Skip to content

చిల్లర శ్రీ మహావిష్ణువు

18 జూలై, 2009

శ్రీ మహా విష్ణువు పురుషోత్తముడా లేక చిల్లర దేవుడా అన్న మీమాంస ఈ మధ్య బ్లాగుల్లో తలయెత్తింది.ఎవరి వాదానికి వారు ఋగ్వేదం నుండి మొదలుపెట్టి కొకు గారి సాహిత్యం వరకు రిఫరెన్సులు ఇవ్వడం జరిగింది.

నిజానికి పరిశీలిస్తే విష్ణువు ఒక చిల్లర దేవుడిగానే మిగిలిపోయినట్లు ఘట్టిగా నిదర్శనాలు కన్పిస్తున్నాయి. అందుకోసం ఋగ్వేదందాకా వెళ్ళనవసరం లేదు.”ఆండ్రు బిడ్డలు దెచ్చు ప్రఖ్యాతె గాని, మొదటినుండియు నీవు దామోదరుడవె” అని మొన్న మొన్న నే మన కాసుల పురుషోత్తమ కవి విష్ణువును వెటకారం చేశాడు. పోనీ అంత ప్రఖ్యాతి తెచ్చిన ఆండ్రు బిడ్డలైనా ఆయన చెప్పుచేతల్లో ఉన్నట్లు కనపడదు. అందరికీ సిరులిచ్చే లక్ష్మీ దేవి ఇల్లాలయి వుండీ పాపం పెళ్ళి ఖర్చులకు కుబేరుడి దగ్గర అప్పుచేయాల్సి వచ్చిందంటే ఎంత చిల్లర బ్రతుకైపోయిందో చూడండి. ICICI వారి క్రెడిట్ కార్డు లోను లాగా ఎంతకీ ఆ అప్పు తరగడం లేదు. అందరూ విష్ణువును మాయావి అంటారు, వైష్ణవ మాయ అని అబ్బురంగా చెప్పుకొంటారు. కానీ పరిశీలనగా చూస్తే ఆయనంత వెర్రి వెంగళప్ప మరొకరున్నట్లు కనబడదు. పాలసముద్రం నుండి వచ్చిన గొప్ప గొప్ప వస్తువులన్నీ ఆయన తీసేసుకొని విషం మాత్రం శివునికిచ్చేశాడని లోకులు ఆడిపోసుకుంటారు. చిలికినంత సేపూ ఆయనే కూర్మంగా మారి అంత పెద్ద కొండనీ నడుం విరిగేలా మోసిన విషయాన్ని మాత్రం కన్వీనియెంట్ గా మరిచిపోతారు. శివుని సాహసం ప్రచారం అయినంతగా విష్ణువు మోసిన భారం విషయం మార్కెటింగ్ చేసుకోలేకపోయాడు. శివుడు విషం మింగితే అది గొంతు దిగకుండా అయన సతీమణి పీక పట్టుకుని బ్రతికించింది. అదే విష్ణువు మింగి ఉంటే ఏమయ్యేది? ఆయన భార్య కూడా ఆయనలాగే ఒక పిచ్చిమాలోకం. తనకు ఒక్క మాట చెప్పకుండా, చెంగు పుచ్చుకొని పరుగెత్తినా, పాపం ఎవరికే కష్టమో అని మౌనంగా వెనక పరుగెత్తిందే కాని, “ఆ భక్తుడేమైనా నిన్ను బొట్టుపెట్టి పిలిచాడా! రావే ఈశ్వరా అంటే శివుడు వెళ్ళాలి గాని నువ్వెందుకు ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నావ”ని అని ఒక్క మాటా ఆడి యెరుగదు కదా. అందరూ భోళా శంకరుడంటారు గానీ నిజానికి శివుడికున్నంత గడుసుదనం విష్ణువుకెక్కడిది? శివుని కుటుంబం చూడండి. భార్య ఆది శక్తి. పెద్ద కొడుకు గణాధిపతి. చిన్న కొడుకు దేవతల సైన్యాధ్యక్షుడు. తానో, స్వయంగా భూతనాధుడు.ఇలా దేవతల, భూతాల, పిశాచాల, ప్రమథ గణాల నాయకత్వమంతా తమకుటుంబంలోనే పెట్టుకొని కుటుంబ పాలనకు ఆద్యుడైన వాడు శివుడు. తనవారికంటూ ఒక్క పోస్టైనా ఇప్పించుకోలేని వాడు, ఎప్పుడూ తననే కీర్తిస్తూ తిరిగే మనవడు నారదుడు పాపం ముల్లోకాలూ పట్టుకు తిరుగుతుంటే వైకుంఠంలో కనీసం ఒక 30 x 40 సైటన్నా ఇప్పించి ఓ ఇంటివాడిని చేయలేనివాడు చిల్లరదేవుడుగాక మరేమౌతాడు!

పరిశీలనగా చూస్తే శివుడి వంశం విష్ణువు కుటుంబంపై ఒక పథకం ప్రకారం సాగించిన కుట్ర కోణాలు ఆవిష్కృతమౌతాయి. విష్ణువు కుటుంబంనుండి ఒక గొప్ప పోస్టునలంకరించిన బ్రహ్మదేవుని తలకాయను శివుడు ఆ అమ్మ తోడుగా అడ్డంగా నరికేసి ఆ కపాలాన్ని తన భోజనపాత్రగా మార్చుకొన్నాడు. బ్రహ్మకు ఇంకా నాలుగు తలలుండి బ్రతికిపోయాడు కానీ లేకుంటే ఏమై ఉండేది! అంత ఘోరం చేసిన శివుని అదేమనైనా ప్రశ్నించలేదు పాపం ఆ విష్ణువు. అది అలుసుగా తీసుకొని ఇంకో మానస పుత్రుడు మన్మధుని ఉత్తి పుణ్యానికి కాల్చి బూడిద చేశాడు. అంత జరిగినా శివుని పల్లెత్తి మాటనలేదు సరిగదా ఆయన పెళ్ళి దగ్గరుండి మరీ జరిపించాడా చిల్లర దేవుడు. లక్ష్మీదేవి సోదరుడైన చంద్రుని ఏదో ఒక వంక దొరికించుకొని శపించాడు వినాయకుడు. విష్ణువాహనుడైన పాపానికి గరుత్మంతుడి ఆహారమైన పాములు, ఎలుకలకు అండనిచ్చి గరుడుడు ఆహారానికి కటకటలాడేలా చేశారు. విష్ణువు కూతురైన గంగ పైనుండి దూకితే కిడ్నాప్ చేసినంత పని చేసి తన జటాజూటంలో కట్టి పడేశాడు శివుడు. ఇన్ని జరిగినా శివుడి కుటుంబంపై విష్ణువేమీ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించినట్లు కనపడదు. ఒక ఫ్యాక్షనిస్టుకున్న కసి, తెగువ కూడాలేని విష్ణువు చిల్లరదేవుడే అయివుండాలనడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు.

ఋగ్వేదంలో ఆయనను గురించి “సహస్ర శీర్షాత్ పురుష:, సహస్రాక్ష స్సహస్ర పాత్” అని వ్రాశారంటే విని మోసపోకండి. అందులోని లొసుగులను ఎత్తి చూపండి. సహస్ర శీర్షాలున్నప్పుడు, ద్విసహస్ర నేత్రాలు, ద్విసహస్ర పాదాలు ఉండాలి గానీ అవీ సహస్రమే ఎలా ఉంటాయి ? అని ప్రశ్నించండి. అందుకే ఈ వేద విజ్ఞానమంతా పుక్కిటి పురాణం అని గతితార్కిక భౌతికవాదం మద్దతు లేకుండానే చెప్పొచ్చు. వెయ్యి తలలకీ వెయ్యి కళ్ళే ఉన్న విష్ణువు ఒక్క తలకు మూడు కళ్ళున్న శివునితో పోల్చితే, ఆ మాటకొస్తే తలకు వేయి కళ్ళున్న ఇంద్రునితో పోలిస్తే చిల్లర దేవుడు కాక మరేమవుతాడూ? అందుకే విష్ణువుని ఉపేంద్రుడన్నారేమో!

ఇన్ని చెప్పినా విష్ణువు చిల్లరదేవుడని మీరు నమ్మకపోతే అది ఖచ్చితంగా వైష్ణవ మాయే!

(గమనిక: ఇదంతా నా అభిప్రాయం మాత్రమేననీ, ఎవరినీ వ్యక్తిగతంగా ఉద్దేశించలేదనీ మనవి. తిట్టాలంటే నన్నే తిట్టండి-ఇతరులను కాదు)

ప్రకటనలు
35 వ్యాఖ్యలు
 1. Malakpet Rowdy permalink
  18 జూలై, 2009 2:13 ఉద.

  LOL!

 2. 18 జూలై, 2009 2:28 ఉద.

  శబాష్! భలేగా రాశారు

 3. uma permalink
  18 జూలై, 2009 4:20 ఉద.

  You are Amazing ! Awesome, Awesome I say !

 4. 18 జూలై, 2009 7:53 ఉద.

  దశావతారాలంత మార్కెటింగ్ జరిగాక ఇంకా విష్ణువు salable కాదంటారేమిటి? వేదకాలం తరువాత అత్యంత విస్తృతమైన మార్కెట్ ఉన్న దేవుడు విష్ణువు. వివిధబ్రాండ్లలో కొలువై, మొత్తం భక్తి సప్లైచైన్ ను సుస్థిరం చేసుకున్న దేవుడు విష్ణువు. Fixed finances,assets and bonds పక్కనే పెట్టుకుని మార్కెట్ షేర్ విపరీతంగా పెంచేసుకుని, భక్తి సెన్సెక్స్ లో భారీ లాభాల్ని గడిస్తున్నాడు. ఇంకా salable కాదంటారేమిటి?

 5. 18 జూలై, 2009 8:47 ఉద.

  మీరు మళ్ళీ శైవ, వష్ణవ వివాదాలు సృష్టించేలా ఉన్నారు 🙂

 6. 18 జూలై, 2009 8:51 ఉద.

  మీ టపా రాఘవేంద్రుడనే దర్శకేంద్రుడు చూస్తే, శివుడిని, విష్ణువును ప్రధాన పాత్రలలో పెట్టి ఒక రాయలసీమ ఫాక్షన్ సినిమా తీసేయగలడు. చివర్లో సుమోలు పేల్చడానికి శివుడి మూడో కన్ను ఎలాగూ ఉంది.

  ఇక విష్ణువును మీరెంత వెనకేసుకొచ్చినా నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయ్.

  భృగు యూనివర్సిటీ వారు కామన్ ఎన్ట్రన్స్ టెస్ట్ పెడితే, “రామబ్రహ్మం” కన్నా తెలివి తేటలు ప్రదర్శించి, కన్వీనర్ కే మొదట అమ్యామ్యాలు, ఆ తర్వాత చేయి చేసుకోడాలు చేసి టాప్ రాంక్ కొట్టేసినది ఎవరు?

  నారదుణ్ణి ఇంటి వాణ్ణి చేయకపోవడం వెనుక కుట్రే తప్ప భోళా తనం లేదు అధ్యక్షా! సదరు నారద్ గారు నిజానికి సంసారి కావాలనుకున్నారు. ఆతనికి వైష్ణవ మాయలు అవీ చూపెట్టి, జీవితాంతం నిలయ విద్వాంసుడిగా మార్చేశారు దేవర వారు.

  రాక్షసులకు వరాలిచ్చినట్టే ఇచ్చి, వారి ద్వారానే తను అవతారాలు ఎత్తి, తన మార్కెటింగ్ రేంజ్ పెంచుకున్న జాణ తనమూ ఈయనదే.

  తులసి అనే ఆవిడను మోసం చేసి, ఆ తర్వాత అనుగ్రహించి, “మొక్కే కదా అని పీకేశారో, పీక కోస్తా!” అని మానవులకు ధంకీ ఇచ్చినదీ ఆయనే. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి లెండి.

  మన మతంలో “ఫత్వా” ఫెసిలిటీ లేదు కాబట్టి ధైర్యంతో ఈ వ్యాఖ్య రాశాను. అంతకంటే దురుద్దేశం ఏమీ లేదు.

 7. 18 జూలై, 2009 9:28 ఉద.

  బాగుంది. అసలు బోళాశంకరుడని అనడం కూడా సరైంది కాదు. బోళా విష్ణువనాలి. అదేపనిగా నోరుపెట్టుకుని తనను తిట్టిపోసినవాళ్ళను కూడా, పనిగట్టుకుని అవతారాలెత్తి మరీ చంపేసి, వాళ్ళకు పెందలాడే మోక్షమిచ్చేసిన బోళాదేవుడాయన. అసలందుక్కాదూ.. ఇప్పుడు కూడా ఆయన్ని పట్టుకు తిట్టేసే జనం తెగబడిపోతున్నదీ? వాళ్ళను చిల్లరజనం అని అనుకుంటాంగానీ.. మా తెలివిగలవాళ్ళు సుమండీ!

  మహేష్ కుమార్ గారు, మీరీ విషయంలో గట్టి లెక్కలే వేసుకుని ఉన్నట్టు కనబడుతోంది. ఈ మొత్తం ఎస్సెట్లూ, బాండ్లలో మీ వాటా కోసం అవసరమైతే ఉద్యమం చేపట్టేట్టే ఉన్నారు! మీ ప్రయత్నాలు ఇప్పటికే మొదలెట్టుంటారనుకోండి. కానీ మీకు పోటీగా చాలామంది హేతువాదులు, దాదాపుగా అందరు నాస్తికులూ, కొందరు దళితవాదులూ, దొంగ హిందువులూ, దొంగ లౌకికవాదులందరూ కూడా ఉన్నారు సుమండి.. వాళ్ళతో జాగర్త.. అవకాశం దొరగ్గానే మిమ్మల్ని ఎనక్కి తోసేసి, బోళావిష్ణువు కాళ్ళట్టేసుకుని మోక్షం కొట్టేసే బాపతు మరి!

 8. 18 జూలై, 2009 11:10 ఉద.

  భలే! ఇన్నాళ్ళూ ఏదో మాయలో పడి, కళ్ళముందున్న కటిక నిజాలని చూడలేని యీ నా కళ్ళును ఈనాడు పూర్తిగా తెరిపించారండీ! టోపీలు తీయబడినవి.
  రవిగారు, మీరిలా కామెంటి ఊరుకుంటే సరిపోదండీ. “మాయలమారి మహావిష్ణువు” అని మీరో టపా రాయాల్సిందే!

 9. 18 జూలై, 2009 2:11 సా.

  భలే! అద్భుతమైన టపా…

 10. 18 జూలై, 2009 8:21 సా.

  @చదువరి. Jokes apart, సమాజానికి అనుగుణంగా దేవుడు మారాడనే నిజం మనచుట్టూ ప్రతిరోజూ కనిపిస్తున్నదే. దాన్ని అర్ధం చేసుకోవడం అవసరం.

  హఠాత్తుగా 90 లలో అయ్యప్ప మాలవేసేవాళ్ళు పెరగడం. ఇప్పుడు షిర్డీ సాయిబాబా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పట్టణాలలో ‘కొత్తదేవుడిగా’ వెలవడం వెనుక ఎన్ని మార్కెటింగ్ స్కీములున్నాయో తెలుసుకోకపోతే ఎట్లా!

 11. చంద్ర మోహన్ permalink
  18 జూలై, 2009 9:58 సా.

  మలక్పేట్ రౌడీ గారు (!) , కొత్తపాళీగారు, ఉమ గారు
  ధన్యవాదాలు.

  మహేష్ గారు,

  దశావతారాల్లో ఓ రెండు, మూడు తప్పించి ఇంకేవీ పెద్దగా మార్కెట్ కాలేదంటాను. దశావతారాలు ఒక కాన్సెప్ట్ గా మార్కెట్ అయింది బహుశ కొండపల్లి బొమ్మల విషయంలో మాత్రమే. విష్ణువుకు అంతో ఇంతో పూజలు జరుగుతున్నది వేంకటేశ్వరుని పేరున. అది దశావతారాల్లోఒకటి కాదు. కృష్ణా జిల్లా శ్రీకాకుళంలోని మహావిష్ణువు ఆలయం పరిస్థితి చూస్తే తెలుస్తుంది మీకు, పాపం ఆయన మార్కెట్ విలువ ఎంతో. ” ఆకాశాత్పతితం తోయం యథా గఛ్ఛతి సాగరం; సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతి గఛ్ఛతి” అని చెప్పిన వారెవరో గానీ, విష్ణువుకు ప్రత్యేక పూజలు అనవసరం చేసేసి తీరని అన్యాయం చేశారు. అదే నా ఆక్రోశం :).

  బృహస్పతి గారు,
  వివాదాలు సృష్టించడం ఇప్పటి ట్రెండ్ కదా. చారిత్రిక అన్యాయాలను వెలికితీయవద్దా :).

  రవిగారు,

  శివారెడ్డి, కేశవరెడ్డి ల సంగ్రామం… ఒక్క సారి ఊహించుకోండి ఎంత రంజుగా ఉంటుందో! ఐతే లాభంలేదు. శివుని ప్రమథగణాలు ఆవేశం వస్తే ఎంత రచ్చచేస్తారో దక్ష యజ్ఞ విధ్వంసమప్పుడు గొప్పగా వర్ణించాడు నన్నెచోడుడు. కామేశ్వర రావుగారిని అడిగి చూడండి! మచ్చుకు ఓ పద్యం:

  “వాహనంబునెక్క వచ్చి భయమ్మున
  వణకి నేలబడ్డ వనజగర్భు
  గమిచికొని మరాళము వారె చెందమ్మి
  గరచికొని రయమున బరచినట్లు “

  ప్చ్! మా అమాయక విష్ణువుకు అలాంటి రౌడీలు, అంత మందీ మార్బలం లేరు.
  కామేశ్వర రావుగారి రిక్వెస్టే నాదీ. పోస్టేయండి, అప్పుడు చూసుకొందాం!!

  చదువరి గారు, ప్రవీణ్ గారు
  నెనర్లు!

  కామేశ్వర రావు గారు,
  మాయ తొలగిపోయింది కదా! నన్నెచోడుని పద్యాలను మాకోసం పరిచయం చేయకూడదూ.

 12. 19 జూలై, 2009 12:46 ఉద.

  మన మతంలో “ఫత్వా” ఫెసిలిటీ లేదు కాబట్టి
  :-))

  bollojubaba

 13. 19 జూలై, 2009 6:52 సా.

  అద్భుతం అండి. బాగా వ్రాసారు. జనాలు ఆవేశపడిపోయే ఇలాంటి అంశాలమీదనే హాస్యం బాగుంటుంది.

  కానీ మన తెలుఁగు వాళ్ళ విషయంలో ఒక మాట చెప్పుకోక తప్పదు. మీరే పరమశివ భక్తులనుకోండి, లేదా శక్తి ఆరాధకులు అనుకోండి. మీకు విష్ణావతారాల మీద దొరికినన్ని కీర్తనలు దొరుకుతాయా అంటే, ప్చ్ అబ్బే సమస్యే లేదు. రామదాసు, అన్నమయ్య, త్యాగయ్య వంటి ప్రముఖులందరూ రామనామం, విష్ణునామం జపించినవారే. ఇక అన్నమయ్య చేతనన్ని సంకీర్తనలూ వ్రాయించుకున్నది, ఒక valid అవతారం కూడా కాదంట. హతవిధీ. యఱ్‌ఱ్. వైష్ణవమాయా… అన్నట్టు అన్నమయ్య వారు తొలుత శివభక్తులఁట, ఎవరో హరిదాసులతో చేరి పార్టీ ఫిరాయించారని తితిదే భక్తి స్రవంతిలో విన్నాను (అక్షరాలా అదే మాటల్లో కాదనుకోండి).

  మొత్తాని మా శివశక్తి ఆరాధకులు ఎంతో కష్టపడి ఏ శ్యామశాస్త్రి కీర్తనలో ముత్తుస్వామి దీక్షితులు కీర్తనలో వెదుక్కోవాలి. ఇక మధ్యమధ్యలో అడ్డమైన సినిమాల వాళ్ళూ, పశుపతి అని ప్రతినాయకుని పేరు పెట్టుకొని హింసిస్తూంటారు.

  ఇక బ్రహ్మ విషయం, పాపం త్రిమూర్తులలో ఒకడు. మెల్లగా మొదట విష్ణువుకు కొడుకైనాడు, తరువాత తలకాయల్లో ఒకటి తగ్గింది. సృష్టి ఎలాగూ జరిగిపోయిన విషయమే, మనకు కాలో కన్నో లేకపోతే అది ఎలాగూ మార్చలేము, గతం గతః అని నమ్మిన జనాలు ఈనాటికి కనీసం ఒక్క గుడికూడా మిగిల్చలేదు ఆయనకు. ఆయనకిచ్చి చేసిన మా శారదమ్మకి కట్నం డబ్బుగా చదువు వుండి ఈ ఎంసెట్ల, టాలెంట్‌షోల కాలంలో నాలుగు కొబ్బరికాయలు దొరుకుతున్నాయి, లేకుంటే ఏమైపోయేది?

  ఇక ఇంద్రుడు వంటి ఇతర దేవుళ్ళో… గోవర్ధనపర్వతం క్రింద నలిగిపోయాడు దేవేంద్రుడే స్వయానా పాపం! ఒకప్పుడు బుద్ధుడేలిన కృష్ణానది తీరం నుండి యతనును జపాను పంపించారు మనవాళ్ళు. వివిధ బాబాలు నేడు ఊళ్ళు పంచుకున్నారు!

  recessionలు, కష్టకాలాలూ పాపం దేవుళ్ళకు కూడా వస్తాయనుకుంట!

  రాకేశ్వర

 14. 19 జూలై, 2009 7:27 సా.

  రాకేశ్వర గారు,
  నెనర్లు.

  “…ఈనాటికి కనీసం ఒక్క గుడికూడా మిగిల్చలేదు ఆయనకు…” పుష్కర్ లో బ్రహ్మ దేవునికి ఒక పెద్ద ఆలయం ఉంది అని విన్నాను. పొన్నూరులో కూడా నేను ఒక బ్రహ్మదేవుని గుడి చూశాను. రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు గారు కట్టించారట.

 15. sravya permalink
  19 జూలై, 2009 7:54 సా.

  పొన్నూరులో కూడా నేను ఒక బ్రహ్మదేవుని గుడి చూశాను. రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు గారు కట్టించారట.>>

  అది చేబ్రోలు లోనండి !

 16. 19 జూలై, 2009 10:01 సా.

  దేవుడిని కథలలో ఒక పాత్రగా , గుడిలో కేవలం ఒక విగ్రహంగా చూసినంతవరకు, ఇటువంటి సంభాషణలే చోటుచేసుకుంటాయి. ఏ విధంగా మనము నాటకాలు, రూపకాలు, సినిమాలలో ఎన్నో విషయాలను చూసినా, కేవలం మనకు కావలసినది మాత్రమే గ్రహిస్తామో. అలాగే, మనము మన గ్రంథాలలోని మంచిని, నీతిని మాత్రమే గ్రహించాలని నా భావన.

  రామాయణాన్ని పలు రచయితలు రచించారు. కొన్ని basic అంశాలు తప్పితే, ఒక్కొక రచయిత ఒక్కో రకంగా రచించారు. మరి మనము దేనిని నమ్మాలి? మనము ఈ విషయం మీద పరిశోధించాలా? పరిశోధించి ఏమి సాధిస్తాము? దేవుడు చిల్లరనా? కాదా? అని కనుగొని ఏమి సాధిస్తాము.

  ఇంటువంటి ఆలోచనలు సల్పకుండా, వారు ఏమి చేసారు? దానిలోని ఆంతర్యమేమిటి? ఆ విషయాలను మన నిజ జీవితాలకు ఏవిధముగా అన్వయించుకుని లాభపడవచ్చు? అని మనం ఆలోచించినట్లైతే ధన్యులవుతాము.

 17. 19 జూలై, 2009 11:16 సా.

  శ్రావ్య గారు,
  నిజమేనండి, చేబ్రోలులోనే చూశాను. సరిదిద్దినందుకు నెనర్లు!

  సాయి ప్రవీణ్ గారు,
  మీరు చెప్పింది నిజమే. ’యద్భావం తద్భవతి’ – మనం ఏది చూడాలనుకొంటామో అదే కనిపిస్తుంది, అదే వినిపిస్తుంది.

  “…మరి మనము దేనిని నమ్మాలి?…” ఈ విషయంలో సాధారణంగా మూడు మార్గాలున్నాయి. చదివిన ప్రతిదాన్నీ నమ్మడం, అసలు దేనినీ నమ్మక పోవడం, ఏదో ఒకదాన్ని యథాలాపంగా నమ్ముకొని మిగిలిన వాటిని గుడ్డిగా తిరస్కరించడం. ఇవన్నీ కాక నాలుగో మార్గం ఒకటున్నది. అన్నింటినీ పరిశీలించి, పరిశోధించి, స్వయంగా గానీ, గురుముఖత గాని విచక్షణా ఙ్ఞానాన్ని పెంపొందించుకోవడం, ఏది ఉపాదేయమో ఏది విసర్జనీయమో తెలుసుకొని ఆచరించడం. అవసరమైతే మన నమ్మకాలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉండడం. మీ తరువాతి ప్రశ్న ” ఏమి సాధిస్తాము?” అన్నదానికి జవాబు కూడా అదే.

  నిజానికి అంత బరువైన విషయాలను ఆలోచించి నేనీ టపా వ్రాయలేదండీ 🙂 . సరదాగా వ్రాశానంతే!

 18. 20 జూలై, 2009 10:38 ఉద.

  అన్నట్టు, విష్ణుమూర్తి శ్లోకం కూడా శివుడు ఫేమిలీ హైజాక్ చేసేసింది ఒకటుంది! ఏవిటో చెప్పుకోండి చూద్దాం?

 19. 20 జూలై, 2009 11:55 ఉద.

  శుక్లాంబరధరం … ?

 20. సుజాత permalink
  20 జూలై, 2009 12:13 సా.

  చంద్ర మోహన్ గారూ,ఏదో ఇంత బూడిద పూసుకుని స్మశానాలు పట్టుకుని తిరిగే ఆది భిక్షువు ని ఎన్నెన్ని మాటలన్నారండీ? ఆయన ఏమైనా వజ్రకిరీటాలూ, గోపురాలకు బంగారు తొడుగులూ అడిగే వాడు కాదే! అదేదో సినిమాలో రావు గోపాల రావు అన్నట్లు “శివాలయంలో ఏముంది బూడిద, విష్ణాలయంలో దొరుకుతుంది పద చక్రపొంగలి”అనీ…..శివుడు క్షీరాన్నాలు, దద్ధోజనాలూ అడగడే! నెత్తి మీద కాసిన్ని నీళ్ళూ,ఆకులూ, కాడలు కూడా లేని తుమ్మి పూవులూ తప్పించి! అయినా ఇంత ఆడిపోత తప్పలేదు! రాకేశ్వర చెప్పినట్లు అందరూ విష్ణువుని కీర్తించే వారే కానీ శివుడిమీద పంచరత్నాలైనా రాశారా?(రాశారేమో…తెలీదు)

  శ్రీశైలంలో తప్పించి నిత్యమూ సుప్రభాతం ఎవరైనా కాసెట్టైనా వేసుకుంటారా శివుడికి!

  ఎంతసేపూ తిరుగుడేనాయె! లేకపొతే వణుక్కుంటూ మంచుకొండల్లో సరైన బట్టలు కూడా లేకుండా డాన్సాడుకోవడం! నగలూ, నాణ్యాలూ అసలే అఖ్ఖర్లేదు. ఇది తప్ప “మెత్తని” పరుపు మీద బజ్జుని భార్య చేత కాళ్లైనా పట్టించుకుంటాడా అంటే అదే లేదే! ఇన్నిన్ని కుట్రలు మోపుతారా ఆది దేవుడి మీద! న్యాయమా!

  భలే రాశారండీ! నిజానికి జనం అనవసరంగా ఆవేశపడిపోయే ఇలాంటి వాటిమీదే హాస్యం బాగుంటుంది. బావుంది మీ పోస్టు. నా మనోభావాలు మాత్రం శివుడి వైపునుంచి ఆలోచించి గాయపడ్డాయి.ప్చ్!

 21. 20 జూలై, 2009 12:56 సా.

  కామేశ్వర రావుగారు,

  రవి గారు చెప్పిన శ్లోకమే నాకూ గుర్తుకొచ్చింది. కరక్టేనా?

  సుజాత గారు,
  చూశారా, నా వాదనకు ఇంతకంటే ఋజువేంకావాలి! అందరూ విష్ణువు వైభవం చూసి కుళ్ళుకొనేవారే గానీ ఆయనకు మద్దతుగా ఒక్కరైనా నా వాదనను బలపరిచారా! కలియుగం మరీ ఇంత ఘోరంగా ఉందేమిటి చెప్మా!!

  “నా మనోభావాలు మాత్రం శివుడి వైపునుంచి ఆలోచించి గాయపడ్డాయి.” – శివుని గురించి ఇలా వ్రాశానని మా అమ్మకు తెలిస్తే ఇంతేసంగతులు. శివుడైనా క్షమిస్తాడేమో కాని మా అమ్మ క్షమించే ప్రసక్తే లేదు 🙂

 22. 20 జూలై, 2009 2:17 సా.

  బాగా వ్రాశారు.

  —-

  ఎవడ్రా వాడు మా లార్డ్ వెంకట్ గురించి కూసింది?
  కలి యుగ ప్రత్యక్ష దైవం.
  యుగ వలయ చక్రాల్లో ఏ కలి యుగమో మేము చెప్పామా? ఎప్పుడో వెనకటి కలియుగం అది, ఇప్పుడు మీ పాపాలు పండించటానికి ఇంకా కల్కి రాలేదు లేండి అప్పటి వరకు వదరండి.

  —–

 23. 20 జూలై, 2009 2:50 సా.

  భలే రాసారు. చాలా రోజుల తర్వాత టపాని ఎంజాయ్ చేసాను.

  కాకపోతే సుజాత గారిలాగే నా మనోభావాలు కూడా గాయపడిపోయాయి. అసలు శివుడ్నేమన్నా అంటే ఆట్రాసిటీ కేసు వేసే హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామధ్యక్షా. అన్నిచోట్లా ప్రభ వెలిగిపోయే దేవుడ్ని వదిలేసి స్మశానాలలో తిరిగేవాడి మీద పడి ఏడుస్తారా? ఒక్క సీటు వచ్చిన లోక్‍సత్తా మీద పడి తెదేపా వాళ్ళు ఏడ్చినట్టు.

  పైన చెప్పినట్లు శివుడి మీద కీర్తనల కోసం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ పెట్టి వెతుక్కోవాల్సి వస్తోంది. మీ విష్ణువుకేమండి, ఖాళీగా ఉన్న కత్తిని పంపించి బోలెడు కీర్తనలు రాయించుకున్నాడు. చేతిలో కత్తి లేకపోయినా నాలుగు చేతుల్లో ధరించటానికి బోలెడు ఐటమ్స్. ఇన్ని పెట్టుకుని మళ్ళీ పెళ్ళి కోసం శివుడికున్న విల్లు విరిచేసాడు. ఏదో వరమిచ్చిన పాపానికి బాణుని వాకిట కాపలా కాస్తున్న వారి మీదకు సైన్యాన్ని వేసుకుని దౌర్జన్యానికి దిగింది కాకుండా, మళ్ళీ మా దేవుడికి రౌడీ మాకలున్నాయంటూ రివర్స్ కేసు బనాయిస్తారా, హన్నా. మీ దేవుడు మందర పర్వతాన్నేమన్నా ఊరికే మోశాడా? వచ్చిన వాటిల్లో మంచి మంచి వన్నీ తీసేసుకున్నాడు, మిగిలినవి తన వాళ్ళకు(దేవతలకు) పంచిపెట్టుకున్నాడు. విషం తాగినందుకు మా దేవుడికొచ్చిందేమిటి బూడిద. పోనీ ఆయన్ని పూజించే అసురులకు ఏమన్నా వచ్చాందా అంటే అదీ లేదు. గుక్క అమృతం తాగలేకపోగా, చిలికినందుకు బాడీ పెయిన్స్ మిగిలాయి. మా శివుడు ఏమీ తీసుకోలేకపోయాడు, తన వాళ్ళకు ఇప్పించుకోలేకపోయాడు పాపం.

  మీ దేవుడికి ఒక్క అవతారం క్లిక్ అయితే చాలదా, దాని సంపాదనతో రాష్ట్రంలోని మిగతా వైష్ణవాలయాలన్నిటినీ పోషించేస్తున్నారు. మా దేవుడికేమో మైంటెనెన్స్ ఖర్చులకు కష్టంగా ఉంది చాలా చోట్ల. అసలు మీ దేవుడికున్నంత వైభోగం ఇంకెవరికన్నా ఉందా. బోలెడంత గొల్డు, ఏడు కొండల రియల్ ఎస్టేటు, వేలల్లో భార్యలు (కాళ్ళు పట్టటానికొకరు, కాల్తో తన్నటానికొకరు). మా శివుడికేముందండి ఉన్నది ఇద్దరు. ఒకరికి సగం ఆస్తి, ఇంకొకరికి తల సమర్పించుకోవలసి వచ్చింది. ఉన్న భక్తులైనా సరైనా వాళ్ళా అంటే అదీ లేదు. అంతా తిక్క మంద. ఒకడు కొంపని పునాదుల్తో సహ లేపి నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇంకొకడు ఏకంగా నెత్తి మీద చెయ్యే పెట్టబోయాడు. ఇంకో పెద్దమనిషి దాహమేసిందని, నీకు ఇద్దరు భార్యలెందుకు వేస్టు మాకొకర్ని ఇచ్చేయమని తగువేసుకుంటాడు. వీళ్ళందరితో ఏగుతున్న మా దేవుడ్ని పట్టుకుని ఇన్నేసి మాటలంటారా.

 24. sbmurali2007 permalink
  20 జూలై, 2009 3:49 సా.

  నాకీ పోస్టూ, వ్యాఖ్యలూ చాలా నచ్చాయి.
  స్నేహితుల మీద చనువుగా జోకులు వేసినట్టు దేవుడి మీద కూడా అప్యాయంగా జోకులేసుకొని నవ్వ గలగటం బహుశా మన అదృష్టం.
  శారద

 25. 20 జూలై, 2009 5:36 సా.

  ఒక్క సీటు వచ్చిన లోక్‍సత్తా మీద పడి తెదేపా వాళ్ళు ఏడ్చినట్టు…., ఇది సూపర్బ్!

  చైతన్య కృష్ణ,
  మీరు బోలెడు పాయింట్లు పట్టుకున్నారు. మీ వ్యాఖ్య చదివాక మరీ బాధ వేసేస్తోంది.

 26. 20 జూలై, 2009 7:12 సా.

  చైతన్య కృష్ణ గారు చాలా విషయాలు చెప్పేశారు.

  శివా రెడ్డి గారు అందరికీ మేలు జరగాలని హాలాహలం మింగితే, కేశవ రెడ్డి గారు? అమృతం అస్మదీయులకు పంచడం కోసం మోహిని అవతారం ఎత్తారు! ఆ మోహిని వేషానికి శివయ్య కూడా దాసోహమన్నాడు, ఇది విష్ణు మాయని తెలుసుకోలేక.

  అసలు సృష్టి , స్థితి, లయలు అన్న పోర్ట్ ఫోలియోల విషయంలోనే త్రిమూర్తిమధ్యముడు (బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే సీక్వెన్స్ ప్రకారం మధ్యముడు అంటున్నాను) తన చక్రం తిప్పేడు. గానుగెద్దు లాంటి పోర్ట్ ఫోలియో బ్రహ్మకు కట్టబెట్టేడు. నెగటివ్ హీరో ఛాయలున్న పోర్ట్ఫోలియో శివయ్యకు అంటగట్టేడు. తను మాత్రం హాయిగా మిల్క్ ఓషన్ మధ్యలో ఇల్లు కట్టుకుని శ్రీ దేవితో కాళ్ళు పట్టించుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు.

  అసలు మా శివయ్య దగ్గరేముందండీ బూడిద తప్ప? ఆంత చలిలో ఓ నాలుగు జతల బట్టల్లేవు! ఉన్నదొక్క మృగచర్మం . అదీ ఎవరికో అనుగ్రహం ఇచ్చినందుకు గాను మోస్తున్నాడు. ఈయనేమో? “చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి!” శివయ్య హెంత అమాయకుడంటే, ఎవరో మార్కండేయులు అనే అబ్బాయ్ ని సమవర్తి తీసుకెళుతుంటే, తను లయకారుడు, యముడు తన గ్రూపే అన్న విషయం కూడా పట్టించుకోక ఆ మార్కండేయులు ను రక్షించాడు. అంత దూరమెందుకు? స్వయంగా తన మెడ మీదున్న పాముల మీద గరుత్మంతుడి దౌర్జన్యాన్నే తిప్పి కొట్టలేక పోయాడు.

  చివరకు రాయల ప్రాపకం కోసం లింగడు కాస్త కృష్ణుడవవలసి వచ్చింది. అంత రేంజ్ ఆయనది!!!

 27. 21 జూలై, 2009 12:49 సా.

  @kcmohan
  no offence. సందర్భం వచ్చింది గనక, నేను మా మిత్రులకు ఎప్పుడో తెలపాలని అనుకున్న విషయము మీ ద్వారా తెలప గలిగాను. ధన్యవాదములు.

 28. 12 ఆగస్ట్, 2009 7:42 సా.

  @సుజాత
  “ఒక్క సీటు వచ్చిన లోక్‍సత్తా మీద పడి తెదేపా వాళ్ళు ఏడ్చినట్టు…., ఇది సూపర్బ్! ” – ha ha ha

  చంద్రమోహన్ గారూ, మీ టపాయే అనుకుంటే, ఇహ ఈ కామెంట్ల వరస .. అద్భుతం. నేను సుమారు రెండేళ్ళుగా చూస్తున్న తెలుగు బ్లాగుల్లో అతి సరసమైన బ్లాగుటపాల్లో ఇదొకటని ఒప్పుకోవాలి. అభినందనలు!!

 29. 22 అక్టోబర్, 2009 8:01 సా.

  superb sir……

 30. 5 నవంబర్, 2009 5:21 సా.

  చాలా బావుందండీ.. టపాతో పాటు వ్యాఖ్యలూనూ..

 31. 20 ఫిబ్రవరి, 2010 12:03 సా.

  మీ విష్ణు కథ బాగుంది. దానికి ఇంతమంది వ్యాఖ్యానం ఇంకా బాగుంది. మనం మనం కాబట్టి సరిపోయిది అదే ఆర్.ఎస్.ఎస్, వి.హెచ్.పి వాళ్ళు చూస్తే పెద్ద గొడవే కదా. కలియుగం లో ఇలా కొట్టుకుంటామని తెలిసే వేదాలలో ఒక మాట చెప్పారు శివకేశవులకు అభేదం చెప్పకూడదని. నేను మాత్రం జై శంకర, జై కేశవ..

 32. Razesh permalink
  8 మార్చి, 2010 6:42 సా.

  baagundandee mee varnana..

 33. కమల్ permalink
  9 మార్చి, 2010 3:55 సా.

  మొత్తానికి పురాణ ఇతిహాసాల మీద బాగానే హాస్యాన్ని పండించారు అందరూ..! ఇక పోతె శివకేశవులిద్దరు ఒకే ఆలయప్రాంగణం లో పూజలందుకున్నారు, అది కడపజిల్లా లోని దక్షిణ భారతదేశ మొట్టమొదటి ” శ్రీ ఆది శంకరాచార్యుల ” వారి పీఠము అయిన ” పుష్పగిరి ” లో శైవులు, వైష్ణవులిరువురిచేత పూజలందుకున్నారు. ఒక సారి నా బ్లాగ్ లో చూడవచ్చు.

  http://mahavarnam.blogspot.com/

 34. Prasanth permalink
  10 మార్చి, 2010 3:02 సా.

  Definitely one of the best blogs i have read. Thanks a lot for the fun.

 35. Durga permalink
  8 జూలై, 2010 4:16 సా.

  The guy who has written that forgot that Lord Shiva has taken birth from Brahma…. in the sense, Lord SriMahavishnu is the grand father of Lord shiva on the other way.

  Why Grand father (Sri Maha Vishnu) shuold get angry on a grand son (Lord Shiva) ?. They are all one family only.

  ————————————-

  This is feedback from my friend. Is it? Please clarify.

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: