విషయానికి వెళ్ళండి

అందమైన కంద పద్యం

24 ఆగస్ట్, 2008

“కందం వ్రాసినవాడే కవి, పందిని చంపినవాడే బంటు” అని ఒక తెలుగు సామెత. దాన్నే ఇంకెవరో కసిగా “పందిని చంపినవాడే కందం వ్రాయాలి” అని మార్చారు. కందం వ్రాయక పోతే పోయారు గానీ దానికోసం పాపం పందిని చంపడం ఎందుకో మరి!

పందిని చంపడంలోని సాధకబాధకాలేవో నాకు తెలియవుగానీ, కందం వ్రాయడంలోగల కష్ట సుఖాలు మాత్రం బాగా తెలుసు. ఎటులనగా నా పన్నెండవయేటనే కందపద్యమొకటి రచియించితిని.

కంద పద్యం ఛందస్సు అటు వృత్తాలలాగా ఖచ్చితమైన చట్రంలో బిగించినట్లూ ఉండదు. అలాగని తేటగీతి, ఆటవెలదుల్లా ఇంద్ర గణాలు, సూర్యగణాలు ఏవైనా ఎక్కడైనా రావచ్చు అన్నట్లూ ఉండదు. కందం నియమాలివీ:

1. భ జ, స, నల, గగ అనే ఐదు గణాల్లో నుండి ఏవైనా మూడు గణాలు మొదటి పాదంలోనూ, మరో ఐదు గణాలు రెండవ పాదంలోనూ రావాలి.
2. రెండవ పాదంలోని మూడవ గణం జగణం గానీ, నల గణం గానీ అయి ఉండాలి.
3. బేసి స్థానాలలో జగణం ఉండకూడదు (మొదటి రెండు పాదాలనూ ఒక ‘యూనిట్ ‘ గా పరిగణించి 1, 3, 5, 7 వ గణాల్లో జగణం రాకుండా చూడాలి).
4. మొదటి రెండు పాదాల నియమాలే తరువాతి రెండు పాదాలకూ వర్తిస్తాయి.
5. రెండవ, నాల్గవ పాదాలలో నాలుగవ గణం మొదటి అక్షరం యతి స్థానం.
6. ప్రాస నియమం పాటించాలి.
7. రెండవ, నాలుగవ పాదాల చివరి అక్షరం గురువు గా ఉండాలి.

టూకీగా ఇవీ కంద పద్య నియమాలు. ఇన్ని మెలికలు మరే పద్యానికీ లేవు. అందుకే కవి అన్నవారందరూ కందం వ్రాసి సర్టిఫికేట్ పొందినవారే. తెలుగు భాషలో మొదటి కందం వ్రాసింది మన ఆదికవి నన్నయ గారే. ఆంధ్ర మహాభారతం అవతారికలో వ్రాసిన

విమలాదిత్య తనూజుడు
విమల విచారుడు కుమార విద్యాధరుడు
త్తమ చాళుక్యుడు వివిధా
గమ విహిత శ్రముడు తుహిన కరుడురు కాంతిన్

అన్న పద్యం తెలుగులో మొట్టమొదటి కందం.

నన్నయ గారినుండి అంధ్ర సాహిత్యాన్ని అందిపుచ్చుకొన్న తిక్కన సోమయాజిగారు కంద పద్యాన్ని కదంతొక్కించారు. సీసపద్యానికి శ్రీనాధుడిలా, మందాక్రాంతకు కాళిదాసులా, ఆటవెలదికి వేమనలా, ఈనాటికీ కందం అంటే తిక్కన గారే. తిక్కన తరువాత కందాని కి ప్రాణంపోసినవారిలో పోతన ఎన్నదగిన వాడు. శబ్దాలంకారాలను కందంలో విరివిగా చొప్పించిన ఘనత పోతనదే. భాగవతంలోని ఈ పద్యం చూడండి:

