకోగలమా (అది బహుశ లాటిన్, ఫ్రెంచి ప్రభావంలేని ఆంగ్లో-సాక్సన్ లా ఉండి ఉండేది!) ఒక భాషలో వ్యాకరణం వచ్చాక వ్యాకరణ శాస్త్రం కూడా తయారయిపోతుంది కదా. తరువాత వచ్చే భాషా వ్యాకరణాలు ఆ శాస్త్ర నియమాల ప్రకారంగానే నిర్వచిస్తారు. ఇక్కడ సంస్కృతానిది ‘being first’ advantage మాత్రమే.

  కామేశ్వర రావు గారు,
  వారు చెప్పింది make, goat లలోని ఏ,ఓ లేనండీ! ఐతే అది హిందీలోని ఒక యాస (బహుశ ‘ఖడీబోలీ’) మాత్రమేనేమో నని ఇప్పుడనిపిస్తుంది. ప్రభుత్వం తయారుచేసిన “మానక్ హిందీ” అనే ప్రామాణిక భాష ఉంది. లిపి, ఉచ్చారణ నియమాలను ఒక కమిటీ నిర్ధారిస్తుంది. అదే రాజభాషగా ఆమోదింపబడుతుంది. ఇది హిందీ రాష్ట్రాలలో పలికే యాసలకు భిన్నంగా ఉండవచ్చు కూడా. మరో సారి ఆయనతో చర్చిస్తాను:)

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: