Skip to content

తెలుగు లో ఫిజిక్స్ ?! (లేక ఫిజిక్స్ లో తెలుగు?!) అను సంవాదము

7 జూన్, 2009

కొంత కాలం క్రితం ఒక మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు ఒక చర్చ వచ్చింది. విజ్ఞాన శాస్త్ర విషయాలను తెలుగులో అర్థమయ్యేలా చెప్ప వచ్చా అని. ముఖ్యంగా భౌతిక శాస్త్ర సూత్రాలను తెలుగులో ఎలా అనువాదం చేయగలమని. మాటల్లో అతనన్నాడు, హాస్యంగా: ‘ సూత్రాలను పద్యాల్లో చెప్పితే ఇంకా తమాషాగా ఉంటుందేమో’ అని. నిజంగానే పద్యాల్లో ఛందస్సు వలన ఒక తూగు, ఒక సౌష్ఠవ రూపం ఉంటుందని, అందు వలననే కవుల వచన సాహిత్యం కంటే పద్య సాహిత్యం జనుల నాలుక పై ఎక్కువగా ఆడుతుంటుందనీ, సూత్రాలను పద్యాల్లో చెబితే గుర్తుంచుకోవడం సులభం కావచ్చనీ నేనన్నాను. “ఐతే కెప్లర్ నియమాల్ని పద్యాల్లో చెప్పు చూద్దాం” అని సవాలు విసిరాడా మిత్రుడు. నేనూ అందుకొని సూత్రాలను అనువాదం చేయడం ప్రారంభించాను. కెప్లరు గ్రహగతి నియమాలు ఇవీ (ఆంగ్లంలో) :

Kepler Laws of Planetary Motion:


1. Every Planet revolves around the sun in an elliptical orbit, with the sun at one of its foci.

2. The areal velocity of the radius vector is constant. In other words, the line joining the planet with the sun will sweep equal areas in equal intervals of time.

3. the square of the time period (time taken by planet to complete one revolution around the sun) is inversely proportional to the cube of the semi-major axis of its orbit.


చూస్తే చాలా కష్టమే అనిపించింది. ఐనా ధైర్యం తెచ్చుకొని పై నియమాలకు నా అనువాదం ఇలా ప్రారంభించాను:

౧.
ప్రతి గ్రహము యినుని చుట్టును
గతి దప్పక దీర్ఘవృత్త కక్ష్యను దిరుగున్
సతతము యుండును భానుడు
అతివృత్తపు రెండు నాభులందొక దానిన్

౨.
సర్వ స్థితులందు వ్యాసార్థ సదిశ రేఖ
యొక్క విస్తీర్ణ వేగమ్ము యొకటె గాని
మారదచు వచించె కెప్లరు, గ్రహముల
గమనమంతయు నియమ బధ్ధమని చాటె

౩.
గ్రహ భ్రమణ కాల వర్గము
గ్రహ కక్ష్యకు చెందు అర్థ గుర్వక్షమ్మున్ …

మూడో నియమం వద్దకు వచ్చేసరికి కలం ఆగిపోయింది. రెండో పాదంలో యతి తన్నేసిందని గుర్తు పట్టగానే ఇక ఆలోచనలు ముందుకు కదల్లేదు.

కనుక చదువుతున్న బ్లాక్కవి వరులకు నా విన్నపం ఏమిటంటే, మూడో నియమం కాస్తా అనువాదం చేసి పుణ్యం కట్టుకోండి. అలాగే ఫిజిక్సుకు, ఛందస్సుకు ఏమైనా ఫ్యూజన్ జరిగే అవకాశముందేమో ఆలోచించండి .

ప్రకటనలు

భాషలతో ఒక రోజు

1 జూన్, 2009

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసే ప్రతిచోటా టోలిక్ (TOLIC – Town Official Language Implementation Committee) అనే సమితి ఉంటుంది. ఆ పట్టణంలో ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, జాతీయ బ్యాంకులు అందులో సభ్యులు.ఊళ్ళోని ఏదో ఒక పెద్ద సంస్థ టోలిక్ కు అధ్యక్షత వహిస్తుంది.ఈ TOLIC ను హిందీలో నరాకాస్ అంటారు – ‘నగర రాజ్ భాషా కార్యాన్వయన్ సమితి’ అన్న మాట. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ రాజభాష ఐన హిందీ ని ఎంతవరకు అమలు చేస్తున్నాయో రివ్యూ చేసి పార్లమెంటుకు రిపోర్టు చేయడం, హిందీ అమలుకు సూచనలివ్వడం ఈ సమితి పనులు. మైసూరులో భారతీయ భాషా సంస్థాన్ (Central Institute of Indian Languages – CIIL) ఈ సమితి కి అధ్యక్షత వహిస్తుంది. మా కార్యాలయంలో ఈ రాజభాషా అమలు సమన్వయకుడి పదవి నాది (Official Language Coordinator). ఆ బాధ్యతల రీత్యా నేను నెలకోసారి భారతీయ భాషా సంస్థాన్ కు వెళ్ళవలసి వస్తుంది.

గత సోమవారం మధ్యాహ్నం సమావేశానికి CIIL నుండి పిలుపు వచ్చింది . ఆ ముందురోజే బ్లాగుల్లో భాషా చర్చలతో బుర్ర వేడెక్కి ఉండడాన ఆఫీసులో కూడా అవే అలోచనలతో ఉన్న నాకు అదేరోజు భాషల నిలయానికి వెళ్ళవలసి రావడం యాదృచ్ఛికమే ఐనా ఆలోచనలనుండి కొంత విముక్తి కలుగుతుందనే ఉద్దేశ్యంతో ఎగ్గొట్టకుండా వెళ్ళాను. హిందీ అమలు గురించి చర్చలు జరుగుతున్నాయి. అన్యమనస్కంగా ఉన్ననాకు పెద్దగా తలకెక్కడం లేదు. సభాధ్యక్షత వహించిన ప్రొఫెసర్ రాజేష్ సచ్ దేవ , CIIL ఉప సంచాలకులు, ఈ విషయం గమనించినట్లు నాకప్పుడు తెలియలేదు. సమావేశం ముగిసిన తరువాత దగ్గరకు పిలిచి అడిగారు – ” ఇక్కడ లేవు నువ్వు ఏమిటి సంగతి?” అని. ఎలాగూ అడిగారు కదా అని భాష గురించి నాక్కొన్ని ప్రశ్నలున్నాయని చెప్పాను. ఆయన కూడా కొంత తీరిగ్గా ఉండడంతో కాసేపు వివరంగా మాట్లాడారు మా సంభాషణలో ఆయన చెప్పిన సంగతులు, యథాతథంగా కాకుండా, నా మాటల్లో క్రింద వ్రాస్తున్నా:

అసలు అధికార భాషంటే ఏమిటి అన్న దానికి సచ్ దేవ గారి వివరణ:

అధికార భాష అన్నది మూడు రకాలు:

1. Legislative Official Language : పరిపాలనా సౌలభ్యం కోసం శాసన పూర్వకంగా ప్రభుత్వం అదేశించిన అధికార భాష. మన దేశంలో హిందీ లాగా.

2. Symbolic Official Language : ప్రభుత్వం లాంఛనంగా ప్రకటించిన అధికార భాష, ఆంధ్ర ప్రదేశ్ లో ఉర్దూ లాగా, పాండిచ్చేరిలో ఫ్రెంచి లాగా – ఒక వర్గాన్ని సంతోష పరచడంకోసం ఒక భాషను అధికారభాషగా లాంఛనంగా ప్రకటిస్తారు గానీ నిజానికి ఆ భాషలో అధికారిక కార్య కలాపాలేవీ జరగవు.

౩. Working Official Language : ఇది ఎవరైతే అధికారిక కార్య కలాపాలు నిర్వహిస్తారో వారికి అనువుగా ఉండే భాష అన్నమాట. మన దేశంలో ఆంగ్ల భాష లాగా. ఎవరు అవునన్నా కాదన్నా చివరికి ఆ భాషలోనే అన్ని అధికారిక పత్రాలూ వెలువడుతాయి.

ఈ మూడు రకాల అధికార భాషలూ ఏ దేశంలో నైతే ఒకే భాషగా ఉంటుందో అది భాషా పరంగా ఎంతో సౌలభ్యం ఉన్న దేశం అన్నమాట. చాలా వరకు ఐరోపా దేశాలు,అమెరికా(ఉత్తర,దక్షిణ), చైనా, తూర్పు ఆసియా దేశాలు, అరబ్బు దేశాలు ఈ కోవలోకి వస్తాయి.

ఆఫ్రికాలో లాంఛనంగా ప్రతి దేశానికీ ఓ అధికార భాష ఉంటుంది కానీ, నిజానికి దైనందిన కార్యకలాపాలన్నీ ఆంగ్లంలోనో, ఫ్రెంచిభాషలోనో జరుగుతాయి. అక్కడ సామాన్య ప్రజలకు , పాలనాధికారులకు మధ్య భాష పెద్ద అంతరాన్నే సృష్టిస్తుంది.

ఇక మూడవ దానికి ఉదాహరణ మనదేశమే. అనేక భాషా సంస్కృతులకు నిలయమైన మన దేశంలో ఆంగ్లం అప్రకటిత అధికార భాషగా స్థిరపడిపోయింది. రాజ్యాంగంలో కేవలం కొంతకాలం పాటు , హిందీ అధికార భాషగా నిలద్రొక్కుకొనేంత వరకు ఒక ‘లింక్ లాంగ్వేజ్’ గా వాడమని చెప్పిన భాష ఈనాడు తొలగించ వీలుకాని దశకు చేరుకొంది.

హిందీ భాష రాజ భాషగా ఎందుకు ఇంకా నిలద్రొక్కుకోలేదు అన్నదానికి ఆయన విశ్లేషణ ఇది:

హిందీని అధికార భాషగా పెట్టినప్పుడు పెద్దలకు తెలుసు. ఇతర భారతీయ భాషలు హిందీకంటే ఉన్నత స్థాయిలో ఉన్నాయని, ఆయా భాషల ప్రజలు అంత తొందరగా హిందీని అంగీకరించరనీ. ఇతర భారతీయ భాషలన్నింటినుండీ పదాలను స్వీకరించి కలుపుకుంటూ హిందీ ఒక కొత్త భారతీయ భాష, భారతీయులందరి భాషగా అవతరించాలని ఆశ్వాసించారు. కానీ వాస్తవంలో జరిగింది వేరు. ఇతర భారతీయ భాషలనుండి చెప్పుకోదగ్గ సంఖ్యలో పదాలేవీ హిందీలో చేరలేదు. దానితో బాటే ఆ భాష కొన్ని భాషల ప్రజలను చేరలేదు. ప్రభుత్వం గత యాభై యేళ్ళుగా హిందీని ఒక సర్వశక్తిమంతమైన భాషగా అభివృధ్ధి పరచడంలో విఫలమైంది. నేటికి కూడా ఒక ఇంజనీరింగ్ గానీ వైద్య శాస్త్రంగానీ హిందీలో చదవగలిగే అవకాశంలేదు. ఎందుకూ పనికిరాని జాతీయ భాషను ఎవరైనా ఎందుకు పనిగట్టుకొని నేర్చుకొంటారు? చైనా, ఇజ్రాయెల్, కొరియా, చివరికి మన చుట్టుప్రక్కలున్న సింహళం, థాయ్ లాంటి భాషలు కూడా హిందీకంటే అభివృధ్ధి చెందాయి.

హిందీ అమలుకు నియుక్తమైన కమిటీలన్నీ, “అన్ని భారతీయ భాషా పదాలనూ” అన్న రాజ్యాంగ కర్తల మాటలను ప్రక్కన పెట్టేశారు. ‘జనని సంస్కృతమ్ము సకలభాషలకును’ అన్న సూక్తిని గుర్తుకు తెచ్చుకొని సంస్కృత పదాలను కలిపేస్తే, అన్ని భాషల పదాలను కలిపేసినట్టే కదా అని అతితెలివిగా అలోచించి బోలెడన్ని సంస్కృత పదాలను హిందీలోకి తరలించేశారు (అంటే రాజభాష ఐన హిందీ అన్నమాట). అయ్యవారిని చేయబోతే కోతి అయిందన్న సామెతగా అలా కృత్రిమంగా తయారైన రాజభాష, అటు హిందీ మాతృభాషగా కలవారికీ మింగుడు పడక, అటు హిందీయేతర జనుల మన్ననలూ పొందక రెండికీ చెడింది. ఉదాహరణకు కొన్ని హిందీ పదాలు, హిందీ మాతృభాషగా కలవారు ఉపయోగించేవి-రాజభాషా నిఘంటువులు చెప్పేవి:

ప్రజా వ్యవహారంలోని హిందీ———-రాజభాష (శుధ్ధ్‌ హిందీ)———–తెలుగు మాట

ఇంత్ జామ్ కర్నా ——————-ప్రబంధ్ కర్నా———————-సిధ్ధం చేయడం (prepare)
ఇంత్ జార్ కర్నా———————ప్రతీక్షా కర్నా———————–వేచి ఉండడం (wait)
ఔర్——————————— ఏవం —————————–మరియు (and)
మగర్——————————–పరంతు————————– కానీ (but)
కార్ఖానా——————————సంయంత్ర్————————కర్మాగారం (plant/ factory)

ఇలా ఎన్నో. ఈ రెండవ నిలువు వరుస లోని హిందీ భాషను హిందీరాష్ట్రాల్లో వారెవ్వరూ వారి దైనందిక వ్యవహారంలో గానీ, సాహిత్య సృష్టిలో గానీ వాడరు. అది కేవలం ప్రభుత్వ పత్రాలకే పరిమితం ఐపోయిన ఒక కృతక భాష. ఇతర భాషీయులకు కొంత సులభమైనా వారు ఈ భాష నేర్చుకొన్నందువలన అదనపు ప్రయోజనం ఏమీ లేదు. పైగా ఉత్తరాదిలో ఆ రెండో వరుసలోని భాషను వాడితే వాడు హిందీయేతర జాతీయుడని రూఢిగా తెలిసిపోతుంది. వాళ్ళు నవ్వుకోవడానికితప్ప అనుకున్న విషయాన్ని వ్యక్తీకరించడానికి ఆ భాష పనికిరాదు. అలా మన రాజ భాష, రాజ భాషగానే మిగిలిపోయింది గానీ ప్రజలకు , వింధ్యకు రెండువైపులనున్నవారికీ, చేరువకాలేక పోయింది.

ఐనా హిందీ భాష పెరుగుతోంది. భాషాభివృధ్ధికి చేపట్టిన ప్రభుత్వ ప్రాజెక్టులన్నీ వాటి లక్ష్యాలను అందుకోలేక పోయినా సరే, హిందీ భాష విస్తరిస్తోంది. 2001 జనగణన వివరాల ప్రకారం దేశంలో 40% ప్రజలకు హిందీ మాతృభాష ఐతే మరో 25% మంది హిందీని ద్వితీయ భాషగా వాడుతున్నారు. కనీసం మరో పది శాతం ప్రజలకు హిందీలో కనీస పరిజ్ఞానం ఉంది. మరి ఈ విస్తరణ ఎలా జరిగింది? బాలీవుడ్ వలన, హిందీ టీవీ ఛానెళ్ళ వలన! ఎందుకంటే అవి ప్రజల భాష మాట్లాడాయి. బలవంతపు శాసనాల ద్వారా కాక, సాంస్కృతిక సంబంధాలద్వారా ప్రజలకు దగ్గరయ్యింది. ఈనాడు టివీ ఛానెళ్ళలో సీరియళ్ళు చూస్తూనే దక్షిణ భారత మహిళలు హిందీ నేర్చుకొంటున్నారు. అందుకు ఉదాహరణగా ఆయన ఒక సన్నివేశాన్ని వివరించారు – సచ్ దేవా గారు కన్నడ భాషావాది ఐన ప్రముఖ కన్నడ రచయిత లింగదేవరు హళెమనె గారి యింటికి వెళ్ళినప్పుడు ఆయనతో ఆయన కూతురు దెబ్బలాడుతోందట. ‘ టివీలో నేను హిందీ కార్యక్రమాలే చూస్తాను, కన్నడ కార్యక్రమాలొద్దు’ అని. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో తన యీడు పిల్లలందరూ హిందీ సీరియళ్ళ గురించే చర్చించుకొంటారట. అవి చూడకపోతే స్నేహితులతో మాట్లాడుకోవడానికి కామన్ విషయం దొరకదట. ఇలాంటి సామాజిక అవసరాలే భాషాభివృధ్ధికి దోహదం చేస్తాయి గానీ, శాసనాల ఒత్తిడులు కావని చెప్పారు.

ఆయన ఇంకో ఉదాహరణ కూడా చెప్పారు – ఆ మధ్య ఆయన తమిళనాడులో UGC వారి సమావేశంలో పాల్గొన్నప్పుడు అక్కడున్న ప్రొఫెసర్లలో ఎంతమందికి హిందీ వచ్చని అడిగారట. 22 మందిలో ముగ్గురు మాత్రమే తమకు హిందీ వచ్చని చెప్పారట. వారిలో ఎందరు తమ పిల్లలకు హిందీ నేర్పాలనుకుంటున్నారని అడిగారట. అందరూ చెయ్యెత్తడమే కాదు, తమ పిల్లలకు ఇప్పటికే హిందీలో ప్రవేశం ఉందని అందరూ చెప్పారట. తమిళనాడులో కూడా హిందీ పట్ల తగ్గుతున్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని అన్నారు.

మరి చిన్నభాషలు ప్రమాదంలో పడవా? అని అడిగాను నేను. CIIL, భాషల ఆస్పత్రి వంటిదనీ, అక్కడ ప్రతియేటా ఎన్నో భాషల చావులు చూస్తామనీ చెప్పారు. మానవ పరిణామ క్రమంలో భాషల పుట్టడం, అంతరించడం సహజ పరిణామమనీ, అందులో మనం పెద్దగా చేయగలిందేమీ లేదనీ ఆయన అభిప్రాయం. కోయ, చెంచు వంటి గిరిజన భాషలు మాట్లాడే వారు, బ్రతుకు తెరువుకోసం, వారుంటున్న రాష్ట్రపు భాషను నేర్చుకోవడం, రాష్ట్రపు భాషను మాట్లాడే వారు, మరింత మొబిలిటీ కోసం హిందీ నేర్చుకోవడం, హిందీ మాట్లాడే వారు మంచి ఉద్యోగావకాశాలకోసం ఆంగ్లం నేర్చుకోవడం, కొన్ని తరాల తరువాత తమ వారసత్వపు భాషలకు దూరమైపోవడం మామూలే. అలా కాకుండా ఉండాలంటే వారికి తమ భాషను మర్చిపోకుండా ఉండేందుకు, అదనపు శ్రమ వెచ్చించి నేర్చుకొనేందుకు ఏదో ఒక incentive కావాలి. అవి ఆర్థిక కారణాలు కావచ్చు, సాంస్కృతిక కారణాలు కావచ్చు, బలమైన కారణం ఉండడం ముఖ్యం. అలాంటి కారణాన్ని సాహిత్యమో, కళలో ఇవ్వగలవు. అందుకోసమే తమ తమ సాహిత్యాన్ని రక్షించుకోవడం సమాజాలకు ముఖ్యం.

అనునిత్యం భాషలకోసం పరిశ్రమించే ఒక విద్యావేత్తతో కొంతసేపు మాట్లాడడం మనసును తేలిక పరచింది. కానీ ఆయన మాటల్లో భాషల భవితవ్యం గురించి ఒక ఆశావహ దృక్పథం కనిపించక పోవడం కొంత నిరాశను కలిగించింది.

తరువాత, అక్కడే క్లాసికల్ తెలుగు విభాగాన్ని చూస్తున్న శ్రీ కందాళం శ్రీనివాసాచార్య గారిని కలిసి మాట్లాడాను. తమిళ విభాగాధిపతి శ్రీ తొల్కాప్పియన్ గారిని కూడా కలుసుకొన్నాను. ఆ సంభాషణలు కూడా భాషల భవితవ్యం పట్ల ఆశను కలిగించేలా లేవు.

అలా నా రోజంతా భాషలమధ్య గడిచింది.

మమ్మల్నలా వదిలేయండి!

24 మే, 2009

ఈ పోస్టు నిజానికి ‘బ్లాగాడిస్తా ‘ బ్లాగులో రవి గారు వ్రాసిన టపాకు వ్యాఖ్య వ్రాయాలని మొదలైంది. రవి గారి  టపా తాడేపల్లి వారు వ్రాసిన టపాకు విమర్శ. కాని విషయ విస్తారం  వలన కామెంటు అసలు పోస్టుకంటే పెద్దదైపోయినట్లనిపించి  దాన్ని విడిగా ఇక్కడ  ప్రచురించాను. ఆ పై టపాలు రెండూ చదివితే గాని ఈ టపా అర్థం కాదు. “>> <<” ఈ గుర్తుల మధ్య వాక్యాలు రవిగారి టపాలోనివి.

చల్లారిపోయిందనుకొన్న వివాదం మళ్ళీ పైకొచ్చింది! మీరు ఈ పోస్టు వ్రాసిన నేపథ్యాన్ని బట్టి మీ ఆవేశం నాకు అర్థమయ్యింది. కానీ ఆ ఆవేశంలో మీరు తమిళ దురభిమానం గురించి కొన్ని మూస (Stereotyped) అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కామెంటకూడదనుకొన్నా వ్యాఖ్యల్లో కూడా ఈ దురభిమానం గురించి దురభిప్రాయాలు వ్యక్తమవడం చూశాక కొన్ని వివరణలు అవసరమనిపించి వ్రాస్తున్నాను. మీ టపాలోని మూల విషయానికి సంబంధించి నాకేమీ అభిప్రాయ భేదం లేదని గమనించగలరు.

.
>>కొన్ని నెలల క్రితం ఈనాడు ఆదివారం అనుబంధంలో…ఉన్నది అభిమానం. ఆ అభిమానం మనసుకు సంబంధించినది!<<

మీరు మరోసారి ఆ వ్యాసం చదవండి. నిజంగా వాళ్ళు భాషాభిమానంతో తెలుగు మాట్లాడుతున్నారా? వారు శ్రీలంకలో అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. ఎలుకల్ని తింటూ, పాములు ఆడించుకొంటూ ఉండడానికి ఇల్లు లేక ఊరూరూ తిరుగుతూ జీవనం కొనసాగిస్తున్నారు. వారు మాట్లాడే భాషని తెలుగంటారని కూడా వారికి తెలియదు.శ్రీలంక జనాభా లెక్కల్లో కూడా వీరిని తెలుగు వారని గుర్తించలేదు. ఏదో గిరిజన భాష మాట్లాడే  Nomadic tribe కింద లెక్కగట్టారు. ఏ భాష మాట్లాడుతున్నామో ఆ వ్యాసకర్త చెప్పేదాకా తెలియని ఆ భాషాభిమానం తమిళుల భాషాభిమానానికి భిన్నమైనదని నా ఉద్దేశ్యం.

చెన్నైలోనూ, తంజావూరు జిల్లా లోనూ, కోయంబత్తూరు లోనూ తెలుగు మాట్లాడే వాళ్ళుండడం చాలా సాధారణమైన విషయం. వారా భాష మాట్లాడకుండా కట్టడి చేసినవారెవరూ లేరు. కనుక వారికే ఉద్యమమూ అవసరం కాలేదు. మదురై నగరంలో వేలాది సౌరాష్ట్రీయుల కుటుంబాలున్నాయి. ఏ కాలంలోనో గుజరాత్ లోని కఛ్ ప్రాంతంనుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వారు సౌరాష్ట్ర భాష మాట్లాడుతారు. తమిళ సాంస్కృతిక రాజధాని ఐన మదురైలో వారు శతాబ్దాలుగా వారి భాష మాట్లాడుతూ నిశ్చింతగా బ్రతుకుతున్నారు. వారిని సౌరాష్ట్ర భాష మాట్లాడవద్దని ఎవరూ అనలేదు. తన  తల్లిని గౌరవించేవాడే ఎదుటి వాడి తల్లిని గౌరవించ గలడు. తమ భాషను ప్రాణంగా భావించే తమిళులు ఇతర భాషలను కూడా అలాగే గౌరవించారు.

>>ఈ ఆధునికులు, పైగాపొద్దస్తమానం పాశ్చాత్య సంస్కృతిలో, పాశ్చాత్య భాషలో వ్యవహారం సాగించే వాళ్ళు… ఇది ఏ ఉద్యమం తాలూకు ఫలితం?<<

ఇంటర్నెట్లో ఉత్తర భారతీయుల జులుం, అవహేళనలు సహించలేక తెలుగు యూజర్నెట్ గ్రూపు స్థాపనకు ఎంత  పోరాటం  జరిగిందో, ఎంత పెద్ద ఉద్యమం నడిచిందో ‘ఈమాట’ ఎడిటర్ సురేష్ కొలిచాల గారి స్మృతులు ఈ లంకెలో చదవండి. భారతీయ భాషల్లో యూజర్ నెట్ మొదటగా తెలుగు, తమిళ భాషల్లోనే ప్రారంభమయ్యాయని ఆయన వ్రాశారు.

ఏ ఉద్యమం నడవకుండా భాష బ్రతకదన్న విషయం గ్రహించాలి. గిడుగు వారి వ్యవహారిక భాషోద్యమం లేకుంటే బహుశ ఇప్పుడు తెలుగు సాహిత్యం రిఫరెన్సు లైబ్రరీల్లో మాత్రమే ఉండేది కాదా!

>>శ్రీలంక విషయం వచ్చినప్పుడల్లా, “శ్రీలంక భారతీయులు” అన్న పదం వినిపించదు. బహుశా శ్రీలంక తమిళులు తాము “భారతీయులు” అని చెప్పుకోవటం సిగ్గుచేటని భావిస్తారో ఏమో?<<

నిస్సందేహంగా! శ్రీలంక పౌరులు తమను భారతీయులమని చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా? శ్రీలంక తమిళులను ఇతర ప్రవాస భారతీయులతో పోల్చి మీరే పొరబడ్డారు. మీరనుకుంటున్నట్లు  వారు భారతపౌరులు కాదు. భారత పౌరసత్వమూ వారు కోరుకోవడం లేదు. వారు కోరేది తమ దేశం (శ్రీలంక)లో తమకు సమాన హక్కులు కావాలని మాత్రమే. వారు భారతపౌరసత్వమే కోరుకొనివుంటే ఇంత పోరాటం ఎందుకు. అందరూ తమిళనాడుకు వచ్చేయక పోయారా! బాంగ్లాదేశీయులనే రానిస్తున్న మనం వారిని అడ్డుకొంటామా?

శ్రీలంక పొమ్మంటే పోవడానికి వారు నిన్నమొన్న   కోబాల్ నేర్చుకొని  H1B వీసాలపై  వెళ్ళిన ఎన్నరైలు కాదు. వెయ్యి సంవత్సరాల పూర్వం రాజ రాజ చోళుడు  లంకను జయించి చోళ సామ్రాజ్యంలో కలిపేసుకున్నప్పటినుండి తమిళులు అక్కడ నివసిస్తున్నారు.(చూ. -“వికీ పీడియా” ). బ్రిటిష్ వారు తరలించుకొని వెళ్ళిన  తమిళులు దీనికి అదనం. తమ దేశంలోనే సహస్రాబ్దపు చరిత్ర ఉన్న భాషను నాశనం చేయాలనుకోవడం సింహళుల మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వానికి ఫలితమే ఇంత వినాశనం.

>>శ్రీకృష్ణదేవరాయలు. మనకు తెలిసిందే…’మేము ఓ కన్నడిగుని మీద అభిమానం చూపించాం, ఆదరించాం’ అన్నప్రచారం, పటాటోపం, ఆవగింజంత కూడా లేవు<<

ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో గమనించండి. ఆదరించేది ఎవరు? ఆదరణ పొందేది ఎవరు? గజపతులు, బహమనీ, బీజాపూర్ సుల్తానుల రాజ్యాలను వదిలేస్తే మొత్తం దక్షిణ భారతాన్నంతా(ఒరిస్సాతో కలిపి) సర్వం సహాధిపత్యంగా ఏలిన మహాచక్రవర్తి ని ఓ ప్రాంత ప్రజలు ఆదరించారని చెబుతారా లేక అంతటి మహా ప్రభువు  తెలుగువారిని ఆదరించాడని చెబుతారా! చూడబోతే తెలుగువారి దయమీదే రాయలవారు బ్రతికారన్నట్లుంది! ఆయన తెలుగు భాషను అభిమానించి ఆదరించాడు. అదే సమయంలో కన్నడ, తమిళ కవులు కూడా ఆయన ఆస్థానంలో ఉండేవారు. పెద్దనతో సమంగా వారికీ గౌరవాదరాలుండేవి. కన్నడ భాషీయులెవరినైనాఅడిగి చూడండి- రాయలు మావాడంటారో మీవాడంటారో. ఆయన ‘ఆంధ్ర భోజుడు’ మాత్రమే కాదు. ‘మూరు రాయర గండ’ కూడా.ఆయనను తెలుగువాళ్ళు ఆదరించడం కాదు, ఆయనే తెలుగువారిని ఆదరించాడు.

>>>ఓ పద్ధతి ప్రకారం తమిళులు కన్నడ రాజధానిలో వేళ్ళూనుకున్నారనిపిస్తుంది. ఇక్కడ ఏ (ప్రభుత్వ రంగ లేదా ప్రైవేటు) సంస్థలో అయినా, మేనేజర్లు అధికశాతం తమిళులు. వీళ్ళందరూ, నిజాయితీగా, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళేనా? … … … <<<

మీనుండి ఇంత  Biased వాదనను ఊహించలేదు నేను. బహుశ మీ స్వీయానుభవాలేవో ఇలాంటి దురభిప్రాయాన్ని కలిగించాయనుకొంటాను. కొంచెం కూల్ గా అలోచిస్తే మీ వాదనన వితండ వాదమని మీకే అనిపిస్తుంది. పనిచేయని తమిళులను టోకున ఉద్యోగాల్లో చేర్చుకొని ప్రమోషన్లిస్తూ  ఉండేంత లగ్జరీ ఈనాడు ఏ సంస్థకైనా (ప్రభుత్వ/ప్రైవేటు)ఉందనుకోను. నేనూ ఓ ప్రభుత్వ సంస్థలోనే పనిచేస్తున్నాను. నా భాషకారణంగా ఇంతవరకు ఒక్క ప్రయోజనమైనా కలుగలేదు నాకు- ఎందరో తమిళ బాసులక్రింద పనిచేసినా. కనీసం తమిళనాడుకు బదిలీ ఐనా ఇవ్వలేదు గత 14 ఏళ్ళుగా ఎంత అడిగినా (మీ టపా చూపించాలి వారికి – “చూడండ్రా మన ఐకమత్యం గురించి వాళ్ళెంత చెబుతున్నారో! కనీసం వారి మాట నిజం చేయడం కోసమైనా నాకు చెన్నైకి బదిలీ ఇవ్వండ్రా..” అని చెప్పాలి. ఏమైనా వర్కవుట్ అవుతుందేమో చూద్దాం 😉 ).

మీరు బెంగళూరులోనే ఉన్నారు కదా, ఒక సారి చుట్టుపట్ల విచారించి చూడండి. ఏ జాతీయులు ఎలా ఉన్నారో. తమిళులు మీరన్నట్లు ఉద్యోగాల్లో, చిన్న చిన్న వ్యాపారాల్లో ఉన్నారు. సగం బెంగళూరు నగరాన్ని రియల్ ఎస్టేట్ భూముల కింద కొనేసిందెవరో, బెంగళూరులో పెద్ద పెద్ద హోటళ్ళు ఎవరివో, రాజకీయాలు చేసేది ఎవరో, బెంగళూరు నగరంలో పెద్ద పెద్ద సివిల్ కాంట్రాక్టులు చేసేది ఎవరో ఒకసారి పరిశీలించండి. జగన్ బాబు మొదలుకొని మాచిత్తూరు జిల్లా రాజులు, నాయుళ్ళ వరకు అందరూ తెలుగు వాళ్ళే సార్! చాలా మంది తెలుగు మాట్లాడక పోవచ్చు. ఎందుకంటే మనకు బతుకు ముఖ్యం, భాషకాదు. తెలుగంటూ కూర్చుంటే కాసులు రాలవు. కర్ణాటక అసెంబ్లీలో తెలుగు మంత్రులెందరో , తమిళులెవరైనా ఉన్నారో ఒకసారి కనుక్కోండి. బెంగళూరులో ఒక పథకం ప్రకారం రాజకీయాలు చేస్తూ  పాతుకుపోయిందెవరో మీకే తెలుస్తుంది. బెంగళూరులో తమిళులు ఒక్కచోట ఉండడానికీ, వారి ఆవాసాల్లో ఇతరులను చేర్చకపోవడానికీ గల చారిత్రిక కారణాలు బహుశ మీకు తెలియవు. కావేరీ గొడవలప్పుడు ఇళ్ళు, వాకిళ్ళి వదిలేసి ప్రాణాలరచేత పట్టుకొని పారిపోయి వచ్చిన మా బంధువులు నాకు తెలుసు. కన్నడిగుల చేత మానభంగం కావింపబడి ఆత్మహత్యలు చేసుకొన్న తమిళ స్త్రీల కథలు నాకు తెలుసు. అంతెందుకు, నేను మైసూరు వచ్చిన కొత్తలో కావేరి అల్లర్లు జరిగాయి( సుప్రీం కోర్టు తీర్పు తరువాత). అప్పుడు మా ఇంటి ఓనరు (వాళ్ళు సింధీలు) మాకు సలహా ఇచ్చాడు.” మీరు తమిళులమని చెప్పుకోకండి. ఈ మండ్యా జనాలు మంచివాళ్ళు కాదు” అని. ‘వీళ్ళకు భయపడి రోజూ చస్తామా, ఠాట్ ‘ అని నేను పట్టించుకోలేదనుకోండి. అందరితో తమిళుణ్ణనే చెబుతాను. కానీ పిల్లలను వెంటేసుకుతిరిగే మా ఆవిడ పాపం అంత ధైర్యం చేయలేక పోయింది. తను అందరితో తెలుగువాళ్ళమని చెప్పుకుంటుంది. ఇంత అల్లర్లలోనూ తమిళనాడులో ఒక్క కన్నడ స్త్రీకైనా అవమానంజరిగిందని ఎవరినైనా చెప్పమనండి! భయపడుతూ బ్రతికేవారిని భయపెట్టే వారెందరో. సుబ్రహ్మణ్య భారతి  ఇలా నినదించాడు :

“అచ్చమిల్లై  అచ్చమిల్లై  అచ్చమెన్బదిల్లయే
ఇజ్జగత్తుళోరెల్లాం ఎదిర్తు నిన్డ్ర పోదిలుం
అచ్చమిల్లై అచ్చమిల్లై అచ్చమెన్బదిల్లయే”

(భయంలేదు .. భయంలేదు.. భయమన్నదె లేదులే
ఈ జగాన జనులెల్లరు ఎదురించి  నిలిచినప్పుడూ
భయం లేదు.. భయంలేదు.. భయమన్నదె లేదులే)

తన భాషకోసం, తన సంస్కృతికోసం ఎదురొడ్డి నిలిచిన ప్రతి తమిళుడి గుండెలోనూ స్ఫూర్తిని నిలిపేది పై మాటలే. తమను ద్వేషంతో చూసే జనులమధ్య బ్రతుకు తెరువుకై వచ్చి నివసిస్తున్నా తన భాషను, తన సంస్కృతిని మరచిపోకుండా, భయంతోనో, ధనార్జనకోసమో, ఇతర లాభాలకోసమో తన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టకుండా తలెత్తుకొని తిరిగే ప్రతి తమిళుడి గుండెలోనూ పై గీతం ప్రతిధ్వనిస్తుంది. అది బెంగుళూరైనా, బట్టికలోవా అయినా సరే.

>>ఇంత పెద్ద దేశంలో ఒక్క తమిళ నాడులో తప్ప, మరెక్కడా, తమ మాతృ దేశంలో అత్యధికులు మాట్లాడే హిందీ భాషపై తీవ్ర అసహనమూ, ఏవగింపూ కనబడదు.<<

నిజమా! మరైతే దక్షిణ భారత హిందీ ప్రచార సభ  కార్యాలయం చెన్నైలో ఎందుకుంది? సురక్షితమైన హైదరాబాద్ కు ఎప్పుడో తరలి పోవలసింది కదా? హిందీ వ్యతిరేక ఉద్యమాల్లో ఎప్పుడైనా ఆ కార్యాలయం మీద దాడి జరినట్లు గాని, దాన్ని తరలించాలని డిమాండు చేసినట్లు గానీ విన్నారా? తమిళుల వ్యతిరేకత భాషపై కాదు. భాషను దౌర్జన్యంగా రుద్దడం పైన. నేను ముందే చెప్పినట్లు తల్లిని గౌరవించేవాడు పరమాతను అగౌరవ పరచలేడు. తమిళులు ఎప్పుడూ ఇతర భాషలను చులకన చేయరు. భారతియార్ అంతటి మహాకవి కూడా పాట పాడితే సుందరమైన తెలుగు భాషలోనే పాడాలని ప్రశంసించాడు.

త్రిభాషా సూత్రాన్ని తుంగలో తొక్కి, కేంద్రం ఇక్కడ హిందీని రుద్దుతూ, ఉత్తర భారతంలో రెండు భాషలనే నేర్పుతూ, దక్షిణాది భాషలను ఒక పథకం ప్రకారం అణగదొక్కే కుటిల నీతికి వ్యతిరేకంగా మాత్రమే తమిళులు పోరాడుతున్నారు. చేతనైతే చేయి కలపండి. మన భాషా సంస్కృతులను నిలబెట్టుకొందాం రండి. లేదంటారా తమిళులను వారి మానాన వారిని వదిలేయండి. ఒకరు వారి తో పోల్చడం ఎందుకు? ఇతరులు దాన్ని తెగడుతూ పన్లో పనిగా తమిళులపై అభాండాలు వేయడం ఎందుకు? మన గీతను పెద్దది చేయడం కోసం పక్క గీత ను చిన్నది చేయడం తెలివైన పనే, కానీ సరియైన పని కాదు. తెలుగు వారి రాజీ ధోరణే ఉన్నతమైందని అందరూ అంగీకరిస్తే అందులో అభ్యంతరపెట్టవలసిందేదీ లేదు. కానీ అందుకోసం మమ్మల్నీ , మా భాషాభిమానాన్ని (మీ భాషలో దురభిమానం) కించ పరచకండి. మా భాష మాకు ఎంత ముఖ్యమో మీరు అర్థం చేసుకోలేరు. భారతిదాసన్ తన కవితలో అంటాడు:

“తమిழுక్కు అముదెండ్రు పేర్
అంద తమిழ் ఇన్బ త్తమిழ் ఎంగళ్ ఉయిరుక్కు నేర్
తమిழுక్కు నిలవెండ్రుమ్ పేర్
ఇన్బత్తమిழ் ఎంగళ్  సమూగత్తిన్ విళైవుక్కు నీర్…”

( తమిళానికి అమృతమని పేరు,
ఆ తమిళం, ఆ తీయని తమిళం, మాకు ప్రాణంతో సమానం.
తమిళానికి వెన్నెలనీ పేరు.
ఆ తీయని తమిళమే  మా తమిళజాతి అనే పంటకు నీరు)

మా భాష మాకు ప్రాణం, మా సంస్కృతికి జీవం. దానికి ఎవరు హాని తలపెట్టినా ఓర్చుకోలేనితనం మా జీన్సు లో ప్రోగ్రాం అయిపోయింది. మమ్మల్నలా వదిలేయండి.

శివుని మూడుకన్నులూ మంటలెత్తిన వేళ!

23 ఫిబ్రవరి, 2009

చి‍రుతొండ నంబి గొప్ప శివభక్తుడు. ప్రతి రోజూ ఒక శివభక్తునికి ఆతిథ్యమిచ్చి గానీ తాను భోంచేయడు.

ఒకనాడు అతని ఇంటికొక జంగము వచ్చాడు. ప్రతిరోజూ తూమెడు చెరకు రసంతో శివుని అభిషేకించడం అతని ఆచారం. దానికి కావలసిన చెరకు రసం సమకూర్చితే ఆతిథ్యం స్వీకరిస్తానన్నాడు. చిరుతొండనంబి అభిషేకానికి కావలసిన చెరకుమోపులు మోసుకురావడానికి వెళ్ళాడు. ఆ బరువు మోయలేక పాపం తడబడుతున్నాడు. భక్తుని కష్టం చూసిన శివుడు తక్షణం వెళ్ళి సాయం పట్టాడు. ఆ మోపుల బరువుకు ఆయనకూ పాపం మేను చెమరించింది.

ఈ సన్నివేశం జరిగినప్పుడు శివుడు కైలాసంలో ఉన్నాడు. పార్వతితో కలిసి అప్సరసల నృత్యం తిలకిస్తున్నాడు. అక్కడ కూడా శివుని మేను చెమర్చింది. అది పార్వతి గమనించింది. అప్సరసల హొయలు చూసి శివుడు వారిపై మోజుపడ్డాడని, అందుకే మేను చెమర్చినదని అనుమానం కలిగింది. జగజ్జననికి కూడా అసూయ తప్పలేదు. అయితే అపర కాళిక ఊరుకొంటుందా!

“అమరవరేణ్య! ప్రేంకణము లాడెడు వేలుపులేమ జూచి యే
చెమరిచి తంచుగేళి సరసీరుహమెత్తి ప్రతాపమొప్పగా
హిమగిరి రాజనందన మహేశ్వరు మొత్తె, మధూళికా పరా
గములు శశాంకశేఖరుని కన్నుల మూటను జిందునట్లుగన్”

చేతిలోని తామర పూవుతో ’ప్రతాపమొప్పగా’ శివుని ఘాట్టిగా ఒక్కటిచ్చుకొంది. దెబ్బకు పాపం తామరపూవులోని పుప్పొడి అంతా శివుని మూడుకన్నుల్లోనూ చిందిందట. కొంచెం మెల్లగా కొట్టియుండవలసింది పాపం.

శివపార్వతుల మీద ఇంత కామెడీ వ్రాయగల ధైర్యం ఎవరికుంటుంది, ఒక్క శ్రీనాధునికి తప్ప! ” పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ ” అని ఆక్షేపించిన నోటినుండి వెలువడిందా పద్యం – హర విలాసం లో.

ఆ పరమశివుడు అందరికీ శుభములు కూర్చు గాక!

పిల్లలను గురించి కాళిదాసు

6 నవంబర్, 2008

పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు? అది ఎంత మహా కవులకైనా, మహర్షులకైనా సరే. ఎంత కటువుగా మాట్లాడే వారైనా పిల్లల ప్రసక్తి వచ్చేసరికి మృదుత్వం సంతరించుకొంటారు. మరి మృదుత్వం తప్ప మరొకటి ఎరుగని కాళిదాసు అయితే…

ఈ క్రింది పద్యం శాకుంతలం లోనిది. భరతుని చూసి గుర్తుపట్టక, దుష్యంతుడు తన సంతాన లేమిని తలచుకొన్న సందర్భంలో:


అలక్ష్య దంత ముకుళా ననిమిత్త హాసై

రవ్యక్త వర్ణ రమణీయ వచ: ప్రవృత్తీన్

అంకాశ్రయ ప్రణయిన: తనయాన్వహంతో

ధన్యా: తదంగ రజసా మలినీ భవంతి

ఏ కారణమూ లేకుండానే పలు మొగ్గలు కనిపించేలా చిరునవ్వులు చిందిస్తూ, వచ్చీ రాని ముద్దు పలుకులను వర్ణించలేనంత అందంగా పలుకుతూ, ఎప్పుడూ ఒడిని వదిలి పెట్టడానికి ఇష్టపడని బిడ్డలను ఎత్తుకొన్న వారు, ఆ బిడ్డ వంటిమీది దుమ్ము తగిలి ధన్యులౌతారు!


పిల్లలను గురించి పై పద్యానికి సాటి రాగల అందమైన వర్ణన ప్రాచీన సాహిత్యంలో మరొకటి కనిపించదు నాకు; ఒక్క తిరుక్కురళ్ లో తప్ప.


శాకుంతలంలోనే మరో హృద్యమైన పద్యం:


అనేన కస్యాపి కులాంకురేణ

స్పృష్టస్య గాత్రేషు సుఖం మ మైనం

కాం నిర్వృతిం చేతసి తస్య కుర్యాత్

య స్యాయ మంగాత్కృతిన: ప్రరూఢ: ?

ఎవరి వంశాంకురమో వీడు! ఈ పిల్లవాడిని ఆలింగనం చేసుకొంటే, ఇతడి స్పర్శ తగిలిన నా ప్రతి అంగమూ సుఖానుభూతిని పొందుతోంది. నాకే ఇలా ఉంటే ఇతడిని కన్న వారికి ఇతని ఆలింగనం మరెంత హాయిని కలిగిస్తుందో కదా! (అప్పటికి భరతుడు తన కుమారుడే నని దుష్యంతునికి తెలియదు)


రఘు వంశంలో దిలీపుడు కూడా వశిష్ఠునితో ఇలా అంటాడు…


కిం తు వధ్వాం త వైతస్యా

మదృష్ట సదృశ ప్రజం

న మా మవతి సద్వీపా

రత్న సూరపి మేదినీ

మీ కోడలైన ఈ సుదక్షిణ ద్వారా నాకొక పుత్ర రత్నం కలగనప్పుడు, సప్తద్వీపాలతో కూడిన ఈ భూమి యిచ్చే సమస్త రత్న రాశులూ నాకేమీ సంతోషాన్ని కలిగించడం లేదు (భూమి రాజుకు మరో భార్య కదా!).

కాళిదాసుకు సాటి రాగల వర్ణన, పిల్లలను గురించి,  తమిళ వేదమని చెప్పబడే తిరుక్కురళ్ లో కనిపించింది నాకు:


మక్కళ్ మెయ్ తీణ్డల్ ఉడఱ్కిన్బమ్ మట్ఱు

అవర్చొఱ్ కేట్టల్ ఇన్బమ్ శెవిక్కు

పిల్లల మృదు ఆలింగనం మన శరీరానికి అవ్యక్తమైన హాయిని గూర్చుతుంది. ఇంకా వారి ముద్దు పలుకులు మన చెవులకు తీయని సంగీతంలా వినిపిస్తాయి.

అమిழ் కినుమ్ ఆట్ఱ ఇనిదేదమ్ మక్కళ్

శిఱుకై అళావియ కూழ்

బిడ్డలు తమ చిన్నారి చేతులతో పిసికిన చద్దన్నం, తలిదండ్రులకు అమృతం కన్న మిన్నగా రుచిస్తుంది.

కుழల్ ఇనిదు యాழ் ఇనిదు ఎన్బదమ్ మక్కళ్

మழలైచ్చొల్ కేళాదవర్

తమ పిల్లల ముద్దు పలుకులు వినడానికి నోచుకోని వారు మాత్రమే వేణునాదం, యాழ் (ఒక ప్రాచీన తమిళ వాయిద్యం) ధ్వని సాటిలేని మాధుర్యం కలిగినదని అంటారు.

సంస్కృత భాష లోని మహాకవీ, ద్రవిడ భాషలోని మహాకవీ పిల్లల గురించి సంవదించిన హృదయ స్పందనలివి!

అద్వైతం

28 అక్టోబర్, 2008

ఎవరన్నారు మనం దూరమయ్యామని?


ఉషోదయమౌతున్నప్పుడు

అరుణ కిరణాల దీప్తులలో

గులాబీ రేకులపై నిలిచి

ముత్యాల్లా మెరుస్తున్న మంచు బిందువులు

నీ రాగ రంజిత వదనాన్నే ప్రతిఫలిస్తున్నాయి


అపరాహ్ణ వేళ

చండ భాను ప్రజ్వలిత తాప ప్రతాపాన్ని పరిహసిస్తూ

మొగలి పొదల పైనుండి వీచే

సుగంధ పూరిత శీతల సమీరం

నీ స్పర్శ యని భ్రమింపజేస్తుంది


సాయం సమయాన

నీలాకాశం సంధ్యా రాగాన్ని పలికిస్తున్నప్పుడు

పక్షుల కలస్వనాల నడుమ

విలసిల్లే నిశ్శబ్ద ప్రకృతి

నీ మౌన ముద్రనే అనుకరిస్తున్నది


ఎవరన్నారు మనం దూరమయ్యామని!


అర్ధ రాత్రి వేళ, నిశ్శబ్ద నిశీధిలో

వెన్నెలలో తడిసి, మత్తుగా

జోగుతున్న చెట్ల ఆకులను సవరిస్తూ

మెల్ల మెల్లగా వీచే చిరుగాలి సవ్వడి

నీ పాటనే గుర్తు చేస్తున్నది


గట్లను ఒరుసుకొంటూ

బండ రాళ్ళను ఢీకొని ఎగసి పడుతూ

అల్లరిగా ప్రవహించే

సెలయేటి అలల గలగల ధ్వానం

నీ నవ్వునే తలపింప జేస్తున్నది


ఉవ్వెత్తున లేచి

చెలియలి కట్టను తాకి

ఇసుక తిన్నెలను రాచుకొంటూ

వెనుదిరిగే కడలి తరంగం

నీ చరణ మంజీర నాదాన్ని వినిపిస్తున్నది


ఎవరన్నారు మనం దూరమయ్యామని?


ఘనీభవించిన ఏకాంతంలో

స్మృతి పథంలో పయనిస్తూ

గడిచిపోయిన మధుర క్షణాలను ఏరుకొంటూ

హృదయాంతరాళాలను సమీపించి

లోనికి తొంగి చూసినపుడు

గుండె గదిలో సుప్రతిష్ఠితమై

స్నేహ సామ్రాజ్యాభిషిక్తవై

చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చేనీ రూపం

నేనే నీవన్న భావనను కలిగిస్తున్నది


మరి,


ఎవరన్నారు మనం దూరమయ్యామని!

నా హైకూలు

27 అక్టోబర్, 2008
 • రాని నీ నిరీక్షణలో రాత్రి గడిపేకన్న

  నిదురించి తీయని స్వప్నాల లోనైన

  నిన్ను వీక్షించియున్న బాగుండునేమొ!

 • నన్ను పూర్తిగా నమ్ముతున్నానంటావు, మరుక్షణం

  నావంక చూస్తావు, నీ మాటలు నమ్ముతున్నానో లేదో అని

  ఎలా అర్థం చేసుకోవాలి నిన్ను నేను!

 • నా ఆకాంక్షలు, అవిగో అక్కడ దగ్ధమైపోతున్నాయి

  సుళ్ళు తిరుగుతూ లేస్తున్నవి చితిమంటలే కావు

  నా మదిలోని వేదనా జ్వాలలు కూడ

 • NOTE: హైకూలు జపాను వారి పద్య ఛందో విశేషం. మొత్తం 17 అక్షరాలు (మాత్రలు కాదు) మూడు పాదాల్లో 5,7,5 లెక్కన రావాలి. హైకూల గురించి మరిన్న వివరాలకోసం ఇక్కడ చూడవచ్చు.

  జపానీయ హైకూలను అనుకరిస్తూ తెలుగులో ఒకానొక కాలంలో కోకొల్లలుగా హైకూలు వ్రాశారు చాలామంది. అందులో 99% నిజమైన హైకూల లక్షణాలకు ఆమడ దూరంలో ఉన్నవే, పైన వ్రాసిన నా హైకూలతో సహా. మూడు పాదాలలో విరిచి వ్రాసినవన్నీ హైకూలు కాలేవు. జపానీయ హైకూల లక్షణం మార్మికత. క్లుప్తంగా ఉంటూ, సూటిగా ఏదీ చెప్పకుండా పాఠకుని అలోచనలను ప్రేరేపించాలి హైకూ. అది తెలుగులో కష్ట సాధ్యం. మనకు మనవైన ముత్యాల సరాలు, ఉపజాతి పద్యాలు, కూనలమ్మ పదాలు, నానీలు ఉండగా, మనవి కాని ఛందో సాంప్రదాయాన్ని పట్టుకొని వేళ్ళాడడం వృధా ప్రయాస అని తెలిసి పోయాక నేను హైకూలు వ్రాయడం మానేసి, తెలుగు సాహితీ లోకానికి చాలా ఉపకారం చేశాను. అలాగే నేను ప్రయత్నించి ఓడిపోయిన మరో ప్రయోగం వచన కవిత. ఇప్పటి వరకూ నేను ఒకే ఒక వచన కవిత(!) వ్రాశాను. ఛందస్సు లేని కవితా వ్యాసంగం నా ఒంటికి పడదనే గ్రహింపు త్వరగానే వచ్చింది. ఇక వచన కవితల జోలికి పోలేదు నేను.

  Distant Early Warning: నేను వ్రాసిన ఆ ఏకైక వచన కవితే నా తరువాతి టపా 🙂