విషయానికి వెళ్ళండి

స్వగ్రామ దర్శనం – గ్రామ చూర్ణం కథ

6 డిసెంబర్, 2009

వృత్తిగత వ్యవహారాల్లో లోతుగా కూరుకుపోయి నాకో బ్లాగుందని మర్చిపోయేంత పనయ్యింది. కొన్ని నెలల విరామం తరువాత ఇవ్వాళ బ్లాగు చూస్తే బావురుమంటూ కనిపించింది:-( “గవర్నమెంటు కంపెనీలో ఉజ్జోగం అయింది కదా, ఇంకేం, అంతా తీరికే నీకు!” అని వేళాకోళమాడిన స్నేహితుల్నందరినీ మైసూరుకు ఛార్జీలిచ్చి పిలిచి మరీ తన్నాలని ఉందిగానీ వారిలో చాలామంది ఇప్పుడు అమెరికాలో బోలెడంత తీరుబాటున్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఛార్జీలిచ్చి పిలవడం కుదిరేపని కాదు.

ఇంత పనిఒత్తిడిలోనూ, దీపావళికి మావూరు, చిత్తూరికి వెళ్ళడం కుదిరింది. ఇంకెన్నాళ్ళు చిత్తూరు ’మా వూరు’ గా ఉంటుందో తెలియదు గానీ, ప్రస్తుతానికి మాత్రం ఆ గాలి నా వయసును పాతికేళ్ళు తగ్గించేస్తూ ఉంటుంది. చిత్తూరును ’చిత్తమున్న ఊరు’ అని చమత్కరించారు సినారె గారొక సారి. నిజానికి ’చిరు + ఊర్’ -> ’చిట్రూర్’ అనే తమిళ పదం వాడుకలో చిత్తూరుగా మారింది. ’చిన్న ఊరు’ అని అర్థం. చిత్తూరు చిన్న ఊరైతే మరి పెద్ద ఊరేది? ప్రక్కనే ఉన్న ’వేలూర్’ నగరం (ఆంధ్రుల వాడుకలో రాయవెల్లూరు). ఆంధ్ర రాష్ట్రం అవతరించిన చాలా యేళ్ళవరకు కూడా చిత్తూరు తమిళనాడులో ఉండేది. ఇప్పుడైనా సాంస్కృతిక పరంగా చిత్తూరు తమిళ పట్టణమే. అందుకే మా ఊరి ప్రజలందరూ రెండు భాషలూ (కలగలిపేసి) మాట్లాడుతారు. “కూలికి పిండి ఆడబడును”, “తలముడి నరకబడును” వంటి బోర్డులు ఇంకా అక్కడక్కడా దర్శనమిస్తూ ఉంటాయి. ఎన్టీయార్ కూడలి ఉన్నట్లే ఎంజీయార్ రోడ్డు కూడా కనిపిస్తుంది. ఏ తమిళ సినిమా ఐనా మొదటిరోజున ఇక్కడ రిలీజ్ కావలసిందే. అయితే మా జిల్లా వాసులెప్పుడూ తెలంగానంలాగా విడిపోయే పాట ఆలపించినట్లు లేదు, అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నా. బహుశ చిత్తూరు ప్రజలెప్పుడూ ఆంధ్ర ప్రభుతమీద ఏ ఆశలూ పెట్టుకోలేదు. ఏ హైకోర్టు కేసు ఉంటేనో, సెక్రటేరియట్లో పని ఉంటేనో లేక ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంటేనో తప్ప చిత్తూరు వాసులెవ్వరూ హైదరాబాద్‌ గురించి తలవనైనా తలవరు. నేను హైదరాబాద్ చూడడం ఎంసెట్ కౌన్సిలింగ్‌ అప్పుడే. మాకు సిటీ అంటే చెన్నై లేక బెంగుళూరు. అంత దూరం వద్దనుకుంటే వేలూరు. కనుక రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశంలో ఉన్నా తమిళనాడులో ఉన్నా పెద్ద తేడా యేమీ లేదని అందరూ అనుకున్నట్లుంది. ఇప్పుడిప్పుడే పట్టణం పెరుగుతుండడం వలన రాజకీయాలు కూడా పెరుగుతున్నాయి.

