విషయానికి వెళ్ళండి

తెలుగు పద్యాల్లో ఆంగ్లోచ్చారణ పాఠాలు

20 డిసెంబర్, 2009

చిత్తూరు వెళ్ళినప్పుడు మా బంధువులైన శీకాయపట్టెడ కె. సుదర్శనం గారిని కలిసిన విషయం గత టపాలో వ్రాశాను. వారిప్పుడు తెలుగు విద్యార్థులు ఆంగ్లం మాట్లాడేటప్పుడు సాధారణంగా వచ్చే ఉచ్చారణా దోషాలను సరిచేస్తూ తెలుగు పద్యాల శతకం వ్రాసే పనిలో ఉన్నారు. మచ్చుకు కొన్ని వినిపించి ఎలా వున్నాయని అడిగారు. నాకనిపించిందేమిటంటే నేటి విద్యార్థులకు ఆంగ్ల పదాల ఉచ్చారణ కంటే ఆ పద్యాలలోని తెలుగు పదాల ఉచ్చారణే కష్టమేమోనని. బహుశ పద్యాల్లోని తెలుగు పదాల అర్థాలు తెలుసుకొనేందుకు వాటిలోని ఆంగ్ల పదాలు సహాయపడతాయి. ‘రివర్సు డిక్షనరీ’  లాగా అన్నమాట. అలా పద్యాలతో పుస్తకం వ్రాస్తే ఏ మాత్రం మార్కెట్ ఉంటుందో కూడా అనుమానమే. పద్యాలకు బదులు “అర గంటలో ఆంగ్ల ఉచ్చారణ” అని టైటిల్ పెట్టి ఇంగ్లీషు-తెలుగు పదాల లిస్టు వ్రాసేసి ప్రచురిస్తే కొంత మార్కెట్ కావచ్చు. ఐతే పుస్తకం ప్రచురించి మార్కెట్ చేసుకోవాలన్నది వారి ఉద్దేశ్యం కాదు గనుక, కనీసం తెలుగు పద్యాల వైవిధ్య భరితమైన ఉపయోగాలను ముందు తరాల వారికి పరిచయం చేయడం కోసమైనా శతకాన్ని పూర్తిచేయమని చెప్పాను. వారి పద్యాలలో కొన్ని ఇక్కడ వ్రాస్తున్నాను:

1.

సో’ యనగా విత్తుట యగు
సో’ యనగా కుట్టుటయును సోమోత్తంసా
సౌ’ యన వారాహి యగున్
సూయిజ్జ’న చెత్త, రొచ్చు; ’సూయరు’ తూమౌ

(1.Sow 2. Sew 3. Sow 4. Sewage 5. Sewer)

2.

‘విన్యడ’న ద్రాక్షతోటగు
‘అన్యన్’ నీరుల్లి యగు, త్రియంబక! శంభో!
సాన్యా‘, ‘సోన్యా‘ సమమౌ
సిన్యోర్‘ అన మిస్టరిటలి,’సిన్యోరా‘ స్త్రీ

(Vineyard; Onion; Sonia; Signor; Signora)

3.

రో‘ యన వరుసకు జెల్లును
రో‘ యనగా తెడ్ల పడవ ద్రోసి నడపుటౌ
రౌ‘ యనగా యలజడి యగు
రౌ‘ యన గద్దించుటయును రౌప్య గిరీశా!

(Row)

4.

వుమన‘న స్త్రీకినిఁ బేరగు
విమిన‘న బహువచనమగును విమలేందు ధరా!
జెమినై‘ యన ‘జెమిని‘ యనన్
యమకంబును, మిథున రాశి హైమవతీశా!

(Woman; Women; Gemini)

5.

బో‘ యన వింటికి నామము
బో‘ యనగా నింద్రధనుసు, ముడికినిఁ బేరౌ
బౌ‘ యనగ నమస్కారము
బౌ‘ యనగా వినతుడగుట పశ్యత్‍ఫాలా!

(Bow)

6.

నైకీ‘ యన జయదేవత
సైకీ‘ యన మనసు, నాత్మ; సద్యోజాతా!
వైకౌంట‘న నొక తెగ దొర
సైకైయేట్రిస్టు‘ మానస వ్యాధి భిషక్

(Nike; Psyche; Viscount; Psychiatrist)

7.

ఫిలిమనకుము ‘ఫిల్మ‘నవలె
లలబై‘ యన లాలి, ‘ఏల్కలై‘ క్షారమగున్
ఇలినోయ్‘ అమెరిక రాష్ట్రము
పలీసు‘ సరి, పోలిసనకు బాలేందు ధరా!

(Film; Lullaby; Alkali; Illinois; Police)

8.

సాలస్‌‘ అన నోదార్చుట
పేలిట్‌‘ అన అంగుడౌను విశ్వాధారా!
పాలన్‌‘ అన పుప్పొడి యగు
వేలంటైన్‌‘ లేఖ, కాన్క ప్రియులకు ముద్దౌ

(Solace; Palate; Pollen; valentine)

9.

మహిళనొక్కతె ‘మేడమ‘ని పిల్వగా వలె
బహుత ‘లేడీస‘న పలుక వలయు
బాలే‘ యనగ గీతభర నృత్య నాటిక
అవన‘ని పల్కంగ నగును ప్రొయ్యి
మెషరు‘, ‘మిరాష‘న మితి, మృగతృష్ణయౌ
బీటు‘కు పాస్టెన్సు ‘బీటు‘ మాత్ర
మాంగ్ల పదంబున నాస్తి ద్విత్వపు వాక్కు
కుక్కరనగ రాదు ‘కుకర‘న వలె

ప్రీమడాన‘ ముఖ్య నృత్యగాయని యౌను
గ్లాసు‘, ‘గ్లేస‘నంగ గాజు పేరు
ప్లాంటు‘, ‘ప్లేంట‘నంగ పరగు మొక్కకు పేర్లు
ఆశుతోష! ఈశ! అట్టహాస!

(Madam; Ladies; Ballet; Oven; [ష-zha] Measure;
Mirage; Beat; Beat (past tense); Cooker;
Prima Donna; Glass; Plant)

ఎలా ఉన్నాయంటారు!

7 వ్యాఖ్యలు
  1. 20 డిసెంబర్, 2009 4:55 సా.

    బహు లెస్సగా వున్నాయి. న్యా వంటి దుష్కర ప్రాసలతో సాధించడం ఒక యెత్తైతే, ఆంగ్ల పదాల్ని రాసిన విధం పాశ్చాత్య ఉచ్ఛారణ ప్రకారం ఉండడం కూడా మెచ్చాల్సిన విషయం.

  2. 20 డిసెంబర్, 2009 6:13 సా.

    ఓ “వావ్” అందుకోండి చెప్తాను! ఇదే రీతి తెలుగు – తెలుగు నిఘంటువు అయితే కూడా ,అమర కోశానికి తెనుగు సమాధానం లా, మహా పసందుగా ఉంటుంది.

  3. 3 జనవరి, 2010 8:50 సా.

    సుదర్శనంగారి కృషి చాలా బాగుంది. మీరు దాన్ని బ్లాగ్ పాఠకులకు పరిచయం చెయ్యడం కూడా. శతకం పూర్తయ్యాక చెబితే ప్రచురణ నేను సంతోషంగా నెత్తికెత్తుకుంటాను. (మార్కెటు సంగతి ఎలా ఉన్నా)

  4. 3 జనవరి, 2010 10:59 సా.

    సుదర్శనం గారి కృషి, మీరు మాకు పరిచయం చేయటం రెండూ మంచి ప్రయత్నాలు. అరుణ గారు ప్రచురణ బాధ్యత తలకెత్తుకుంటే నేను కొనుక్కునే సామాజిక బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తాను. ఇలాంటి విలువైన విషయాలు చెప్పేవాళ్లు లేక బాధ పడుతున్నాము.

  5. 10 జనవరి, 2010 1:55 సా.

    కొత్తపాళి గారు, రవి గారు
    ధన్య వాదాలు. మీ స్పందనను రచయితకు తెలియజేస్తాను.

    అరుణ గారు, కల్పన గారు
    శతకం పూర్తవకముందే ప్రచురణకర్తనూ, (కొని చదివే)పాఠకులనూ సంపాదించుకోవడం గొప్ప విశేషమే! నెనర్లు. ఈ విషయాన్ని ఆయనకు చెప్పి ‘ఇక మీదే ఆలశ్యం’ అంటాను:)

  6. 11 జనవరి, 2010 1:57 సా.

    చాలా బాగుంది. ఈశ్వరుని పలు పేర్లు కూడా తెలిసివస్తున్నాయి.
    ఆయన మరి కాలేజ్ మాడ్యూల్, Matt వంటి పదాలను తెలుఁగలోనెట్లా వ్రాస్తారో?

  7. Sowmya permalink
    29 ఆగస్ట్, 2010 5:43 సా.

    చాలా బాగుంది.
    పంచుకున్నందుకు నెనర్లు.

వ్యాఖ్యలను మూసివేసారు.