లేమా! దనుజుల గెలువగ
లేమా? నీవేల కడగి లేచితి? విటురా;
లే మాను మానవేనిన్,
లే! మా విల్లందుకొనుము లీలం గేలన్

సుమతీ శతకకారుడు “నోరూరగ చవులు పుట్ట…” నీతులు నుడివినా, “ఇయ్యగనిప్పించంగల అయ్యలకే గాని మీసమందరికేలా?” అని కవి చౌడప్ప వెటకారం చేసినా , “తిరిపెమున కిద్దరాండ్రా” అని శ్రీనాధుడు ఆక్షేపించినా వారు ఉపయోగించిన ఛందం కందమే.

పదాలలో క్లుప్తత, చెప్పిన విషయంలో స్పష్టత, చెప్పే పధ్ధతిలో సూటిదనం, శబ్దాలలో లయవిన్యాసం, నడకలో జవనాశ్వపు హొయలు … ఇవన్నీ కందంలో గాక మరెందులో ఉన్నాయి!

కందపద్యం వ్రాయడంలో అంత ‘మజా’ ఉంది గనుకే ఛందస్సునూ, వ్యాకరణాన్నీ నడుంవిరగ్గొట్టి మళ్ళీ లేవనీకుండా చేశానని ఘనంగా చెప్పుకొన్న శ్రీశ్రీ అంతవాడు కూడా

అందంగా, మధురస ని
ష్యందంగా, పఠితృ హృదయ సంస్పందంగా
కందా లొకవంద రచిం
చిందికి మనసయ్యె నాకు సిరిసిరి మువ్వా!

అని ముచ్చటపడి పోయాడు. శ్రీశ్రీ కందపద్యాలు వ్రాయడమా అని ఎవరూ ప్రశ్నించకుండా

“పందిని చంపినవాడే
కందం రాయాల” టన్న కవి సూక్తికి నా
చందా యిస్తానా? రా
సేందు కయో షరతులేల ? సిరిసిరి మువ్వా!

అని చెప్పేశాడు. అంతే కాదు,

నాలాగ కంద బంధ
జ్వాలా జాలాగ్ర సంవసత్ సద్గీతా
లాలాపించే కవితా
శ్రీలోలుడు నహినహీతి సిరిసిరి మువ్వా!

అని తన ఢంకా తానే గట్టిగా బజాయించుకొన్నాడు కూడా. ఎవరూ కాదన్నట్లు లేరు.

27 వ్యాఖ్యలు
  1. 24 ఆగస్ట్, 2008 1:19 సా.

    వాగ్విలాసం రాఘవ ఈ టపా చదవాలే కానీ వెంఠనే ఓ కొత్త కందంతో ఇక్కడ వాలిపోడూ?

  2. 24 ఆగస్ట్, 2008 7:12 సా.

    బాగుబాగు .. మరో కంద ప్రవాహ నిష్పంది అన్నమాట!
    చాలా సంతోషం.
    చంద్రిమ గారూ, ఈ వ్యాఖ్యతో నా మెయిలు ఐడీ కనిపిస్తోందా మీకు? నాకో మెయిలు రాయండి మీకు వీలైనప్పుడు.

  3. 25 ఆగస్ట్, 2008 10:57 ఉద.

    కందాలపిచ్చి యున్నా
    పందుల్నీ ఛంపలేదు పోని కనీసం
    సుందర సుమధుర కవితా
    సుందరినీ పట్టలేదు సుడి యన యిదియే!

  4. చంద్ర మోహన్ permalink
    25 ఆగస్ట్, 2008 3:41 సా.

    గిరి గారు, కొత్తపాళీ గారు,
    నెనర్లు.

    నెనరులు రాఘవ గారూ
    కనికరమున వ్రాసినారు కామెంటొకటిన్
    వినిపించవలయు తప్పక
    ఘనమగు మీ వాగ్విలాస గానము నెపుడున్

  5. 25 ఆగస్ట్, 2008 6:33 సా.

    మీరు వ్రాస్తున్నారని తెలిస్తే నేను గమ్మునుండే వాడిని. నేను మొన్నీ మధ్యనే కందాలు వ్రాయడం మొదలు పెట్టాను. కాబట్టి అలా బొమ్మలు గీసుకొని కట్టపడి నేర్చుకున్నాను. అప్పటికే రాఘవ నేను తొందరలో కందం మీద టపా వేయబోతున్నా కాబట్టి మీ బొమ్మల టపా తొందరగా వేసుకోండి అని హెచ్చరించాడు! వ్యాఖ్యగా కందం వ్రాస్తే బాగుంటుంది, కానీ నాకు కందం రాయాలంటే కనీసం నాలుగు గంటలైనా పడుతుంది. 🙂

    అన్నట్టు నేను చదివింది ఉత్త పోతనే కాబట్టి అన్నీ ఆయన కందాలే వాడాను. మీరు చెప్పాక తిక్కన గారి మీద కూడా ఒక కన్నేసి వుంచుతాను.

    మీ
    రాకేశ్వర

  6. 25 ఆగస్ట్, 2008 7:45 సా.

    కందం తిక్కన గారిది, కుందవరపు కవి చౌడప్పదీ అని కూడా కితాబిచ్చాడు శ్రీశ్రీ సిరిస్రిమువ్వ పద్యాల్లో. అసలు అప్ద్యం నాకిప్పుడు గుర్తు లేదు.

    ఎప్పుడో బ్లాగు మొదలెట్టిన కొత్తల్లో రాసిన నా పేరడీ కందాలొక రెండు ఇక్కడ!

  7. 25 ఆగస్ట్, 2008 10:58 సా.

    కందం తిక్కనగారిది
    కుందవరపువారి ముద్దుకుర్రని దంతే,
    అందరి తరమా కందపు
    చిందులు కిటుకుల్ గ్రహింప సిరిసిరిమువ్వా!

  8. 26 ఆగస్ట్, 2008 12:28 సా.

    నేను ఈ టపా చదువుతూ అడుగుదామనుకున్న ప్రశ్న, కొత్తపాళీ గారు ఆడిగేశారు .. కామేశ్వరరావు గారు జవాబు చెప్పేశారు.. అందరికీ నెనరులు.
    నేను ఈ టపా చదువుతూ అడుగుదామనుకున్న ప్రశ్న, కొత్తపాళీ గారు ఆడిగేశారు .. కామేశ్వరరావు గారు జవాబు చెప్పేశారు.. అందరికీ నెనరులు.
    ఐతే కామేశ్వర రావు గారు,
    ముద్దుకుర్రనిదంతే కందమొస్తుందన్నమాట. 🙂

  9. 26 ఆగస్ట్, 2008 5:13 సా.

    ఊక మహాశాయా .. మీ పన్నులకి అడ్డేముంది? కుందవరపు వారి కుర్రాణ్ణి తంతే ఒహటేం ఖర్మ .. కనీసం ఓ నాలుగైనా రాలిపడతాయి పసందైన తీట్ల కందాలు 🙂

  10. 30 ఆగస్ట్, 2008 10:54 ఉద.

    @ ఊదం – 🙂 దంతే

    వ్రాయబడ్డ కందాలన్నిటినీ పరిశీలిస్తే ‘అంద’ అనే ప్రాసాక్షరం అతి ఎక్కువగా వాడబడ్డదిగా నిలుస్తుందేమోనని పిస్తుంది.

  11. 30 ఆగస్ట్, 2008 11:01 ఉద.

    కొత్తపాళీ గారు, 🙂
    అసలు సందేహం, ఇప్పుడొచ్చింది,
    నాలుగో పాదం లో కిటుకుల్ అంటం లో కిటుకేమిటి?
    కిటుకులు గ్రహింప అంటే “లు” గురువై, గణభంగమౌతుందా?

    చంద్రమోహన్ గారు,
    పనిలోపని, కందం ఛందస్సుని కందంలోనే వివరించే పద్యం కూడా ప్రకటించండి.

  12. 30 ఆగస్ట్, 2008 11:25 ఉద.

    రాకేశా,
    మీకు తెలియనిది కాదనుకోండి, దంతి అంటే ఏనుగు అని కూడా అర్ధం.
    ఈ అంద అనే ప్రాసాక్షరమే అతి ఎక్కువగా వాడబడ్డదిగా నిలుస్తుందేమో
    నేను సైతం … 🙂
    కందము వ్రాసితి నేనని
    అందరికీ చూపినంత, అబ్బురపడి మా
    డెందెము లూగెనులే ఆ
    నందపు టూయలలనవలె నమ్ముము ఆ.రా.
    *
    ( *ఆచంట రాకేశ్వర, ) (కేరా లక్ష్మీ అని ఆరుద్రగారి మకుటం లాగా )

  13. 30 ఆగస్ట్, 2008 1:41 సా.

    ఊ.దం.గారు,
    ఇక్కడకి ఏనుగునికూడా లాక్కొచ్చేసారా! అంత పెద్ద పన్నులే 🙂

    “కిటుకుల్” గురించి మంచి ప్రశ్నే వేసారు. “కిటుకులు” అని వేసుకున్నా “లు” గురువవ్వాల్సిన అవసరం లేదు, “గ్రహింప” వేరే పదం కాబట్టి. “చిందులు కిటుకులు” అంటే కందపు గుఱ్ఱం సాఫీగా సాగిపోతుంది. అదే “చిందులు కిటుకుల్” అనేటప్పటికి పరిగెడుతున్న గుఱ్ఱానికి ఒక్కసారి కళ్ళెం బిగిస్తే అది ముందుకాళ్ళపై లేచి సకిలించి నట్టుంటుంది. అలాటి సకిలింత శ్రీశ్రీ కిష్టం – అని చెప్పుకోవచ్చు.

  14. 8 సెప్టెంబర్, 2008 8:30 సా.

    క:-ఆరా తీయగ తెలిసెను
    ఆరాకేశునకు కంద మన ప్రేమనుచున్.
    తీరిక వేళల కందము
    నారా! లిఖియింపు! జనము లౌరాయనగా.
    చింతా రామ కృష్ణా రావు.
    ఆంధ్రామృతం.

  15. 10 సెప్టెంబర్, 2008 11:53 సా.

    ఈ మధ్య బ్లాగుల్లో పద్యాల పరంపర చూస్తూంటే పద్యాలు వ్రాయాలని తెగ ఆవేశం వచ్చేస్తుంది. కానీ తంతారని (వీలుకాక పోతే బ్లాగుని బ్లాక్ చేస్తారని) భయంతో వెనక్కి తగ్గుతున్నాను.
    సరదాగా

    మంచి పోష్టు. కామెంట్లు బాగున్నాయి.
    కొత్తపాళీ గారి లింకు చూసాను. చాలా బాగుంది వారి సాధన.
    బొల్లోజు బాబా

  16. 11 సెప్టెంబర్, 2008 2:36 ఉద.

    కామేశ్వర్రావుగారూ, కిటుకుల్ లో కిటుకుని అటుకులంత కమ్మగా వివరించారు.
    బాబాగారూ, భయం లేదు. దూకెయ్యండి. పక్కన మేమంతా లేమూ?
    కొంచెం పరీక్ష పేపరు లీక్ చేస్తున్నా .. మన భట్టు మూర్తి కవి మీకందరి ఘంటాలకీ మళ్ళి త్వరలోనే పని చెప్పే ప్రయత్నంలో ఉన్నాడు!

  17. 23 సెప్టెంబర్, 2008 1:57 ఉద.

    వహవా! వవహా! వవవా!!
    అహహా! కందపు పందిరి యనగా నిదియే!!
    మహదానందము గలిగెను
    మహనీయుల పద్యవృష్టి మహిమను జూడన్!

    ఆలస్యంగా నయినా నా కంటబడింది ఈ టపా. మొట్టమొదటి కందాన్ని పరిచయం చేశారు, కృతజ్ఞతలు. టపా ఎంత బాగుందో వ్యాఖ్యలు అంత బాగున్నాయి. కృతజ్ఞతలు.

  18. Thyagaraju permalink
    29 సెప్టెంబర్, 2008 6:55 ఉద.

    Ranare garu, mee vahavaa padyam lo rendava paadam kontha thappindi. pandhiri ni maarchi veyyandi. Namaskaaraalu.

  19. 16 అక్టోబర్, 2008 4:39 ఉద.

    త్యాగరాజుగారూ, కృతజ్ఞతలు. ఇప్పుడు సరిపోతుందేమో చూడండి.

    వహవా! వవహా! వవవా!!
    అహహా! కందపు పందిరి యనంగ నిదియే!!
    మహదానందము గలిగెను
    మహనీయుల పద్యవృష్టి మహిమను జూడన్!

  20. 17 అక్టోబర్, 2008 1:16 ఉద.

    సరిపోదు. మళ్లీ కాస్త ఓపిగ్గా చూస్తే నా తప్పు ఇప్పుడు తెలిసింది. రెండోపాదపు మూడోగణం జ కానీ నల కానీ కావాలి. పద్యం వస్తే ఒక వరవడిలో రావాల్సిందే. రిపేర్లు శోభించడం అరుదు గనుక నేను చేతులెత్తేస్తున్నాను. 🙂

  21. 17 అక్టోబర్, 2008 10:27 ఉద.

    రానారె,
    జగణానికి నాకొక ట్రిక్కు తెలిసింది. జగణం సులువుగా రావాలంటే, ముందున్న గణాన్ని కాస్త మారిస్తే easyగా ఉంటుంది అని. మీ పాదాన్ని ఈ కింది విధంగా మారిస్తే,
    ౧. అహహా! కందముల మంచె యనంగ నిదియే!!
    ౨. అహహా! కందముల మాల యనంగ నిదియే!!
    🙂 🙂

  22. 21 అక్టోబర్, 2008 8:48 సా.

    “అహహా! కందంపు పందిరనగా నిదియే!!” అని వ్రాస్తే సరిపోతుంది. అదనపు పదాలేవీ వాడకుండా గణశాంతి ఐపోతుంది.

  23. 21 అక్టోబర్, 2008 11:42 సా.

    అహహా! కందంపు పందిరనగా నిదియే!!” ఇది నాకు నచ్చిందని వేరే చెప్పక్కర్లేదనుకుంటా 🙂

  24. 22 అక్టోబర్, 2008 2:36 సా.

    @ ఊ.దం. గారు

    ప్రతి పదంలోనూ పన్నులు ‘దంచే’స్తున్నారు! పాదంలో కందం వెంటే పంది కూడా వచ్చేసింది చూడండి.

  25. భావకుడన్ permalink
    15 ఫిబ్రవరి, 2009 4:39 సా.

    చంద్రమోహన్ గారు,

    “లేమా దనుజుల గెలువగా లేమా”….అను పద్యంలో మూడు నాలుగు పాదాలు అర్థం కాలేదండి…నిజంగా కష్టపడ్డాక కూడా…దయ చేసి ప్రతి పదార్థం వివరించగలరా?

Trackbacks

  1. పొద్దు » Blog Archive » ఆగష్టు నెల బ్లాగ్వీక్షణం
  2. మా కందాలు - మాకందాలు « ఊక దంపుడు

వ్యాఖ్యలను మూసివేసారు.