తమిళ మాసమైన ’ఆడి’ నెలలో కృత్తికా నక్షత్రం వచ్చేరోజు చాలా పవిత్రమైనది. ఆరోజు సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలన్ని క్రిక్కిరిసి పోతాయి. చిత్తూరు ప్రజ కావిళ్ళెత్తుకోని దగ్గరలోనే ఉన్న తిరుత్తణి క్షేత్రానికి బయలుదేరుతారు. చిత్తూరు బస్టాండు ప్రాంతం పసుపురంగు బట్టలేసుకున్న వాళ్ళతో ’మహానాడు’ ను మరిపిస్తుంది. సమస్యేమిటంటే మురుగన్ పాటలన్నీ చాలావరకు తమిళభాషలోనే ఉంటాయి.’కావడి చిందు’ అనే ఒక ప్రత్యేక తాళగతిలో సాగే ఈ పాటలు అందెలు చేతబట్టి చిందులేయడానికి అనువుగా ఉంటాయి. తెలుగు మాత్రమే తెలిసిన పాటక జనం ఈ పాటలను అతికష్టంమీద నేర్చుకొని పాడుతుంటే వినడానికి తమాషాగా ఉండేది మా చిన్నప్పుడు. “పంది రెండు కొయ్యా … తోళ్ల మురుగయ్యా” అని భక్తి పారవశ్యంతో చిందులు వేస్తున్న వారిని చూసి ’తోళ్ళ మురుగయ్యేమిటి? పందిని కొయ్యడమేమిటి? దేవుడిని అలా అనడం తప్పుకాదా!’ అని ఆశ్చర్యపడి పోయే వాళ్ళం. తరువాత పెద్దలు చెప్పేవారు: అది “పణ్ణిరెండు కయ్యా… తోழ் మురుగయ్యా” అనే తమిళ పాట యొక్క అపభ్రంశ రూపమని.’పన్రెండు చేతులవాడా, కాపాడు మురుగా, తండ్రీ’ అని భావం. ఇలాంటి భాషాభాసాలు, భాషాహాసాలు బోలెడన్ని మా వూళ్ళో.

ఈ దీపావళినాడు చిత్తూరులో ఉన్న మా బంధువులు శీకాయపట్టెడ కె. సుదర్శనం గారి ఇంటికి వెళ్ళాం. ఆయన తమిళం, తెలుగు, ఆంగ్లం, సంస్కృత భాషల్లో విశేషంగా అధ్యయనం చేసినవారు. ప్రస్తుతం ఆంగ్ల పదాలకు సరియైన ఉచ్చారణను తెలుగు పద్యాల్లో విద్యార్థులకు తెలియజెప్పడానికి ఒక శతకం వ్రాసే ప్రయత్నం చేస్తున్నారు (ఆ వివరాలు మరో టపాలో). మాటల సందర్భంలో ఆయన ఒక కథ చెప్పారు.

ఒక పండితుడు దేశాటనం చేస్తూ పండితులను వాదంలో ఓడిస్తూ ఒక రాజ్యానికి వచ్చాడట. ఆ రాజ్యంలోని ఆస్థాన విద్వాంసునితో రాజుగారు పోటీ ఏర్పాటు చేశారట. పండితుని ప్రతిభను గురించి వినివున్న ఆస్థాన విద్వాంసుడు పోటీకి భయపడి అతడిని భయపెట్టడానికి ఒక ఎత్తు వేశాడట. రేపు పోటీ అనగా ఆ సాయంత్రం విద్వాంసుని భార్య తమ పనిమనిషితో కలిసి పండితుడు బసచేసిన సత్రం వద్దనున్న బావి వద్దకు నీళ్ళకోసం వెళ్ళింది. పండితుడు అరుగుమీద కూర్చున్న సమయం చూసి పనిమనిషి ’అమ్మగారూ, సాయంత్రం కూర ఏం చేయమంటారు?’ అని అడిగింది. దానికి ఆస్థాన విద్వాంసుని భార్య ఈ క్రింది శ్లోకం చెప్పింది:

” మత్కుణం నదీ సంయుక్తం
గోపత్నీ సింధు సంయుతం
విచార ఫల సంయుక్తం
గ్రామ చూర్ణం కరిష్యతాం “

అది విన్న పని మనిషి ’అలాగేనండీ అమ్మగారూ’ అంటూ అక్కడినుండి నిష్ర్కమించింది. ఈ శ్లోకం వింటున్న పండితునికి ఆ వంటేమిటో ఏమీ అర్థం కాలేదు. వచ్చి నీళ్ళబిందె చంకనెత్తుకొంటున్న విద్వాంసుని భార్యను అడిగాడు ఆ శ్లోకం అర్థం ఏమిటని. ’మా వూరి అమ్మలక్కలు మాట్లాడుకొనే మాటలకే అర్థం తెలియని వారు రేపు మా ఆస్థాన విద్వాంసునితో ఏం పోటీ పడతారు!’ అని పరిహాసం చేసి వెళ్ళి పోయిందావిడ. ఇంకేముంది, పండితుడు పలాయనం చిత్తగించడం, ఆస్థాన విద్వాంసుడు ఊపిరి పీల్చుకోవడం జరిగిపోయాయి.

ఇంటికి వెళ్ళిన ఆ ఇల్లాలు భర్తను అడిగింది- ఆ వంటేమిటని. ఆస్థాన విద్వాంసుడు నవ్వి ఇలా చెప్పాడు:

మత్కుణం = నల్లి; నదీ = ఏరు ; నల్లి + ఏరు = నల్లేరు
గో = ఆవు; పత్నీ = ఆలు ; ఆవు + ఆలు = ఆవాలు
సింధు = ఉప్పు
విచార = చింత ; ఫలం = పండు ; విచార ఫలం = చింతపండు
గ్రామ = ఊరు ; చూర్ణం = పిండి; గ్రామ చూర్ణం = ఊరుబిండి

’అంటే చింతపండు, ఆవాలు, ఉప్పు వేసి నల్లేరు ఊరుబిండి చేయి అని దాని అర్థం. తెలుగు పదాలను ముక్కకు ముక్కగా సంస్కృతంలో అనువదించి చెప్పాను’ అన్నాడట ఆయన. భర్త చమత్కారానికి ఆశ్చర్యపోయిందా ఇల్లాలు.

చిత్తూరులో మాట్లాడే తెలుగు, తమిళం కూడా ఇలాగే ఉంటాయని మీరనుకుంటే ఆ తప్పు మీది కాదు 🙂

11 వ్యాఖ్యలు
  1. 6 డిసెంబర్, 2009 11:28 సా.

    wahwa.. mee blog saradaagaa uMdaMDi. your unique background makes your writing even more interesting. would love to read any of your stories/poems?

  2. 7 డిసెంబర్, 2009 9:11 ఉద.

    welcome back

  3. 7 డిసెంబర్, 2009 11:19 ఉద.

    “చిరు + ఊర్” = చిట్టూర్ – ద్విరుక్తటకారాదేశ సంధి ప్రకారం (కురు, చిరు, కడు, నడు, నిడు ల రడలకు అచ్చు పరంబగుచో, ద్విరుక్త టకారాదేశంబగు) .. సర్లెండి..సంధి కుదరక పోయినా, సామరస్యం కుదిరితే చాలు. బెంగళూరుపక్క హోసూరులో కూడా కాస్త తెలుగు, తమిళ సంస్కృతులు కలిసిపోయి వినబడుతుంటాయి.

    లేటుగా వచ్చినా లేటెష్టుగా వచ్చారు. welcome back.

  4. nagamurali permalink
    7 డిసెంబర్, 2009 7:43 సా.

    చంద్రమోహన్ గారూ, చాలా కాలానికి మళ్ళీ మీ బ్లాగు పోస్టు చూసి ప్రాణం లేచొచ్చింది. చిత్తూరు విశేషాలు చాలా బాగున్నాయి. గ్రామచూర్ణం శ్లోకం ఎక్కడో విన్నట్టే ఉంది. అచ్చ తెలుగు పదాల్ని సంస్కృతంలోకి మార్చి భలే రాశారీ శ్లోకం (వివాహ పుత్రులు, అరణ్య క్షీరం లాగా).

    ప్రస్తుతం కిరాతార్జునీయం రోజుకో శ్లోకం చదువుకుంటూ నోట్సు రాసుకుంటున్నాను. వీలైనప్పుడో లుక్కెయ్యండి: http://kiratarjuniyam.wordpress.com/

  5. 8 డిసెంబర్, 2009 9:55 సా.

    @బుడుగు, బాబా గారు,

    నెనర్లు!

    @రవి,
    ద్విరుక్త టకారం తమిళ సంధి కాదు కద:) ఆ మాటకొస్తే తెలుగులోకూడా మొదటినుండీ లేదు. తమిళం(ద్రవిడం) నుండి విడిపోయిన చాలా రోజులకు ట్ర – ట్ట గా మారి ఉంటుంది. పుట్ర , పుట్ట గా మారినట్లు. పులిమీద పుట్ర లాంటి సామెతల్లో పాత ప్రయోగాలు ఇంకా మిగిలే ఉన్నాయి.

    @నాగమురళి,
    వివాహ పుత్రులు- బాగుంది! మేం Marriage Son అంటుంటాం.
    మీ కొత్త బ్లాగు చాలా బాగుంది. మీరు నోట్సు వ్రాసిన విధం మరీ బాగుంది. ’భారవేరర్థ గౌరవం’ అన్న మాట గుర్తొచ్చింది. అంత పేరున్న రచనలో మీరు అనౌచిత్యాలు చూశారా! మీ రెగ్యులర్ బ్లాగులో మాఘం, ఇక్కడ కిరాతార్జునీయం అన్నమాట. భలే!

  6. 9 డిసెంబర్, 2009 10:09 సా.

    చంద్రమోహన్ గారూ,

    మీ పునర్దర్శనం ఎంతో సంతోషం కలిగించింది. ఈ శ్లోకం చాలా కాలం కిందట ఏదో సందర్భంలో మేడసాని మోహన్ గారు చెప్పగా విన్నాను. తర్వాత దీని కోసం చాలా వెతికినా ఎక్కడా దొరకలేదు. మళ్ళీ ఈ మోహన్ గారి పుణ్యమా అని దొరికింది 🙂 అనేక ధన్యవాదాలు.

    నాగమురళి గారూ,
    చడీ చప్పుడూ లేకుండా మీరు కిరాతార్జునీయం ఎప్పుడు మొదలుపెట్టేసారు! మీ నోట్సు అందరితో పంచుకుంటున్నందుకు మరీ మరీ ధన్యవాదాలు.

  7. రవి చంద్ర permalink
    10 డిసెంబర్, 2009 5:27 సా.

    మా ఊరు శ్రీకాళహస్తి. ఊరెళ్ళి చాలా రోజులైంది. మీ టపా చదవగానే మా ఊరు వెళ్ళినంత ఆనందం కలిగింది. మాక్కూడా చెన్నై ౩ గంటల ప్రయాణం, బెంగుళూరు 6 గంటల ప్రయాణం, మన రాజధానీ నగరమేమో 12 గంటల ప్రయాణం. 🙂

  8. 11 డిసెంబర్, 2009 8:32 సా.

    Dear sir-

    Really marevellous. Good to know that other bloggers of “nostalgic” chittoor are still there and blogging!

    cheers
    zilebi.
    http://www.varudhini.tk

  9. 20 డిసెంబర్, 2009 11:13 ఉద.

    కామేశ్వర రావు గారు,
    ధన్యవాదాలు!

    రవిచంద్ర గారు,
    ‘తిరు’ పతి, ‘తిరు’ మల, ‘తిరు’ చానూరు ల ప్రక్కన ‘శ్రీ’ కాళహస్తి ఒక అసలైన తెలుగు (అది తెలుగే అనుకుంటే) పేరులా అనిపిస్తుంది. రోడ్డు పొడవేకాదు, సంస్కృతి పరంగా కూడా హైదరాబాదు కొంత దూరమే మనకు! “ఈడెవడ్రా భై, పోరిని పోరంటలేడు. పాపంటడు” :). ధన్యవాదాలు!
    వరూధిని గారు,
    మీరు చిత్తూరు వారని ఇంతవరకూ గమనించలేదండీ! ఇప్పుడే చూశాను మీ బ్లాగులో చిత్తూరు విశేషాలు. ధన్యవాదాలు .

  10. 18 ఫిబ్రవరి, 2010 11:22 సా.

    భలే, శబాష్.
    బహు బాగా చెప్పారు.
    భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా సరిహద్దులు గీశారని జనజీవన స్రవంతి ఆగదు, ఆనకట్టకి నది అయినా ఆగుతుంది గాని.
    భారద్దేశంలో ఉండగా నా నివాసమెప్పుడూ ఆయా రాష్ట్రాల నడిబొడ్డు ప్రాంతాల్లోనే ఉండడం చేత ఈ సరిహద్దు ప్రాంతాల జీవనం నాకెప్పుడూ ప్రత్య్కషంగా అనుభవానికి రాలేదు. కానీ మీ వర్ణన చదివి అర్జంటుగా చిత్తూర్లో ఓ నెల్రోజులు కేంపెయ్యాలని ఉంది.

  11. 19 ఫిబ్రవరి, 2010 12:48 సా.

    డిశెంబరులో ఈ టపా మొదటి సారి చదివినప్పుడు మొదటి పారా చదివి మానేశాననుకుంట, ఇంపరమేషన్ ఓవర్ లోడ్ సిండ్రోమ్ చే. కావిడి చిం౨దు గురించి చదివినట్టులేను.
    నేను డిశంబరు నెల మొత్తం ఎస్ సౌమ్యా గారి కావిడి చిందు పాటల సీడీ ఒకటి రోజూ వినేవాడిని.
    తిరుచ్చిమలై మేలే ఒందు.
    సంద వలర్.
    అళగుదైవమాహావందు.
    సెందమిళ్
    వంటి పాటలు వున్నాయి. మొత్తానికి నాకు మొదటి సారి తమిళ పాట ఇంతబాగా నచ్చడం.

    అప్పటివఱకూ అయ్యోపాపం అరవోళ్ళకి దేవుఁడు అన్నాయం చేశాడు అనుకునేవాణ్ణి. కానీ ఎప్పుడు తేటతెలుక్కస్తూరిగన్నడాల్లో హరినామసంకీర్తనం విని తుప్పటిన చెవులకు, ఇలా సుబ్బారాయని పాటలు అదీ కొత్త భాష అద్వాన్నర.. యఱ్ సారి తమిళంలో వినడం చాలా బాగాఅనిపించింది.

    -x-

    మీరా అద్వాన్న అరవం అన్నమాట చెప్పినప్పటినుండి నేను దాన్ని ఒక వెయ్య సార్లైనా స్ఫురించుకున్నాను. భలే ప్రయోగం, నాకెందుకు తట్టలేదా అని. సరదాకి అంటున్నా, క్షమించగలరు.
    అసలే మొన్న నాలుగు రోజులు తమిళనాట వుండడంతో.
    ధ్యాన – తియాన
    ప్రసన్న – పిరసన్న
    శివోహం – చివోగం
    అని యరలవలకు బలవంతంగా ముందొక అచ్చును చేర్చడం, హబదులు గ పలకడం వంటివి ఎంతైనా కొద్దిగా అలవాటు పడేవరకూ చిరాకుగానే అనిపిస్తాయి. కష్టపడి లిపినేర్చుకున్నవాళ్ళకి ఇదేనా వీళ్ళు చేసే మర్యాద అనిపిస్తుంది.

    -x-

    అరవ పాటలంటే ఎయార్రెహ్మాన్ అనుకునే మాలాంటి అజ్ఞానులుకు, కావిడి చిందు (అందు జగణ ప్రయోగం గుఱించి) పరిచయం చేయాల్సిన బాధ్యత మీ చిఱ్ఱూరు (దీనిని చిట్ఱూరు అని పలుకుతారనుకుంటగా) వారిదే.

    చిత్తు + ఊరు = చిత్తూరు (ఉకారసంధి, లోపసంధి, సంవర్ణదీర్ఘసంధి 😀 )

వ్యాఖ్యలను మూసివేసారు.